3
"నాపేరు రామలింగం!" అన్నాడతను.
"అయితే నన్నేం చేయమంటారు?" అన్నాడవతలి వ్యక్తీ చిరాగ్గా.
"మీశక్తి కొద్దీ అనాధులకు సహాయపడండి" అంటూ అతను జేబులోంచి ఒక రసీదు పుస్తకం తీశాడు.
అవతలి వ్యక్తీ రసీదు పుస్తకాన్నందుకుని చూశాడు"ఏదో అనామక అనాధ శరణాలయానికి చందాలు తీసుకుని రసీదులిచ్చే పుస్తకమిది. ఒకటీ, రెండూ, అయిదు పది చొప్పున చాలామంది ఇచ్చినట్లున్నారు. అతను జేబులోంచి రెండ్రూ పాయలు తీసి ఇచ్చాడు. రామలింగం సంతకం పెట్టి రసీదు నిచ్చి, " మీరు మా శరణాలయానికి కనీసం పది రూపాయలివ్వగల స్థాయికి త్వరలో చేరుకో గలరని ఆశిస్తున్నాను" అని అక్కణ్ణించి ఇంకో మనిషి దగ్గరకు వెళ్ళాడు.
అలా సాయంత్రం వరకూ తిరిగి సంపాదించిన డబ్బుతో తన గది చేరుకున్నాడతను. ఆరోజు సంపాదించిన డబ్బు లెక్క పెట్టుకుని సంతృప్తిగా నిట్టూర్చాడు.
"వెధవది అప్లికేషన్స్ కు వేస్టు చేసే బదులిలా రసీదు పుస్తకాలచ్చేయించుకుంటే బోలెడు డబ్బు సంపాదించవచ్చు"అనుకున్నాడోకసారి మనసులో.
కానీ, ఈ సంపాదన తనకు చాలడం లేదు. తన కోరికలు పెద్దవి. తన ఆశలు అంతులేనివి. అందుకే పగలు చందాలు, రాత్రి దొంగతనాలు!
"ఇంకా ఎన్నాళ్ళిలా జీవితం?' అనుకున్నాడతను.
గోడకు తగిలించి వున్న అతని కాన్యోకేషన్ ఫోటోలో చేతిలో వున్న డిగ్రీ కాగితం అతన్ని వెక్కిరించింది. అతనూ దాన్ని వెక్కిరించి, "నేను నిన్నేమీ నమ్ముకోలేదు లే. నీ అవసరం లేకుండానే నాక్కావలసిన డబ్బు సంపాదించుకుంటున్నాను" అన్నాడు.
రామలింగం కాసేపు నడ్డి వాల్చాడు. ఆలోచిస్తూ పడుకున్నాడు.
ఏడున్నర ప్రాంతాల్లో లేఛి ముఖం కడుక్కుని గది తలుపులు తాళం వేసి బయటపడ్డాడు. ఒక హోటల్లోకి వెళ్ళి భోజనం చేశాడు. ఓ కిళ్ళీ షాపు ముందర నిలబడి తాడుకు వ్రేలాడగట్టి వున్న పుస్తకాల్లో ఒకటి తీసుకుని, చదివి మళ్ళీ అక్కడే పెట్టాడు.
తొమ్మిది గంటల ప్రాంతంలో సినిమాహాలు దగ్గరకు వెళ్ళాడు. సెకండ్ షో కి టికెట్లివ్వడం మొదలు పెట్టె వరకూ అటూ ఇటూ తిరిగాడు. టిక్కెట్లివ్వడం మొదలు పెట్టగానే ఓ కుర్చీ టికెట్ కొన్నాడు. ఇంటర్వల్ దాకా సినిమా చూసి బయటకు వచ్చాడు. హల్లో హైక్లాసు లోంచి బయటకు వచ్చిన వాళ్ళలో ఒకాయన్ను పలకరించి 'సినిమా ఎలాగుంది సార్!' అనడిగాడు.
"మీకెలాగుంది?" అనడిగాడు హైక్లాసు.
"చాలా బోరు. దీని గురించి ఊరి కామూల నించి వచ్చాను. తిరిగి వెళ్ళడానికి బస్సులైనా లేవు. రిక్షా మీద పోవాలి. "అదో ఖర్చు" విసుగ్గా అన్నాడు రామలింగం.
హైక్లాసు కూడా పెదవి విరిచాడు. "నేనూ నారాయణ పేట నుంచి వస్తున్నాను. మా ఆవిడ పట్టు మీద వచ్చాను. మొదటి షో టికెట్ దొరకలేదు. అందుకని రెండో షోకి టికెట్స్ కొన్నాను."
'అయితే సకుటుంబ సపరివార సమేతంగా వచ్చారన్న మాట. "అంటూ రామలింగం హైక్లాసుకు సిగరెట్ ఆఫర్ చేశాడు. హైక్లాసు అందుకున్నాడు.
"నారాయణ పేట అంటున్నారు. మీ ఇల్లు పోస్టాఫీసు పక్కనేమిటి?"అనడిగాడు రామలింగం.
"కాదు లెండి. పోస్టాఫీసు కు సరిగ్గా మూడిళ్ళ అవతల వున్న పచ్చరంగు డాబా, నారాయణపేట లో మీకుతెలిసినవాళ్ళు ఎవరైనా వున్నారేమిటి?"
"మా బాబాయుండే వాడు లెండి" అన్నాడు రామలింగం. "నేను మా బాబాయి దగ్గరే వుండేవాడిని . రోజూ పోస్టాఫీసు పని మీద పంపుతుండేవాడాయన. అవసరానికి మించి స్టాంపులు కొనడు, ప్రతిరోజూ అవసరం రాకా మానదు. అవస్థ పడలేక అస్తమాను మా పిన్నితో అంటుంటేవాడిని. బాబాయికి పోస్టాఫీసు పక్క ఇల్లెయితే బాగుంటుందని. అంతేకాదు, పోస్టాఫీసు పక్కగా వుండే వాళ్ళంటే నాకు అసూయ గా కూడా వుంటుంది. అందుకే ఎవరన్నా కొత్తవాళ్ళు కనిపిస్తే...."
"హైకాసు నవ్వి , "ఏం చేస్తున్నారు?' అన్నాడు.
"ఇంకా నిరుద్యోగి నేనండీ" అన్నాడు. హాల్లోంచి బెల్ మ్రోగింది. "వస్తాను సార్ , మీ క్లాసు వేరు, నా క్లాసు వేరు" అన్నాడు రామలింగం. అక్కణ్ణించి నెమ్మదిగా కదిలిన రామలింగం హాల్లోకి వెళ్ళలేదు. సగం రేటుకి పాస్ అమ్మేసి వడివడిగా అడుగులు వేయడం ప్రారంభించాడు.
కొంతదూరం నడిచి రిక్షా ఎక్కాడు. నారాయణపేటకు దగ్గర్లో దిగి డబ్బులిచ్చి రిక్షా వాడ్ని పంపించేశాడు. ఆ తర్వాత హైక్లాసు చెప్పిన పచ్చ రంగు డాబా పట్టుకోవడానికతని కెంతో సేపు పట్టలేదు.
ఇంటి ముందు ఏ కాపలాలూ లేవు. ఇంటికి తాళం వేసి వుంది. వీధి నిర్మానుష్యంగా వుంది.
రామలింగం టైము చూసుకున్నాడు. అతని వాచీ ప్రకారం టైము పదకొండూ నలభై నిముషాలయింది. రామలింగం తటపటాయించకుండా ఆ ఇంటిని సమీపించి తలుపు తాళం తీయపోయాడు. అంత సులువుగా రాలేదది. తన దగ్గరున్న రకరకాల సాధనాలు పయోగించి మొత్తం మీద తాళం తీయగలిగాడు.
రామలింగం ఇంట్లో అడుగుపెట్టి తలుపులు లోపల గడియ వేశాడు. జేబులోంచి పెన్ టార్చి తీసి యిల్లంతా కలియ తిరిగాడు. అతని శ్రమ వృధా పోలేదు.
పాంటు జేబులోనూ, వంటింట్లో పోపుల పెట్టె లోనూ కలిపి అతనికి రెండు వందల యాభై రూపాయలు క్యాష్ దొరికింది. డ్రస్సింగ్ టేబుల్ దగ్గర సొరుగులో ఒక లాకెట్ గొలుసు దొరికింది.
ఇంట్లో స్టీలు అల్మార్తా కూడా వుంది కానీ అది తెరవడం రామలింగం వల్ల కాలేదు. అతని వద్దనున్న పనిముట్లు అందుకు పనికి రాలేదు. వచ్చినందుకు ఫలితం దక్కిందనుకుంటూ రామలింగం అక్కణ్ణించి బయటపడ్డాడు.
రోడ్డు మీదకు వచ్చేక రామలింగానికి చాలా అసంతృప్తిగా వుంది. ఇలా ఎంతకాలం ? కనీసం ఓ పాతిక వేలైనా చేతికి దక్కాలి. అలాంటి అవకాశం కోసం అతను చాలాకాలంగా యెదురు చూస్తున్నాడు.
అటువంటి అవకాశాన్నిచ్చే ఇంటిని కూడా అతను చాలా కాలం క్రితమే ఎన్నిక చేసి వుంచాడు. చందాల వంకతో అయన ఇంటికి ఎన్నో పర్యాయాలు వెళ్ళాడు. ఇంట్లోని వున్న దారులు కొన్నింటిని బాగా స్టడీ చేశాడు. ఇంట్లో ప్రవేశించడానికి ఒకే ఒక్క ఆధారం, బాత్ రూం వెంటి లెటరు . అయితే రాత్రి ఎనిమిది దాటితే అది మూసివుంటుంది.
ఇంటాయన చాలా జాగ్రత్తపరుడు. ముఖ్యంగా డబ్బుకూ, అయన ప్రాణానికీ పెద్ద లంకె వుంది. పది, పదిహేను సార్లు ప్రయత్నించినా కనీసం ఒక్క రూపాయయినా చందా పేరు చెప్పి ఇవ్వలేదాయన. ఆయనే బాపిరాజు.
కానీ, కలిసొస్తే ఆ ఇంట్లోనే తన అదృష్టం కలిసి రావాలి. అందుకే రామలింగం వారానికొక్క సారయినా ఆ ఇంటి తోటలో పదకొండు గంటల ప్రాంతంలో కాచుకుని వుంటాడు.
ఆరోజు కూడా రామలింగం తన ప్రయత్నంగా ఆ ఇంటికి మరోసారి వెళ్ళాడు. చప్పుడు చేయకుండా ఇంటి గేటు తీసి, నెమ్మదిగా మొక్కలు చాటు చేసుకుని బాత్ రూమ్ వైపు వెళ్ళాడు.
మామూలే, వెంటిలేటర్ మూసి వుంది.
రామలింగం నిట్టూర్చి అక్కణ్ణించి బయటపడ్డాడు.
4
భానోజీరావు లోపలకు వచ్చాడు. ఉమ అతన్ని మురళీధర్ పడుకుని వున్న గదిలోకి తీసుకు వెళ్ళింది.
"ఏమిట్రా ఏమయింది?" అనడిగాడు భానోజీరావు.
"ఏముంది , స్వయం కృపరాదం " అన్నాడు మురళీధర్ నీరసంగా.
"అంటే?"
"వానలో తడిశానంటే జ్వరం తప్పదు నాకు. మొన్న ఆఫీసు నుంచి వస్తుంటే హటాత్తుగా వాన ప్రారంభమైంది. వెంటనే షెల్టర్ తీసుకోవాల్సింది. బస్ స్టాపు దాకా పరుగెత్తే లోగా తడిసీ ముద్దయిపోయాను" అన్నాడు మురళీధర్ "ఏడిసి నట్లుంది. చెట్టంత మగాడివి. వానలో తడిస్తే జ్వరం రావడమేమిటి?" అన్నాడు భానోజీరావు నవ్వుతూ.
'అదే మా డాక్టర్ గారిని నేనూ అడిగాను. మగాడు చెట్టంత వాడయినా సరే, శరీర తత్వాన్ని బట్టే ఆరోగ్య ముంటుందని అన్నాడాయన" అన్నాడు మురళీధర్.
"బాగుంది కానీ, ఈ మాత్రం జ్వరానికే అంత అధైర్య పడిపోయావేమిటి? నీ ముఖం చాలా దిగులుగా వుంది" అన్నాడు భానోజీరావు.
"దిగులు నా గురించి కాదురా, మా రాజు గురించి, నాకు జ్వరం వచ్చినప్పట్నించీ వాడూ సరిగ్గా తిండి తినడం లేదు. నేను పక్కన లేకపోతె అన్నం సహించదు వాడికి" అన్నాడు మురళీధర్ దిగులుగా.
"తండ్రీ కొడుకులకు మరీ ఇంత సెంట్ మెంటుండకూడదు. జీవిత మెలాగుంటుందో తెలియదు. ఇద్దరూ చెరో చోటా ఎక్కువ కాల ముండవలసివస్తే ఏం చేస్తారు?" అన్నాడు భానోజీరావు.
'అలాంటి అవసర మెందుకొస్తుంది? నాకేం విపరీతంగా సంపాదించి పారేయాలని అత్యాశ గా లేదు.ఉన్నదాంతో తృప్తి పడుతున్నాను. నాకున్నదల్లా ఒక్కటే కోరిక, స్వంత ఇల్లుండాలని..."
