43
సుబ్బారావుగారికి ఒక బాధ్యత నెత్తినించి దింపుకున్నామన్న తృప్తితో పాటు హృదయం తేలికగా ఉన్నది కూడాను. జానికమ్మగారు అల్లుణ్ణి కూతుర్ని చూసుకుని మురిసిపోయింది. ఆమెకి కించిత్ గర్వంగా ఉంది కూడాను. ఇక గర్వి, ఘరానా అయిన ధనమ్మగారితో వియ్యమందితేనా?......ఐతే "ఈ భాసడు వసంత పెళ్ళి అయిపోయినా చెరుపు చేసినట్లు దిగులుగా ఉన్నాడేం?" అన్న అనుమానం ఆమెకు కలిగింది.
"ఒహో చెల్లెలు పరాయిదై పోయిందే" నన్న వ్యధయేమో ననుకున్నదామె.
భాస్కరం తిరిగి తిరిగి వచ్చి సురేఖ కోసరం వెతుక్కున్నాడు. తను ఏ ప్రేమనైతే పవిత్రంగా అతి రహస్యంగా భద్రపరుస్తున్నాడో అది ఇవాళ నడి రోడ్లపాలై అవమానానికి అనుమానానికి మాత్రం దారి తీస్తుందేమోనని భయం.
సురేఖ, భాస్కరానికి అగుపించలేదు. పిన్ని నడిగితే కథ మరో మార్గాన పట్టిపోడానికి తానే కారకుడవుతాడన్నమాట. ధనమ్మగారిని అడగటం ఇంకా ముప్పు!
సురేఖకు శిరోభారంగా ఉన్నందున తన గదిలో మంచంమీద పడుకున్నది. అలా పడుకున్నదల్లా మధ్యాహ్నం జరిగిన సంఘటనలను తీవ్రంగా ఆలోచించింది. పరిస్థితుల దుర్భరత ముందు ఆ పిల్లతెలివి తేటలు వీగిపోయాయి. ధనమ్మగారు వచ్చి "ఏమ్మాయీ!" అని ప్రక్కన కూచుని నుదుట చెయ్యివేసేసరికి "చుర్"మని కాలింది. "అమ్మయ్యో! జ్వరం" ధనమ్మగారి గుండెల్లో రాయి పడ్డది.
"దిష్టి తగిలింది" అనుకున్నదామె. ఏమైనా సురేఖకు జ్వరం తీవ్రంగా కాస్తున్నది. పెళ్ళైన సంబరంతో ఉన్న వాళ్ళందరిమధ్య సురేఖకు జ్వరం అని చెప్పడం "ఓగాయిత్య" మనిపించింది. ధనమ్మగారికి. "పైగా మగ పిల్లాడి వంకవారు వంకలు పెట్టడంలో బహు నేర్పరులు" అనుకుంది.
భాస్కరం తాను చాలా సమర్దవంతుణ్ణి అనుకుంటూ వచ్చాడుకాని, ఇప్పుడు 'మూర్ఖుణ్ణి' అనే విషయం గ్రహించాడు.
సురేఖను చూడాలన్న ప్రయత్నం-పద్మావతి గురించి వాల్తేరులో కనుక్కోవాలీ అన్న తహతహ ఎక్కువయ్యాయి.
వసంతకు పెళ్ళికూతురి బిడియం కాస్త తగ్గింది. ముకుందరావును సోగ కనులెత్తి చూసింది. నవ్వింది. సిగ్గుపడ్డది. అన్నయ్యకు వంగి దండంపెట్టి లేచి కన్నీళ్ళు నింపుకుంది.
"గృహప్రవేశం" లాంఛనంగా చేసినప్పుడు జానకమ్మగారు సురేఖ గురించి అడిగింది.
"కాస్త మంచు పడింది నిన్నరాత్రి ఆరు బయట పడుకున్నది. పడిసం పటింది" అన్నది ధనమ్మగారు. కాని సురేఖకు ఆమె డాక్టర్ ను పిలిచి ఇంజెక్షన్ ఇప్పించింది!
