Previous Page Next Page 
వసుంధర కథలు-14 పేజి 33

 

    ఆమె తిరిగొచ్చేసరికి మోహన్ అక్కడ లేడు.

                                     3

    సునంద హారాన్ని మెడలో వేసుకుని అద్దంలో పదే పదే తన్ను తానూ చూసుకుంది. ఆమె సంతోషానికి అంతు లేదు.
    "బాగుందా ?" అన్నాడు మోహన్.
    సునంద అతడి వైపుకు తిరిగి -- ఊహించని విధంగా అతణ్ణి కౌగలించుకుని కుదిపేసింది. అప్పుడామె పురుషుడి కంటే బలంగా వుంది.
    "సునందా -- ఏమిటిది?" అన్నాడు మోహన్ ఉక్కిరిబిక్కిరవుతూ.
    "సంతోషం -- కృతజ్ఞతా -- ఏమని చెప్పాలో తెలియడం లేదు. డియర్ మోహన్! నీకేం కావాలో చెప్పు. నేను నీ ప్రియురాలిని కాదు దాసిని --...." అంది సునంద.
    "థాంక్యూ సునందా! నీమాటలె చాలు నాకు ...వేరే ప్రతిఫలం అవసరం లేదు --" అన్నాడు మోహన్.
    "వద్దన్నా ప్రతిఫల మిస్తాను --నేను నీదాన్ని " అంది సునంద.
    "వద్దు సునందా! నువ్వు ప్రేమలో నా దానివి కావాలి. ప్రతిఫలంగా కాదు. నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను --..." అన్నాడు మోహన్.
    "నన్ను ప్రేమిస్తున్నావా --నా చరిత్ర తెలిసి కూడా!" అంది సునంద.
    "నీ చరిత్ర కేం లోటోచ్చింది ....?" అన్నాడు మోహన్.
    "ఒక బలవంతుడి చేతిలోని అట బొమ్మను నేనని నీకు తెలుసు --"
    "కానీ ఆ బలావంతుడికి నీ వల్ల ప్రయోజనం అయిపొయింది. అతడు నీకు స్వేచ్చ నిచ్చాడు--...."
    "కానీ ఆటబొమ్మగా ఉన్నప్పుడు నేనతడు చెప్పినట్లు ఆడాను ---"
    'ఆడితే ఆడావు. ఆ మాటకొస్తే నేనూ అలాగే ఆడాను. నేనేమీ పవిత్రుడిని కాదు. నిన్నో బలవంతుడు ఆడిస్తే నన్ను పరిస్థితులు లాడించాయి. నేరాలు చేశాను. జైళ్ళకు వెళ్ళాను. ఇప్పుడు మాములుగా జీవించాలని ఉంది."
    'అయితే నువ్వు నన్ను నిజంగా పెళ్ళి చేసుకుంటావా ?"
    "నా ప్రేమను నిరూపించుకుందుకే యీ హారం తెచ్చాను నీ కోసం. నువ్విక నీ ప్రేమను నిరూపించుకోవాలి --"
    "ఎలా?"
    "హారాన్ని తిరిగి నా కిచ్చేయడం ద్వారా --"
    సునంద నిరుత్సాహపడింది. తమాయించుకుంది -- "ఇవ్వకపోతే ?" అంది.
    "బహుశా నేను మళ్ళీ నీకు కనిపించను --' అన్నాడతడు.
    "నేనివ్వక పొతే బలవంతంగా తీసుకుంటావా ....' భయంగా అడిగింది సునంద.
    "తీసుకొను -----"
    తేలిగ్గా నిట్టూర్చింది సునంద.
    "సునందా! నీకోసం నా ప్రాణాలకు తెగించి యీ హారం తీసుకుని వచ్చాను. ఇది తిరిగివ్వకపోతే నా ప్రాణాలకే ప్రమాదం. అలాగని నేను నిన్ను బలవంత పెట్టను. నువ్వు మనస్పూర్తిగా హారాన్ని నాకు తిరిగిస్తేనే తీసుకుంటాను. అందుకే యిప్పుడు కళ్ళు మూసుకుని వెయ్యంకెలు లెక్క పెడతాను. లెక్క పూర్తయి నేను కళ్ళు తెరుస్తాను. నువ్వు హారం నాకు తిరిగివ్వాలి. అలా జరక్కపోతే వెంటనే వెనక్కు తిరిగి వెళ్ళిపోతాను. ఆ తర్వాత బహుశా మనం మళ్ళీ కలుసుకోము...."
    "ఎందుకని ?"
    "నా ప్రాణాలు పోవచ్చు ."
    "పోకపోతే ?"
    "పోకపోతే తప్పక నిన్ను కలుసుకుంటాను ...."
    "అప్పుడు నన్ను పెళ్ళి చేసుకుంటావా ?"
    "ఊ"
    "స్వార్ధపరురాలినని అసహ్యించుకోవా?"
    "నిన్ను నే నసహ్యించుకోలేను ...."
    సునంద నిట్టూర్చి -- "ప్రేమ విలువ నాకు తెలియదు. స్వార్ధ మొక్కటే నాకర్ధ మవుతుంది. డియర్ మోహన్! నన్నపార్ధం చేసుకోకు. నువ్వు బలవంతంగా వెనక్కు తీసుకుంటే ఏమో గాని -- నాకై నేనీ హారాన్ని నికివ్వలేను. నాకు నీపై ప్రేమ లేదనుకోకు. నన్నర్ధం చేసుకో --" అంది.
    "నేను నిన్నర్ధం చేసుకున్నాను. నువ్వే నన్నర్ధం చేసుకోవాలి." అన్నాడు మోహన్ నీరసంగా.
    "షరతులేమీ పెట్టకు. ఈ హారం ఎప్పటికీ నాదని చెప్పు" అంది సునంద.
    "నా ఆశ నాది --" అంటూ మోహన్ కళ్ళు మూసుకుని అంకెలు లెక్క పెట్టడం ప్రారంభించాడు. అతడు వెయ్యంకెలు పూర్తీ చేసి - కళ్ళు తెరిచేసరికి -- సునంద లేదు. అతడు నిట్టూర్చి అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.

