Previous Page Next Page 
ప్రేమకు పగ్గాలు పేజి 33


    రైలు దడదడ పరుగెత్తుతున్నది. ఇక్కడ దూకేస్తే?....కాని,
    దూకలేదు పద్మావతి.
    తనను భాస్కరం దగా చేశాడని తెలియక తాను తల్లిని దగా చేసింది. ఇప్పుడా తల్లిని తన కోసరమే, -వూపిరి మాత్రం తీసుకుని తతిమా సర్వస్వాన్ని త్యాగం చేస్తూ ఉన్న అమ్మని వొదిలి ఇలా దిక్కుమాలిన చావు చావడం దారుణం అనిపించింది.
    "దగా చేసినవాళ్ళకి లేని బాధ నా కెందుకు?" అనుకుంది.
    రైలు తన గుండెలమీద పరిగెడుతున్నట్లుంది. ఎంత కాదనుకున్నా పదేపదిగా ధనమ్మగారు 'ఈమె మా వియ్యంకురాలు' అని జానికమ్మగారిని చూపుతున్న దృశ్యమే స్ఫురణకు వస్తున్నది.
    రైలు విశాఖపట్నం దగ్గరికి వెళ్ళినకోద్దీ పద్మావతికి కోపం చల్లారి విరక్తి, నిర్లిప్తత ఆవహించసాగాయి!
    "పోనీ! ఆయన సురేఖతోనే సుఖపడితే అలాగే చెయ్యమను. నా కర్మ ఎలా ఉంటే అలాగే అవుతుంది. అమ్మ అంటున్నట్లు నేను సంతు అమ్మగా బ్రతికి యీ జన్మకిదే చాలు ననుకుంటాను" అనుకుంది.
    "పాపం! అమ్మ ఇంటిదగ్గర నా కోసరం ఎదురు చూస్తూ ఉంటుంది. తనకి తన ఆలోచన తప్ప మరొకటి ఉండదు కాని తనో ...... ఎప్పుడు భాస్కరం గురించే ఆలోచించేది....."
    "ఇక అక్కరలేదు" విసురుగా బయటికి చూసింది వెనక్కి వెళ్తున్నట్లు అగుపించే ఆ చెట్లూ చేమల్లాగే తన గత జీవితం స్మృతులు కూడా భూతలంలోకి వెళ్ళిపోతే బాగుణ్ణు అనిపించింది.
    కాని, భాస్కరం స్మృతులు తనను వెన్నాడటం మానలేదు.
    పద్మావతికి తాను చాలా పెద్ద పొరబాటే చేశాననిపించింది. కాని ఇప్పుడు దానిని మరిచిపోవాలంటే సాధ్యంకావడంలేదు.
    యాంత్రికంగా రైలు దిగింది. ఏదో అభూత శక్తి నడుపుతున్నట్లు ఇంటికి చేరుకుంది.
    తలుపు తెరిచే ఉంది.
    లోపల అడుగు పెడుతూనే "అమ్మా!" అన్నది. ఎదురుగా గదిలో గోడవార ఒక కొత్త పెట్టె హోల్డాలు ఉన్నాయి.
    జయమ్మగారు కూతురు గొంతు వింటూనే "వచ్చావా తల్లీ! వెయ్యేళ్ళాయిష్షు" అంటూ వంట యింటినుంచి ఇవతలికి వచ్చింది! "నీ గురించే అనుకుంటున్నాము"-
    "ఎవరమ్మా వచ్చారూ?"
    పెట్టె నక్కడ పడేసి మంచంమీద కూచుని భయం భయంగా అడిగింది పద్మావతి.
    "మన రాజు .... అంటే మీ అన్నయ్య నిన్న నీ వేళకీ, అతగాడు వచ్చాడు ....." అని చెబుతూనే ఆమె వంటయింటిలోనికి వెళ్ళి కాఫీ కలుపుకుని వచ్చి కూతురి కిస్తూ "అయ్యో! అదేమిటే ఆ కళ్ళు వాచిపోయాయి" ఈడ్చి తన్ని నట్లు, నీ వేషం-పిట్టలు పీకినట్లు ఆ జుట్టూ...." అన్నది ఆశ్చర్యంగా.
    "మరి ప్రయాణం గామ్మా" అని కాఫీ త్రాగకుండానే అక్కడ పెడుతూ "ఈ రాజు ఇప్పుడెందుకమ్మా వస్త?" అన్నది అయిష్టంగా.
