శకుంతలాదేవికి అర్చనని చూడగానే కళ్ళనీళ్ళు తిరిగాయి. మాట్లాడలేనట్టు అర్చన చేయి గట్టిగా పట్టుకుంది. "నా పని అయిపోయింది అర్చనా అంది హీనస్వరంతో. అర్చనకి కంటినీరు జారింది. సదాశివంగారు గదిలోకి వచ్చారు. అర్చనని చూడగానే "వచ్చావా అమ్మా" అన్నారు.
"ఏమిటిది మామగారూ! యిన్నాళ్ళవరకు మీరిద్దరూ డాక్టర్లయి ఉండి ఎలా నిర్లక్ష్యం చేశారు. యిలా అయిపోయారేమిటి యీవిడ" గొంతు రుద్దమవగా అంది.
ఆయన కూడా వడిలిపోయి హఠాత్తుగా వృద్దాప్యం ముంచుకొచ్చి నట్టు కుంచించుకుపోయారు. మొహం అంతా కమిలిపోయినట్టు నల్లబడింది దుఃఖం, ఆవేదన ఆయన్ని నమిలేస్తున్నట్టు ఆయన మొహం చెబుతూంది. ఆయన ఆ ప్రశ్నకి జవాబివ్వలేనట్టు రెండు చేతులు పైకెత్తి అంతా ఆ భగవంతుడి లీల అన్నట్టు చూశారు. కంటినీరు తుడుచుకుంటున్న భార్య దగ్గిరకెళ్ళి "ఇదిగో మళ్ళీ ఏడుస్తున్నావా....అమ్మా అర్చనా ఎవరొచ్చినా యీవిడ ఇలా ఏడుస్తుంది. అందుకే నేనెవరికి చెప్పలేదమ్మా ఎవరినీ రానీయడంలేదు. నీకు చెప్పకపోతే నీవు నన్ను క్షమించవని ఆఖరికి చెప్పాను. శకూ....నీవు డాక్టరివి.....మనం ఏడ్చి చేయగలిగింది ఏమీ లేదని నీకు తెలిసి ఇలా దుఃఖపడి, నన్ను దుఃఖపెట్టకు" ఆయన బుగ్గల మీద కారుతున్న కన్నీటిని చిన్నపిల్లాడిలా చొక్కాచేతులతో తుడుచుకుంటూ అన్నారు. "చావు అనివార్యం అని తెలిసినపుడు బతికే నాలుగు రోజులూ నవ్వుతూ బతకాలి డార్లింగ్ అని ఎన్నిసార్లు చెప్పాను. కమాన్ చీర్ అప్ డియర్.....ఏది నవ్వు" అంటూ ఆయన భోరున యేడ్చారు మంచం మీద తల ఆన్చి, శకుంతలాదేవి ఆయన్ను చూసి తనూ విలపించడం మొదలుపెట్టింది. అంత గంభీరంగా, హుందాగా వుండేవాళ్ళు ఇతరుల కష్టాలని, దుఃఖాలని దూరం చేయడానికి రాత్రింబగళ్ళు డాక్టరుగా కష్టపడిన ఆ యిద్దరూ అంత బేలగా దుఃఖించడం చూసిన అర్చన ఏడుపు ఆపుకోలేకపోయింది. వారిద్దరూ ఎంత అన్యోన్యంగా.....ఒకరికోసం ఒకరయి బతికేవారో అర్చనకి తెలుసు. ముగ్గురూ పట్టి కుదిపేసిన ఆ దుఃఖం నుంచి రెండు మూడు నిమిషాలకి గాని తేరుకోలేకపోయారు. శకుంతలా దేవే ముందుగా తేరుకుని తన కన్నీళ్ళు తుడుచుకుని ఆయనని చీరచెంగుతో తుడిచి "ఊరుకోండి, పాపిష్టిదాన్ని బతికుండగానే ఏడిపిస్తున్నాను మిమ్మల్ని. ఐ ప్రామిస్ యింక ఏడవను నేను-అర్చనా వెళ్ళమ్మా! ప్రయాణంచేసి వచ్చావు స్నానం అదీ చెయ్యి. బాబు ఏడి ఇలా యియ్యి" అంటూ మంచం మీద పక్కన కూర్చోపెట్టుకుని......ప్రేమగా బుగ్గలు నిమిరింది. "అదృష్టవంతురాలివి అర్చనా! చక్కని భర్త, ముద్దులు మూటగట్టేబాబు" సదాశివంగారు అర్చన చేతిలోంచి బాబుని ఎత్తుకొని గదిలోంచి బయటికి తీసికెళ్ళారు.
