Previous Page Next Page 
అయిదు రెళ్ళు పేజి 32

 

                                  12

    గీత తీరికగా డ్రాయింగ్ రూం లో కూర్చున్నది. సాయంత్రం అయిదు గంటల వేళ-- ఉష మరో గదిలో కూర్చుని ఏదో కుట్టుకుంటున్నది.
    ఆరోజు హోటల్లో హటాత్తుగా వదిలేసి వెళ్ళిన మోహన్ రెండు, మూడు రోజుల తర్వాత ఇంటి కొచ్చి క్షమార్పణ చెప్పుకున్నాడు. ప్రభాకర్ లైబ్రరీ కెళ్ళి కిరో పుస్తకం తెచ్చుకున్నాడట. ప్రేయసీ కోసం వేస్తున్న వేషం అని చెప్పాడట. అందుకని తన మీద అనుమానం వేసిందిట. మగవాళ్ళకి ఎంత అనుమానం. తనకు చూచాయగానైనా ఆ విషయం చెప్పి ఉంటె అప్పుడే అతని బెంగ తీర్చి ఉండేది . ప్రేమ అనేది లేకపోతె అనుమానం మాత్రం ఎందుకు వస్తుంది? మోహన్ కు నిజంగా తన మీద ....?
    గీత కళ్ళు మూసుకుని సన్నగా నవ్వుకున్నది.
    "ఏ లోకంలో ఉన్నారు?"
    గీత కళ్ళు విప్పి నవ్వింది. మోహన్ కుర్చీలో కూర్చుంటూ "మీరు నాతొ ఒక్క మాటలా పోస్టాఫీసు వరకు వస్తారా?" అనడిగాడు.
    గీత అర్ధం కానట్టు చూసింది.
    మోహన్ గొంతుక తగ్గించి చెప్పాడు.
    "పోస్టాఫీసు కు ఎదురుగా ఒక ఇంటరుగు మీద ఒకతను అరూడం బ్రహ్మాండంగా చెప్తాడట. ప్రభాకర్ వెళ్ళి చూసి రమ్మని మరీ మరీ చెప్పాడు. తొందరగా రండి. అరైతే ఆతనుండడు--"
    "చెప్తే చెప్పాడు మీరు వెళ్ళి చూపించుకోండి! నాకేం వద్దు--" అంది గీత విరక్తిగా.
    తనకి, గీత కి పెళ్ళయితే కాని ఉషకి పరిణయం కాదట.
    'ఆ ముసలాయన నువ్వంటేనే మండి పడతాడు. మరి మీ యిద్దరికీ పెళ్లెలా జరుగుతుందో నాకు ఒకటే బెంగగా ఉంది....ఆ! జ్ఞాపకం వచ్చింది. బిగ్ స్ట్రీట్ పోస్టాఫీస్ ఎదురుగా ఒకతను బ్రహ్మాండంగా అరూడం చెప్తాడట. వెళ్ళి చూపించుకొచ్చారంటే అందరి బెంగా తీరుతుంది--" అని ప్రభాకర్ నూరి పోశాడు.
    అందుకే మోహన్ "మీరలా అంటే కాదు! నా కోసమైనా మీరు రాక తప్పదు!" అన్నాడు బ్రతిమాలుకుంటూ.
    గీత అయిష్టంగా కుర్చీ లో నుంచి కదిలి ఉష ఉన్న గదిలోకి తొంగి చూసింది.
    "ఉషా! నేనలా వెళ్ళి వస్తాను, కాని కాస్త ఇల్లు చూసుకో! అంటూ మోహన్ తో పాటు వెళ్ళింది.....
    ఇద్దరూ మాట్లాడకుండా నడుస్తున్నారు. కొంతదూరం నడిచాక మోహన్ "అతనే" అని కాస్త దూరానికి చెయ్యి సారించాడు. ఒక ఇంటి అరుగు మీద రెండు, మూడు చినికిపోయిన పుస్తకాలను పెట్టుకుని ఒక ముసలాయన కూర్చున్నాడు. అతన్ని చూడగానే గీత ఉలిక్కిపడింది.
    "అరె! విస్తరాకుల సుబ్బన్న కదూ? .....వీడికి అరూడం ఏమి తెలుసు నా మొహం! మొన్న మొన్నటి దాకా మా వీధిలో విస్తరాకులు అమ్ముతూ ఉండేవాడు....."
    మోహన్ కోపగించుకున్నాడు.
    "తప్పు! తప్పు! లెంప లేసుకోండి. ఇతను మహా పండితుడు. విస్తరాకుల సుబ్బన్న కి , ఇతనికి సంబంధం ఏమిటి?,..... ఇంకా నయం! వీధులూడ్చే పిచ్చయ్య, ఇతను ఒకరే అన్నారు కాదు --"
    గీత మాట్లాడలేదు. ఇద్దరూ ఆ ఇంటిని చేరుకొని మెట్లెక్కి అతను కూర్చున్న చోటికి వెళ్ళారు. ఆ ముసలాయన తలెత్తి ఆశ్చర్యపోయినట్టు చూశాడు.
    "ఎమ్మా! ఇలా వచ్చారు?' అన్నాడు సర్దుకుని కూర్చుంటూ.
    "ఎందుకొస్తాం లెండి! అరూడం చెప్పించుకుందామనే! మీరు కరెక్టు గా లెక్కగట్టి మా ఇద్దరికీ పెళ్ళవుతుందో లేదో చెప్పాలి--" అన్నాడు మోహన్.
    ఉత్సాహంగా లేని గీత మొఖంలోకి అతను సంకోచంగా చూస్తున్నాడు.
    ఎంత నమ్మకం లేకపోతె మాత్రం ముఖంలోనే తన అయిష్టాన్నంతా చూపించుకోవాలా? అరూడం వాడు ఏమనుకుంటాడు? అతని చేత నిజం చెప్పిస్తేనే గాని గీతకు నమ్మకం కలుగదు కాబోలు!
    "మిమ్మల్ని చూస్తె మా గీతకు విస్తరాకుల సుబ్బన్న జ్ఞాపకం వస్తున్నాడట. మీకు విస్తరాకులు అమ్ముకునే ఖర్మేం అంటే వినిపించుకోవటం లేదు.... కాదని మీ నోటితో చెప్పారంటే ఆవిడ అక్షరాలా నమ్ముతుంది...."
    అరూడం వాడు తెల్లగా పాలిపోయాడు.
    "బాబ్బాబూ! మీకు పుణ్యం ఉంటుంది విస్తరాకుల సంగతి ఎత్తకండి!....మీకేం బాబు ఈడూ, జోడూ నిక్షేపం లా పెళ్ళవుద్ది......" అంటూ వాళ్ళిద్దర్నీ దీవించాడు.
    ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు "విస్తరాకుల సుబ్బన్న అరూడం ఎప్పుడు నేర్చుకున్నాడు చెప్మా?" అంటూ మోహన్ ఆశ్చర్యం వెలిబుచ్చాడు.
    "నేర్చుకున్నాడు? మీరు చెదలు తినేసిన రెండు పుస్తకాలు ముందేసుకుని ఇంటి ముందు అరుగు మీద కూర్చోండి...."
    "అలా అనకండి! అతను అన్నది అక్షరాలా నిజమౌతుంది. మనిద్దరికీ తప్పకుండా పెళ్లవుతుంది...."
    గీత నిట్టూర్చింది.
    "బావ నన్ను చేసుకుంటానని ఉత్తరం వ్రాశాడు."
    మోహన్ గుండెలు గుభేలుమన్నాయి. సుధాకర్ ని వదిలి తనని పట్టుకుందా ఈ శని? అసలీ బావగాడు పుట్టకపోతే లోకం ఎడ్చేదా?
    మోహన్ దిగులుగా అడిగాడు.
    "మీరు చేసుకుంటానన్నారా?"
    గీత సూటిగా జవాబివ్వలేదు.'
    "బావ శారదను చేసుకుంటే బావుండును.... ఇన్నాళ్ళూ చేసుకుంటాడనే అనుకున్నారట. శారదంటే ఎంతో ప్రేమగా ఉండేవాడట....అలాంటిది పెళ్ళి మాట వచ్చేసరికి పెళ్ళే వద్దన్నాడట. మగవాళ్ళు ఎంతలో మారిపోతారో చూడండి! అంతకు ముందు ఇద్దరూకలిసి సినిమాలకు వెళ్ళేవారట . బావ దానికి చదువు చెప్పేవాడట....."
    గీత మోహన్ ముఖంలోకి చూసి ఉలిక్కిపడింది.
    'అదేం? అలా అయిపోయారు?" అనడిగింది కంగారుగా.
    మోహన్ సర్దుకుని 'అర్జెంటు గా వూరి కెళ్ళాలి... మీరు ఒక్కరే ఇంటి కెళ్ళగలరా? మరేం అనుకోరు కదూ?' అన్నాడు.
    గీత అయోమయంగా చూసి నిట్టూర్చింది.
    "మళ్ళా ఎప్పుడొస్తారు?"
    "ఎప్పుడో ఎందుకు? ఎల్లుండి కల్లా రానూ?' అంటూ మోహన్ వీడ్కోలు పుచ్చుకున్నాడు.

                            *    *    *    *
    సాయంత్రం ఆరు గంటలు దాటింది. చల్లగాలి తిరిగింది. శేఖర్ సారంగను చూసి వద్దామని బయలు ల్దేరాడు......
    కాస్త దూరం నడిచాడో లేదో కాళ్ళకు సడన్ గా బ్రేకు పడింది. గుండెలు అవిసి పోయేంతటి కేకలు---
    సందు ఇంచుమించు నిర్మానుష్యంగా ఉన్నది. సందు మొగలో నుంచి ఒక మనిషి , కుక్క పోటీపడుతూ పరుగు లెత్తటం కనిపించింది. రయ్యి మంటూ దూసుకు వస్తున్న మనిషిని అందుకోవాలని కుక్క వాయు వేగ మనో వేగంతో పరుగులెత్తుతున్నది. ఆ దృశ్యాన్ని కాస్సేపు చూసి ఆనందించే లోగా శేఖర్ వెనక్కి పడ్డాడు.
    రోడ్డు దేవాలయానికి శేఖర్ బుర్రనే టెంకాయ గా సమర్పించుకున్నాడు - రొమ్ము మీద అమాంతం ఏదో బరువు!...శేఖర్ ఒక్క క్షణం అప్పచ్చిలా అణిగిపోయాడు. ఇంతలో శేఖర్ మీద పడిపోయినాయన లేచి వళ్ళు దులుపుకుని శేఖర్ ను చెయ్యి పట్టుకుని లేవదీశాడు. శేఖర్ లేచి కూర్చుని తల తడుము కున్నాడు. చిట్లి పోయిందేమో అనుకున్నాడు గాని గట్టి బుర్ర బొప్పి కట్టి ఊరుకున్నది. ఇంత మర్యాద చేసిన ఆ పెద్దమనిషి శేఖర్ ముఖం వంక తేరిపార చూసి ఉబ్బితబ్బిబ్బై పోయాడు.
    "అరె! మీరా? వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టు..."
    శేఖర్ షర్టు కి చేతులకు అంటుకున్న మట్టి దులుపు కుంటూ కొరకొరా చూశాడు.
    "కాలికి తగిలినట్టు అంటారేమిటి అమాంతం మీద పడి పోయి?......."
    "క్షమించాలి!....అమ్మయ్యా! ఈ కుక్కొకటి నా ప్రాణానికి!" అంటూ అతను భయంగా  శేఖర్ ను పట్టుకున్నాడు. కుక్కతోకాడించుకుంటూ శేఖర్ పక్క కొచ్చి నిలబడింది. శేఖర్ ఒక్క ఉదుటున పైకి లేచాడు.
    "ఊర్వశీ!" అంటూ క్రిందకు వంగి దాన్ని ఆప్యాయంగా నిమిరాడు.
    శరణు జొచ్చిన ఆసామి ఇంకా భయంగా చూస్తున్నా శేఖర్ కు నవ్వొచ్చింది, జాలేసింది.
    "ఇది నా పెట్ లెండి! నేను దగ్గరుండగా మిమ్మల్నేమీ చెయ్యదు-- " అంటూ అభయమిచ్చాడు.
    శేఖర్ నుదుటి మీద టకటకా కొట్టుకుంటున్నాడు. సన్నగా, రివటలా ఎక్కడో చూసిన జ్ఞాపకం !... ఆ రోజు హల్లో తను కిళ్ళీ  షాపు దగ్గర......
    "మీరు....మీరు....."
    "నా పేరు మోహన్!"
    శేఖర్ మాటలు తడుముకున్నాడు.
    "ఇదివరకోసారి మిమ్మల్ని సినిమా హల్లో చూసిన జ్ఞాపకం.........."
    "అక్షరాలా నిజం! ...నేను క్షమార్పణ చెప్పుకోవాలని వచ్చాను---"
    శేఖర్ నిలువునా ఆశ్చర్యపోయాడు. ఇంతకూ ముందు కనీసం మాట్లాడుకు నైనా ఎరుగరు. క్షమార్పణేమిటి?
    "శారదను మీరు పెళ్ళి చేసుకోవాలి!....."
    శేఖర్ ఉలిక్కి పడ్డాడు. శారద అతనికేలా తెలుసు? శారదను తను పెళ్ళి చేసుకోనని ఇతనితో ఎప్పుడన్నాడు?
    "అది నా స్వంత విషయం...అవన్నీ మీకెందుకు?' అంటూ కోపగించుకున్నాడు శేఖర్.
    "ఆ ఆకాశరామన్న ఉత్తరం నేనే రాశాను--"
    శేఖర్ త్రుళ్ళి పడ్డాడు. ఇదేమిటి? కలా? నిజమా? ముక్కూ మొహం తెలియని మనిషికి తనేం అపకారం చేశాడు?
    మోహన్ తడబడుతూ చెప్పాలనుకున్నదేదో చెప్పేశాడు.
    "మీరు కళని చేసుకుంటారేమో అని భయం వేసింది. సుధాకర్, కళా ప్రేమించుకున్నారు. అందుకని మీకలా ఉత్తరం వ్రాసాను..... కాని ఒక్క పొరపాటు జరిగిపోయింది. ఉత్తరంలో కళ అని రాయటానికి బదులు మరదలని రాయటం లో మీరు మరోలా అనుకున్నారు. నిన్ననే నాకు నా పొరపాటు తెలిసి వచ్చింది... మీరు శారదను చేసుకోకపోతే నేను....నేను...."
    ఆపైన మాటలు తట్టక మోహన్ దిగులుగా చూశాడు.
    శేఖర్ సంతోష సంభ్రమాలతో తలక్రిందు లయ్యాడు. గుండె రాయి చేసుకుని క్షణ మొక యుగంలా గడుపుతున్న సమయంలో మోహన్ దేవుడిలా ప్రత్యక్ష మై తనను రక్షించకపోతే ఇద్దరు బ్రతుకులు నిష్కారణంగా నాశన మయ్యేవి అటు పోయిన ఊర్వశి ని కూడా వెంట బెట్టుకుని వచ్చాడు. శేఖర్ అపలేనంత ఆనందంతో మోహాన్ని కావలించుకున్నాడు. వూర్వశి ప్రేమగా శేఖర్ కాళ్ళకు అడ్డాలు పడింది.
    శేఖర్ కౌగిలి నుండి బైట పడ్డాక "మరి నేను సెలవు తీసుకుంటాను...." అన్నాడు నమ్రతగా.
    "మా యింటికీ రాకుండా ఎలా వెళ్ళిపోతారో చూస్తాను!" అంటూ శేఖర్ మోహన్ చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళాడు వూర్వశి ని కూడా వెంట తీసుకెళ్తూ.
    మోహాన్ని చూసి కళ సుధాకర్ ను చూసినంత సరదా పడింది.
    "ఎలా ఉన్నారు?" అని ఆప్యాయంగా పలకరించింది.
    శేఖర్ పేరు పేరునా ఇంట్లో అందరినీ పరిచయం చేశాడు.... చిత్ర మోహన్ వంటి మనిషిని అనుమానించినందుకు మనస్సులోనే క్షమార్పణ చెప్పుకున్నది. రెండు మూడు రోజులుండి వెళ్ళమని శేఖర్, తతిమా వాళ్ళు చాలా బలవంతం చేశారు. కాని మోహన్ వినిపించుకోలేదు. మర్నాడు మెయిల్లో మెడ్రాసు కు బయల్దేరాడు.
    వచ్చిన పని సులువుగా , జయప్రదంగా జరిగి పోయింది. తను శారద, శేఖర్ల పాలిట విలన్ గా తయారైనట్టు గీత శేఖర్ సంగతి చెప్పేంత వరకు తనకు తట్టనే లేదు. ఏమైతే నేం? ఇప్పుడంతా సవ్యంగా పరిష్కారమైంది....
    మోహన్ తృప్తిగా కదులుతున్న రైల్లో నుంచి చేతులు వూపుతూ దిగబెట్టడాని కొచ్చిన శేఖర్ కు వీడ్కోలు చెప్పాడు.
    ఇంటికి వెళ్ళగానే శేఖర్ శారద కోసం వెదికాడు. మోహన్ వెళ్ళాక తన కిప్పుడు తీరిక చిక్కింది.... శారద కిటికీ లో నుంచి దూరంగా చూస్తూ ఏదో ఆలోచిస్తున్నది. పాపం! తను శారదను ఎంత బాధపెట్టాడు! ఈ కొద్ది రోజులకే శారద బాగా చిక్కిపోయింది.... తను మాత్రం? మోహన్ రాకతో కొండంత సత్తువ వచ్చింది కాని లేక పొతే తను కూడా శారద లానే దిగులుగా, నీరసంగా......
    శేఖర్ వెనకాలే వెళ్ళి శారద భుజాలను ఆప్యాయంగా నొక్కాడు. శారద వెదురు చూపులు చూస్తూ ఇటు తిరిగింది.
    శేఖర్ శారద చుబుకాన్ని పైకెత్తి "మామయ్యకి ఉత్తరం రాస్తున్నాను. మనిద్దరికీ పెళ్ళి చెయ్యమని -- " అన్నాడు.
    నమ్మలేనట్టు చూస్తున్న శారద కళ్ళలోకి చూస్తూ "నిజం శారూ!.... నేనంటే నీ కిష్టమేనా?' అనడిగాడు.
    "ఫో బావా!' అంటూ శేఖర్ ను చేత్తో వెనక్కి త్రోసి తప్పించుకుని పారిపోయింది శారద.
    ఆ సాయంత్రం శేఖర్ కళ వంటరిగా ఉన్నప్పుడు చూసి "నేను శారదను చేసుకుంటాను కళా!" అన్నాడు.
    కళ కళ్ళు పెద్దవి చేస్తూ "నిజంగా?" అనడిగింది.
    శేఖర్ సంగతంతా చెప్పి "మోహన్ నిజంగా దేవుడిలాంటి వాడు!" అన్నాడు.
    "అవును! చాలా మంచివాడు ..." అనుకుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS