Previous Page Next Page 
తుపాన్ పేజి 32

    '' శకూ! పురుషుడు  ఇంతవరకు  మనుష్యుడు. ప్రపంచంలో  కృషి చేసేవాడతను.  అతని జాతికి  అమృతత్వం  ఇచ్చి, అతనికి వెనకాల  బలమైన స్త్రీ  అతనిలోని  దివ్యత్వం.

    '' ఈ రోజున  నాలో  ఏదో  పవిత్రత  వచ్చింది, మీకూ, నాకూ అర్థం  కాని  ఏదో మహాభావం  నాలో చేరినట్లు నా కల  నాకు భావం  కలిగిస్తున్నది''

                                       14

    మా  అత్తగారైన  వెంకటరావమ్మగారు  శలాకలా  పొట్టిగా, బంగారు బొమ్మలాంటి మనిషి. ఎంత ఈడువచ్చినా  చిన్న బిడ్డలా  ఉండే కాయ శరీరం కల ఆరోగ్యవంతురాలు.  చారెడేసి కళ్ళూ, ఉంగరాలు తిరిగిన జుట్టూను.  ఎనిమిది కాన్పులు వచ్చినా  ఇద్దరు బిడ్డలు మాత్రమే బ్రతికి ఉన్నారు. అయినా  ఆమెలోని యవ్వనపు  బిగి ఏమాత్రమూ  సడలలేదు. తల్లీ, పెద్ద కొమరిత కలిసి వస్తూఉంటే  అప్ప చెల్లెళ్ళలా  ఉండే వాళ్ళు. ఆమె వెర్రిబాగుల మనిషి. ఆమెకు లోకంలోని  వాళ్ళందరూ మంచివాళ్ళే. అనవసర సంబంధాలు  కలుగచేసికొనేదికాదు. కాని తన దృష్టి  పథంలోకి వచ్చిన  వాళ్ళనందరినీ  నిష్కలష్మమైన  ఆ పేక్షతో చూచేది. భర్త అంటే  ఎంతో గౌరవం, భక్తి. 

    లోకంలో సర్వసాధారణంగా రెండవ వివాహం భార్యలకు, భర్తలు దాసానుదాసులుగా  ఉంటారు. తన భర్త అలా  ఉండటానికి వీలులేకుండా చేసింది  మా అత్తగారు. వినాయకరావుగారికీ,  రాజ్యలక్ష్మమ్మగారికీ మధ్య  ఇరవై సంవత్సరాలు  తేడా ఉన్నది. అందులో  మా అత్తగారు  బంగారు తీగలాంటి  మనిషిన్నీ, మా మామగారు  విఘ్నేశ్వరుని పేరు సార్ధకం చేసుకునే  శరీరం కలవారున్నూ  అవడం చేత  మా అత్తగారు  మా మామగారి  కన్నా  ఏ నలభై ఏళ్ళో  చిన్నదిలా కనిపించేవారు.

    మా మామగారు, వినాయకరావుగారు  ఉత్తములు. ఉదాత్త హృదయం, ఉత్కృష్టరూపం కలవారు.
అయిదడుగుల పదకొండంగుళాల ఎత్తు. ఆ ఎత్తుకు తగిన లావూ, పుష్టీ కలవారు.''ఊ'' అని  మూలిగి ఎరుగని మంచి ఆరోగ్యం కలవారు. శుభ్రమయిన భోజనమూ , శుచివంతమయిన  నడవడి, సూక్ష్మగ్రహణ శక్తి, ఉత్తమ ఆలోచనలూ  వినాయకరావుగారిని మా చుట్టుప్రక్కల  గ్రామాలలోకి  ముఖ్యపురుషుణ్ణి చేసినవి. ఆయన పలుకుబడి  అనంతము. మా జిల్లాలో ఆయన్ను గౌరవం  చెయ్యనివారు లేరు.

    కొంచెం బొజ్జ ఉన్నా  అతిసునాయాసంగా ఎంత దూరమైనా నడవగలరు. తన స్వంతపనుల్లో కూలీలతోపాటూ, పాలేళ్ళతోపాటూ, తానూ రాక్షసునిలా పనిచేసేవారు. భోజనప్రియ లవడంచేత  మా మామగారు  సమస్త  శాకపాకాదులూ, చివరకు  విదేశీయ జాతులు  కూడా తన దొడ్లో పండించుకొనేవారు. ఏ ముష్టి లక్ష్మీనారాయణగారినో సలహా చేస్తూ  ఉండేవారు.     
    మా మామగారు  ఎక్కడ  ఏ మీటింగు  జరిగినా  హాజరు. జాతీయవాది, ఖాదీవస్త్రవాది.  సీతారామశాస్తురుగారు  వైదీకైనందుకు కొంత విచారించినా, కాంగ్రెసువాదై  నందుకు  సంతోషిస్తూ  ఆయనకు ఎంతో  సహాయం చేస్తూవుండేవారు. గాంధీమహాత్ముడు  అవతార పురుషుడని  నమ్ముతాడుగాని, హరిజనోద్దరణ విషయంలో  ఆయనకు బాగా తెలియదేమోనని  అనుమానపడ్తాడు.

