మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఓ మనిషిని పిలిచి "నువ్వు చిన్న గదిలో భోజనం పెట్టిరా . తలుపులు వేయకు ' అన్నాడు.
అతడలాగే చేశాడు.
అప్పుడు మురహరి గదిలో ప్రవేశించాడు. తలుపులు దగ్గరగా వేశాడు. కావాలనీ చప్పుడు గట్టిగా చేసి వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు.
బాత్రూం లో ఉన్న సురుచి ఒక్క నిమిషం ఆగి బయటకు వచ్చి అక్కడున్న మనిషిని చూసి తడబడి వెనక్కు పోబోయింది.
"భయపడకు....నేను....' అన్నాడు మురహరి వెనక్కు తిరక్కుండానే.
ఆమె అతడి ముందుకు వచ్చింది.
మురహరి ఆమె వంక పరీక్షగా చూసి "వళ్ళు మెరుస్తోంది. రోజూ స్నానం చేస్తున్నావన్నమాట" అన్నాడు.
సరుచి కి ఆ క్షణంలో చచ్చిపోవాలనుంది. సిగ్గు....ఆడదానికి సహజమైన సిగ్గు.... పాతికేళ్ళ భర్తతో కాపురం చేసినా ఆడదాన్ని వదలని సిగ్గు....ఆ వయసులో ఆమె అతడి ముందు వదిలి పెట్టాల్సి వచ్చింది.
"బాగున్నావు" అన్నాడు మురహరి మెచ్చు కోలుగా. సిగ్గు పడాల్సిన వయసులో సిగ్గి ముంచుకొస్తున్న సమయంలో సిగ్గు పడలేని అసహాయకతను చూసి ఆనందించడం మురహరి ప్రత్యేకత.
ఆమె తను బాగున్నందుకు మనసులో విచారించింది.
"పాపం రోజూ ఆదరా బాదరాగా భోం చేస్తుంది ఉంటావు. ఈవేళ అలాంటి బాధ లేదు. నేనున్నాగా..." కడుపు నిండా భోం చేయి....
ఆమె క్యారేజీ విప్పింది.
అతడు కుర్చీలోంచి లేవలేదు.
పదార్ధాలు కంచంలోకి వడ్డించుకుంది.
అతడేదురుగా ఉన్నాడు. అన్నం తినాలని కూడా అనిపించడం లేదామెకు. కాని అతడు చెప్పినట్లు చేయకపోతే ఏం జరుగుతుందో అనుభవ పూర్వకంగా ఆమెకు తెలుసు.
ఆమె భోం చేస్తుంది.
ఎదుట ఎవరూ లేనట్లుగానే ఆమె భోజనం చేస్తోంది.
అతడామెను చూస్తున్నాడు. ఆమె శరీరంలోని కదలికలు చూస్తున్నాడు. ఆమె తింటుంటే అది బాగుంది. మరికాస్త వేసుకో అని బలవంత పెడుతున్నాడు.
అతడి అభిమానం ఆమెకు వెగటు పుట్టిస్తుంది. అయినా భరిస్తోంది.
"నీవు చెప్పిన విశేషానికి రోజుతో గడువు తీరిపోతుంది. రేపుదయం నువ్వు నీ ఇంటికి వెళ్ళవచ్చు" అన్నాడతను.
ఆమె భోజనం అయిపొయింది. వెళ్లి చేయి కడుక్కుని వచ్చింది.
'నువ్వు చాలా మంచిదానివి. నాకు పెళ్ళి అయిపొయింది. కాని లేకుంటే నిన్నే పెళ్ళాడి ఉండేవాణ్ణి. అన్నాడతను.
ఆమె విని ఊరుకుంది.
రాత్రి స్నానం చేయి. ఈరాత్రి నీతోనే గడుపుతాను" అన్నాడతడు.
"ఊ" అందామె.
అతడు గదిలోంచి బయటకు వచ్చి మళ్ళా తలుపులు దగ్గరగా వేశాడు. నాలుగడుగులు పక్కకు వేసేసరికి గుమ్మం దగ్గర పనివాడు నిలబడి ఉన్నాడు.
"ఏరామ నేను పిలిచేదాకా ఇక్కడకు రాకూడదని తెలియదూ" అన్నాడు మురహరి కోపంగా.
అతడూరికే కోపం నటించాడు. ఏదో అవసరం లేనిదే అక్కడి దాకా వచ్చే సాహాసం వాడు చేయడని అతడికి తెలుసు.
"మీ కోసం ఎవరో వచ్చారండి. అరగంట నుంచి ఎదురు చూస్తున్నారు" అన్నాడు పనివాడు.
ఆ సమయంలో ఎవడోచ్చారా అని కుతూహలంగా డ్రాయింగ్ రూంలోకి వెళ్ళాడు మురహరి.
అక్కడ....
ఒక పొట్టివాడు....అయిదడుగులలోపే ఉంటుందతడి ఎత్తు. నల్లగా ఉన్నాడు. తప్పడ ముక్కు. వాడి ముఖంలో ప్రత్యేకత....
"నమస్కారమండీ !" అన్నాడతడు.
"ఎవరు నువ్వు ?"
"పేపర్లో ధనుష్టంకారం గురించి వినే ఉంటారు తమరు...."
"ఊ" అన్నాడు మురహరి కుతూహలంగా.
"ఈరోజు సాయంత్రం మహాకవి చంద్రశేఖర రాజుకు సన్మానం జరుగుతుంది. ఆ సభకు మీకూ ఆహ్వానం వచ్చింది. కానీ మీరు రానని చెప్పారు."
"నీకెలా తెలుసు ?"
"నాకింకా చాలా తెలుసు...."
"ఏం తెలుసు?"
"ఈరోజు మీరా సభకు వెడతారు.
అక్కడ మధ్యలో లేచి నిలబడి వేదిక మీదకు వెడతారు. మైకు ముందు నిలబడి ఒక్కటొక్కటిగా మీ గురించిన నిజాలన్నీ చెప్పడం ప్రారంభిస్తారు. ఆ నిజాలు సామాన్యమైనవి కాదు. వాటిలో చాలావరకూ మీకు తప్ప వేరెవ్వరికీ తెలియవు ."
మురహరి నవ్వాడు- "నిన్నెవరు పంపారు?"
"ఆ వివరాలన్నీ యిక్కడ కాదు. రహస్యంగా చెబుతాను. వేరే గది ఉంటె అందులోకి వెళ్ళి మాట్లాడుకుందాం."
మురహరి అతణ్ణి తేరిపార చూశాడు.
మనిషి పొట్టిగానే కాదు-- బలహీనంగా కూడా ఉన్నాడు.
"మనం గదిలోకి వెడతాం. కానీ నువ్వు చెప్పిన కబురు విన్నాక -- గది లోంచి బయటకు నేను మాత్రమే వస్తాను. వ్యవహారం పూర్తయ్యేవరకూ నువ్వు గడిలోపలే ఉండిపోతావు. నీవల్ల నాకు ప్రయోజనం కనపడింది - నువ్వీ యింట్లోంచి బయటకు వెడతావు, లేదూ -- ఇక్కడే భూస్థాపితమౌతావు."
"ఒకవేళ గదిలో తమరుండీ- నేను బయటకు వచ్చేస్తే ?"
"అది జరక్కుండా నేను చూసుకుంటాను --" అని చప్పట్లు కొట్టాడతడు. కొద్ది క్షణాల్లో పనివాడక్కడ ప్రత్యక్షమయ్యాడు.
'ఆలోచనా మందిరంలో అన్ని ఏర్పాట్లూ చేయించు...." అన్నాడతడు.
పనివాడు వెళ్ళిపోయాడు.
'ఆలోచనా మందిరమంటే?" అన్నాడు పొట్టి మనిషి.
"రహస్యంగా ఎవరితో మాట్లాడాలన్నా అక్కడే!" అని నవ్వాడు మురహరి.
"మీరేక్కువగా నవ్వుతారు -" అన్నాడు పొట్టి మనిషి.
"కొందరు నవ్వడానికే పుడతారు."
పొట్టివాడు కళ్ళు మూసుకుని రెండు చేతులూ జోడించి పెదాలు కలిపి అస్పష్టంగా ఏదో ఉచ్చరించాడు.
"ఏమిటి చేస్తున్నావు?" అన్నాడు మురహరి.
"రేపు మీ నవ్వు చూసే అవకాశమిమ్మని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను..." మురహరికతడి మాటల్లో వ్యంగ్యం అర్ధమయింది. అయినా అతడి నవ్వు మాసిపోలేదు - దేవుడు నీ కోర్కెను తీరుస్తాడులే ....అయితే అందుకు నువ్వు దేవుణ్ణి ఇంకోసారి ప్రార్ధించుకో -- రేపటి దాకా నువ్వుండాలని" అన్నాడతడు నవ్వుతూనే.....
"నా దురదృష్టం నాకు దేవుడంటే నమ్మకం లేదు" అన్నాడు పొట్టివాడు. మాటకు మాట విసరడంలో గట్టి వాడేనని మురహరి కర్ధమయింది. అతడు నవ్వుతూనే ...."దేవుణ్ణి బదులు నన్ను నమ్ము దేవుడు తీర్చలేని కోరికలు కూడా నేను తీర్చగలను " అన్నాడు...
"రేపు కూడా మీలాగే నవ్వుతుంటే తప్పక మిమ్మల్నే దేవుడిలా నమ్ముతాను -' అన్నాడు పొట్టివాడు.
"నువ్వు నాకు మేలు చేయడానికి వచ్చేవా. కీడు చేయడానికి వచ్చావా ?" అన్నాడు మురహరి.
పొట్టి మనిషేదో అనబోయే లోగా అక్కడికి పనివాడు వచ్చి "అన్నీ సిద్దం సార్!" అన్నాడు.
మురహరి, పొట్టి మనిషి అక్కణ్ణించి కదిలారు.
డ్రాయింగు రూం నానుకుని ఓ గది. ఆ గదిలోంచి బయటకు వెడితే సన్నటి వరండా మార్గం. ఆ మార్గాన్ననుసరించి ముందుగా వెడితే కుడిపక్కగా ఒక గది. ఇద్దరూ ఆ గదిలో అడుగుపెట్టారు.
గదిలో నలుగురు వస్తాదులు వ్యాయామం చేస్తున్నారు.
వాళ్ళు నలుగురూ పర్వతాకారంలో రాక్షసుల్లాగున్నారు.
మురహరి ని చూస్తూనే వాళ్ళు వ్యాయామం ఆపి రెండు చేతులూ జోడించి నమస్కరించారు.
"వీళ్ళీక్కడున్నప్పుడే నేను ఆలోచనా మందిరంలోకి వెడతాను.
లోపల్నుంచి నేను కాక వేరెవరైనా బైటకు వస్తే వీళ్ళను దాటి పోలేరు-----" అన్నాడు మురహరి.
వస్తాదులంతా గదిలోంచి మరో గదిలోకి ఉన్న తలుపులు తెరిచారు.
'అదేనా ఆలోచనా మందిరం!" అన్నాడు మురహరి.
"అక్కడ మనమిద్దరం తప్ప వేరేవ్వారూ ఉండరుగా?' అన్నాడు పొట్టివాడు.
"ఉండరు. ఆ తర్వాత నువ్వొక్కడివే ఉంటావు--" అంటూ మురహరి ఆలోచనా మందిరంలోకి అడుగు పెట్టాడు.
గది మరీ పెద్దది కాదు.
గదిలో ఖరీదైన కార్పెట్...
ఒక బల్ల--- నాలుగు కుర్చీలు.