    "తప్పు పద్మా! అలా రాజు అనకు, అతగాడు బయటకు వెళ్ళాడు. ఇప్పుడే వస్తాడు-విన్నాడా? నొచ్చుకుంటాడు ...." అని కూతురు దగ్గరిగావచ్చి, "రాజు గుంటూరు వచ్చి మనం యిక్కడ ఉనంమని తెలసుకుని వచ్చాడు. ఎంతైనా ఓ కడుపున కాకపోయినా ఒక తండ్రికి పుట్టిన వాళ్ళు మీరు మీరు......అన్నయ్య అన్నయ్యేనమ్మా! గౌరవించాలి" అంటూ కూతురు తల నిమిరింది.
    "అలవాటు లేదుగా" అంటూ స్నానాల గది లోకి వెళ్ళిపోయింది పద్మావతి.
    పద్మావతికి అద్దంలోకి చూసుకోగానే మళ్ళీ దుఃఖం పొంగివస్తున్నది.
    "ఇప్పుడీ అన్నయ్య ఎలా వచ్చాడు చెప్మా?"
    పద్మావతికి జ్ఞానం వచ్చిన తర్వాత రాజు అనే అన్నయ్యను చూడటం రెండు మూడు సార్లకన్నా ఎక్కువసార్లు జరగలేదు. వాస్తవానికి తన తల్లికీ, తండ్రివంక బంధువులకూ రాకపోకలు, తండ్రి మరణంతోనే ఇంచుమించు స్థంభించిపోయాయి.
    పైగా రాజు తనకంటే పదేళ్ళు కనీసం పెద్దవాడు "పెద్ధన్నయ్య"-అంచాత చూసిన రెండు మూడుసార్లేనా చనువు కూడా కలగలేదు.
    పద్మావతి యివతలికి వచ్చేలోపున జయమ్మ గారు-రాజుకి పీట, పళ్ళెం అవీ అమర్చింది. ఆమెకు రాజు ఎందుకు వచ్చాడో తెలుసును. అదీ గాక రాజు ఎలా వచ్చినా, ఎందుకు వచ్చినా, అది ఆమె దృష్టిలో తన ప్రతిపత్తికి, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. 'పిన్నీ' అంటూ తన సవతి కొడుకులు రావడం-తన యోగక్షేమాలు కనుక్కోడం ఆమెకు ఒక "కుల స్త్రీనీ", "సమాజంలో చాలినంత ప్రతిపత్తి గలదాన్ని" అనే ఆత్మవిశ్వాసాన్నిస్తుంది.
    పైగా ఇటీవల ఆమె పద్మావతికి భర్త వంక సంబంధా లేమేనా దొరుకుతాయేమోనని ఆలోచిస్తున్న తరుణంలో రాజు రాక ఆమెకు ఎంతేనా నచ్చింది!
    రాజు కాలేజీలో లెక్చరర్ గా ఉద్యోగం చేస్తున్నాడు-వయస్సు ముఫ్ఫై అయిదు ప్రాంతాలలో ఉన్నా నాజూకుగా ఉంటాడు. తండ్రిలాగే పొడగరి. పద్మావతిని చూస్తూనే "ఏమ్మా! అయిందా మీ ఫ్రెండు ఇంట్లో పెళ్ళీ?" అన్నాడు.
    "అయింది" తల దించుకునే చెప్పింది.
    పిన్నీ! పద్మావతి బాగా మారిపోయింది సుమా!-అంతా మా పార్వతి లాగే ...." అని అంతలో "మా" అన్న మాట సర్దుకుని ..... "ఏం పద్మా! నీకు అమ్మ నే తెచ్చిన ప్రెజెంట్ యివ్వలేదూ?" అన్నాడు.
    "మా పార్వతి" అన్న మాటలను జయమ్మగారు కూడా విననట్లే నటించింది.
    పార్వతి రాజు చెల్లెలు. పద్మావతి కన్నా రెండేళ్ళు చిన్నది.
    "పార్వతిని తీసుకొని రావాల్సింది ....."
    "అన్నయ్యా" అన్న మాటను దిగమింగేస్తూ అడిగింది పద్మావతి.
    "అదీ సరదాపడ్డది కాని నేనే అక్కయ్యనే తెస్తాను అన్నాను సరేనా?" కూచుని తల వెనక్కి ఎగరేసి నవ్వాడు రాజు.
    పద్మావతికి ఈ కొత్త అన్నయ్య రావడంవల్ల అనుకోని ప్రతివ్యాపకం దొరికింది-గుండె గాయాన్ని కాస్త ఏమార్చగలిగింది.
    ఐతే ఇన్ని సంవత్సరాలుగా రాని అన్నయ్య ఇవాళ అకస్మాత్తుగా రావడం పద్మావతికి గుండెల్లో భయం భయంగా మెదిలింది. ఎందుకంటే, "ఆస్తి మీద మీకు ఏ హక్కూ లేదన్న" ధర్మనిధి యీ రాజు అన్నయ్యేనని ఆమెకు బాగా జ్ఞాపకం.
    కాని, రాజు ఇప్పుడు వచ్చిన సంగతి వేరు. పెద్ద అన్నదమ్మునిగా తనకు గల బాధ్యతను నిర్వర్తించడానికి వచ్చానని జయమ్మగారికి రాజు చెప్పాడు. అది అతని హక్కు అని నమ్మడం జయమ్మగారి బలహీనత గనకనే రాజు యిరవై నాలుగ్గంటల్లోనే ఆమెకు చాలా సన్నిహితుడయ్యాడు.
    కూతురు పెళ్ళికి వెళ్ళి వచ్చిన వెంటనే ఎందుకని విషయం కదపలేదు గాని, ఆ రాత్రి ఎట్టకేలకు జయమ్మగారు పద్మావతితో రాజు ఆగమనంలోని అసలు కథ చెప్పింది.
    "పార్వతికి సమ్మంధాలు వస్తున్నాయట" అన్నదామె.
    "సరే! పెళ్ళి చేసెయ్యమను" అన్నది పద్మావతి.
    "అదేం మాటలే! పెద్దదానివి నువ్వుండగా చిన్నపిల్ల దాని కెలా కళ్యాణం తలపెడతారూ? ఆమాట మీ పెద్దన్నయ్య రాజు అంటున్నాడు." జయమ్మగారు అసలు విషయం చెప్పింది.
    సమయానికి అందుకుని "చూడు చెల్లాయ్! నాకు నువ్వొకటీ పార్వతీ ఒకటీ కాదు. ఆమాట కొస్తే మా అమ్మ మాట విని పార్వతిని బడి మాని పించి హైస్కూలు తర్వాత ఇంట్లో కూచోపెట్టానే గాని, నిన్ను ఇవాళ ఎమ్మే కూడా వద్దూ అనడంలేదూ" అన్నాడు.
    "పద్మావతికి నువ్వెవరివి?" అన్న మాటలు పైకి రాలేదు గాని పెదాల చివరిదాకా వచ్చాయి!
    రాజు విషయం మరింత వివరించాడు.
    "పార్వతి అప్పుడే మూడేళ్ళయింది పెద్ధదై యింట కూచుని-నువ్వు ఆ బి.ఏ. అవగానే, పెళ్ళి సమ్మంధాలు చూద్దాము. పిన్ని కబురు పెడుతుంది అనుకున్నాం-కాని, వెధవది కాలేజీలో రోజూ అరవడం, అలిసిపోవడం-తలమ్ముకొన్న బ్రతుకు గదా ..... అందుకని ఆ వెంటనే రాలేకపోయాను-ఇప్పుడు......"
    పద్మావతి అతి కష్టంమీద అతని వాగ్దోరణికి అడ్డుపడి, "కాని యీ చదువు పూర్తి చేస్తాన్నయ్యా" అన్నది.
    "తప్పకుండాను.....నీ చదువుకు ఆటంకం రాగల కళ్యాణం ఎందుకు చేస్తాము. నువ్వు నిక్షేపంలాగ చదువుకో ..... పార్వతికి ఎలాగా మానేశాం...."రాజు పార్వతి విషయంలో సొంత చెల్లెలై నందున అశ్రద్ధ చేశామన్నట్లు నిట్టూర్చాడు.
    జయమ్మగా రన్నది "అయినా చిన్నవాళ్ళు వాళ్ళతో ఏమిటి గాని ..... నీవు ఏవైనా సమ్మంధాలు చూశావా? చెప్పు బాబూ!"
    "లేదమ్మా! మొదట చెల్లాయినీ, నిన్నూ అడగాలి గదా! ఆమాటకొస్తే మన పలుకుబడికి కొదవలేదు గాని-,ఈరు యివతల ఏమీ సమ్మంధాలు వెతకడం లేదుగదా?" రాజు అడిగాడు.
    "లేదు, లేదు. నీ ఏరున ఉత్తరం రాయకుండా ఎలాగ? పెద్దవాడివి కదా?" నన్నది జయమ్మ గారు ఆప్యాయంగా.
    ఆ రాత్రి మొత్తంమీద సమస్య ఎటూ తేలలేదు. ముగ్గురూ తెగేవరకూ ఒకరిని ఒకరు సాధించ గల ధైర్యంలేక వూరుకున్నారు.
    పద్మావతికి కంట కునుకు రాలేదు.
    "ఇక భాస్కరానికి తనకూ ..... అనుబంధం తెగినట్లేనా?...." అన్న ఆలోచనయే ఆ పిల్ల గుండెల్లో అగ్నిపర్వతమై ప్రేలుతున్నది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS