తిరుగులేని అబద్దాలు!!
వసుంధర
"త్వరగా కాళ్ళు కడుక్కుని రండి -- ఈరోజు తొక్కుడు లడ్డు చేశాను."అంది ఉమ.
"ఏమిటి విశేషం ?" మురళీధర్ అడిగాడు.
"మన రాజు క్లాసులో ఫస్టు వచ్చాడండీ . ఈరోజే ప్రోగ్రెస్ రిపోర్టు తీసుకుని వచ్చాడు. నీకేం తినాలనుందిరా అంటే తొక్కుడు లడ్డు తినాలనుందన్నాడు. వెంటనే చేసేశాను. చేసి గంటయినా -- వాడు రుచి చూడ్డానికి కూడా ఒప్పుకోలేదు. నాన్న రావాలి - అంతా ఒక్కసారే కలిసి తినాలి అంటూ కూర్చున్నాడు-"అంది ఉమ.
రాజు మురళీధర్, ఉమలకు ఏకైక సంతానం. కాన్వెంట్లో రెండో తరగతి చదువుతున్నాడు. ఆరు సంవత్సరాలు నిండి ఏదో సంవత్సరం నడుస్తోంది.
"ఏడీ వాడు?' అన్నాడు మురళీధర్ అభిమానంగా.
"దొడ్లో మొక్కలకు నీళ్ళు పోస్తున్నాడు."
మురళీధర్ వెళ్ళి కాళ్ళు కడుక్కుని రాజును వెంట బెట్టుకుని వచ్చేసరికి ఉమ ప్లేట్లో టిఫిన్ సిద్ధంచేసి ఉంచింది.
"ప్రేమించబడడంలో ఎంత ఆనందముంది ఉమా?" అన్నాడు మురళీధర్ ఇంకా అడ్డు నోట్లో ఉంచుకోకుండానే.
"ప్రేమ పంచిన వారే ప్రేమించబడతారు." అంది ఉమ.
అది నిజం . ఆ ఇంట్లోని ముగ్గురు మనుషులూ ఒకరికొకరుఅత్యంతంగా ప్రేమిస్తూ- ఒకరికోసం ఒకరు జీవిస్తున్నారు.
మురళీధర్ నోట్లో లడ్డు పెట్టుకోబోతుండగా ఎవరో తలుపు తట్టారు. రాజు వెళ్ళి తలుపు తీసి - "అమ్మా- ఎవరో పోలీసు -- అంటూ అరిచాడు. మరుక్షణం లోనే రాజూ ఆ పోలీసు మనిషితో కలిసి డైనింగు టేబిల్ దగ్గరకు వచ్చేశాడు.
మురళీధర్ తెల్లబోయి ఆ మనిషిని చూస్తున్నాడు. నిండా పోలీసు దుస్తుల్లో వున్నాడు . దృడంగా ఉన్నాడు. ముఖానికి మీసాలు వన్నె తెచ్చాయి.
'అయాం సారీ మిస్టర్ మురళీధర్ - యు అండర్ అరెస్టు -" అన్నాడతను గంబీరంగా.
ఉమ, మురళీధర్ ఇద్దరూ తెల్లబోయారు. రాజు కైతే కళ్ళలో నీళ్ళు వచ్చేశాయి."
"రెండు నెలల నించి నీకోసం వెదుకుతున్నాను. ఇప్పటికి దొరికావు-" అన్నాడా పోలీసు మనిషి.
"మీరే మురళీధర్ కోసం వేదుకుతున్నారో నాకు తెలియదు. నేను పోలీసుల దృష్టిలో ఉన్న నేరస్తుడ్నికాదు. మాములుగా సంసారం చేసుకుంటున్న సామాన్య మానవుణ్ణి -" అన్నాడు మురళీధర్.
"వాట్ - ఇన్ స్పెక్టర్ భానోజీ రావు పొరపాటు పడడమా -- " అన్నాడా పోలీసు మనిషి కటువుగా.
వెంటనే - "ఒరేయ్ భానూ నువ్వా?" అంటూ ఓ కేక పెట్టాడు మురళీధర్.
భానోజీరావు నవ్వాడు- "చూడగానే నిన్ను నేను గుర్తుపట్టాను. నన్ను నువ్వు గుర్తు పట్టాదానికి కింతసేపు పట్టింది. నా అభిమానానికీ నీ అభిమానానికి ఎంత తేడా ఉందొ చూశావా?"
మురళీధర్ తడుముకోలేదు- "నాకు చెప్పకుండా నాకు తెలియకుండా నువ్వు వచ్చావు. అయినా నీకోసం తొక్కుడు లడ్లు చేయించి సిద్దంగా ఉన్నాను. చూశావా?"
"మాటల్లో నిన్ను జయించడం కష్టం-" అంటూ భానుజీరావు కుర్చీల్లో కూర్చున్నాడు. ఈలోగా ఉమ అతనికో ప్లేటు సిద్దం చేసింది.
భానోజీరావు నెమ్మదిగా తనసంగతి చెప్పాడు. అతనక్కడికి వచ్చి రెండు నెలలయిందిట. ఈ వూళ్ళో మురళీధర్ ఉంటున్నట్లు అనుకోకుండా తెలిసిందిట. అప్పట్నించీ ఆచూకీ తీయడానికి ప్రయత్నిస్తున్నడట. రామారావు ద్వారా ఈరోజే మురళీధర్ చిరునామా దొరికిందిట.
"రెండు నెలలీ ఊళ్ళో ఉంటూ రామారావూ నువ్వూ కలుసుకోకపోవడం ఆశ్చర్యంగా వుందే?" అన్నాడు మురళీధర్.
"రామారావు భార్యా బిడ్డలతో యాత్రకి పోయాడట. ఓ వారం రోజుల క్రితమే తిరిగి వచ్చాడట. ఈలోగా ఆ లాయరు గారి కోసం ఎంతమంది పడిగాపులు పడి కూర్చున్నారో చెప్పలేను-" అన్నాడు భానోజీరావు.
"ఏమైతే నేంలే -- నువ్వెప్పుడూ మంచి సమయంలోనే మిత్రుల్ని కలుసుకుంటుంటావు-" అన్నాడు మురళీధర్ నర్మగర్భంగా లడ్డుల వంక చూస్తూ.
భానోజీరావు నవ్వేసి లడ్డు నోట్లో పెట్టుకుని-- "అదృష్టవంతుడివిరా మురళీ -- చెల్లాయి హస్తవాసి -- అత్తయ్య గారిని మించింది. లడ్డు ఏం బాగుందిరా?' అంటూ మరో రెండు నోట్లో వేసుకున్నాడు.
మురళీధర్ భార్యకు తను చిన్ననాటి అనుబంధాన్ని వివరించి చెప్పాడు. ఫస్టు ప్రారంభించి గ్రాడ్యుయేషన్ దాకా రామారావు, తను, భానోజీరావు ముగ్గురూ కలిసి చదువు కున్నారు. ముగ్గురు ఎక్కువగా మురళీధర్ ఇంట్లోనే కాలం గడుపుతుండేవారు. పరీక్ష లోస్తే అంతా మురళీధర్ ఇంట్లోనే పాడుకునేవారు. మురళీధర్ తల్లిది చల్లని మనసు. ఆమె వీళ్ళ ముగ్గుర్ని కన్న బిడ్డల్లా సమంగా చూసుకునేది.
భానోజీరావు కిద్దరు పిల్లలట. ఇద్దరూ అబ్బాయిలే. తన చిరునామా చెప్పి -- ఇంటికి తప్పకుండా రావాలని చెప్పాడు.
2
'అబద్దాలు చెప్పడం కూడా ఒక కళ -- అది అందరికీ సాధ్యం కాదు-" అన్నాడు రామారావు.
'అవున్లే -- అబద్దాలలోని కళా స్వరూపం లాయర్లకే తెలియాలి-" అన్నాడు భానోజీరావు.
'అందుకే -- మీరు మమ్మాశ్రయించేది --" అన్నాడు రామారావు.
"మాటలకేం లెండి గానీ-- అబద్దమాడడం కళ అని ఋజువు చేయండి చూద్దాం--" అన్నాడు మురళీధర్.
"నాయనా- ఎన్నేళ్ళుగా కాపురం చేస్తున్నావో చెప్పు-" అన్నాడు రామారావు.
"ఎళ్ళా -- నా పెళ్లింకా కొద్ది క్షణాల క్రితం జరిగినట్లుంటే --" అన్నాడు మురళీధర్.
రామారావు నవ్వాడు - "వైవాహిక జీవితం అంత బాగుందంటే నీ భార్య నీకు అందమైన అబద్దాలు చాలా చెప్పి ఉండాలి."
"నా భార్య అబద్దమాడదు " అన్నాడు మురళీధర్.
'ఆడినట్లు తెలిస్తే - అది కళ ఎందుకవుతుంది?" రామారావు చాలెంజ్ చేశాడు.
"అదే ఋజువు చేయమంట --" అన్నాడు మురళీధర్.
"సరే - మీ ఆవిడ నీ అందాన్ని, మంచి గుణాల్ని , పర్సనాలటీని మెచ్చుకుందా లేదా?"
"మా అవిడెం కర్మ-- చాలా మంది మెచ్చుకున్నారు-"
"సరేనా- అయితే అవి అబద్దాలని నీకెప్పుడైనా తోచిందా?"
మురళీధర్ తడబడి - "అవి అబద్దాలేందుకవుతాయి- నిజాలే కదా-"అన్నాడు.
"అయితే ఒక్కసారి మా గదిలోని నిలువుటద్దంలో నీ ప్రతిబింబం చూసుకో -- కనీసం నీ అందానికి సంబంధించిన నిజం నీకు తెలుస్తుంది. నీ అద్దం అబద్దమాడుతుందేమో కానీ-- మా అద్దం అబద్ద
మాడదు--" అన్నాడు రామారావు.
మురళీధర్ కు తెరలు తెరలుగా నవ్వు వచ్చింది . "హరినీ - ఆ అద్దం ఇంకా మర్చలేదా-" అన్నాడు.
"ఎందుకు మార్చాలి? సౌందర్యగర్వంతో మిడిసి పడే మీ చెల్లాయి నదుపులో వుంచడానికి నాకా అద్దం బాగా ఉపయోగ పడుతోంది."
భానోజీరావు కు విషయం అర్ధమైంది. మిత్రులు ట్యూబ్ లైట్ అంటారేమోనన్న భయమైనా లేకుండా అతనూ నవ్వాడు.
రామరావు మళ్ళీ అన్నాడు. "స్నేహితులు సరదాగా కూర్చుని కబుర్లు చెబుతున్నాప్పుడు ఒకోసారి అబద్దాలు సంభాషణని మంచి రక్తి కట్టిస్తాయి. విన్న వెంటనే నమ్మడానికి బదులు, నవ్వు పుట్టించే అబద్దాలు మీలో ఎవరైనా చెప్పగలరా?"
భానోజీరావు ఒక్క క్షణం అలోచించి, "నేను మురళీధర్ ను అరెస్టు చేశాను" అన్నాడు.
మిత్రులిద్దరూ నవ్వారు. మురళీధర్ ది నేరాలు చేసే స్వభావం కాదు. అన్యాయంగా నేరం మోపి అరెస్టు చేస్తాడనుకుందుకు భానోజీరావు మురళీధర్ కు ప్రాణ స్నేహితుడు.
ఒక్క క్షణం ఆగి , "భానోజీరావు నన్నరెస్ట్ చేయిడంలో తప్పులేదు. నేను హత్య చేసాను గదా" అన్నాడు మురళీధర్.
భానోజీరావు అబద్దాన్ని సమర్ధించడం ద్వారా మురళీధర్ అబద్దానికి అందం వచ్చింది. అందుకే అందరూ నవ్వారు.
నవ్వులాగేక రామారావు తన జేబులోంచి ఒక పది రూపాయల నోటు తీసి, "ఇది నా కెవరిచ్చారో తెలుసా?" అన్నాడు.
"తెలియదు" అన్నారు మిత్రులిద్దరూ.
"మా లాయర్స్ అసోసియేషన్ తరపున చందాలు వసూలు చేయడానికి వెడుతుంటే , బాపిరాజు గారు తనే స్వయంగా పిలిచి ఈ పది రూపాయలు ఇచ్చారు" అన్నాడు రామారావు.
మురళీధర్ గొల్లుమన్నాడు కానీ, భానుజీరావు నవ్వలేదు.
కాస్సేపాగి బాపిరాజు గారి గురించి వివరంగా చెప్పాడు రామారావు. ఆ ఊళ్ళో చెప్పుకోదగ్గ ధనికుడైన బాపిరాజు మురళీధర్ కు స్వయానా మేనమామ. కానీ, అయన పిసినారి గా ఉళ్ళో పేరు కెక్కాడు. బాపిరాజు కు సంబంధించిన కొన్ని కధలు విన్నాక రామారావు మాటల్లోని హాస్యం అర్ధమై, విరగబడి నవ్వాడు భానోజీరావు.
"ఎలాగైనా నువ్వు ట్యూబులైటువే" అన్నాడు రామారావు.
"మీ మగవాళ్ళ కబుర్లు పూర్తయితే , భిజనానికి రావచ్చు వంటయింది" రామారావు భార్య శోభ వంటింట్లోంచి డ్రాయింగు రూంలోకి వినిపించేలా అరిచింది.
"డ్రాయింగు రూం వంటింటికి కూతవేటు దూరంలోనే వుంది. మా ఆవిడ కంఠం పెద్దదనుకునేరు" అన్నాడు రామారావు.
"మిగతావాళ్ళ కంఠలు వినిపించవేం" అన్నాడు మురళీధర్. ఆ రోజు రామారావు వివాహ వార్షిక దినోత్సవం సందర్భంగా మిత్రులు ముగ్గురూ రామారావింట్లో కలుసుకున్నారు. ఆడవాళ్ళు వంటింట్లోకి, పిల్లలు గార్డెన్ లోకీ, మగవాళ్ళు డ్రాయింగు రూమ్ లోకి సర్దుకున్నారు.
