Previous Page Next Page 
అయిదు రెళ్ళు పేజి 33

 

    ఉదయం ఏడు గంటల వేళ--
    మోహన్ రూం చేరుకునేసరికి 'సినీరధం' సంపాదకుడు చీడీల మీద పచార్లు చేస్తూ కనిపించాడు. మళ్ళా పత్రిక అవతరిస్తుంది కాబోలు అనుకున్నాడు మోహన్ అనుమానంగా.
    మోహన్ కంటబడగానే సంపాదకుడు గబగబా దగ్గరకొచ్చి "మీకోసం నిన్నటి నుండి కాళ్ళరిగేలా తిరుగుతున్నాను. ఇప్పటికైనా కన్పించారు.... ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళరు కదా అనుకుంటే మీరు వీధిలో నుంచే వస్తున్నారు!" అన్నాడు విస్మయంగా చూస్తూ.
    మోహన్ తాళం తీసి గది తలుపులు తెరిచి పంపాకైనా ఒక కుర్చీ లేదు....ఎక్కడి నుంచి వస్తాయి? ఇంటి నుండి పారిపోయి వచ్చి ఈ గదిలో తలదాచుకుంటూన్నాడయ్యె -- ఏదైనా సినిమాలో బుకింగ్ దొరికితే పెద్ద యిల్లు, ఫర్నిచర్ ...దర్జాగా ఉండొచ్చు....
    నిలబడి ఉన్న సంపాదకుని చూసి మోహన్ నొచ్చుకున్నాడు.
    "మిమ్మల్ని కూర్చోమనటానికైనా కుర్చీ లేదు. ఇంటి వాళ్ళ నడిగి తెస్తానుండండి--" అంటూ పరిగెత్తి పోయాడు.
    సంపాదకుడు చెయ్యి పట్టుకుని ఆపి రుమాలుతో క్రింద కాస్త జాగా శుభ్రం చేసుకుని చతికిలబడ్డాడు.
    'చాపైనా వేస్తానుండండి--" అంటూ మోహన్ కంగారు పడ్డాడు.
    లావుగా పొట్టిగా ఉన్న సంపాదకుడు నిత్యం తమలపాకు సేవించుట వల్ల గారేక్కిన పళ్ళను బైట పెడుతూ "ఏదో ఈరోజు ఇలా కంగారు పడుతున్నారు కాని రేపు మీకు నేను జ్ఞాపకం ఉంటానా? మీరు హీరో , నేను పేరు ప్రఖ్యాతులు లేని పత్రికా సంపాదకుడిని...." అన్నాడు.
    మోహన్ నిట్టూర్చాడు.
    "సరేలెండి! నేను హీరోను కావటం, మీ సినీరధం బజారులోకి రావటం...."
    సంపాదకుడు లాల్చీ జేబులో చెయ్యి పెట్టి ఒక ఉత్తరం పైకి తీశాడు.
    "సినీ రధాన్ని అంత తేలిగ్గా తీసిపారెయ్యకండి...ఇదిగో! ఈ ఉత్తరం చూడండి!" అంటూ మోహన్ చేతికి ఉత్తరం యిచ్చాడు.
    ఉత్తరం చదివి మోహన్ సంతోష సంభ్రమాలతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. గుంటూరు నుంచి ఓ రమణయ్య ఉత్తరం వ్రాశాడు. అతనో పిక్చర్ తీస్తున్నాడట. ఇంతట్లో సినీరధం లో మోహన్ ఫోటో కంట బదిందిట. హీరోకు కావాల్సిన లక్షణాలన్నీ మోహన్ లో కనపడ్డాయట. అందుకని అతని ఇంటి అడ్రస్ యిస్తే అన్ని విషయాలు స్వయంగా వచ్చి మాట్లాడతానని రమణయ్య గారు సంపాదకునికి ఉత్తరం వ్రాశారు.
    తను? హీరో?? వారేవా? కల కాదు గదా ?
    మోహన్ ఎదురుగా సంపాదకుడు కూర్చున్న సంగతి మర్చిపోయి ఉత్తరాన్ని పదేపదే చదువుకుని బట్టీ పెట్టేశాడు.
    సంపాదకుడు తన ధోరణి లో తను చెప్పుకుపోతున్నాడు.
    "ఉత్తరం అందిన వెంటనే నేను మీ ఎడ్రస్ రాసి పడేశాను-- అయన రేపో మాపో వస్తాడు చూడండి!"
    మోహన్ చూపులు ఉత్తరాన్ని దాటి వెళ్ళలేక పోతున్నాయి. సంపాదకుడు త్వరగా వెళ్ళిపోతే బాగుండునని దేవుడికి దణ్ణం పెట్టుకున్నాడు. మనస్సులో ఎన్నెన్ని ఆలోచనలు ఉరకలు వేస్తున్నాయి!
    సంపాదకుడు మోహన్ ఇంగితాన్ని గ్రహించినట్టు చటుక్కున లేచి నిలబడ్డాడు.
    'నన్ను మర్చిపోకండి....విష్ యూ బెస్ట్ ఆఫ్ లాక్--"
    మోహన్ గుమ్మం లో నిలబడి సంపాదకుడిని సాగనంపాడు. సంపాదకుడు కనుమరుగు కావటం తోనే తలుపులు దభేలుమని మూసి క్రింద సాగిలబడి రమణయ్య గారు వ్రాసిన ఉత్తరాన్ని మరో వంద మాట్లు చదువుకున్నాడు.
    తన మొదటి సినిమా శతదినోత్సవాలు అందుకుంటుంది. తన నటనను అంతా మెచ్చుకుంటారు. తన రేటు పెరుగుతుంది. వేలకు వేలు సంపాదిస్తాడు. అప్పుడు గెట నాన్నగారు గీతను చేసుకోమని కాళ్ళ మీద పడతాడు..... అలా కాకపోయినా ఇబ్బంది లేదు. గీత, తనూ ఒకరి లక్ష్యం లేకుండా పెళ్ళి చేసుకుని రాజమహల్ లాంటి పెద్ద భవంతి లో కాపురం పెడతారు. గేటు , గేటు దగ్గర గూర్కా, గేటుకు ఫర్లాంగు దూరంలో ఇల్లు, చుట్టూ పూల మొక్కలు , నీళ్ళను చిందించే పౌంటేన్, మధ్యలో నాట్య భంగిమ లోని ఒక వయ్యారి శిలా విగ్రహం , ఇంటి ముందు పార్టి కో -- పోర్టికో లోకి పెద్ద ఎంబాసిడర్ కారు వచ్చి ఆగగానే ఆదరాబాదరా పరిగెత్తుకుని వచ్చే నౌకర్లు ..... కారులో నుంచి తనూ, గీత ర=దర్జాగా దిగుతారు..... రాజూ రాణీ జీవితాన్ని గడిపేస్తారు.....
    ఊహలలో నుండి తెరుకునేసరికి పది దాటింది. రామయ్య గారు ఇల్లు విడిచి చాలా సేపై ఉంటుంది. ఈ శుభవార్త ను గీత చెవిని వేస్తె ఎంత సంతోషిస్తుందో?
    నిజంగా ఈ వార్తను విన్నప్పుడు గీత ఆనందానికి పట్ట పగ్గాలు లేవు.
    "మీరు పెరులోకి వస్తే నేను కూడా చాన్సు సంపాదించొచ్చు" అంది గీత.
    మోహన్ ఆశ్చర్యంతో తలమునక లయ్యాడు.
    "ఏమిటి? మీరు కూడా సినిమాల్లో చేరాలనుకుంటున్నారా?"
    "నటిగా కాదు లెండి. నటన నాకేం వచ్చు నా మొహం? ....నాకు ప్లేబాక్ సింగర్ ని కావాలని ఉంది --" అంది గీత గారాముగా మోహన్ భుజాల మీద చేతులేస్తూ.
    'అవునవును! మీరు పాడతారు కదూ?..... ఒకపని చేస్తే సరిపోతుంది."
    గీత ఆతృతగా చూసింది.
    "నాకా పాట రాదు.... మీరు గొంతుక ఎరువిచ్చారంటే ..." గీతకు కోపం వచ్చింది.
    "ఎంత మీకు నచ్చకపోయినా మరీ మగాడి గొంతుకలా ఉందేమిటి?" అంటూ విసురుగా అక్కడ నించి వెళ్ళిపోయింది.

                          *    *    *    *
    ప్రొడ్యూసర్ రమణయ్య గారు ఏ క్షణం లో వస్తారో, తీరా సంపాదకుడి లా క్రింద కూర్చో బెడితే బాగుండదని అలోచించి మోహన్ ఇంటి వాళ్ళ నడిగి రెండు కుర్చీలు ఎరువడిగి తెచ్చి తన గదిలో వేసుకున్నాడు. మోహన్ అనుకున్నట్లుగానే ఒకరోజు ఉదయం పది గంటలకు అయన హటాత్తుగా ఊడి పడ్డాడు. ఎభయ్యో వడిలో ఉన్న ఆజానుబాహుడు- తెల్లని షర్టు, తెల్లని పంచ. ఆ తెలుపుతో పోటీ చేస్తున్న జుట్టు , కళ్ళకు జోడు, కాళ్ళకు జోడు-- గది గుమ్మం ముందు నిలబడి "ఇక్కడ మోహన్ అనేవారున్నారా?' అని అడిగినప్పుడు మోహన్ గాభరాగా లేచి వెళ్ళి "నేనే! లోపలికి రండి!" అంటూ ఆహ్వానించాడు రమణయ్య గారు అవునా, కాదా అని సందేహిస్తూ . అయన కూర్చుంటూ "నేను రమణయ్యను-- ' అని చెప్పినప్పుడు మోహన్ గుండె సంతోషంతో ఒక్క నిముషం కొట్టుకోవటం ఆగిపోయింది.
    రమణయ్య గారు ముఖం మీది చెమట బిందువులను తుడుచుకుంటూ "ఏం మెడ్రాసయ్యా! ఎండలు మండిపోతున్నాయి!" అన్నారు నొసలు చిట్లిస్తూ.
    గుంటూరు లో ఎండలు "చల్లగా' ఉంటాయి. కాబోలు అనుకున్నాడు మోహన్ కాని పైకి అనలేదు. గదిలో ఓ మూల కూజా నిండుగా నీళ్ళున్నాయి. మోహన్ అలమారాలో నుంచి గ్లాసు తీసి నీళ్ళతో నింపి రమణయ్య గారి కిచ్చాడు. రమణయ్య గారు ఒక గుక్కలో ఆ నీళ్ళన్నీ త్రాగేసి గ్లాసు క్రింద పెట్టారు. మరి కాసిని యివ్వబోతే వద్దన్నారు.
    ముక్కు మీదికి జారుతున్న కళ్ళద్దాలను పైకి తోసుకుంటూ రమణయ్య గారు అసలు విషయంలోకి వచ్చారు.
    'చూడబ్బాయి! నీ వాలకం చూస్తె ఇంటి దగ్గర నుండి చెప్పకుండా పారిపోయి వచ్చినట్లున్నావ్?"
    మోహన్ కు గుండె లాగిపోయినంత పనైంది. ఈ పెద్దవాళ్ళు ఆవులిస్తే పేగులు లెక్క పడతారు. ఖర్మ!
    "మరి వేషం యిస్తే మధ్యలో నీ దారిని నువ్వు వెళ్ళి పోవుకదా?"
    మోహన్ ధైర్యం తెచ్చుకుని 'అబ్బెబ్బే! అలాంటి అనుమానం మీకేమీ వద్దు. వేషం యిప్పిస్తే మా వాళ్ళనే యిక్కడకు రప్పించు కుంటాను." అన్నాడు.
    రమణయ్య గారు తల పంకించి "సరే!.... ఇంతకీ ఎంతవరకు చదువుకున్నావబ్బాయ్!" అన్నారు.
    నటనకు, చదువుకు సంబంధం ఏమిటా అని విస్తుపోయాడు మోహన్. ఎం.ఎ చదువుకున్నంత మాత్రాన ఎవడైనా నటించగలడా? నిశానీ నటించలేకపోతాడా?.... అయినా అతడు ప్రొడ్యూసర్! ఎదురు తిరిగితే తనేం పైకొస్తాడు?
    అందుకని నమ్రతగా "బి.ఏ. పాసయ్యానండి." అని చెప్పాడు.
    రమణయ్య గారు ఈ కాలం కుర్రవాళ్ళ ను గురించి చిన్న లెక్చరిచ్చాడు.
    "ఈ రోజుల్లో కుర్ర వాళ్ళందరికీ సినిమా లంటే ఒకటే మోజు పట్టుకున్నదయ్యా! నీ మాట కదయ్యా.... చదువుకున్నవాడు, చదువు కొని వాడు, చేతనైననాడు, చేతకాని వాడు కూడా సినిమాలో చేరి వేలకు వేలు గడించాలని గొంతెమ్మ కోర్కె. అందులోని కష్టసుఖాలు తెలియవు, బాధ్యతలు తెలియవు. ఎవడికో ఒకడికి అదృష్టం పట్టిందని అందరికీ పడుతుందా?చివరకు పొట్ట గడవని స్థితికి కూడా వస్తారు.... నా మాటేమిటంటే మామూలు వాళ్ళంతా మామూలు ఉద్యోగాలే చూసుకుంటే నేల తిరిగేసరికి ఖచ్చితంగా ఎంతో కొంత చేతిలో కొచ్చి పడుతుంది...."
    రమణయ్య గారి దృష్టిలో తను "మామూలు' వాడు కానందుకు మోహన్ సంతోషించాడు. లేని ఆసక్తిని కనబరుస్తూ అయన చెప్పిన మాట లన్నిటిని ఊకోట్టాడు.
    రమణయ్య గారు తీయబోయే సినిమా పేరేమిటి? ఇంకా పేరు పెట్టలేదేమో. పేరు పెట్టేంతవరకు 'ఎక్స్' అంటూ పిలుస్తారేమో? సినిమాలో తన సరసన నటించే హీరోయిన్ ఎవరు? ఆవిడ కూడా కొత్తావిడేనా? అందంగా ఉంటుందా? కధేమిటి? రమణయ్య గారు ఒక్క ముక్కా సినిమాను గురించి చెప్పరేమిటి అని విసుక్కున్నాడు మోహన్ మనస్సులో. చివరికి ఉండబట్టలేక తనే అన్ని విషయాలు అడిగేశాడు.
    "అవన్నీ సెటిల్ చేయడానికే వచ్చానయ్యా రేపు డబ్బు విషయాలు మాట్లాడుకుందాం....."అంటూ కుర్చీలో నుంచి  లేచారు రమణయ్య గారు.
    "మీ రెక్కడున్నారో చెప్పండి. నేనే వచ్చి కలుసుకుంటాను. మీకెందుకు శ్రమ?" అన్నాడు వినయం ఉట్టి పడేట్టు మోహన్.
    రమణయ్య గారు తల అడ్డంగా తిప్పారు.
    "ఎక్కడుండేది ఇంకా ఖచ్చితంగా తేల్చుకోలేదు లేవయ్యా. రెపీ వేళకి నేనే నీ రూం కోస్తాను --" అంటూ సెలవు తీసుకున్నారు.
    ప్రొడ్యూసర్ వెళ్ళాక మోహన్ హోటల్ కెళ్ళి భోజనం చేసి మళ్ళా రూం కొచ్చి అయన తీయబోయే సినిమా గురించి ఆలోచించుకుంటూ చాప మీద నిద్రపోయాడు. మెలుకువ వచ్చేసరికి ఒంటి గంట యింది. లేచి ముఖం కడుక్కుని గీత దగ్గరకు పరిగెత్తాడు. తలుపు తట్టేసరికి ఉష వచ్చి తలుపు తీసింది.
    "గీతక్క ఇప్పుడే నడుం వాల్చింది. పొద్దుటి నుంచి  చచ్చే చాకిరి....మా ఇంటికి ఇద్దరు చుట్టా లోచ్చారు లెండి--' అని చెప్పింది ఉష.
    మోహన్ కు ఆశా భంగమైంది.
    "ఉండండి! గీతక్కను లేపుతాను." అంటూ వెళ్ళబోయింది ఉష.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS