Previous Page Next Page 
వసుంధర కధలు -11 పేజి 32


    "ఈ విషయమై నేను చిదానందస్వామిని అడిగాను. ఆయన చెప్పింది నీకు నచ్చుతుందో నచ్చడోనని అనుమానంగా వుంది-" అన్నది రమ.
    స్వామి ఏమి చెప్పాడో తెలుసుకోవాలని రవి ఆత్రపడ్డాడు.
    రమ చెప్పసాగింది.

                                        3

    "నా పేరు లక్ష్మీనారాయణ!" అన్నాడాయన.
    ఇన్ స్పెక్టర్ చౌదరి ఆయనవంక పరీక్షగా చూశాడు. ఎత్తయిన మనిషి. ఛాయ నలుపు. ఖద్దరు బట్టలు ధరించినా ఖరీదైన మనిషి అనిపిస్తుంది. ముఖం బాగోలేదు. ముఖ్యంగా రెండు ఎత్తుపళ్ళు.
    "చెప్పండి-" అన్నాడు చౌదరి.
    "నిన్న సాయంత్రంనుంచీ మా అల్లుడి ఆచూకీ తెలియకుండా పోయింది-" అన్నాడాయన.
    చౌదరి ఆయన అల్లుడి వయసు వగైరా వివరాలడిగి "భార్యాభర్తలేమైనా దెబ్బలాడుకున్నారేమో-" అన్నాడు.
    "లేదండి ఇంట్లో అతడు నోరు విప్పడు.బొత్తిగా లేని కుటుంబంనుంచి రావడంవల్లనేమో, నేనన్నా, నా కూతురన్నా అతడు వల్లమాలిన గౌరవం చూపిస్తాడు. కృతజ్ఞత అందుకు కారణం. ఒకప్పుడు పూటకు గతిలేని వాడు-ఇప్పుడు మహారాజవైభోగాలకు వారసుడయ్యాడు కదా!" అన్నాడు లక్ష్మీనారాయణ.
    "అదే భావాన్ని మీరు రోజూ అతడిముందు వ్యక్త పరుస్తూంటారా?" అన్నాడు చౌదరి.
    "ఏం-అలా అడిగారు?" అన్నాడు లక్ష్మీనారాయణ.
    "అతడొక వేళ ఇల్లు వదిలి వెళ్ళడానికి కారణం అదేమోనని!" అన్నాడు చౌదరి సాలోచనగా.
    "మా అల్లుడు ఇల్లువదిలి వెళ్ళాడని నేను భావించడం లేదు-" అన్నాడు లక్ష్మీనారాయణ.
    "మరి?"
    "అతడిని ఎందరో వలలో వేసుకోవాలని చూస్తున్నారు. అతడు కాస్త అమాయకుడు. నా అనుమానం అతడు ఎవరి వలలోనో చిక్కుకున్నాడని..."
    "అంటే?"
    "స్త్రీ వ్యామోహం...."
    "ఎవరిమీదనైనా మీకు అనుమానముందా?"
    "అతడు ఆడవాళ్ళతో తిరుగుతూండగా చూసిన ఆధారాలు ఒక్కటీలేవు. అతడలాంటి వాడు కాదు కూడా. అందుకే ఎవరైనా అతడిని అపహరించి బలవంతంగా స్త్రీ వ్యసనానికి గురిచేస్తారేమోనని నా అనుమానం...."
    "మీ అమ్మాయితో మాట్లాడేరా?"
    "మా ఇద్దరిదీ ఒక్కటే పోలిక - ఒక్కటే ఆలోచనలు...."
    అతడెందుకు పారిపోయాడో అర్ధమయింది-" అనుకున్నాడు చౌదరి మనసులో. అయితే అతడు పరిస్థితిని అర్ధంచేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. లక్ష్మీనారాయణకు సంబంధించిన కంపెనీ ఆఫీసుకు నిన్న సాయంత్రం అయిదు గంటలకు వదిలిపెట్టాడు రవిబాబు. బయల్దేరడం ఇంటివైపే బయల్దేరాడు. కానీ ఇంతవరకూ ఇల్లు చేరలేదు. అతడికి ఇల్లు తప్ప ఇంక వేరే ప్రదేశాలు లేవు.
    "ఆఫీసు, ఇల్లు తప్ప ఇంక ఎక్కడికీ వెళ్ళడా?" ఆశ్చర్యంగా అడిగాడు చౌదరి.
    లక్ష్మీనారాయణ కొద్దిక్షణాలు ఆలోచించి-"ఇటీవల అతడు చిదానందస్వామి ఆశ్రమానికి వెడుతున్నాడు-" అన్నాడు.
    "ప్రతిరోజూ వెడుతున్నాడా?"
    "అవును-"
    "ఎందుకో చెప్పాడా?"
    "యోగాభ్యాసానికని చెప్పాడు. అక్కడికి వెళ్ళి రావడం ప్రారంభించినప్పట్నించీ మనిషి చాలా సంతోషంగా వుంటున్నాడు. అంతకుమునుపు ఎప్పుడూ గంభీరంగా వుండేవాడు. అతడి ముఖంలోని సంతోషం చూసి నేనూ అందుకు అభ్యంతర పెట్టలేదు-"
    "అతడి మాటలు మీరు నమ్మారా?" అన్నాడు చౌదరి.
    "లేదు. అతడిమీద ఎప్పుడూ నా నిఘా వుంటుంది. అతడు ఆశ్రమానికి వెడుతున్నాడు. చిదానందస్వామిని దర్శించుకుంటున్నాడు. రోజూ కాసేపు యోగాభ్యాసం చేస్తున్నాడు-" అన్నాడు లక్ష్మీనారాయణ.
    "మీకు మీ అల్లుడిమీద నమ్మకం లేదన్న మాట...."
    "దేవుణ్ణి నమ్మి చెడినవారు లేరంటారు. వ్యాపారంలో నమ్మక చెడినవారుండరు-" అన్నాడు లక్ష్మీనారాయణ.
    "ఇప్పుడు నన్నేం చేయమంటారు?" అన్నాడు చౌదరి.
    "మా అల్లుడి ఆచూకీ తెలుసుకోవాలి. అందుకు నేను మీకు వ్యక్తిగతంగా కూడా వేరే బహుమతి ఇచ్చుకుంటాను..."
    "థాంక్స్!" అన్నాడు చౌదరి. అతడు కేసు వివరాలు నోటుచేసుకున్నాడు.

                                       4

    "నాన్నా!" అన్నది ప్రమీల.
    "ఏమిటమ్మా?" అన్నాడు లక్ష్మీనారాయణ.
    "ఇప్పుడే ఉత్తరం వచ్చింది-"
    "ఎక్కణ్ణించి?" లక్ష్మీనారాయణ మామూలుగా అడిగాడు.
    "ఆయననుంచి-"
    లక్ష్మీనారాయణ ఉలిక్కిపడి-"ఆయన అంటే?" అన్నాడు. కానీ ఆయన కర్ధమైపోయింది.
    "ఆయన కావాలనే ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. ఇంక రారు-" అన్నది ప్రమీల.
    "ఏదీ ఆ ఉత్తరం-" అన్నాడు లక్ష్మీనారాయణ. ప్రమీల తండ్రికి ఉత్తరం అందించింది.
    "ప్రియమైన ప్రమీలకు-ఆశీస్సులు.
    ఈ యింట్లో నాకు గౌరవంలేదు. మీరెవ్వరూ నన్ను మనిషిగా చూడడంలేదు. ఈ జీవితంమీద నాకు విరక్తి కలిగింది. చిదానందస్వామిని ఆశ్రయించాను. ఆయన నాకు తరుణోపాయం చూపించాడు. ఆయన సలహాపై నేను మిమ్మల్నందర్నీ వదిలి దూరంగా వెళ్ళిపోతున్నాను. మీకు మళ్ళీ కనబడను. నా గురించి వెతికించాలని ప్రయత్నించవద్దు. మీ ప్రయత్నం ఫలించదు. నీవు మరో వివాహం చేసుకునేందుకు ఏ విధమైన అభ్యంతరమూ వుండకూడదని నీ కీ ఉత్తరం వ్రాస్తున్నాను. ఈసారి అంతస్థులో నీకు తగినవాడిని ఎన్నుకుని సుఖపడు-....

                                                                                                నీ
                                                                                               రవి."

    "డామిట్-" అన్నాడు లక్ష్మీనారాయణ ఆ ఉత్తరాన్ని నేలమీదకు విసిరికొడుతూ.
    "మనిషిగా చూడడంలేదుట-అసలు తను మనిషైతే కదా-" అంది ప్రమీల.
    "బాగా చెప్పావు-" అన్నాడు లక్ష్మీనారాయణ-"నా అనుమానం-ఎవర్తో వీణ్ణి తఃగుల్కుంది. లేదా ఆ చిదానందస్వామే ఎవత్తినొ వీడికి తగిలించివుంటాడు. ఇంట్లోంచి ఎంతో కొంత డబ్బు తీసుకుని వెళ్ళుంటాడు. అది పెట్టి ఏ కూరగాయాల కొట్టో తెరవొచ్చునని అయిడియా అయుంటుంది. కనకపు సింహాసనంమీదకు శునకాన్ని తీసుకొచ్చాను. నాకీ గుర్తింపు ముందే ఉండాల్సింది-ఇప్పుడనుకుని ఏం లాభం?"
    లక్ష్మీనారాయణ క్షణాలమీద అన్ని ఎకౌంట్లూ వెరిఫై చేయగా-అల్లుడు కూడా ఇరవై వేలు తీసుకుని వెళ్ళాడని అర్ధమయింది. ప్రమీల ఇల్లంతా శోధించగా సుమారు పాతికవేలు విలువచేసే నగలు కనబడ్డంలేదని తేలింది.
    "నోట్లో వేలుపెడితే కరవలేడనుకున్నాను-ఎంత మోసం చేశాడు?" అన్నాడు లక్ష్మీనారాయణ. తండ్రి కూతుళ్ళిద్దరూ కూడా పోయిన డబ్బు, నగలు గురించి కాసేపు గుండెలు బాదుకున్నాక లక్ష్మీనారాయణ-"ఎట్టి పరిస్థితుల్లోనూ వీణ్ణి వదిలిపెట్టటానికి సరైన విధంగా బుద్ది చెప్పాలి-" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS