"ఇన్ స్పెక్టర్ ఈయన ఆచూకీ కనిపెట్టగలడంటావా నాన్నా!' అంది ప్రమీల అనుమానంగానూ, దిగులు గానూ.
"చౌదరి చాలా గట్టివాడు. అయితే ముందు నేనోసారి ఆ చిదానందస్వామిని కలుసుకుని మాట్లాడాలి-" అన్నాడు లక్ష్మీనారాయణ.
5
ఆశ్రమంలో చిదానందస్వామి ఉండే కుటీరానికి ముందున్న రావిచెట్టు నీడలో సుమారు పాతికమంది కూర్చుని వున్నారు.
వారందరూ స్వామి దర్శనంకోసం ఎదురుచూస్తున్నవారే! వారిలో నలుగురు లక్ష్మీనారాయణకు బాగా తెలిసినవారు. లక్ష్మీనారాయణ అక్కడకు రాగానే వారతన్ని గుర్తుపట్టి పలకరించారు.
లక్ష్మీనారాయణ వారిని చూసి ఆశ్చర్యపడ్డాడు. అప్పుడు వాళ్ళు లక్ష్మీనారాయణకు చిదానందస్వామి మహిమల గురించి చెప్పారు. లక్ష్మీనారాయణ అన్నీ మౌనంగా విన్నాడు. ఆయనకు మనసులో రకరకాల ఆలోచనలు పరుగెడుతున్నాయి.
ఈ స్వామికి పేరు బాగా వున్నట్లుంది. అటువంటి వాడు తన అల్లుడిని ఇంట్లోంచి పారిపొమ్మని యెందుకు సలహా యిచ్చాడు?
కొద్ది నిమిషాల్లో స్వామి కుటీరంనుంచి బయటకు వచ్చాడు అంతా గౌరవ పురస్కారంగా లేచి నిలబడ్డారు. చిదానందస్వామి రెండు చేతులతోనూ అందరినీ దీవించాడు. ఆయన ముఖంలో దివ్య తేజస్సు ఉట్టిపడుతున్నది.
ఒకొక్కరే ముందుకువచ్చి తమ సమస్యలు చెప్పుకుంటూంటే చిదానందస్వామి మందహాసం చేస్తూ విని-"నాతో చెప్పుకున్నావుగా-నీ సమస్యలింక పరిష్కరించబడినట్లే అనుకో-" అంటూ వచ్చాడు.
లక్ష్మీనారాయణ వంతు వచ్చింది-"స్వామీ! మీరు అందరికీ సమస్యలు పరిష్కరిస్తానంటున్నారు. కానీ నాకు మీరే సమస్యను సృష్టించారు-" అన్నాడాయన.
చిదానందస్వామి ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ-"నావల్ల నీకు సమస్య వచ్చిందా-"అదేమిటో చెప్పు-వింటాను-" అన్నాడు.
లక్ష్మీనారాయణ క్లుప్తంగా రవిబాబు గురించి చెప్పాడు.
"ఇందులో నేను చేసినదేమున్నది? సమస్యను నీవే సృష్టించుకున్నావు. నీ అల్లుడిని నీవొక మనిషిలా ఎందుకు చూడలేకపోయావు?" అన్నాడు చిదానందస్వామి.
"నా ఇంటి గొడవలు మీకు అనవసరం. కానీ ఒక సంసారిని ఇల్లువదిలిపొమ్మని ఆదేశించడం మీకు తగునా?" అన్నాడు లక్ష్మీనారాయణ.
"ప్రపంచం నిండా ఎన్నో సమస్యలుంటాయి. వాటిని విని పరిష్కార మార్గాలను అప్పటికప్పుడు సూచించడమే నా పద్ధతి. అంతేకానీ ఎవరి సమస్యలు ఏమిటీ వారికి ఏయే పరిష్కార మార్గాలు సూచించానూ అని నేను గుర్తుపెట్టుకోను. నీ అల్లుడు నా దగ్గరకు వచ్చి వుండవచ్చు. దానికి సరియైన పరిష్కార మార్గం నేను సూచించివుండనూవచ్చు. అది అతడికి నచ్చి వుండవచ్చు. అయితే అందువల్ల నీకు నష్టంవాటిల్లిందంటున్నావు. నా పరిష్కార మార్గంవల్ల నీకు నష్టంవాటిల్లిందీ అంటే అందుకు ఒక్కటే కారణం-నువ్వు పాపివి అయుండాలి-" అన్నాడు చిదానందస్వామి తాపీగా.
లక్ష్మీనారాయణకు అప్పుడు జీవితంలో యెన్నడూ ఎరుగనంత ఆవేశం కలిగింది. స్వామి మాటలు విని అక్కడున్న భక్తజనమంతా ఘొల్లుమన్నారు. అందువల్ల లక్ష్మీనారాయణ ఆవేశం మరింత పెరిగింది.
"పాపివి నేను కాదు నువ్వు. నీమూలంగా నా కూతురి కాపురం చెడిపోయింది-" అన్నాడు లక్ష్మీనారాయణ అరుస్తూ.