       ఆహితాగ్ని, అచారసంపంన్నుడు, ఆచారాలవల్లనే  భరతవర్షం ఈ మాత్రమైనా  బ్రతికి  వుందని  ఆయన వాదిస్తాడు. మా మామగారింట్లో  ఎప్పుడూ నిత్యదేవతార్చన, జపతపాలు  జరుగుతూ వుండేవి. ఏడాదికి  మూడు నాల్గుసార్లయినా  ఏ సత్యనారాయణ  వ్రతమునో పేరు  చెప్పి, చుట్టాలందర్నీ పిల్చి, బట్టలూ, పాత్రలూ, బహుమతులూ  పెట్టి, బ్రాహ్మణులకు తదితర వర్ణాలవారికి  పంచభక్ష్య  పరమాన్న భోజనాలు పెడుతూ వుంటారు. ఒక రోజున  నన్ను కబురంపించారు. '' మూర్తీ, నువ్వు బి.ఏ. ప్యాసయిన తర్వాత  ఏం చేస్తావు? '' అని అడిగారు.

    '' నాకు గవర్నమెంటు ఉద్యోగంమీద  ఏమీ నమ్మకం లేదండీ!''

    '' అయితే బి. ఎల్. కు వెడతావా?''

    '' ప్లీడర్లు  వృత్తంటేనే నాకు అసహ్యం. మనిషినీ, ఆత్మనూ  చంపుకోవాలంటే ప్లీడరువృత్తి తీసుకోవాలి  గాని లేకపోతే గడకఱ్ఱ చివరతో నయినా దాన్ని  ముత్తదానికి వీల్లేదని నా గాఢమైన నమ్మకం.''

    '' ఆ విషయంలో  నేను నీతో  ఏకీభవిస్తానోయ్. ధర్మశాస్త్రాలెరగనివాళ్ళూ, ఆచార వ్యవహారం సంగతు  లెరగనివాళ్ళూ  ప్రజాసామాన్యం యొక్క ఆశయాలూ, భావాలూ గ్రహించలేనివాళ్ళూ మన మతాలను గురించి వాదించడం, వాళ్లల్లోంచి వచ్చి, తమ చుట్టూ గోడలు కట్టుకొన్న  మునసబులూ, జడ్జీలూ, మన మత విషయాల్లో   తీర్పు చెప్పడం, మన దురదృష్టం కొద్దీ ఏర్పడ్డ  ఒక విచిత్ర సంఘటనగాని ఇంకోటికాదు. ఇంతకూ నువ్వేమాలోచన చేసినట్లు?''

    '' పెద్దలు  సంపాదించి, మా తండ్రిగారు  వృద్దిచేసిన ఇంత ఆస్తి ఉన్నది. ఆస్థికోసం  కాదుగదాండీ నేను వుద్యోగం చెయ్యవలసింది. ఇంత వ్యావర్తికోసం. శిల్పకళంటే నాకు చాలా ఇష్టం. అసలు వైద్యానికి  వెళ్దామనుకున్నాను. ఈ   శిల్పకళయందుండే  అభిరుచిచేత, నా దారి ఆ వైపు మళ్ళింది. ఈ ఊళ్లోనే  ఒక శిల్పాశ్రమం ఏర్పాటుచేసి, కళాసేవ  చేద్దామని సంకల్పం ఉంది.''

    '' అదీ బాగానే వుంది. ఇవతల  వ్యవసాయమూ చూచుకుంటూ ఉండవచ్చును . శిల్పాన్ని మళ్ళీ  పునరుద్దరించడము చాలా గొప్పకార్యం.

    '' అదే  అనుకుంటున్నానండీ మీ ఆశీర్వచనం వుంటే.'' ఆ విషయమూ, స్వంత  వ్యవసాయ  విషయమూ  ఆలోచన సాగింది నాకు. మనం స్వంత వ్యవసాయం ఎలా చేయించగలం? చదువుకున్నవారు  స్వంత వ్యవసాయం  చేయించగలరా? ఎందుచేత చేయించగూడదు? సర్వాధారమైన భూదేవికి  వ్యవసాయం వల్ల సన్నిహితులంకామా?  సర్వకాల  యవ్వనంతో  సకల  సౌరభావృతిదివ్యగర్భ అయిన ధరత్రీమాత తన  దగ్గిరకు చేరిన అనుగు  బిడ్డలకు సర్వసృష్టి రహస్యాలనూ ఉపదేశింపదా?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS