"ఇప్పుడు నా లోట్లు పాట్ల మాట కాదండి చెప్పమంది. అందం....అందం గురించి" అన్నాడు గోవిందబాబు నవ్వుతూ.
అప్పుడే మొదటిసరిగా అతని వైపు పరీక్షగా చూసింది జానకి. అదే సమయంలో అతడు ఆమె వైపు చూసేడు. ఇద్దరి కళ్ళు క్షణ కాలం కలుసుకోన్నాయి. వెంటనే చూపులు తిప్పుకొని , పిల్లల్ని పలకరిస్తూ ముందుకు పోతున్న అనసూయమ్మ ను అనుసరించింది జానకి.
గోవిందబాబు పాలసరి చెట్ల మరుగున మాయమయేవరకూ అలాగే చూసింది జానకి. ఆనాడు గోవిందబాబు అందం గురించి ఏమీ చెప్పలేక పోయింది. కాని ఈనాడు ఎవరూ ప్రశ్నించకుండానే "గోవిందబాబు అందమైన వాడు" అని సమాధానం చెప్పింది జానకి మనసు.
ఇదేమిటి...ఈరోజు ఆలోచనలన్నీ అతని చుట్టూ తిరుగుతున్నాయి? అతని అంద చందాలతో , మంచి చెడ్డలతో తనకేం పని? ఇక్కడ ఉన్న నాలుగు రోజులు మంచిగా కాలం వెళ్ళబుచ్చుకొంటె సరి. అటు తరువాత ఆయనెవరో, తనెవరో? మనసును మరల్చుకొని వడివడిగా అడుగులు వేసింది జానకి.
అనసూయమ్మ జానకి కోసం ఎదురుచూస్తున్నట్లే, వరండాలో కూర్చుంది.
"గోవిందు వెళ్ళి చాలా సేపయిందే! తిన్నగా నీ దగ్గరికి రాలేదా?" అన్నది ఆవిడ.
'అయన వచ్చి వెళ్ళి చాలాసేపే అయింది. ఏవో కాగితాలు చూస్తూ నాకే ఆలస్యం అయింది."
"ఆహా! మరేం లేదు. మొన్న ఇంటి మాట అడిగేవు కదూ? ఇప్పట్లో నీకిచ్చిందికి లేవనుకొన్నాను. కాని గోవిందు అన్నదేమంటే-- పిల్లల హాస్టల్ పక్క నున్న రెండు గదులు జానకి కావాలంటే ఉపయోగించుకోవచ్చు. నెలనాటికీ ఉత్తరపు వైపు ఇళ్ళు తయారవుతాయి. నేల గచ్చులు, సున్నాలు మాత్రమే మిగిలి ఉన్నాయి-- అన్నాడు. అలా ఇష్టమైతే నువ్వే రోజునైనా వచ్చి దిగవచ్చు" అన్నది అనసూయమ్మ.
"ఇప్పుడంత తొందర లేదు లెండి. ఆ ఇళ్ళు పూర్తయే కనే చూడచ్చు. ఇంకా ఈ విషయం మా అన్నయ్యతో ప్రస్తావించలేదు. వాడేమంటాడో? అయినా మీ సహాయానికి చాలా కృతజ్ఞరాలీని. నేను ఆలోచించుకొని, రెండు మూడు రోజులలో మీకు ఏ భోగట్టా చెప్తాను." అంటూ లేచింది జానకి.
"సరే, అలాగే కానీ నీ ఇష్టం. నా ఉద్దేశం మరేం లేదు. గోవిందబాబు వెళ్ళిపోతానంటున్నాడు. మహా బలవంతం మీద ఒకటి రెండు నెలలాగిందికి ఇష్టపడ్డాడు. నా ఒంట్లో శక్తి లేకుండా పోయింది. ఈపని చెయ్యడానికి డబ్బిస్తే ఎవరు రారని కాదు. కాని ఆపేక్షగా గోవిందబాబులా ఎవరు చేస్తారు? అతను వచ్చేక బాలవిహార్ ఎంత అభివృద్ధి లోకి తెచ్చేడు! ఎన్ని మార్పులు, కూర్పులు చేసేడు! ఇటువంటి పనులు నాలాటి వయసు మళ్ళినవాళ్ళ వల్ల కావు, జానకీ! మీలాంటి ఉత్సాహవంతులైన యువజనులు చెయ్యవలసినవి. గోవింద'బాబు మరొక ఏడాది పాటుంటే..... పోనీ, నువ్వోసారి చెప్పి చూడకూడదూ?"
అనసూయామ్మ మాటల ధోరణికి జానకి ఆశ్చర్యపోయింది. గోవిందబాబు తన అజ్ఞానువర్తిగా కనుసన్నలలో మెలుగుతున్నట్లు మాట్లాడుతుందేమిటి ఈవిడ? అనుకొంది.
"మీరు చెప్పగా ఉండనిది నా మాట మీద ఆగిపోతారా?" అన్నది.
ఆ మాటలో విసుగుదల పసికట్టింది అనసూయమ్మ. నిజమే. జానకికి, గోవిందబాబుకు ఉన్న సంబంధ మేమిటి? వయసులో ఉన్నవాళ్ళు కాస్త చనువుగా తిరిగితే తనలాటి ముసలాళ్ళు దానికి ఏవేవో భావాలు కల్పించుకొంటూ, ఆ చనువుకు అడుగున ఏదైనా భావం ఉండక పోతుందా? అని ఊహించుకొంటుంటారు. ఆ మాట తను అనకపోవలసింది-- అనుకొంది. "సరేలే, జానకీ! గోవిందబాబు వెళ్ళిపోయినా, నువ్వు ఇక్కడికి వచ్చేస్తే పిల్లలకి దగ్గరగా ఉంటావు. అదే నా అభిప్రాయం. తొందరేం లేదు. అలోచించి నీకు బాగుంటుందని తోస్తేనే రా" అన్నది ఆవిడ.
జానకి ఆలోచిస్తూనే ఇంటికి బయలుదేరింది. అంతకు పూర్వం అనసూయమ్మ దగ్గర ఆ ప్రస్తావన తేవడానికి కారణం లేకపోలేదు. శాంత ఇల్లు వదిలి వెళ్ళిననాడు లీలగా ఆమెలో రేగిన అనుమానాలు, భయాలు ఆమెలో ఆలోచనలు రేకెత్తించాయి. అన్న సూర్యారావు మాటలు విన్నమీదట ఏ కారణం గా నైనా శాంత తిరిగి వస్తే, అతడు ఆమెను ఇంట్లో ఉండనియ్యడెమో? అనే అనుమానం మొలకెత్తింది.
ఏడాది నాడు తమ ఇంటి ఎదుటి వాసలో , హనుమాయమ్మ గారింట అపరాత్రి అరుపులు, బొబ్బలు తలపు కొచ్చేయి. అమాయకంగా మోసపోయిన బాల వితంతువు చెల్లాయమ్మ, అటు నమ్మించి మోసం చేసినవాడిచేత, ఇటు కడుపులో పెట్టుకొంటారనుకొన్నకన్నవారి చేత , కుక్కలా తరమబడి, అవమానాన్ని హరాయించుకోలేక, గంగాదేవి శరణు జోచ్చింది. తెలిసినవారి చీత్కారాలు, కన్నవారి కఠోరోక్తులు తన్ను చేరని దూరానికి వెళ్ళిపోయింది. చనిపోయిన తరువాత కూడా 'తన' అనుకొన్న వారి కన్నీటి చుక్కకు నోచుకోలేదు ఆ జీవి.
శాంత ఇంకొక చెల్లాయమ్మ కాకూడదు. మనసు, మానవత ఉన్న ఏ కుటుంబంలోనూ చెల్లాయమ్మలు సృష్టించబడకూడదు. నేరానికి శిక్ష ఎంత అవసరమో క్షమా కూడా అంత అవసరమే. తాము చేసిన తప్పు తెలుసుకునే అవకాశం వాళ్ళకు కలిగించాలి. సరిదిద్దుకునే పరిస్థితులు ఏర్పరచాలి.
చెల్లాయమ్మ, శాంత చేసిన పనుల్లో ఉన్న తప్పొప్పులను తను చర్చించబోవడం లేదు. మనిషికి తిండి, బట్టా కాక మరికొన్ని ప్రకృతి సిద్దమైన అవసరాలు ఉంటాయని అందరూ ఒప్పుకొంటారు. వాటిని సంఘం, తలిదండ్రులు గమనించనప్పుడే దైహికమైన ఈ అవసరాలకూ, నీతి, న్యాయం అని చలామణి అవుతున్న ఆచారాలకూ వైరుధ్యం ఏర్పడుతుంది.
కొందరు దైహిక వాంఛలను అరికట్టుకొని, తమ్ము తాము అదుపులో పెట్టుకొంటారు. మరికొందరు వాటికీ తలొగ్గి లొంగి పోతారు. అది ఒక్కొక్కరి వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది; ఆలోచనల రీతి ని బట్టి ఉంటుంది; జీవితం పట్ల వారికి ఉన్న విలువల్ని బట్టి ఉంటుంది.
అందరు వితంతువులూ చెల్లాయమ్మలు కారు; అందరు కన్యలూ శాంతలు కారు. కాని తమ కుటుంబాలలో చెల్లాయమ్మలు, శాంతలు ఉన్నప్పుడు వారిని అసహ్యించుకొని, ఇంటి నుండి వెడల గోడితే లాభం లేదు. వాళ్ళను అలా తయారు చేసిన పరిస్తితుల్ని సవరించాలి. సానుభూతి తో వాళ్ళ సమస్యల్ని అర్ధం చేసుకోవాలి. వాటి పరిష్కారానికి మార్గాలు అన్వేషించి, వారికి చేయూతనివ్వాలి.
జానకి లో రేగిన ఈ ఆలోచనల సారాంశమే, శాంత తిరిగి వస్తే ఆమెను తను ఆదుకోవాలన్న అభిప్రాయం గా మారింది. అనసూయమ్మను ఇంటి కోసం ప్రశ్నించవలసిన అవసరం కలగజేసింది. వారం రోజులు గడిచినా శాంత తిరిగి రాలేదు. ఒంటరిగా బాలవిహార్ లో ఉండే అభిప్రాయం ఆమెకు లేదు. ఆ విషయం అప్పుడే అనసూయమ్మ తో చెప్పవచ్చు. కాను ముందు ఇంటి గురించి ప్రస్తావించడానికి కారణం ఆమెతో చెప్పడం ఇష్టం లేక అలా తప్పుకోంది. రెండు రోజులు పోయేక , అప్పటికీ శాంత తిరిగి రాకపోతే, తల్లి, అన్న సమ్మతించలేదని చెప్పేస్తే సరిపోతుంది అనుకోంది జానకి.
* * * *
అలవాటు చొప్పున ముగ్గు డొక్కు, నీళ్ళు , చీపురు కట్ట పట్టుకొని వీధి తలుపు తెరిచింది కనకం. తెరిచిన తలుపు గుండా చల్లని చలిగాలి రివ్వున కొడుతున్నది. పైట కొంగును భుజాల మీదుగా తిప్పుకొని నిండుగా కప్పుకొన్నది.
"మరీ ఇంత చీకటి తో లేవకపోతే ఏమైంది? కాస్త తెల్లవారని య్యకూడదూ?" అన్నది సుందరమ్మ దుప్పటి ముసుగు లోంచి.
"ఈరోజు నువ్వు బయటికి పోకు, వదినా! ఆ ముగ్గేదో నే పెట్టి వస్తాను. ఆ గాలి నీ ఒంటికి మంచిది కాదు" అన్నది జానకి ఆమె చేతి లోంచి ముగ్గు డొక్కు అందుకొంటూ.
"ఈ ఒక్క రోజుకీ నన్ను పెట్టనీ, జానకీ!రేపటి నుండి నువ్వే పెడుదువు గాని. ఆమధ్య పక్కింటి వారి కోడలు వద్ద నేర్చుకొన్న చుక్కల పులిగోరు పెట్టనే లేదు. తిన్నగా వచ్చిందో , లేదో ఒకసారి పెట్టి చూస్తాను" అన్నది కనకం.
"ముగ్గులంటే నీకెంత పిచ్చి, వదినా!" అన్నది జానకి.
జానకి మాటతో కనకం ఆలోచనలు పారుతున్న ఏరులా గలగలా ప్రవహించేయి.
ముగ్గులంటే తనకు అభిమానం. పాటలంటే తనకు ప్రాణం. అవి రెండూ ఒక విధంగా తన భావనలో బాధలలో భాగం పంచుకొంటూ , తనను సంతతం అనునయించే అప్తుల్లాటివి.
ముడుకులు దిగని ఫ్రాకు తొడుక్కొని అమ్మ వెంట ముగ్గు కర్రలు తీయడం మొదలు పెట్టిన నాటి నుండి అవి తనతో ఉన్నాయి. ఆటల్లో, పాటల్లో పండుగల్లో, పూజల్లో తనతో సరిగా ఆనందం పంచుకోన్నాయి. ఎన్నో మరుపురాని అనుభవాలు వాటిలో లంకె పడి ఉన్నాయి. వాటిని తను వదులుకోలేదు. అందుకే ముగ్గుల్ని తను దూరం చేసుకోలేదు.
శీతగాలి ఈ చెవులోంచి ఆ చేవులోకి రివ్వున కొడుతుంటే మేలుకొలుపులు పాడుతూ, ముగ్గులు పెడుతుండే నాన్నమ్మ ముకం, తనకు నెలగంట ముగ్గులో కనిపిస్తుంది.
"గుమ్మంకే గోపదేవీ" పాట పల్లవి ఎప్పుడూ తన గొంతుకను క్షణ కాలం పలకనియ్యదు. అమ్మ వెన్న చిలుకుతూ ఆ పాట పాడుతుంటే , తమ్ముడు మీద పడి వెన్న పెట్టమని అల్లరి పెట్టేవాడు. ఆడుతూ పాడుతూ కళ్ళు మూసిన ఆ తమ్ముడి మాటలు, ఆ పాటలు పల్లవి తో పాటు తన చెవుల్లో దూరి రోద చేస్తాయి. అయినా ఆ పాట పాడుకోకుండా ఉండలేదు; ఆ బాధను మరిచి పోనూ లేదు.
గొబ్బి పాటలు నోట్లో మెదిలినప్పుడల్లా, "మొగలి పువ్వువంటి మొగుడి నియ్యావే" అని గొబ్బెమ్మను ప్రార్ధిస్తూ పెద్దవాళ్ళు వింటే సిగ్గుతో పరుగులు పెట్టె చిన్నతనపు రోజులు జ్ఞాపకం వస్తాయి.
రాగభావాలు అంతంత మాత్రంగా ఉన్నా ఈ పద్యాలలో, పాటలలో ఇంతటి శక్తి ఎలా ఉందొ తనకు తెలియదు. ఎప్పుడో విన్న ఒక పాట మనిషి మెదడుకు పదును పెట్టి , గడిచిన కాలం లోకి ఈడ్చుకు పోతుంది . ఆ పరిసరాలను, అప్పటి సంఘటనలనూ కళ్ళ ముందు కదలాడే చిత్రాల్లా నడిపిస్తుంది. అవి ఆనందపరిచేవైనా, కన్నీరు కార్పించేవైనా అనుభవం మాత్రం ఒక్కలాగే ఉంటుంది.
ధనుర్మాసం వచ్చి పది రోజులైంది. గ్రామంలో అయితే ఇటు అటు ఇళ్ళ ముగ్గులు కలిసి పోతాయి. పట్నాలలో తలకొక రీతి. కొందరు పనిమనిషిచే గుమ్మం కడిగించినా ముగ్గులు తాము స్వయంగా పెట్టుకొంటారు. కొందరు దానినే సుద్దతో రెండు గీతలు గీసేమంటారు. ఇంకొక తరహవాళ్ళు అసలు వీధి గుమ్మాన ముగ్గు అవసరమే తోచదు.
పోయిన సంవత్సరం ఎదురింటి వారు సుశీలా, తను పంతాలు వేసుకొని ముగ్గులు పెట్టేవారు. ఆ పిల్ల, పెళ్ళయి అత్తారింటికి వెళ్ళిపోయింది. ఆ పిల్ల తల్లి అంత ఓపిక లేదు. కడిగిన గుమ్మం ఉండి పోకుండా ముగ్గు గొట్టంలో పోసి అడ్డంగా నిలువుగా రెండు గీతలు గీస్తుంది. తను మాత్రం మానకుండా ముగ్గులు పెడుతున్నది. కాని అందులో సంతోషం సన్నగిల్లిపోతున్నది. ఏదో బాధ పీకుతున్నది.
సూర్యరధం ముగ్గు పెడుతుంటే చదువుతున్న పుస్తకం మూసి తదేకంగా చూసేవాడు సాంబు. పండుగ ముందు పరీక్షకు చదువు కోవాలని సాంబు చీకటితో లేచేవాడు. ముగ్గుల కోసం తను లేచేది.
"మీ ముగ్గులన్నీ పూర్తయ్యాక నన్నోకసారి పిలవండి, వదినా" అనేవాడు.
సూర్యరధం ముగ్గంటే సాంబు కెంతో ఇష్టం. "ఎంత చక్కగా పెట్టేరు వదినా! ఎప్పుడూ ఈ ముగ్గే ఎందుకు పెట్టరు?" అనేవాడు.
