Previous Page Next Page 
శంఖారావం పేజి 33

 

    గదిలో ఇంకెవ్వరూ లేరు----- వాళ్ళిద్దరూ తప్ప.
    మురహరి తలుపులు వేస్తూ -- "నేను బయటకు వచ్చేదాకా మీరు తలుపులు తీయకండి. ఇక్కడించి వెళ్ళకండి --' అన్నాడు.
    వస్తాదులు తలాడించారు.
    గది తలుపులు మూసుకున్నాయి.
    వస్తాదుల  వ్యాయామం ప్రారంభమైంది.
    కొండల్ని పిండి కొట్టగల సమర్దుల్లా ఉన్నారా వస్తాదులు.
    వాళ్ళు వ్యాయామం చేస్తూ మధ్యమధ్య తలుపు వైపు చూస్తున్నారు.
    కాసేపటికి తలుపులు తెరచుకున్నాయి.
    వస్తాదులు వ్యాయామం ఆపారు.
    వారి కళ్ళలో కుతూహలం....
    బయటకు వచ్చాడు మురహరి.
    తలుపులు దగ్గరగా వేసి గడియ పెట్టి --- జేబులోంచి చిన్న తాళం కప్ప తీశాడు. దగ్గరగా నొక్కి ఏవో నంబర్లు తిప్పాడు.
    అతడు వెనక్కు తిరగ్గానే వస్తాదులతడికి నమస్కరించారు.
    మురహరి నవ్వుతూనే వారి దండలందుకుని అక్కణ్ణించి వచ్చిన దారిలోనే డ్రాయింగు రూంకు తిరిగి వెళ్ళాడు. వెడుతూనే టెలిఫోన్ సమీపించాడు. ఓ నంబరు తిప్పి -- "హలో----- నేను మురహరిని మాట్లాడుతున్నాను. చంద్రశేఖరరాజుగారి సన్మాన సభకు నేను వస్తానని సెక్రటరీ గారికి చెప్పండి------" అని ఫోన్ పెట్టేశాడు.
    "ఫెంటాస్టిక్ -----" అంది ఉదయ.
    వేదాంతం నవ్వాడు.
    "నువ్వు మనిషివి కాదు-----" అంది ఉదయ మళ్ళీ.
    వేదాంతం నవ్వి ఊరుకున్నాడు.
    "ఇదెలా సాధ్యమో నాకు తెలియడం లేదు----' అందామె.
    వేదాంతం ఆమె చేతిలోని పేపరు వంక చూశాడు.
    చంద్రశేఖర రాజు సన్మాన సభలో సంచలనం జరుగుతుందని ఎవరో ముందే పురప్రముఖులను హెచ్చరించారు. అలౌకికానందస్వామి, జయప్రకాష్ ల విషయంలో జరిగిన అనుభవం కారణంగా ఆ వార్తకు విలువ పెరిగింది. సన్మాన సభ కెందరో ప్రముఖులు విచ్చేశారు. అక్కడ మురహరి పురప్రముఖులను విభ్రాంతులను చేసే విశేషాలు చెప్పాడు. అప్పటి కప్పుదతడిని పోలీసులు అరెస్ట్ చేశారు . అయితే అతడేలాగో వారి బారి నుండి తప్పించుకుని పారిపోయాడు. పోలీసుల వేట ప్రారంభమయింది. ఎవరో పోలీసులకు ఫోన్ చేసి మురహరి ఆచూకీ చెప్పారు. అతడి గదికి వేసి ఉన్న తాళానికి కోడ్ నంబరు కూడా ఫోన్లో పోలీసులకు చెప్పడం జరిగింది. పోలీసులకా ప్రకారం మురహరి తన ఇంట్లోనే ఆలోచనా మందిరంలో దొరికాడు. అతడి రెండు చేతులూ, రెండు కాళ్ళూ బందించబడ్డాయి. అతడు గదిలో నిలబడి ఉన్నాడు. నోటికి టేపుంది.
    ఈ వివరాలన్నీ పేపర్లో వచ్చాయి.
    ఉదయ ఆ వార్త చదివి తన కళ్ళను తానే నమ్మలేక పోతోంది.
    "నేను నీకేన్నో సార్లు చెప్పాను. నా జోస్యం తప్పదని!"
    మురహరి చేసిన ఘోరలన్నీ -- ఒక అనుబంధ సంచికలో విడిగా వేశారు పత్రికా సంపాదకుడు.
    ఉదయ ఆ ఘోరాలు చదివింది.
    అందులోనే ఆమె సురుచి గురించి తెలుసుకుంది.
    ఎంత అన్యాయం? యెంత ఘోరం ?
    ఉదయ సురుచిని మించి వేదాంతం గురించే ఆలోచిస్తోంది. అటుపైన విశ్వనాద్" గురించి ఆలోచిస్తోంది.
    వేదాంతం విస్సీ బావనేమైనా చేస్తాడా?"
    ఒక్కసారి రకరకాల భావాల కామె గురి అవుతోంది.
    మురహరి చేసిన ఘోరాలు సామాన్యమైనవి కాదు. అతడి చరిత్రతో పాటు ఎందరి కధలో బైటపడ్డాయి.
    అలాంటి మురహరి ని-- తానంట్లోనే ఉండి -- అన్ని నేరాలూ ఒప్పుకునేలా చేసాడు వేదాంతం.
    "నేను యుద్ధం చేయడం లేదు. ఇది ధనుష్టంకారం మాత్రమే -- ఇది దేశమంతటా ప్రతిధ్వనించాలి "-- అంటున్నాడు వేదాంతం.
    ఉదయకు వేదాంతంలో దేశాన్నుద్దరించే మహానుభావుడు కాక- తనను విస్సీబావను దూరం చేస్తున్న స్వార్ధ పరుడు కనబడుతున్నాడు.
    "ఇప్పుడెం చేస్తావు?" అంది ఉదయ.
    "నీకు మాటిచ్చానుగా -- భూషణ్ ని తీసుకుని బయల్దేరుతాను --" అన్నాడు వేదాంతం.
    "ఎక్కడికి?"
    "ఎక్కడి కైతేనేం -- వారం పది రోజుల దాకా తిరిగి రాను....."
    "పాపం -- అంతకాలం నీ ధనుష్టంకారం ఆగిపోతుందన్న మాట--" అంది ఉదయ జాలిగా.
    'ఆగదు. నేనిక్కడ లేకున్నా ఇకమీదట రోజుకొక్క మనిషి చొప్పున తన నేరాలన్నీ ఒప్పుకోవడం ప్రారంభిస్తాడు. స్వార్ధపరుల్లో భయం పుడుతుంది. నా ప్రభావం ధనుష్టంకారమై వారి గుండెల్లో ప్రతిధ్వనిస్తుంటుంది. ఇప్పటికీ కొందరిలో పరివర్తన ప్రారంభమయింది -' అన్నాడు వేదాంతం.
    ఉదయ అతడి దగ్గర్నుంచి తిన్నగా కులభూషణ్ వద్దకు వెళ్ళింది.
    "నేనే నీవద్దకు వద్దామనుకుంటున్నాను -" అన్నాడతడు.
    "ఎందుకు?"
    "నీకోసం నన్ను నేను సంస్కరించు కుంటున్నాను. ఆ అవసరముందో లేదో నువ్వింకా నాకు చెప్పడం లేదు-"
    'అంటే?"
    "ఉదయా -- మన పెళ్ళి జరిగిందని నేననుకోవడం లేదు. నువ్వే అన్నావు. నీ మాటలు నాలో సంచలనాన్ని సృష్టించాయి. నువ్వంటే నాకాశ ఉన్నదని అప్పుడే తెలిసింది. నిజం చెబుతున్నాను. నాకు నువ్వు కావాలి. అయితే నీ మనసుకు వ్యతిరేకంగా నిన్ను కోరను. నీతో ఇలా మాట్లాడే ధైర్యాన్నిచ్చింది కూడా నువ్వే!" అన్నాడు కులభూషణ్.
    "విస్సీ బావ నా మనసంతా నిండి ఉన్నాడు--" అంది ఉదయ.
    'అయితే?"
    "నిన్ను నేను ప్రేమిస్తున్నానంటే అది ఆత్మవంచనే అవుతుంది...."
    'ఈ విషయం ఎప్పుడు తెలుసుకున్నావు?"
    "విస్సీ బావ అమెరికా నుంచి వచ్చీ రాగానే ...."
    'అయితే మరి ఇన్నాళ్ళూ నాకెందుకు చెప్పలేదు...."
    'చెప్పాలనే అనుకున్నాను. కానీ నేను నమ్మిన సంప్రదాయం నన్ను బాధ పెడుతోంది. సందిగ్ధంలో ఉంచుతోంది...."
    "ఎందుకని ?"
    "నాకోసం నువ్వు చాలా మారావు. అది కూడా మన సంప్రదాయం గొప్పతనం. నేనే స్వయంగా నిన్ను నా జీవితం లోకి ఆహ్వానించాను. శాస్త్ర యుక్తంగా జరగకున్నా మన పెళ్ళి అయిందన్నాను. నిజానికి మనం దగ్గర కాకపోయినా మన వివాహం అయిపొయింది. నేను వివాహితను...."
    "ఈ సందగ్దంలో ఎన్నాళ్ళు ఉంటావు ?"
    "నాకోసం మరో మనిషిగా మారిన నీ కన్యాయం చేయలేను. అలాగని మరో వ్యక్తిపై ప్రేమ నింపుకుని నీతో కాపురం చేయలేను. పైగా అత్త నాకూ విస్సీ బావకూ పెళ్ళి జరిపించాలని కలలు కంటోంది. అందుకే సంప్రదాయాన్నేదిరించాలని మనసు హెచ్చరిస్తోంది-"
    'అమ్మ గురించి ఆలోచించనేలేదు. నువ్వు సంప్రదాయాన్నేదిరించడమే మంచిది --' అన్నాడు కులభూషణ్ వెంటనే.
    "ఎదిరించలేనేమోనని భయంగా ఉంది ...."
    "ఇందులో సంప్రదాయాన్నేదిరించే ప్రసక్తి లేదు. మనపెళ్ళి సంప్రదాయం ప్రకారం జరగలేదు. అదే నిజమైతే --- నీకూ నీ విస్సీ బావ కూ పెళ్ళి ఎప్పుడో అయిపొయింది...."
    "ఏమో నాకు మనస్కరించడం లేదు. ముఖ్యంగా నీలోని మార్పు ..." అని ఆగింది ఉదయ --" నేడో రేపో కన్నుమూయనున్న ఒక అభాగ్యురాలీని భార్యగా భావించి ఆమె కన్యాయం చేయకూడదన్న తలంపుతో నీ అలవాట్లకు స్వస్తి చెప్పావు. అది నీ ప్రేమ బలాన్ని రుజువు చేస్తుంది. ఆ బలమే నాలో జీవం నింపుకున్నదని....నేనే నీ కోసమే బ్రతికాననే నా మనసు చెబుతోంది. ఏం చేయాలో పాలుపోవడం లేదు...."
    "నీ సందిగ్ధం తొలగిపోవడానికి నేను సహకరించగలను...."
    "ఎలా?"
    "నాకోసం జలజ, మనోహరి, సులోచన , వాసంతి వగైరా లెందరో ఎదురు చూస్తున్నారు. నువ్వెప్పుడు కాదంటావా వారి ముందు వాలాలని నా మనసు ఉవ్విళ్ళురుతుంది. నా మనసు నిన్ను ప్రేమిస్తుండవచ్చు. నా శరీరం మాత్రం నువ్వెప్పుడు నన్ను కాదంటావా అని ఎదురు చూస్తోంది. ఇది నిజం!" అన్నాడు కులభూషణ్.
    ఉదయ కేం మాట్లాడాలో తెలియక తెల్లబోయి అతడి వంక చూసింది. కులభూషణ్ మాట మార్చుతూ -- "నువ్వు నా దగ్గర కెందుకు వచ్చినట్లు?" అన్నాడు.
    ఉదయ వెంటనే ఏదో గుర్తుకు వచ్చిన దానిలా -- "అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. నువ్వూ వేదాంతం ఈరోజు మధ్యాహ్నం ప్రయాణమవుతున్నాను గదా -" అంది.
    'అవును"
    "నీ ప్రవర్తన ఎంతో ఉన్నతంగా ఉంది. కాని వేదాంతం నన్ను చాలా ఇబ్బంది లో పెడుతున్నాడు..." అంటూ ఆమె తన ఇబ్బంది చెప్పుకుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS