విషవలయంలో ప్రియురాళ్ళు
వసుంధర
"నీ సౌందర్యం అపురూపం - "అన్నాడతడు సునందతో.
"నీ ప్రేమ మాత్రం అపురూపం కాదు --" అంది సునంద.
"ఎందుకని ?"
"అపురూప సౌందర్యానికి అపురూపమైన కానుక నిచ్చెనా?"
'అపురూప సౌదర్యానికి తగ్గ కానుక నూహించడమే ఒక సమస్య ---" అన్నాడతడు బాధగా.
"మనసుంటే ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కార ముంటుంది -- " అంది సునంద.
"సునందా! నా మనసు నీకు తెలుసు ...." అన్నాడతడు దీనంగా.
"మోహన్ ! పోనీ నాకేం కావాలో నేను చెబుతాను . తెగలవా?"
"అయ్యో - సునందా ! నీకోసం సప్త సముద్రాల ఈదగలను. పాతాళంలోకి చొచ్చుకుపోగలను...." అన్నాడు మోహన్.
"అవేమీ చేయనక్కరలేదు. నీ స్నేహితురాలు లీలను మోసగించు --" అంది సునంద.
"లీల నీకెలా తెలుసు ?"
"లీల నాకే కాదు- ఎందరికో ప్రత్యేకంగా తెలుసు. కారణం చెప్పుకో!" అంది సునంద.
మోహన్ కాసేపాలోచించి -- "ఏమో -- నాకు తెలియదు --" అన్నాడు.
"చూడగానే కళ్ళు చెదిరే ఆమె వజ్రాల హారం...."
"అవునవును . అది లేకుండా లీల ఎక్కడికీ కదలదు."
"ఆ వజ్రాల హారం లీల ప్రత్యేకాభిమానాన్ని పొందింది. కారణం నీకు తెలుసా?"
మోహన్ తల అడ్డంగా ఊపాడు.
"లీల అందానికి మెచ్చి ఆమె ప్రియుడిచ్చిన అపురూప మైన కానుక అది! ఆమెకు లాగే నేనూ నా ప్రియుడి గురించి చెప్పుకోవాలనుకుంటున్నాను . తప్పా!"
"అయితే లీలను నేను మోసం చేయడమెందుకు ?"
"ఆ వజ్రాలహారం నువ్వు నాకు తెచ్చివ్వాలి..."
'అదేనా -- అలాంటిదా?"
"అదే"
'అదే ఎందుకు ?"
"ఒకటి -- లీల మెడలో ఆ హారం చూస్తె నా వంటి మీద తేళ్ళూ జేర్రులూ పాకుతున్నాయి. రెండు - లీల ముందేలాంటి మగాడైనా చిత్తేనట. ఆమె దగ్గిర చిత్తూ కాకుండా నువ్వా ఆ హారం నాకు తెచ్చివ్వగలిగితే -- అది నా అహానికి విజయం. మూడు - లీలకు ప్రమాదకరమైన వ్యక్తుల రక్షణ వుంది. అంటే లీలను మోసగించే వ్యక్తీ ప్రమాదాన్నే సవాలు చేసినట్లు. అందుకు అపురూపమైన ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ నీలో ఉందని నాకు ఋజువు కావాలి."
'సరే -- నీ కోరిక తీరుస్తాను --" అన్నాడు మోహన్.
2
అందంగా అలంకరించబడిన ఆ గదిలో అద్దం ముందు నిలబడి తన అందానికి మెరుగులు దిద్దు కుంటోంది లీల. అప్పుడామెకు అద్దంలో తన వెనుకగా మోహన్ కనిపించాడు.
'అరె -- మోహన్ -- నువ్వా?" అందామె.
"గుర్తు పట్టావా ?" అని నవ్వాడు మోహన్.
"మరిచిపోవలసిందే -- నిన్నుచూసి నెల్లాళ్ళు దాటిందేమో--"
"నెల కాదు, అయిదు వారాలు ..." సరిచేశాడతాడు.
"ఇన్నాళ్ళూ ఏమైపోయావ్?"
"ఏమవుతాను? ప్రేమలో పడ్డాను...."
లీల కళ్ళలో అసూయ కనబడింది ...."ప్రేమలో పడ్డావా? నా ఆకర్షణను మరిచిపోయావా ?"
"లేదు. నా మనసు కొత్తదనాన్ని కోరింది...."
"నన్ను మించిన కొత్తదనం నీకెక్కడ కనబడింది ?"
"సునంద తెలుసా నీకు ?"
"తెలియదు --"
"తెలిసుండదులే -- తెలిస్తే నీ గర్వం కాస్త అణిగేది."
లీల ముఖం ఎర్రబడింది -- "నా పాదాల దగ్గిర పడుండే నీలో గర్వం పెరిగింది. అ సునంద ఎవరో జాణ అయుండాలి --"
"లీలా -- మగాడికి గర్వమే అందమంటుంది సునంద."
లీల చిరాగ్గా -- 'అయితే యిక్కడి కెందు కొచ్చావ్?" అంది.
"ఒకరోజున యీ యింట్లో మనమిద్దరమే ఉన్నాం. నువ్వు యాభై వేల రూపాయలు లెక్కపెట్టి బీరువాలో ఉంచావు. అప్పటికి మన పరిచయం వయసు రెండు రోజులు. గుర్తుందా ?" అన్నాడు మోహన్.
లీల గుర్తు చేసుకుంది.
* * * *
"నేనెలాంటి వాడినో నీకు తెలియదు. ఇప్పుడు నేను నిన్ను గాయపరిచి డబ్బు తీసుకుని పారిపోతే ఏం చేస్తావు?" అన్నాడు మోహన్.
లీల నవ్వి -- " యాభై వేల కోసం ఏ మగవాడూ నన్ను నిన్ను గాయపర్చాలనుకోడు. నేను విలువైన మనిషిని నాకంటే నీకు డబ్బెక్కువ కాదని నాకు తెలుసు --" అంది.
"ఒకవేళ నేను నిన్ననుభవించేక డబ్బు తీసుకుని పారిపోయాననుకో -- అప్పుడేం చేస్తావ్?"
"నువ్వు నీ తల్లిని మోసం చేయగలవు. కానీ నన్ను మోసగించలేవు. నాతొ అనుభవం నీలో కృతజ్ఞతను పెంచుతుంది. ఆ కృతజ్ఞత నిన్ను నాకు బానిసను చేయడం తప్పని సరి --" అంది లీల సమ్మోహనంగా నవ్వుతూ . ఆ నవ్వులోనే చెప్పలేనంత నమ్మకముంది.
"నువ్వు ఓ తరహ మగాళ్ళ తో పరిచయం పెట్టుకున్నావు. వారికి స్త్రీ సౌందర్యం. స్త్రీ సుఖం -- ఈ రెండే ముఖ్యం కావచ్చు. అంతా అలాగే ఉంటారనుకుంటే అది నీ పొరపాటు. కొందరికి డబ్బు తర్వాతే ఏదైనా. మరి కొందరికి తిండి తర్వాతే ఏదైనా -- అలాంటి వాళ్ళచేత నువ్వు మోసపోతావు ...." అన్నాడు మోహన్.
"ఆ భయం నాకు లేదు. ఎందరో ప్రియులు నాకెన్నో కానుక లిస్తుంటారు. అవి నా దగ్గరకు చేరాక నన్ను వదలలేవు. నా యింటికి కాపలా మనుషులవసరం లేదు. ఇంకా చెప్పాలంటే ఇంటికి తాళం కూడా పెట్టను. ఈ యింట్లోంచి పూచికపుల్ల కదిలిందంటే --- కదిలించిన వ్యక్తీ మృత్యువు నావ్వానించినట్లే భావించాలి --"
"ఉదాహరణ లున్నాయా?"
"ఉన్నాయి కానీచేప్పను...."
'అయితే కనీసం నీ ప్రేమ, ఆకర్షణ విఫలమయ్యాయని నువ్వోప్పుకోక తప్పదు-- " అన్నాడు మోహన్.
"లేదు -- " అంది లీల -- "ఇంతవరకూ నా యింట్లో రెండే రెండు చోరీలు జరిగాయి. ఇద్దరూ స్త్రీలే!"
"నువ్వు నన్ను సవాలు చేస్తున్నావు ...."
"లేదు -- హెచ్చరిస్తున్నాను ...." అంది లీల.
"నీ హెచ్చరిక నేను లెక్క చేయకపోతే ?"
"డియర్ మోహన్! ఎందుకీ అసందర్భపు సంభాషణ? కాలం వృధా చేయకు. నువ్వు చటుక్కున చేయి పట్టుకుని లోపలకు లాగకపోతే -- కాలు జారి పట్టాల క్రిందకు పోవలసినదాన్ని. అమూల్యమైన నా ప్రాణాలు రక్షించనందుకు - నిన్ను నేనే అమూల్య కానుకగా సమర్పించుకోవాలనుకున్నాను. లేకుంటే నా పరిచయం అరుదైనది. ఆ అరుదైన అనుభవాన్ని నీలో ఇముడ్చు కుని -- నువ్వు హాయిగా వుండు. నా హెచ్చరికను నిర్లక్ష్యం చేయకు...."
"నీ హెచ్చరికను నిర్లక్ష్యం చేయాలని లేదు. కానీ సవాలును వదలాలని లేదు--"
'అయితే నీ కర్మ -- నీక్కావాలంటే బీరువాలో యాభై వేలూ తీసుకుని వెళ్ళు. ఆ తర్వాతేం జరిగినా - నేను కూడా నిన్ను రక్షించ లేను. అందుకే ముందుగా చెబుతున్నాను" అంది లీల.
"ప్రస్తుతానికి నీ ఆకర్షణేమిటో తెలుసుకుంటాను. సవాలు సంగతి తర్వాత చూస్తాను --..." అన్నాడు మోహన్.
"ఈ యింట్లో దొంగతనం చేయాలంటే నీ కెప్పుడు అడ్డు లేదు. కానీ ఆ తర్వాత నువ్వుండవు. గుర్తుంచుకో అంది లీల.
* * * *
"గుర్తుంది -- " అంది లీల.
'ఇప్పుడు నేను దొంగతనం చేయడానికి నచ్చాను. అన్నాడు మోహన్ గంబీరంగా.
'అంటే" అంది లీల తెల్లబోయి.
"ప్రస్తుతం నేను సునంద ఆకర్షణ లో ఉన్నాను. ఆకర్షణ నీ ఆకర్షణ కంటే గొప్పది. ఆమె నీ మెడలో వజ్రాల హారాన్నీ కోరింది...."
లీల నవ్వి -- "నువ్వు సునంద ఆకర్షణలో ఉండి ప్రమాదాన్ని సవాలు చేసే ఆకర్షణలో ఉన్నావు --..." అంది.
"నిన్ను నీవు మభ్యపరచుకుంటానంటే నాకెలాంటి అభ్యంతరమూ లేదు. కానీ జబర్దస్తీగా నైనా సరే నీ దగ్గిర్నుంచి ఆ హారం తీసుకుని వెడతాను --' అన్నాడు మోహన్.
"ప్లీజ్ -- వద్దు --' అంది లీల.
"నన్నాపలేవు --" అన్నాడు మోహన్.
"నా సమస్య అది కాదు. నా ప్రాణదాత నేలా రక్షించుకోవాలో తెలియక సతమతమవుతున్నాను ....' అంది లీల.
"నన్ను నేను రక్షించు కోగలను --" అన్నాడు మోహన్.
"పోనీ -- ఒక పని చేయి. నేను హారాన్ని బల్ల మీద వదిలి బాత్రూం కి వెడతాను. అరగంట దాకా బయటకు రాను. ఆ అరగంటసేపు ఆలోచించుకో. హారాన్ని తీసుకుపోవాలనుకుంటే నిన్నడ్డగించేవారుండరు. నేనింత ధైర్యంగా హారాన్ని వదిలి వెడుతున్నానంటే నా మాటల మీద , హెచ్చరిక మీద నీకు నమ్మకం పుట్టాలి. పుట్టకపోతే నీ దురదృష్టం. అప్పటికీ ఓ ఉపాయం చెబుతున్నాను. హారాన్ని తీసుకుని వెళ్ళి సునందకు చూపించి కాసేపు వేసుకోనిచ్చి మళ్ళీ తెచ్చేసేయ్. ఒక పూట నీకు గడువిస్తున్నాను. ఆ పూటలో హారం వెనక్కు రాకపోతే నేను చేయగలిగిందేమీ లేదు --" అంది లీల.
మోహన్ ఆమె చెప్పింది మౌనంగా విని ఊరుకున్నాడు.
తన మెడలో హారం తీసి బల్ల మీద పెట్టి -- 'అరగంట తర్వాత నేను బైటకు వచ్చేసరికి నువ్విక్కడే ఉంటావని ఆశిస్తున్నాను . లేదూ -- రేపిదే సమయానికి నాకో పెద్ద పని ఉంది. అప్పుడు నా మెడలో యీ హరముంటుందని నమ్ముతున్నాను --..." అని చెప్పి బాత్రూం లోకి వెళ్ళింది.