"అర్చనా లోపలికెళ్ళు.....వంటింట్లో పద్మ వుంటుంది. పద్మ అంటే మా కోడలు. కొత్త కోడలు."
అర్చన గాభరాగా.... "మీ అబ్బాయి వున్నారా, ఎప్పుడొచ్చారు వాళ్ళు" అంది.
"వాడు నెలరోజులు సెలవుపెట్టి వచ్చాడు. పదిరోజులయింది అపుడే వాడింట్లోలేనట్టున్నాడు ఎక్కడికి వెళ్ళాడో!"
"నేనిలా రావడం....ఆయన చూస్తే ఏమంటారో? కబురు తెలియగానే వుండలేక వచ్చేశాను. ఆయనున్నారని తెలిస్తే తర్వాత వచ్చేదాన్ని - మొహమాటంగా వుంది"
"వాడేమంటాడు....అంటే ఊరుకుంటానా...నా యిల్లు యిది. నా యిష్టం వచ్చిన వాళ్ళని పిలుచుకుంటాను! ఐనా యిప్పుడు వాడు ఇది వరకటివాడు కాదులే. వాడు దాంతో బాగానే వున్నట్టున్నాడులే. చూస్తుంటే అమాయకత్వంతోనే వాడిని ఆకట్ట్టుకున్నట్టుంది ఆ పిల్ల" అంది ఆవిడ.
సన్నగా, పొట్టిగా, పీలగా చామనఛాయ రంగులో వున్న అమ్మాయి లోపలికి వచ్చింది. "పిలిచారండీ?" అంది. పనిచేస్తున్నట్టు పమిట కొంగుకి చేయి తుడుచుకుంటూ, చీర దోపుకుని వుంది.
"చూడు పద్మా! అర్చన.....అర్చన గురించి చెప్పాగా నీకు. లోపలికి తీసికెళ్ళి కాఫీ అదీయివ్వు. వంటావిడకి చెప్పు బియ్యం యెక్కువ వేయమని" అంది శకుంతలాదేవి.
కళ్ళింత చేసుకొని అర్చన వంక చూసింది పద్మ, అర్చన స్నేహ పూర్వకంగా నవ్వి. "హలో అంది. పద్మ కొద్దిగా సిగ్గుపడి తలదించుకుని "రండి లోపలికి, కాఫీ తాగుదురుగాని" అంది.
అర్చన లోపలికెళ్ళి డైనింగ్ టేబిల్ దగ్గర కూర్చుని కాఫీ తాగుతూ పక్కనే నిలబడి కుతూహలంగా తననేచూస్తున్న పద్మతో "నేనెవరో తెలుసా పద్మా నీకు-"
"తెలుసు అత్తగారూ చెప్పారు మీ గురించి."
"తెలిశాక నేనిక్కడికి ఎందుకు వచ్చానని కోపంగా వుందా నీకు." పద్మ ద్వారా సంగతులు తెలుసుకోవాలని సంభాషణ ఆరంభించింది.
"నాకెందుకు కోపం...." మూతి తిప్పింది.
"పోనీగాని ఒక సంగతి అడుగుతా చెపుతావా? మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటున్నారా. కోపగించుకోకుండా, తిట్టకుండా సరిగావుంటారా నీతో."
"ఎందుకుండరు... నన్ను తిడితే, నీ మొదటి పెళ్ళాంలా నేను వెళ్ళిపోతానని చెప్పేశాగా ఆయనతో." అమాయకంగా అంది పద్మ....ఆ ఒక్కమాటతో అమాయకంగా కనిపిస్తూనే అతన్ని జయించగలిగింది పద్మ అనుకుంది. అసలే ఒక భార్యవదిలి వెళ్ళిపోయిన అవమానంతో వున్న మగవాడు రెండోసారి జాగ్రత్తగా వుండకేం చేస్తాడు.
"అవును....మీరింత అందంగా వున్నారు కదా, యింత బాగా వున్న మీతో ఆయన ఎందుకు సరిగా ఉండలేదు..... నేనేం బాగులేక పోయినా ఆయననాతో సరిగానే వున్నారు కదా.
