హు అదేనమ్మా.....ఈ అందమే నా దురదృష్టం అయింది ఆయన 'ఇగోని తృప్తిపరచడానికి. నేను మామూలుగా వున్న లేనింటి ఆడపిల్ల నయితే ఆయన ఇగో తృప్తిపడేదేమో అనుకుంది అర్చన పైకి నవ్వుతూ "ఈ ప్రశ్న మీ ఆయన్ని అడగాలి నన్నుకాదు. అంది కొంటెగా.
అదే సమయంలో బయటికి వెళ్ళిన రావు లోపలికి వచ్చాడు అర్చనని చూడగానే అతని మొహం ఒక్కక్షణంలో నల్లబడిపోయింది. ఊహించని, సన్నివేశం ఏమో అతను ఒక్కక్షణం గాభరాపడిపోయాడు. వెంటనే అతని మోహంలో రక్తం చిమ్మినట్టు ఎర్రబడింది ఈలోగా పద్మనవ్వుతూ "ఎవరొచ్చారో చూశారా....మీ పాత భార్య." అంది ఆ మాటతో మరింత ఉడికిపోయి విసవిస ఆ గదిలోంచి తల్లి గదిలోకి వెళ్ళాడు.
"అమ్మా." అరిచినట్టే అన్నాడు. "అమ్మా" అడ్డమైన వాళ్ళని ఈ యింటికి ఎందుకు రానిస్తున్నారు. మీకు అసలు మతి సుతి లేదా."
శకుంతలాదేవి గంభీరంగా ఎవర్రా అడ్డమైన వాళ్ళు" అంది కొడుకు వంక చూస్తూ.
"అదే, అదే అదెందుకు వచ్చింది. యింక మనతో ఏ సంబంధం వుందని ఈ గడపలో కాలుపెట్టనిచ్చారు మీరు."
రావు అరుపులకి సదాశివంగారు బాబుని ఎత్తుకుని లోపలికివచ్చారు. కొడుకు వంక స్థిరంగా చూశాడు. "జవాబు నేను చెపుతాను విను. ఆడపిల్ల పుట్టింటికి రావడానికి అన్ని హక్కులూ వుంటాయి. ఆమె మా కూతురిగా పుట్టింటికి వచ్చింది. ఎనీ అబ్జెక్షన్.." తండ్రి మాటల్లో కరుకుతనానికి గతుక్కుమన్నాడు రావు. తండ్రి ఆ వరస కలిసి అలా మాట్లాడుతాడని రావు అవమానం జరిగినట్టు మొహం గంటుపెట్టుకుని "సరే మీరు మానాభిమానాలు వదిలేసుకుంటే నాకేం అభ్యంతరం -కన్నకొడుకు కంటే....కొడుకుని వదిలేసిన కోడలు మీద మీకంతప్రేమ వుంటే నాకేం బాధ-"వ్యంగ్యంగా ఎత్తి పొడుస్తూ...తండ్రి ఎత్తుకున్న బాబు వంక ఓ విషపు చూపు విసిరి విసవిస వెళ్ళిపోయాడు. అంతా వింటున్న అర్చనకి కోపంరాలేదు. రావు కోపం అర్ధం అయి నవ్వుకుని వూరుకుంది. రావు మళ్ళీ కిందకి దిగి రాలేదు. భోజనం కూడా భార్యచేత మేడమీదకి తెప్పించుకున్నాడు.
స్నానం అదీ చేసి అత్తగారి దగ్గర కూర్చుని, చెమ్చా చెమ్చాపాలు అతి కష్టంమీద ఆవిడ మింగుతుంటే నోట్లో పోస్తూంది అర్చన. మామగారు ముందునించి ఆవిడ జబ్బు గురించి చెప్పుకొచ్చారు. ఓ ఏడాదిపాటు ఏదో మామూలు దగ్గు అనుకున్నారు. దగ్గు మందులు తింటూండడం నాలుగు రోజులు తగ్గడం, హెచ్చడం జరుగుతుంటే యిద్దరూ పెద్దగా పట్టించుకోలేదు. తరువాత గొంతు మింగలేకపోవడం ఆవిడ చాలా రోజులకిగాని గమనించలేకపోయింది. గొంతునొప్పి, దగ్గు ఎక్కువగా కఫం పడడంతో ఆవిడకి అనుమానంవచ్చి, ఆయనకి చెప్పకుండా, తను డాక్టరునని ఎవరికీ చెప్పకుండా మామూలు పేషంటులా కాన్సర్ హాస్పిటల్ కి వెళ్ళి పరీక్షచేయించుకు వచ్చింది. "దానికి గొంతు కాన్సర్ అన్నది నాకు తెలిస్తే బాధపడతానని, తను బాధపడ్తూ, దాని బాధ నాకు కన్పించకుండా ఆరు నెలలు దాచిందమ్మా నా దగ్గర." సదాశివంగారి గొంతు వణికింది. "ఇతర్లరోగం నయంచేయడంలో మునిగిపోయి నాభార్య రోగాన్నే గుర్తించలేకపోయాను తల్లీ ఆయన కంట్లో నీరు చిమ్మింది. "నాకు తెలిసేసరికి రోగం ముదిరింది. ముదిరిందేమిటి ముదరపెట్టుకుంది. తరువాతేనా వైద్యానికి ఒప్పుకుంటేగా."