                                   4

    మోహన్ నడిరోడ్డు మీద నిలబడి ఉంటె -- పదిమంది మహాకాయులతడిని చుట్టూ ముట్టారు. అందరి చేతుల్లోనూ పొడవాటి కత్తులున్నాయి. చీకట్లో కూడా అవి మెరుస్తున్నాయి.
    మోహన్ వారిని చేతులు జోడించి వేడుకుంటున్నాడు. సమాధానంగా ఆ పదిమందీ కత్తులు పైకెత్తారు.
    కొద్ది క్షణాల్లో ఆ కత్తులతడి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చీల్చేస్తాయి.
    కెవ్వుమని అరిచి లేచి కూర్చున్నాడతడు.
    సమయానికి మెలకువ రాకపోతే అతడి శరీరం కలలో తునాతునకలై పోయుండేది.
    జరిగింది కల అని తెలుసుకుందుకు మోహన్ కు కాసేపు పట్టింది. హమ్మయ్య - అని తేలికగా నిట్టూర్చి టైము చూసుకున్నాడతడు.
    రాత్రి రెండు గంటలు....
    పన్నెండు గంటల వరకూ అతడు మెలకువగానే ఉన్నాడు.
    మోహన్ అవసరాన్ని బట్టి ఎంతకైనా తెగించగలడు కానీ స్వతహాగా ధైర్యవంతుడు కాదు.
    తల్లీ తండ్రి లేరతడికి. బంధువులింట్లో అష్టకష్టాలు పడలేక - ఇంట్లోంచి పారిపోయాడు. కడుపు నింపుకోవడం కోసం చిల్లర పనులూ చేశాడు. చిల్లర దొంగతనాలు చేశాడు. క్రమంగా నేరాలతడి జీవితంలో ఒక భాగమై పోయాయి. సమాజాన్ని నడిపే కొన్ని దుష్టశక్తులతడికి స్వాగతం పలికాయి. పూర్తిగా వారి గుప్పిట్లోకి వెళ్ళిపోకుండా -- వారికి దూరంగానే ఉండి వారికి సహకరించి తన అవసరాలు గడుపు కుంటున్నాడతడు. ప్రస్తుతం అతడి వద్ద కొంత డబ్బు చేరింది. పాత జీవితానికి స్వస్తి చెప్పి కొత్త జీవితం ప్రారంభించాలన్న ఆలోచన అతడికి సునంద పరిచయంతో ప్రారంభమయింది. సునంద కోసం అతడు లీల హెచ్చరికను కాదన్నాడు. సునంద తన కోసం హారం తిరిగి యివ్వగలదనుకున్నాడు. ఆమె ఇవ్వలేదు. అడిగి ఆమెకు బాధపెట్టడం అతడి కిష్టం లేదు.
    ప్రమాదం తన్ను తరుముతుందని అతడికి తెలుసు. కానీ లీల తనకు మర్నాడుదయం దాకా టైమిచ్చింది. ఈ లోగా తనకు ప్రమాదం లేదు. ఆ ధైర్యంతోనే యిల్లు చేరి పడుకోవాలనుకున్నాడు. ఓ పట్టాన నిద్ర పట్టలేదు. పట్టక పట్టక నిద్ర పడితే కలవచ్చి మెలకువొచ్చేసింది.
    "పాడు కల!" అనుకున్నాడతడు. మరుక్షణం లోనే అతడి కనిపించింది -" ఇప్పుడు కలగా జరిగింది - రేపు నిజామవుతుంది!
    సమయానికి కల తనను హెచ్చరించింది.
    ప్రమాదం రేపుదయం తనను తరుముతుంది. ఈ లోగానే తను ప్రమాదానికి దూరంగా పారిపోతే!
    ఈ ఆలోచన ముందే రానందుకు అతడు తన్ను తాను నిందించుకున్నాడు. వెంటనే మంచం దిగాడు. త్వరగా వేషం మార్చుకున్నాడు. జేబులో డబ్బు లెక్క పెట్టుకున్నాడు.
    రెండు వేల రూపాయలున్నాయి.
    "ప్రస్తుతానికి కిది చాలు" అనుకుని ఇల్లు వదిలాడు.
    తెల్లవారు ఝామున నాలుగింటి కతడు రైల్వే శేషన్ లో ఓ ట్రాయి నెక్కాడు. ఆ ట్రయినేమిటో ఎక్కడికి వెడుతుందో అతడు పట్టించుకోలేదు.
    టికెట్ లేకుండా ప్రయాణ మతడికి కొత్త కాదు. ట్రయినలా మూడు గంటల సేపు ప్రయాణం చేసింది. అంతవరకూ అతడి టికెట్ కలెక్టర్ సమస్య తలెత్తి లేదు. ఖాళీగా ఉన్న బెర్తు మీద పడుకున్నాడు.
    టికెట్ కలెక్టర్ వచ్చాడు. మోహన్ నిద్ర పోయినట్లు నటించాడు. టికెట్ కలెక్టర్ పలకరించకుండానే వెళ్ళిపోయాడు.
    ఏం జరిగిందో తెలియక మోహన్ ఆశ్చర్యపడ్డాడు.
    క్రింద బెర్తు మీద ఓ యువతి ఉంది. ఆమె మెలకువగా కూర్చుని కిటికీ లోంచి బయటకు చూస్తోంది.
    మోహన్ తనూ క్రిందకు దిగి ఆమె పక్కనే కాస్త దూరంగా కూర్చున్నాడు.
    ఆమె చటుక్కున అతడి వంక చూసి - "మీరు టికెట్ కలెక్టర్ కోసం లేచారా?" నా దగ్గిర రెండుంటే చూపించాను. ఆయనింక మిమ్మల్నడగలేదు..." అంది.
    ఆమె మోహన్ దగ్గిర టిక్కెట్టు ఉండనే అనుకుంటోంది.
        "మీదగ్గిర రెండు టిక్కెట్లు ఎందుకున్నాయి?" అన్నాడు మోహన్.
    "ట్రయిన్ లో ఎనిమిది గంటల క్రితం ఇద్దరేక్కాం. అతడు నన్ను మోసం చేసి సగం దారిలో దిగిపోయాడు" అందామె.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS