48
అంతమంది ని పోషించదలుచు కున్నప్పుడు ఆ రెండు వేలూ ఏ మాగుతాయి? విసుగు , అసహాయత, ఆవేశం, అన్నీ కలిసి కలగజేసిన కోపంతో రఘు తన ఫియేట్ కారు పదమూడు వేల రూపాయలకు అమ్మేశాడు. సి సర్టిఫికేట్ అవీ అన్నీ తన పేర ఉండడం మూలాన్ని.
సేతుపతి గారికి అదొక ఆచారం -- హిందూస్తాన్ లు చాముండేశ్వరి పెరటా, ఫియేట్ లు రఘు పెరటా, మెర్సిడేజ్ లు తన పెరటా కొనడం, అది అలా ఉపయోగ పడింది ఇప్పుడు.
పదమూడు వేల చేతిలో ఆడేసరికి , పరిస్థితి బాగా మెరుగుగా ఉన్నట్టు తోచింది రఘు కు. ఆ దెబ్బతో అయిదారు వారాలు ఇంటి మొహం చూడలేదు. ఈలోగానే ఫ్యాక్టరీ మళ్ళీ పనిచెయ్యడం మొదలెట్ట బోతూందన్న వార్త తెలిసింది. అందరూ రఘు కు జేజేలు కొట్టారు. కొందరు చాదస్తులు అతని పాదాలాంటి మొక్కారు.
అందరూ ఉల్లాసంగా....ఉత్సాహంగా....ఫ్యాక్టరీ బయలుదేరారు. కానీ, అక్కడికి చేరుకోగానే వీరి ఉత్సాహం అంతా చలిమంట మీద కడివెడు నీళ్ళు కుమ్మరించి నట్టు చల్లారిపోయింది.
"మేనేజ్ మెంటు వారు వీరి నెవరినీ మళ్ళీ పనుల్లోకి తీసుకో మన్నారు. తీసుకోవలసిన అవసరం లేదన్నారు. ఇది ఆ ఫ్యాకరీయే కాదు అన్నారు. బోర్డు మారింది! బోర్ ఆఫ్ డైరెక్టర్ కొందరు మారారు. మేనేజింగ్ డైరెక్టర్ అసలు మరొక గుజరాతీ వాడు! అయినా.....పాత వారెందరో ఉన్నారు ఆ సంస్థలో! అయ్యంగారున్నాడు; సుబ్బారావున్నాడు. వెళ్లి, అందరినీ కలుసుకున్నాడు రఘు.
"నా ఉద్యోగం పోయినందు వల్ల నాకు చింత లేదు సుబ్బారావు గారూ, వీళ్ళ కడుపులు, ఇలా కొట్టడం న్యాయం కాదు!"
"చినబాబు గారు , నేనేమీ చెయ్యలేను. ఈ విషయం లో మీరెంత అసహయులో ...నేనూ అంతే!" అన్నాడు సుబ్బారావు.
పరుగులేత్తుతూ వెళ్లి రఘు సేతుపతి గారిని కలుసుకున్నాడు. పైప్ పీలుస్తూ అయన నిశ్చింతగా , నిశ్చలంగా ఉన్నాడు.
"ఏం బాబూ , ఆనాడేప్పుడో ఒక గంట తీరుబడి చేసుకుని రమ్మంటే ఈనాడు వచ్చావా?"
"నేను మీతో మాట్లాడ్డ్డానికి రాలేదు. ఆరువందల మందికి జీవనోపాధి కల్పించి, అందరినీ రక్షించండని మిమ్మల్ని బ్రతిమాలడానికి వచ్చాను."
"నేనేం చెయ్యగలను రఘూ? ఆ సంస్థ కూ, నాకూ ఏమీ సంబంధం లేదు!"
"చెయ్యదలుచు కుంటే మీరేదయినా చెయ్యగలరు! ఈ ఒక్క సహాయం నాకు చెయ్యండి. ఈ జీవితం ఒక ఏనాడూ మిమ్మల్ని ఏదీ అడగను. నన్ను ఒక్కణ్ణి నమ్మి అంతమంది గంగలోకి దూకారు. అందరూ మునిగి పోతుంటే చూస్తూ నేనూరు కోలేను. ఊరుకోవలసిన పరిస్థితే వస్తే నేను నాశనమై పోతాను. నాన్నగారూ , ఇది బెదిరింపు కాదు. మీ కళ్ళ ఎదట నేనాత్మ హత్య చేసుకుని చస్తాను! ఆ అందరికీ మీరు ఉద్యోగాలిప్పించి తీరాలి! నాకు ఉద్యోగం అవసరం లేదు."
"నీవు మాత్రం ఎలా బ్రతుకుతావు ఉద్యోగం లేకుండా?"
"ఆ?"
"నీకూ ఏదో ఒక జీవనోపాది ఉండాలిగా?"
"అవును! నేనేదో ఒకటై పోతాను! ఇప్పుడు వారు రక్షించబడితే చాలు!"
"వారెవరు? నీవెవరివి? వారిని గురించి నీకెందుకూ ఇంత తహతహ ఇంత తాపత్రయం?"
"చెప్పానుగా? గొప్పవారు గోముఖవ్యాఘ్రాలని తెలియక, నామాట నమ్మి వాళ్ళు పాలు పితకడానికి ప్రయత్నించారు! గొప్పవారి నిజస్వరూపాలు ఇప్పుడు బైట పడ్డాయి!"
"అల్ రైట్ , మిస్టర్ సంబంధం!"
"సర్?"
"రతన్ లాల్ సెట్ ని ఫోన్ లో కాంటాక్టు చేసి కనెక్షన్ నా కివ్వండి."
"యస్ సర్."
సంబంధం వెళ్ళిపోయాడు. సేతుపతి పచార్లు చేస్తున్నాడు. గుండెను గుప్పిట పట్టుకుని రఘు బొమ్మలా నిలుచున్నాడు. ఆ అబ్బాయి ముఖంలో కత్తి వాటుకు నెత్తురు చుక్క లేదు! కళ్ళు మాత్రం చింత నిప్పుల్లా ఉన్నాయి. మానవాతీతమైన ప్రయత్నం లో బావురు మని ఏడవకుండా ఉండ గలుగుతున్నాడు రఘు. కనెక్షన్ వచ్చింది.
"కావ్? సెట్ జీ....మై సేతుపతీ బోల్ రహహహూ...నమస్తే.....నమస్తే.....ఇంత మంచి తెలుగు ఎక్కడ నేర్చారండీ?....ఆ? రాజమండ్రి లో ఉన్నారా? అలా చెప్పండి!.....ఏమీ లేదు , మీరో చిన్న ఉపకారం చెయ్యాలి!........ అదే.....పాత వర్కర్లందరూ క్షమాపణ చెప్పుకోడానికి సిద్దంగా ఉన్నారట!........"
"వర్కర్లు క్షమాపణ చెప్పుకోరు! కావాలంటే ....నేను నా పర్సనల్ అపాలజీ టెండర్ చేస్తా అంతే!" రఘు గర్జించాడు! కానీ , కళ్ళు ఎన్ని కడవల నీళ్ళని నింపు కాగలవు? రెండు కళ్ళూ, చిల్లులు పడ్డ రెండు కడవలయ్యాయి. సేతుపతి గారికే జాలి వేసింది.
"ఆ?......అబ్బే ఏమీ లేదు. ఆ వర్కర్లందరికీ ఒక నాయకుడు న్నాడు లెండి. ఆయనగారు వచ్చి అందరి తరపునా క్షమాపణ చెప్పుకుంటే చాలుగా?........" ఓ....కే దేన్....... అతణ్ణి మీ వద్దకు పంపిస్తున్నాను....ఆ? అవునవును...... పేదవాడు పాపం. అనుభవం లేని ఈనాయకుల వల్ల వాళ్ళు అగచాట్లు పాలవుతున్నారు."
"అది మీ ఉద్దేశం. కీ మీ చేతులో ఉంది. అందుకని ఆదిస్తున్నారు!" ఆవేశాన్ని ఆపుకోలేక , రఘు బిగ్గరగా అరిచాడు!
"ఉంటా మరి. నమస్తే సెట్ జీ. థాంక్ యూ." అంటూ రిసీవర్ పెట్టేసి, కొడుకు తో "ఇంకేం నాన్నా! నీ వర్కర్ల నందరినీ మళ్ళీ పనుల్లోకి తీసుకుంటా మన్నారు!" అన్నాడు సేతుపతి.
"థాంక్ యూ" అంటూ రఘు వెళ్ళిపోయాడు.
ఇంకేముంది? రఘు పెద్ద లీడర్ అయిపోయాడు. వర్కర్లందరూ అతణ్ణి ఊరేగించారు. మెరీనా బీచ్ లో బహిరంగ సభ ఏర్పాటు చేసి అతణ్ణి వేనోళ్ళ పొగిడారు. వార్తా పత్రికల్లో ఈ విషయాలన్నింటి నీ చదివి, సేతుపతి గారు ఉస్సురన్నారు.
49
రఘు తనలో తానె ఒక్కోసారి తనకు నిజంగా పిచ్చి పట్టిందేమో ననుకునేవాడు. కానీ....అతణ్ణి ఎరిగి ఉన్న, అతని పేరు విన్న పేదవారు, అతణ్ణి ఒక దైవ సముడు గా ఎంచుకుని పూజిస్తున్నారు. పెదా, సాదా తన పైని చూపే దయనూ, అనురాగాన్నీ గురించి తలుచుకున్నప్పుడు మాత్రం రఘు తానూ ఒక మామూలు మనిషే అనుకునేవాడు.
చెయ్యడానికి పనేముందీ ఇప్పుడు? తాను స్థాపించిన ఎలిమెంటరీ స్కూలు కు వెళ్లి, ఆ పంతులమ్మ తో పాటే తానో ఒక తరగతి తీసుకునేవాడు. కానీ, అతని తరగతిలో ఆటలూ, పాటలే కానీ, చాడువుండేది కాదు.
ఒక్కోసారి పనికట్టుకు ని కాయకష్టం చేసి బ్రతికే వారిని గమనిస్తూ ఏ రోడ్డు మీదో, కడుతున్న కట్టడం దగ్గర ఉండిపోయేవాడు. ఒక్కోసారి మౌంట్ రోడ్ మీద నిలుచుని పోతున్న కార్ల నూ, వస్తున్నా కార్ల నూ చూస్తూ పేవ్ మెంటు మీద తన కాళ్ళ దగిర కూలబడి, బూట్ లు పాలిష్ చేసే వాళ్ళనూ..... బిచ్చ మెత్తుకుంటున్న రోగిష్టు లనూ , వికలాంగు లనూ గమనిస్తూ .....ఆలోచిస్తూ గంటల తరబడి అలాగే ఉండిపోయాడు. "ఆ కార్ల లో తిరిగే మహనీయు ల్లో ఏ ఒక్కరయినా ఈ దరిద్రుల బాధల్ని గురించి ఆలోచిస్తారా?' అని తనను తానె ప్రశ్నించు కునేవాడు.
ఆ ఆగర్భ శ్రీమంతుడు ఎందుకిలా తయారయ్యారంటే ,మనమేం చెప్పగలం? సిద్దార్ధుడు ఎందుకు రాజ్యాన్నీ....భార్యా పుత్రుల నూ వదిలినట్టూ? నరేంద్రుడు , వివేకానందు డెందుకయినట్టు? మోహన్ దాస్ కరం చంద్ గాంధీ ఎందుకు మహాత్ముడయినట్టు ? అంతే అంటే........రఘు అంతటి మహానుభావుడని కాదు, ఆ అంశ ఏదో ఉంది అతని జాతకం లో.
ఒకనాడు పిచ్చి పిచ్చిగా అలా రోడ్డు వెంట పడి నడిచి పోతున్నాడు రఘు! ఏదో కారు వచ్చి అకస్మాత్తుగా అతని సమీపంలో ఆగిన చప్పుడయింది. తిరిగి చూశాడు. నాన్నగారి బెంజ్ అది! కారులో సేతుపతి గారు కాదు, చాముండేశ్వరి కూర్చుని వుంది.
"నాన్నా.....రఘూ......." అంటుండగానే ఆమెకు దుఃఖం ముంచుకు వచ్చింది.
"అమ్మా...."
"నేను అమ్మానన్న విషయం నీ కింకా గురుంది కదా? అదే పది వేలు! రారా, నా తండ్రీ . రా కూర్చో!"
రఘు కారెక్కాడు. అతణ్ణి తన కౌగిట్లో కి లాక్కుని చాముండే శ్వరి విపరీతంగా బాధపడింది.
"జేమ్స్!"
"అమ్మా?"
"మళ్ళీ హాస్పిటల్ కు వెళ్ళు నాయనా!"
"అప్పిడి దాంగో!" వాడు పని వాడు చేసుకు పోతున్నాడు.
"హాస్పిటల్ కు ఎందుకమ్మా?"
చాముండే శ్వరి బావురు మంది.
"అమ్మా........అమ్మా....ఎందుకమ్మా?"
"నిన్న రాత్రి అకస్మాత్తుగా గుండె పోటు వచ్చింది నాన్నగారికి. అదృష్టం కొద్దీ.....మోహన సుందరం గారు అక్కడే ఉన్నారప్పుడు. ఈ మధ్య ప్రతి రెండు రోజులకూ ఓసారి వచ్చి పరీక్షిస్తున్నాడాయన. ఎందుకూ అంటే నాతొ చెప్పేవారేవారూ ఆ ఇంట్లో? ఇప్పుడాయాన్ని ...ఏదో గుడారం లాటిదిట...."
"ఆక్సిజన్ టెంట్ సర్!" అన్నాడు జేమ్స్.
"ఆ......అదే.అందులో ఉంచారు. నాన్నా, రఘూ , దేవుడేరా మనకిక దిక్కు!' అంటూ హృదయ విదారకంగా ఏడ్చింది ఆ ఇల్లాలు.
"అబ్బబ్బ .......ఊరుకోమ్మా! ఇంతమంది డాక్టర్లు న్నారు, నాన్నగారి కేం ఫరవాలేదులే! ఊరుకో." ఎందుకో మరి, రఘు కు కూడా మనసు గుబులు గుబులుగానే ఉంది.