"ఈ రేడియం ట్రీట్ మెంటులు. క్రోమోథెరపీలు అవి రోగాల్ని తగ్గించలేవని నాకు తెలుసు అర్చనా....మనిషిని చావునింఛి కాస్తంత దూరంగా తీసుకెళ్ళగలవు కాని శాశ్వతంగా దూరం చెయ్యవని నాకుతెలుసు ఆ ట్రీట్ మెంట్ తీసుకుని అనుభవించాల్సిన నరకం కంటే, ఐ ప్రిఫర్ టు సఫర్ లైక్ దిస్."
"అత్తయ్యా.....మీలాగే అందరూ అనుకుంటే ఈడాక్టర్లు మందులు ఎందుకు తగ్గదని ఏం వుంది మందు పుచ్చుకుని ట్రీట్ మెంట్ తీసుకుని నయం కాకపోతే మన ఖర్మ అనుకోవాలిగాని గాలిలో దీపంపెట్టి దేవుడా నీదే భారం అని కూచుంటే ఎలా.... కొన్ని కేసులలో ట్రీట్ మెంటుకి రెస్పాన్డ్ అయిన వారు ఎందుకు లేరు."
"హు సెకండరీ స్టేజి వచ్చాక యింక తగ్గేదేమిటమ్మా - డాక్టరు నయిన నాకు తెలియక ఊరుకున్నానా - ఆ రేడియం థెరపీ, క్రోమోథెరపీలు బతికున్న నాలుగు రోజులయినా శాంతిగా, ఉండనివ్వవు. మనిషిని పీల్చేసి ఆ మందులు నాకొద్దు జుట్టూడిపోయి, చర్మం అంతా మాడిపోయి, ఆకలి చచ్చి బతుకుమీద తీపే చచ్చి నా చావుని యింకొన్నాళ్ళు పొడిగించుకోవాలనిలేదు. నా శరీరం శిథిలమవకుండా..... యిలాగే చచ్చిపోవాలని నా కోరిక.... ఆ మాత్రం శాంతయినా నాకు దక్కనీయరా మీరందరూ." ఆవిడ నెమ్మదిగా ఆయాసపడ్తూ అంది.
"ఇదమ్మా....వరస.....ఈవిడ డాక్టరవడం యింత ముప్పుతెచ్చింది. ప్రయత్నం అన్నా చేరనీయకుండా నా కాళ్ళు, చేతులు కట్టేసింది ఒట్టు వేయించుకుని." ఆవేదనగా అన్నారు సదాశివంగారు.
శకుంతలాదేవి, అర్చన చేయి తనచేతిలోకి తీసుకొని, "ఈ మాట లకేంగాని అర్చనా! ఏం చెప్పినా ఏం చేసినా మహా అయితే ఆరునెలలు, ఇంక నా జీవితం. అర్చనా ఈ ఆఖరు రోజులలో నా ఒక్కకోరిక తీర్చాలి నువ్వు" ఆవిడ కళ్ళల్లో అభ్యర్ధన.
"తప్పకుండా....ఏం కావాలి చెప్పండి. నేను చెయ్యగలిగింది ఏదన్నా చేస్తాను" అర్చన హామీ యిచ్చింది.
"నే బతికే నాలుగురోజులు... పూజని యిక్కడ నుంచి తీసుకెళ్ళకమ్మా! దాన్ని నా కళ్ళముందు వుంచమ్మా యీ నాలుగు రోజులు. అది ఎంత చేరిక అయిపోయిందంటే దాన్ని విడిచి వుండాలన్న ఆలోచనే నాకు మనస్తాపం కలిగిస్తూంది. యీ నాలుగురోజులూ దాన్ని నానుంచి దూరం చెయ్యకమ్మా!" విచలితురాలై అంది.
ఆవిడ కోరిక యిదని ఎదురు చూడని అర్చన ఒక్క నిమిషం తడబడింది. అంటే, యింకో ఆరు నెలలో, ఏడాదో...యిక్కడే ఉంచాలన్నమాట. ఎప్పటికప్పుడు ఏదో ఆటంకం, అవాంతరం.....ఏమిటిలా అవుతూ వుంది. పూజ సేల్ తమకు దూరం అయిపోతూందనుకుంటే ఇంకా ఇంకా ఆలస్యం అవుతూంది. కాని.....తనపట్ల యింత ఔదార్యం, సానుభూతి చూసిన వారి కోరికని.....అందులో.....జీవితం చరమ దశలో కోరిన కోరికని కాదనడం ఎలా.....