వసంత సురేఖ దగ్గిరకు వెళ్ళింది. సురేఖకు ఊష్ణం తీవ్రంగా ఉంది. వసంత మెల్లిగా నీర్సంగా అడుగులో అడుగు వేస్తో వెళ్ళి పక్కమీద కూచుంది.
"సురేఖగారూ!"
"........................"
"మీకు ఇప్పుడెలా ఉంది సురేఖగారూ!"
సురేఖ మూలుగుతున్నది. తన చెయ్యి మెల్లిగా ఆమె నుదుట పెట్టింది వసంత.
"మరుగుతున్నది"
సురేఖకు ఈ కొత్త స్పర్శతో కాస్త మగత విడి "ఎ.....వ.....రూ.....?" అన్నది కనులు బలవంతంగా బరువుగా తెరుస్తూ.
"నేనూ.........."
"ఆ.......? పెళ్ళికూతురా?......." సురేఖ బరువుగా కనులు తెరిచింది.
"మీరు......మీకు.........మీ......" వసంతకు ఏ మనాలో తెలియదు.
వసంత కోసరం అన్నట్లు భాస్కరం వచ్చాడు ఆవెనకాతలే.
"జ్వరం వచ్చిందా?......." అన్నాడు కాస్త ఎడంగా నిలబడి.
"చాలా ఎక్కువగా ఉందన్నయ్యా!" వసంత సురేఖ పైటను సరిగ్గా సర్దుతూ చెప్పింది.
డాక్టర్ ను పిలుద్దునా? అనుకున్న భాస్కరం- ప్రక్కనే వున్న స్టూలుమీద మందుసీసా, అవీ చూసి డాక్టర్ వచ్చి వెళ్ళాడని గ్రహించాడు.
"నువ్వు పద తల్లీ......అమ్మ పిలుస్తోంది" అన్నాడు వసంత నుద్దేశించి.
"సురేఖగారిని మన డాక్టరు రాజశేఖరంగారికి చూపించాలన్నాయ్!" వసంతలేచి కదిలింది ఆ విషయమే అమ్మకి కూడా చెప్పాలనుకొని.
సురేఖ హీనపక్ష చందమామలా ఉన్నది.
"నన్ను క్షమించండి!" భాస్కరం నెమ్మదిగా ఒంగి అన్నాడు.
సురేఖ చెయ్యి బరువుగా ఎత్తి వూపి హరించింది!
"పద్మావతి వాల్తేరు వెళ్ళిందిట" అన్నాడు.
"నిజంగానా? సరే" అన్నట్లు కాస్త చైతన్యయుతంగా ఆమె అతనికేసి చూసింది.
"నేను మీరూ కలిసే వెళ్దాం కాలేజీకి" అన్నాడు......
"ఉహూఁ..........నాకు మరో వారం పడుతుందిగా......మీరు వెళ్ళండి"
"వో........వో.......మీరు నా చదువుకోసం వెంటనే నయమైపోవాలి" భాస్కరం లాలనగా చనువుగా వాత్సల్యంగా అన్నాడు.
"ఎంత స్వార్ధం" సురేఖ పెదాలు చిరుహాసంగా విడ్డాయి.
ఛెళ్ళున లెంపకాయ కొట్టినట్లనిపించింది భాస్కరానికి.
జానికమ్మగారికి ఇదంతా ఏదో దేవతల ఆగ్రహం అనిపించింది. సురేఖ మొన్నటిదాకా నిక్షేపంలా తిరుగుతున్నది. ఇప్పుడు మంచ మెక్కిందీ అంటే నమ్మశక్యమా?
వసంతకు పెద్దరికం చాలా వచ్చింది.
భాస్కరంమూర్తికి టెలిగ్రాం ఇచ్చాడు. మూర్తి సమాధానం ఇచ్చాడు. పద్మావతి మరో 'కళ్ళజోడు' పెద్ధమనిషితో బస్సు దగ్గర నిరీక్షిస్తూ అగుపించినదనీ, శైలజను తాను కల్సుకోలేక పోయి నందున మరే వివరాలు రాయలేననీ, ఎక్స్ ప్రెస్ ఉత్తరం రాశాడు మూర్తి.
"అమ్మయ్య!" అనుకున్నాడు ఉత్సాహం పుంజుకున్నాడు భాస్కరం.
సురేఖకు బహు సున్నితమైన మనసు ఉన్నది. మెత్తని సౌశీల్యమున్నది. అదే కారణం జ్వరానికి. ఆ సంగతీ భాస్కరానికి బాగా తెలుసు.
* * *
జానికమ్మగారు ఆమె బరువు బాధ్యతలతో సతమత మవుతున్నది.
కూతురిచేత వ్రతాలు నోములు చేయించాలి. అత్తవారింటికి దిగబెట్టాలి. మళ్ళీ పుట్టినింటికి తేవాలి. అల్లుణ్ణి పిలవాలి. సాగనంపాలి. ఇవన్నీ సంప్రదాయాలు ఆమె 'నెత్తిన హైరానయేగదా!'
వసంతకు కొత్త ప్రపంచంలో అడుగు పెట్టినట్లు, తన శరీరమంతా ఇప్పుడే ఎవరో తెచ్చిన కొత్త తొడుగులాగ ఉన్నది!
ముకుందరావుకు అప్పుడే తండ్రి దర్పమూ అధికరమూ, తను భరించలేనివీ అనిపించసాగాయి.
"బెట్టు తెలియదురా నీకూ...... పెళ్ళాంమీద అంత ప్రేమ ఇప్పుడే చూపిస్తే మున్ముందు అది నీ నెత్తిన ఎక్కి పిండి కొడుతుందీ" అన్నాడు రాఘవేంద్రంరావుగారు.
ముకుందరావుకు కష్టమనిపించింది.
"నాకు శలవైపోయింది. డ్యూటీకి ఎల్లుండే వెళ్ళాలి" అని విసురుగా తండ్రి ఎదుటనించి లేచి వెళ్ళిపోయాడు.
* * *
కొడుకు తిరిగి వాల్తేరు వెళ్తానన్నప్పుడుగాని జానికమ్మగారికి 'పద్మావతి' గురించి అడగడు గుర్తుకు రాలేదు.

"ఆవేళ ఎవరో ఒకమ్మాయి రైలుకి వెళ్ళింది కాదురా?" అన్నాదామె.
"ఆఁ వెళ్ళింది. రైలుకన్నా ముందే వెళ్ళింది"
"అదేమిటి బాసా?"
"ఏంలేదుపిన్నీ-పాపం అర్జెంటు పనులున్నాయి కదూ-అలా పారిపోయానని నీకూ నాన్నగారికీ క్షమాపణ జెప్పమనీ రాసింది" అన్నాడు భాస్కారం నవ్వు తెచ్చుకుని.
"అలాగా? ఉత్తరం రాసిందా నీకు?" ఆమెకు అంతలోనే ఆందోళన.
"అరసింది."
భాస్కరం ప్రక్క గదిలోకి వెళ్ళిపోయాడు, పెట్టి సర్దుకోడం నటించాడు.
జానికమ్మగారు తిరిగివచ్చి చెప్పింది.
"వాళ్ళ సురేఖకు వూష్ణం పోయింది-నిన్న సత్యం పెట్టారు ఆ పిల్లను సాయంగా తీసుకువెళ్దువుగాని-ఇవాళ పంచమి-రేపులేదు ఎల్లుండి సప్తమినాడు-ఉండరాదూ?"-
"పత్యం పెట్టిన రెండు రోజులకే ఎందుకమ్మా? కాస్త 'రెస్టు' తీసుకోనిమ్మనూ" భాస్కరం ఆ వార్త పట్ల ప్రసన్నతను వ్యక్తపరుస్తూ అన్నాడు.
"నిమ్మళంగా ఉందిట-పాఠాలు పోహాయి వెళ్తానంటున్నదని ధనమ్మగా రంటోంది."
"సరే! నీ ఇష్టం!"
భాస్కరంపట్ల జానికమ్మగారికి వెంటనే వాత్సల్యం పొంగి వచ్చింది.
దగ్గరిగా వచ్చి "బంగారుకొండ" అని తలనిమిరి గొణిగి, గబగబా వెళ్ళిపోయింది.
భాస్కరాన్ని ఎవరో పళ్ళ చెక్రాల మరలో పెట్టి నలుపుతున్నారనిపించింది.
44
రాజా, పద్మావతిని "అమ్మాయ్! పిన్నమ్మ ఎలాగా సినిమాకురాదు. నువ్వేనావస్తే -ఓ మంచి సినీమా చూద్దామనుకుంటున్నాను" అన్నాడు.
రాజు పక్షంగానే జయమ్మగారు కూడా మాటాడింది. "చనువు లేక గాని. లేకపోతే అదే నిన్ను సినీమాకి అడగవల్సిన మాట" అన్నది ఆమె.
"నిజంగా పార్వతి అయితే ప్రాణాలు కొరికేస్తుందనుకో......దానికి ఈమధ్య హిందీ సిన్మాల పిచ్చి కూడా ఎక్కువయింది" అన్నాడు రాజు.
చెట్టంత మనిషిని ఎదుట చూస్తూ "కాదు" అని ఎలా అనాలో తెలియలేదు పద్మావతికి. పైగా తను ఎంత కాదనుకున్నా లోపల లోపల, తనకూ, ఒక ప్రతిపత్తీ, ప్రతిష్ఠగల అన్నయ్య ఉన్నాడన్న చిన్న ధీమా కూడా తల ఎత్తింది.
రాజు చాలా సర్దాగా మాట్లాడ సాగాడు.
"ఇంకా మీ యూనివర్శితేలో క్లాసు రాధనో, మార్కులు తక్కువేస్తారనో భయపడతారుగాని కాలేజేల్లో స్టూడెంట్సు బొత్తుగా మాట వినరనుకో" అన్నాడు. అని తన అసమర్ధతను బయట పెట్టుకోడం ఇష్టంలేక "నన్ను చూస్తే చాలా రెస్పెక్ట్-బోలెడు గౌరవం ఇస్తారులే" అన్నాడు.
"పార్వతిని ఇక్కడకు పంపితే నాలుగు రోజులు సరదాగా గడుపుతాం" అన్నాది పద్మావతి.
"నాకు ఇప్పుడు నాగపూర్ లో పని చేస్తోన్న మిత్రు డొక్కడున్నాడు........నిజంగా ఎంత మంచి వాడనుకున్నావ్?" అని సమాధానంగా అన్నాడు రాజు.
అతని మంచితనంతో తనకేమీ ప్రమేయం లేదు గనుక పద్మావతి మాట మార్చిందికా అన్నట్లు, "మరి పార్వతికి సంగీతం చెప్పిస్తున్నారా?" అనడిగింది. రాజుకీ ప్రశ్న అస్సలు కిట్టలేదని అతని మొహమే చెపుతోంది. "అతను అంటే మా నాగవూరు స్నేహితుడు చెదరంగం అంటే చెవి కోసుకునేవాడు-వాడు నేనూ ఒక్కోసారి తెల్లార్లూ ఆది, కోడి కూశాక పడుకొనే వాళ్ళం"
పద్మావతికి ఆ మిత్రుడు గురించి వినాలన్న కుతూహలంలేదు. భాస్కరానికి కూడా "చదరంగం మహా ఇష్టం" అని చెప్దామనుకుంది చిరాకుగా కాని.
"నాకు చదరంగం రాధ"ని మాత్రం అన్నది. రాజు నవ్వాడు. "మంచిదే! లేకపోతే పూర్తిగా స్టడీస్ దెబ్బతింటాయ్!" అన్నాడు.
అంతలో సినీమా హాలు వచ్చింది. దర్జాగా వెళ్ళి చెల్లెలంటే తన కెంత అభిమానమో తెలియజేయడానికా అన్నట్లు రెండు పై తరగతి టిక్కెట్ లు తెచ్చాడు.
"అమ్మాయ్! కాఫీ త్రాగుతావా?" అన్నాడు.
"వద్దు" వినయంగా తల తిప్పింది పద్మావతి.
హాలులో జనం పల్చ పల్చగా ఉన్నారు. పద్మావతికి సర్దాగా లేదు. మళ్ళీ రాజు చెప్పడం ప్రారంభించాడు.
"మా వాడి పేరు జనార్దనం......ఎమ్మే ఫస్టు క్లాసులో ప్యాసయ్యాడు. వాడిదీ నాదీ ఒకటే బేచ్. అయితే వాడు చాలా తొందరపాటు మనిషి.......గుంటూరులో ప్రిన్సిపాల్ తో కాట్లాడి రిజైన్ చేశాడు....ప్చ్."
పద్మావతికి ఒళ్ళంతా చీమలు ప్రాకుతున్నట్లుంది. పెద్దవాడు అన్నయ్య-పరాయివాడు కూదాకదు. ఎవరో రంగధామయ్య గురించి ఇలా తన ముందు వూదరకొడితే, దాని మంచి ఎలా తప్పించుకోవాలో తెలియకపోవడంతో "నువ్వు కాఫీత్రాగిరా అన్నయ్యా కావాలంటే?" అన్నది.
"అదిసరే! నాకు కాఫీ పెద్ద అలవాటులేదు. ఐనా రెండు కాఫీ తెప్పిస్తానుండు"- అన్నాడు.
పద్మావతి వారించలేదు. కణతలు నొక్కుకుందామని "ఎంతైనా పెద్దవాడు విసిగిస్తున్నానని" చెప్పడం బాగుండదని వూరుకుంది.
రాజు ఆ సినిమా పూర్తయ్యేలోగా జనార్దనం గురించి చాలా చెప్పాడు. వాళ్ళకి ఒక ఇల్లు కాస్త చెప్పుకోదగ్గ పొలమూ ఉంది. మంచి సంప్రదాయం వాళ్ళ నాన్నగారు ప్లీడర్ గుమాస్తా అయినా మంచి పేరు మన్ననా బడసినవాడు. ఒక్కడే కొడుకు జనార్దనం- అదీ ఐదుగురాడపిల్లల తర్వాత కలిగినవాడు. అన్నింటికన్నా ముఖ్యమైన సంగతి "ప్రస్తుతం హోటలు "కూడు" తినలేక ఇబ్బంది పడుతున్నాడు." అని చెప్పాడు.
పద్మావతికి ఈ వ్యహారం కొంతలో కొంత అర్ధమైంది. అందుకనే పదేపదిసార్లు "నాకు ఈ ఎమ్మే ఎలాగైనా పూర్తి చెయ్యాలనున్నది" అంటూ రాజుకు చెప్పింది.
రాజు మాత్రం జనార్దనం గురించి చెప్పడం మానలేదు. చివరికి అసలు సంగతి కూడా ఇంచుమించు బయట పెట్టాడు.
"వాడికి మన పార్వతినే ఇచేద్దును గాని బొత్తిగా వయస్సు తక్కువేమో కాస్త ఎబ్బెత్తుగా ఉంటుందేమోనని యోచిస్తున్నాను" అన్నాడు.
"అసలు ఆ మాటే పిన్నిని సలహా అడిగితే ఆవిడ కూడా మరీ అంత వయస్సులో వార ఉండకూడదన్నది" అన్నాడు రాజు.
పద్మావతికి కొంచెం కొంచెంగా తన నెవరో నమిలేస్తున్నట్లుంది. "ఇంతకీ ఏం చెయ్యమంటావు?" అన్నట్లు చూసింది. ఇంటర్ వల్ దీపాల కాంతిలో ఆ భావం స్పష్టంగా రాజు గ్రహించాడు కూడాను.
