పూర్వకాలం నుంచీ ఆశ్రమాలలో ఉండి, విద్యపూర్తిచేసికొని, పల్లెటూళ్ళలో భూమాత ఒడిలో పెరిగిన మహాశిల్పులే అజంతా, ఎల్లోరా, వాతాపి మొదలైన గుహలను నిర్మించారు. ధాన్యకటక, నాగార్జునకొండ మొదలైన పవిత్ర స్థలాలలో స్థూపాలను నిర్మించారు. కాకతీయ శిల్పులు, పల్లవ శిల్పులు, చాళుక్య శిల్పులు, విజయనగర శిల్పులు ఈ మహాభాగులే! సత్య నాగారికతలోబడి, నకనకలాడే పురుషుల్లా కొట్టుకుంటూ ఉన్న పట్టాన వాసస్థులకు శిల్పహృదయం ఏమి తెలుస్తుంది? కర్కశమైన ఒక గింజను భూమిలో పాతి, లాలిత్యము ఒరుసుకొనిపోయే సర్వవర్ణనము పేతమైన మొక్కను భూమిలోనుంచి తీసుకొనిరాగలిగిన కర్షకుడు విద్యావంతుడే అయినట్టయితే ఉత్తమశిల్పి కాకుండా ఎట్లా ఉండగలడు?
ఈ ఆలోచనలతో శకుంతల దగ్గరకు పరుగెత్తుకొని వెళ్లాను.'' ఓ హృదయసింహాసన రాజ్నిగారూ! ఇలా వినండి. నాకేసి చూడండి. ఆ అందమైన నీలితెరలు జిలుగులాడే తమ కళ్ళనిలా తిప్పండి. తళుకులు ప్రసరిస్తూ మధువులు దొంగిలించే ఆ పెదవులను అట్టే నా వైపుకు తిప్పకండి.అన్నీ మరచిపోవలసివస్తుంది.అందుచేత ఆ పెదవులను కాస్త బిగించండి. ఏదీ తమ బంగారులతలు, ఆ రెండు చేతులూ ఇల్లా ఇవ్వండి. కాస్త ఈ మెడచుట్టూ గట్టిగా చుట్టనివ్వండి. లేత తమలపాకు చెవిని నా పెదవి దగ్గర పెట్టండి. ఒక రహస్యం చెప్పాలి.''
'' రహస్యం చెప్పబోతున్న ఓ పెద్దమనిషిగారూ! నా చెవి కొరికేస్తారా ఏమిటి? రహస్యం చెప్పడం మానేసి నా కళ్ళూ, బుగ్గలూ, జుట్టూ, ముక్కూ తినేసేటట్టున్నారు. నా ఎముకలు విరుగుతున్నాయి. అంత గట్టిగా అదుముతారేమి? అబ్బ! వుందురూ, ఇదా మీరు చెప్పే రహస్యం. అందుకనేనా అంత గబ గబ పరుగెత్తుకొచ్చారు....''
'' రహస్యమూ! ఈ ఊళ్లోనే ఒక శిల్పాశ్రమం మనం ఏర్పరచుకోడం నిశ్చయం చేసాను. మామగారు చాలా ఫాస్టుగా ఉందంన్నారు. రవీంద్రనాథ టాగూరుగారి శాంతినికేతనం గూడా దీని ముందర ఎందుకూ పనికిరానినటు వంటిదనే ఆశ్రమం పెట్టాలి. మన కొల్లిపర దేశదేశాలనుండి తండోప తండాలుగా జనం వచ్చి ఈ పవిత్ర క్షేత్రాన్ని కొలిచి వెళ్లేటట్టు చెయ్యాలి.''
'' ఇక్కడుంటే తోస్తుందా మీకు? మన ఊళ్లో బీచిలేదు. సినిమాలు లేవు. టెన్నిసాటలు లేవు. అయినా బొమ్మలు చేయడం మీ కెంతో ఇష్టంగా? నా బొమ్మను మాత్రం అస్తమానం వేయకండేం!''
'' ఓయి వెర్రిదానా! ప్రపంచంలో నీకన్న అందమయిన వాళ్ళెక్కడున్నారు? సరస్వతిగా, లక్షిగా, లలితాదేవిగా, నిన్నే మూర్తిస్తాను. ఒక్కొక్క శిల్పికి ఒక ఆశయ దేవత వుంటుంది.''
'' మీకైనా సిగ్గు వుండాలి. ఆ మాటలు అలా వుంచండి. ఇక్కడుండటం బాగానే వుంటుంది. మా అమ్మ సంతోషపడుతుంది. హేమ బావగారిని వదిలి ఒక్క నిమిషం ఉండలేదుకూడా! కాబట్టి నేను మీ అభిప్రాయాన్ని బలపరుస్తున్నాను.''
15
ఇంతట్లో ఏడేళ్ళ బాలిక మా హేమకుసుమ అక్కడికి పరుగెత్తుకు చక్కా వచ్చింది.'' అదేమిటే అక్కా! బావ అట్లా గట్టిగా పట్టుకుంటాడు నిన్ను? మంచి బావకాడు. నన్నెత్తుకుని అస్తమానం నలిపేస్తాడు. బావతో మాట్లాడకూడ దనుకుంటాను. కాని ఎంతో మంచి కథలు చెప్తాడు. నాకూ అస్తమానం బావను చూడాలనే వుంటుంది. బావకు అమ్మ ఫలహారాలు చేసిందటా. త్వరగా తీసుకురమ్మంది మీ ఇద్దర్నీ.''
హేమకుసుమ ముద్దులు మూటకట్టే బాలిక. అచ్చంగా అక్కగారి పోలిక. ఆ ఈడులో శకుంతల ఎలావుండేదో అలాగే అచ్చుగుద్దినట్టు హేమకుసుమా వున్నది. కాని మహా అల్లరిపిల్ల. తన ఈడుకు మించిన ఆలోచనలు,కొంటె మాటలు. ఎవరిని పెళ్లి చేసుకుంటుందో కాని ఆ భర్తను సంతలో అమ్ముకు చక్కా వస్తుంది. నేనంటే విపరీతమైన ఆపేక్ష అక్కగారిని ఒక్క నిమిషం వదిలి వుండలేదు. ఎన్ని రాత్రిళ్లో మా దగ్గరే పడుకొని నిద్దరోతుండేది. మా అత్తగారు వచ్చి, ఆమెను ఎత్తుకొని తీసుకు వెళ్ళుతూ వుండటం జరుగుతూ వుండేది.
* * *
హేమకుసుమా! ఆనాటి దివ్యస్వప్నంలోనుంచి ఈ 1941 ఫిబ్రవరి నెలలోనికి వచ్చినాము. మహాయుద్దము లోకాన్ని భయంకర రాక్షసిలా కబళిస్తూ ఉన్నది. వేలకొలది గ్రీసువాళ్ళు, ఇటలీవాళ్ళూ, ఫ్రెంచివారూ, ఇంగ్లీషువారూ, జర్మనులూ అనుదినమూ ఈ రాక్షసికి ఆహుతులై పోతున్నారు. జగత్సంహారమైన ఘోరయుద్దం వల్ల గాని మనుష్యులు తమతమ కాంక్షలకు తృప్తి ఇవ్వలేరా? ప్రేమ అనేది వట్టి హుళక్కేనా ? మానవుని జీవితమంతా రక్తం పీల్చుటకేనా? ప్రేమ అనే పల్చనిపొర లోకాన్ని మాయ చేసేందుకే కప్పుకొని ఉంటాడా మనుష్యుడు? '' సౌందర్యోపాసి'' అని మనుష్యుణ్ణి పిలవడం ఒక భయంకరమైన అసత్యమా? నా చిన్నతనంలో జరిగిన మహాయుద్దంకన్న ఈ యుద్ధం ఇంత భయంకరమై పొయిందేమి? మహాత్ముని పవిత్ర వ్రతము ఏనాటికయినా సఫలత పొందగలదా?
హేమకుసుమ తనతో యుద్ధంమాటే తీసుకురావద్దంటుంది. ఆడవాండ్లను సాసనసభికులుగా ఏర్పాటు చేస్తే, ఏ దేశమూ యుద్దాలతో దిగదని వాదిస్తూంటుంది. వాళ్ళు శాంత వ్రతులట. ఆనంద జీవికలట. రసపిపాసలట. అట్టివాళ్ళు లోకాన్ని సౌందర్యంతో నింపుతారట. వాళ్ళ మాతృ హృదయము యుద్ద పిశాచాన్ని లోకంలో లేకుండా తరిమివేస్తుందట.
తీర్థ : హేమా! ఆడవాళ్ళు కాళికాస్వరూపిణిలు కూడా కదా!
హేమ : అది మీకు కవులై వ్రాసిన వ్రాతగానీ, ఎంత నీచ స్త్రీ అయినా నోటి యుద్దముతో సరిపెడుతుందిగాని కత్తిగట్టి యుద్ధం చేసే స్త్రీ ఎవతయ్యా త్యాగతీ!
తీర్థమిత్రుడు : మొన్న '' ఉమెన్'' అనే ఇంగ్లీషు ఫిల్ము వచ్చింది గదా! అందులో ఆడవాళ్ళు జుట్టూ జుట్టూ పట్టుకొని దెబ్బలాడలేదు టయ్యా!
నేను :అది కథ. మనం కల్పించుకున్నది. ఆడమళయాళం స్త్రీలు యుద్ధం చేశారనీ, అమెజాను స్త్రీలు యుద్ధం చేశారనీ పురాణాల్లో చెప్పుకునాము. అంతేగాని యుద్ధం అంటే ప్రీతిపొందే స్త్రీ ఉంటుందని హేమతోపాటు నేనూ నమ్మను.