ఒక్కసారిగా అక్కడ స్మశాన నిశ్శబ్దం ఆవరించుకుంది. లక్ష్మీనారాయణ మాటలకు భక్తులంతా ఆశ్చర్యపోయారు. చిదానందస్వామిని ఆయన ఎదుట ఆయన ఆశ్రమంలో అంతమాట అనేవారుంటారని యెవ్వరూ అనుకోలేదు.
అయితే చిదానందస్వామి ఏ మాత్రమూ ఆవేశపడలేదు-"చేసిన పాపాలకు ఇప్పటికే అనుభవిస్తున్నావు. ఇంకా నీ పాప భారాన్ని పెంచుకోకు నాయనా!" అన్నాడాయన. మళ్ళీ భక్తులందరూ ఘొల్లుమన్నారు.
లక్ష్మీనారాయణకు మరింత అవమానమయింది. అయన మరింత ఆవేశపడి చిదానందస్వామిని నోటికివచ్చినట్లు దూషించసాగాడు.
చిదానందస్వామి అన్నీ విని ప్రశాంతంగా-"ఇప్పు వదిలిన నీ అల్లుడు మళ్ళీ తిరిగివచ్చే అవకాశం లేకమాత్రమయినా వుంటే అది నువ్విప్పుడు పోగొట్టుకున్నావు. బహుశా నీ అల్లుణ్ణింక నువ్వు చూడలేవనుకుంటాను. అందుకు నాకెంతో విచారంగా వున్నది-" అన్నాడు.
అప్పటికి లక్ష్మీనారాయణ తన ఆవేశాన్ని అదుపు చేసుకుని చిదానందస్వామి పద్ధతిలోనే-"నిన్ను నేను చంపబోతున్నందుకు నాకెంతో విచారంగా వుంది-" అంటూ ఒక్కసారిగా ఆయనమీదకు దూకాడు.
భక్తులందరూ కలగజేసుకుని లక్ష్మీనారాయణ ను వెనక్కు లాగారు. ఆయన రొప్పుతూ- "స్వామీ-తప్పించుకున్నాననుకోకు. ఈ రాత్రికి నా అల్లుడు నా యింట్లో అడుగుపెట్టకపోతే తెల్లారేసరికి ఆశ్రమంలో నీ శవం వుంటుంది-" అన్నాడు.
లక్ష్మీనారాయణ పరిచయస్థులు ఆయన్ను తీవ్రంగా మందలించి అక్కణ్ణించి వెళ్ళిపొమ్మని చెప్పారు. వారు కలగజేసుకుని వుండకపోతే లక్ష్మీనారాయణ వళ్ళు అప్పుడే హునమయుండేది.
లక్ష్మీనారాయణ వెళ్ళిపోయాడు.
"స్వామీ! అతడిని మన్నించండి. మాకు అతడు చాలా సంవత్సరాలుగా తెలుసు. మనిషి అహంకారి కావచ్చు. కానీ మంచివాడు. ఎవరికి ఏ అపకారమూ చేయడు..." అంటూ లక్ష్మీనారాయణ పరిచయస్థులు ఆయన తరఫున వేడుకున్నారు.
"నేను దూషణ భూషణలకు అతీతుణ్ణి. నాకై నేను వాడినేమీ చేయను. కానీ వాడి పాపాలకు తగిన శిక్ష పడకుండా ఆపడంకూడా నావల్లకాదు. ప్రకృతిసిద్దంగా జరిగే వాటిని ఆపాలనుకోవడం ఈ సృష్టికే ప్రమాదకరం-" అని నిట్టూర్చాడు చిదానందస్వామి.
6
జగ్గయ్య సారాసీసా పక్కనపెట్టి గుడిసెలోంచి బయటకు వచ్చి-"ఎవరిది?" అన్నాడు.
అక్కడ ఓ మనిషి నిలబడి వున్నాడు. కాస్త పొడుగ్గా వున్నాడు. ముఖం కనబడకుండా టోపీ ముందుకు లాక్కుని వున్నాడు.
"నన్ను లక్ష్మీనారాయణగారు పంపారు-" అన్నాడతడు.
"ఏ లక్ష్మీనారాయణ?"
అతడు అర్ధమయేలా చెప్పాడు.
"ఓహ్ ఆ బాబా-ఏమిటి పని?" అన్నాడు జగ్గయ్య.
"హత్య!"
"హత్యా?" ఆశ్చర్యంగా అన్నాడు జగ్గయ్య.
"అవును....ఇదిగో వెయ్యిరూపాయల అడ్వాన్సు. పని పూర్తయ్యాక మరో వెయ్యి ఇస్తారు..."
జగ్గయ్య డబ్బు తీసుకుని-"మనిషి ప్రాణాలు మరీ చవకైపోతున్నాయి. ఒక హత్యకు రెండువేలా?" అన్నాడు.
"ఏమో-అవన్నీ లక్ష్మీనారాయణగారితో మాట్లాడుకో-..."
"ఇంతకీ ఎవర్ని చంపాలి?"
"చిదానందస్వామిని...."
"ఎవరినీ?" అన్నాడు జగ్గయ్య.
"చిదానందస్వామిని..." అంటూ వివరాలు చెప్పాడా మనిషి.
"ఆ సన్యాసి లక్ష్మీనారాయణగారినేం చేశాడు?"
"అవన్నీ నీకు అనవసరం-" అన్నాడా మనిషి.
