"పెళ్ళి గురించి చెప్పు."
"ఏ పెళ్ళి? నా పెళ్ళి గురించా, నీ పెళ్ళి గురించా?"
"ముందు నీది కానివ్వు తల్లీ! చంపుకుతింటావు ప్రశ్నలతో" అంటూ విసుక్కుంది జగ్గమాంబ ఆ విసుగూ, చిరుకోపమూ వుత్తుత్తి నటన.
"బావ బలే అందగాడని విన్నాను" అంది మళ్ళీ తనే!
"అందం యెందుకు కొరుక్కుతింటామా?"
"ఏమో కొరుక్కుతింటావో, గిల్లుకు తింటావో నాకేం తెలుసు?"
"ఛ, కోణ గీ! అదికాదు. మగవాడికి అందం యెందుకు? తెలివి వుండాలి. పరాక్రమం వుండాలిగాని" అని అర్ధమయ్యేలా చెప్పింది మల్లమ్మ చెల్లెలికి.
"పరాక్రమాన్ని ప్రక్క వేసుకుని, తెలివితో దుప్పటి కప్పుకుంటావా?" అంటూ పరాచికాలు ప్రారంభించింది జగ్గమాంబ.
"ఇలా అయితే నేను వెళ్ళిపోతాను" అంటూ లేచింది మల్లమ్మ.
"పోవద్దులే కూర్చో యింక అట్లా అననుగా" అంటూ చేయి పట్టుకుని కూర్చోపెట్టింది జగ్గమాంబ మల్లమ్మ జగ్గమాంబను నమ్మికూర్చుంది. కూర్చున్న మరుక్షణంనించీ మళ్ళీ చిలిపితనం మాటలు మొదలెట్టింది జగ్గమాంబ.
"గోపాలకృష్ణ రంగారావు గొప్ప వీరుడట" అంటూ ప్ర్రారంభించింది.
"నీకెట్లా తెలుసూ?" మల్లమ్మ ప్రశ్న.
"నేను విన్నాను."
"ఎవరు చెప్పారు?"
"అమ్మా, నాన్నా అనుకుంటూ వుంటే అంతా తలుపు చాటునించి విన్నాను."
"ఇంకా యేమి చెప్పుకున్నారు?"
"ఇందాక వెళ్ళిపోదామని అన్నావుగా! లే వెళ్ళిపోదాం" అంటూ తను లేచింది జగ్గమాంబ. లేచింది కాని అక్కడనించి కదలలేదు. అక్కగారు చేయి పుచ్చుకుని కూర్చోపెట్టేవరకూ పాతిన కర్రలా నిలబడింది.
"చెప్పు" అంది మల్లమ్మ బ్రతిమలాడుతున్నట్లు.
"మరొక్క మాటకూడా విన్నాను" వూరిస్తోంది.
"ఏమిటా మాట?"
"చెప్తాను- చెప్తాను శ్రద్దగా వింటున్నావా?"
"వింటున్నాలే చెప్పు."
"మాంచి.....మాంచి......"
"ఊఁ మాంచి"
"సరసులట...." అని చెప్పి పక పకా నవ్వుతోంది జగ్గమాంబ.
"ఛీ, నిన్ను కదిలించటం నాదే తప్పు."
"అసలు పేరే గోపాలకృష్ణ కదూ!" అంటూ మరింత నవ్వుతోంది జగ్గమాంబ.
"ఇటువంటి మాటలేనా నీవు విన్నవన్నీ."
"ఇంకా వున్నాయి తల్లీ! సావధానంగా విను చెప్తాను."
"ఇటువంటి మాటలైతే నేను వినను."
"నీవు వింటానంటే యింకా రక రకాల మాటలున్నాయి."
"అవునులే? నువ్వు మంత్రగాడు రొండిన దోపుకునే భరిణివి. మూత తెరిస్తే అన్నీ విచిత్రాలే" అంటూ తనూ నవ్వింది మల్లమ్మ.
"ఆయనకి ఒక తమ్ముడు వున్నారట?"
"ఊఁ...."
"పేరు వెంగళరాయుడట."
"ఈయనకు లేదా రంగారావు బిరుదు."
"ఉండదు బొబ్బిలిలో కిరీటం పెట్టుకున్నవారికే ఆ బిరుదు."
"అంతా బాగానే వుంది కాని బావగారికి యింకా కోటలేదు."
"అదేమిటి?" అని ఆశ్చర్యపోయింది మల్లమ్మ.
"చుట్టూ మట్టి అడుసుతో ప్రాకారం కట్టుకున్నారు. మధ్యన వున్నవి తాత్కాలికమయిన యిళ్ళు మాత్రమే! యెక్కువగా తాటాకు పాక లున్నాయిట" అంటూ తను విన్నది అంతా చెప్తోంది జగ్గమాంబ.
మల్లమ్మ ఆ సంగతులన్నీ చెవి ఒగ్గి శ్రద్దగా వింటోంది.
"బొబ్బిలిలో ఒక బావి వుంది తెలుసా!" అని అడిగింది చెల్లెలు.
"ఒక్క బావి యెట్లా చాలుతుందే!" మల్లమ్మ అనుమానం.
"అది కాదు ఒక అద్భుతమయిన బావి వుంది."
"ఏమిటో ఆ అద్బుతం?"
"అందులో నీరు త్రాగితే కుందేలుపిల్లలుకూడా క్రూరమృగాలమీద యెదురు తిరిగి పోరాడుతాయిట. యింక నువ్వు ఆ నీళ్ళు తాగివచ్చావంటే తల్లీ! చిక్కినవాళ్ళందర్నీ చితకతంతావు కాబోలు" అంది జగ్గమాంబ.
మల్లమ్మదేవికి నవ్వు వచ్చింది.
"అట్లాంటి పని పిచ్చివాళ్ళు చేస్తారు" అంది.
"అట్లా చేస్తావని కాదులే అక్కా! పౌరుషం పెరుగుతుంది"
"నువ్వు ఒక్కొక్కప్పుడు హాస్యం కోసం తప్పులు మాట్లాడుతావు" అంటూ ఆమె మాటలకూ అభ్యంతరం చెప్పింది మల్లమ్మ.
"తప్పా! యేమిటది?"
"బొబ్బిలి బావినీళ్ళు తాగితే కాని పౌరుషం లేకపోయిందా కశింకోణ రాచకన్యలకు?" అవి యెదురు ప్రశ్న వేసింది మల్లమ్మ.
జగ్గమాంబ యిక తర్కించలేదు. యిద్దరూ లేచి గుర్రాలు యెక్కారు గుర్రాలు చావడిలో 'కై జీతగాళ్ళకు' అప్పగించి యిద్దరూ కోటలో కాలుపెట్టారు. అప్పటికి కోట అంతా దీపకాంతితో దేదీప్యమానంగా వెలుగుతోంది.
రామరాయుడూ, వెంకమాంబా పిల్లలకోసం యెదురుచూస్తున్నారు. మల్లమాంబ, జగ్గమాంబ వస్తూనే తండ్రి పాదాలు తాకి నమస్కారం చేశారు.
త్వరగా పెళ్ళి కావాలని యిద్దరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు తండ్రి.
"అమ్మా! మల్లమ్మా!"
