మోహన్ వారించాడు.
"లేపకండి! నేనే కాస్సేపాగి వస్తాను...."
గీత ఈ అలికిడికి లేచింది.
"ఎవరే ఉషా?' అంటూ ఇవతల కొచ్చింది.
మోహాన్ని చూసి "ఒహూ! మీరా?" అంటూ పలకరించి డ్రాయింగు రూములోకి తీసుకెళ్ళింది. మోహన్ కుర్చీలో కూర్చున్నాక గీత లోపలి కెళ్ళి ముఖం కడుక్కుని వచ్చింది.
"ఏమిటి విశేషాలు?' అనడిగింది సోఫాలో కూర్చుంటూ.
మోహన్ బల్ల మీది ప్లవర్ వాజ్ ను పైకెత్తి చూస్తూ 'అన్నీ విశేషాలే! అందుకే అమాంతం మీదగ్గరకు పరిగెత్తు కొచ్చాను" అన్నాడు.
గీత ఆసక్తిగా ముందుకు వంగింది. మోహన్ పూస గ్రుచ్చినట్టు ప్రొడ్యూసర్ వచ్చింది లగాయితు అతను గడప దాటేంతవరకు జరిగిన విషయాలన్నీ చెప్పాడు.
తర్వాత "మీ ఇంటి కెవరో చుట్ట్టా లోచ్చారటగా పాపం! మీరు చాలా అలసిపోయినట్టు కనబడుతున్నారు..." అంటూ సానుభూతి చూపించాడు.
"చుట్టాలు కాదు. పాడూ కాదు. మా నాన్నగారి స్నేహితుడోకాయన, అయన స్నేహితుడు ఒకాయన ....మా నాన్నగారి స్నేహితుడు బ్యాంకు ఏజెంటట....."
సోఫాలో కూర్చున్న గీత డ్రాయింగు రూము కిటికీ గుండా వీధిలోకి చూస్తూ కంగారు పడింది" "మా నాన్నగారు వాళ్ళు వస్తున్నారు ఎలా?" అంటూ.
మోహన్ పై ప్రాణాలు పైనే ఎగిరి పోయాయి. పలాయనం చిత్తగిస్తేనే తప్ప పరువు దక్కదని అలోచించి గభాలున కుర్చీలో నుంచి లేచి రయ్ మంటూ పరిగెత్తాడు. గేటు దాటబోయేసరికి ఎవరో ఒడిసి పట్టుకున్నారు. మోహన్ బిక్కగా భయంగా ఆ వ్యక్తీ ముఖంలోకి చూశాడు. మూర్చ వచ్చినంత పనైంది. నాన్న! ఇక్కడి కేలా వచ్చాడు?....పట్టు విడిపించుకుని పారిపోబోతుంటే అటువైపు నుంచి మరొకరు పట్టుకున్నారు. మోహన్ కంగారుగా ఇటు తిరిగేసరికి ప్రొడ్యూసర్ గారు "ఏమిటయ్యా.. మోహన్! ఎక్కడికీ ఆ పరుగు మనుష్యుల్ని చూసుకోకుండా? ఎలాగూ రానే వచ్చావు ఇక్కడే మాట్లాడు కుందాం అన్ని విషయాలు --' అన్నారు.
ఇంక మాట్లాడుకునే దేమిటి నన్నోకడు వచ్చి పడితే? ప్రొడ్యూసర్ కు నాన్న తెలుసునా? లేక ఎవరి మట్టుకు వాళ్ళే వచ్చారా?
మోహన్ చేసేది లేక నోరు మూసుకుని బిత్తర చూపులు చూశాడు. ఎదురుగా గీత నాన్నగారు!
రామయ్య గారు విస్మయంగా చూస్తూ "నువ్వు ....నువ్వు....' అని ఆగిపోయారు.
మోహన్ మాట్లాడకుండా తల దించుకున్నాడు.
"పదండి! డ్రాయింగు రూం లో కూర్చుందాం!" అంటూ రామయ్య గారు లోపలకు దారి తీశారు. బలిచేయటానికి తీసుకెళ్తున్న మేకలా ప్రొడ్యూసర్ మోహన్ చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళారు.
అంతా కూర్చున్నాక "వీడేనండి మా అబ్బాయి!' అంటూ మోహన్ తండ్రి అబ్బాయిని రామయ్య గారికి, ప్రొడ్యూసర్ గారికి పరిచయం చేశారు.
"సినిమా పిచ్చితో ఇంట్లో నుంచి పారిపోయాడన్నారు కదూ?....అయితే ఇప్పుడు ఏం చేయాలని?" అని అడిగారు రామయ్య గారు.
"నాతొ పాటు తీసుకెళ్ళి పోయి మంచి ఉద్యోగంలో ప్రవేశ పెట్టేస్తానండి." 'అదే మంచిపని!.... ఇలా విచ్చలవిడిగా వదిలేస్తే కుర్రవాళ్ళు చెడిపోతారు-"
మోహన్ కు వళ్ళు మండిపోయింది.
"నేను ఇంటికి రాను. నాకు సినిమా ఛాన్సు వచ్చింది.... కావాలంటే వారి నడగండి!' అంటూ ప్రొడ్యూసర్ గారిని చూపించాడు.
మోహన్ నాన్న ముసిముసి నవ్వులు నవ్వాడు.
"రమణయ్య గారేనా? అయన సినిమా తీసినప్పుడు నువ్వు వేషం వేద్దూ గానిలే. అంతవరకూ ఇంటికి నడు.... అయన నా స్నేహితుడు. గుంటూరు లో బ్యాంకు ఏజెంటు గా పని చేస్తున్నాడు ...నువ్వు ఎక్కడున్నావో తెలియక నేను, మీ అమ్మ ఎంత బెంగ పెట్టుకు పోయామని? నీకోసం పేపర్లో కూడా వేయించాం. ఫలితం కనపడకపోగా రమణయ్య కు ఉత్తరం రాశాను.... అయన ఏదో సినిమా పుస్తకం లో నీ ఫోటో చూశారట. ఉపాయంగా నిన్ను యింటికి చేరవేస్తానని , బెంగ పెట్టుకోవద్దని రాశాడు. ఈమధ్య నన్ను వెంటనే బయల్దేరి గుంటూరు రమ్మంటే వచ్చాను. గుంటూరు నుంచి ఇద్దరం యిలా వచ్చాం నీకోసం ప్రొడ్యూసర్ వేషం వేయాల్సి వచ్చింది."
రమణయ్య గారు నవ్వుతూ అన్నారు.
"లేకపోతె అసాధ్యుడివి నువ్వు మా కంట బడతావటయ్యా? రామయ్య నా స్నేహితుడు . హోటల్లో దిగటం యిష్టం లేక యిక్కడ దిగాం....నీకు రామయ్య తెలుసన్న మాట!"
మోహన్ మాట్లాడలేదు. మధ్య గీత పరువెందుకు తీయటం?
మోహన్ తండ్రి కృతజ్ఞత చెప్పుకున్నాడు.
"రాత్రి మెయిల్లో, నేను, మావాడు వెళ్ళి పోతాం. రమణయ్య! నీ మేలు జన్మ జన్మలకి మరిచిపోలేను--"
"ఇందులో నాదేముంది? ....నేను కూడా మీతో పాటే వస్తాను.... మా బ్యాంకు లో ఖాళీ ఉంది. అందులో చేర్పించు మీవాడిని --' అన్నాడు రమణయ్య.
మోహన్ మనస్సు తిరగబడింది. తనో చిన్న పిల్లాడిలా ఏమిటో వీళ్ళ మాటలు! హీరో నవుతానని ఎన్ని కలలు కన్నాడు? తను మోసం చేసి ఆడించింది చాలక బ్యాంకులో చేరాలట! పొద్దున్న లేచింది మొదలు సాయంత్రం వరకు కుర్చీకి అంటిపెట్టుకుని కూర్చునే ఉద్యోగాలు తను చెయ్యలేడు ఏమైనా సరే! అదీగాక మెడ్రాస్ ను వదిలి పెడితే గీతను చూసే భాగ్యానికి కూడా నోచుకోడు.
"నేనేం ఉద్యోగంలో చేరను-- ఇక్కడే ఉండి సినిమాల్లో ప్రయత్నిస్తాను..."
"బుద్దిగా చెప్పిన మాట వినరా!"
మోహన్ మొండి కేస్తున్నాడు. మోహన్ తండ్రి కోపగించుకుంటున్నాడు. ఈ వాతావరణం చూసి అక్కడ తను ఉండటం భావ్యం కాదని తోచి రామయ్య గారు లేచి వంటింట్లో కి వెళ్ళారు కాఫీ తయారు చేసి తీసుకు రమ్మని చెప్పటానికి.
వంటింట్లో ఓ మూల కూర్చుని గీత ఏడుస్తున్నది. రామయ్యగారు ఒక్క క్షణం నోట మాటలేకుండా నిలబడి పోయారు. తర్వాత తమాయించుకుని "వాళ్ళకు కాస్త కాఫీ తయారు చేసి పట్టుకురండర్రా!' అంటూ గట్టిగా కేకేసి వెళ్ళిపోయారు.
గీత గబగబా కన్నీళ్ళు తుడుచుకుని స్టౌ వెలిగించింది.
ఉష కూడా గీతకు సాయం వచ్చింది.
రామయ్య గారు డ్రాయింగు రూములోకి తిరిగి కాలు పెట్టేసరికి వాతావరణం లోని ఉద్రిక్తత తగ్గకపోగా మరికాస్త పెరిగింది.
"ఇంటికి ఎలా రావో చూస్తాను!" అంటూ బెదిరిస్తున్నాడు మోహన్ తండ్రి.
మోహన్ ఏదో జవాబివ్వబోతున్నాడు.
ఇంతలో రామయ్య గారు కల్గించుకుని "రమణయ్య చెప్పినట్లు బ్యాంకు లో చేరు మోహన్! ఆ సినిమా పిచ్చి వదిలి పెట్టావంటే నిన్ను నా అల్లుడిగా చేసుకుంటాను...." అన్నారు.
మోహన్ ఆశ్చర్యంగా రామయ్య గారి వంక తేరిపార చూశాడు. రామయ్యగారు మందహాసం చేస్తూ కనిపించారు.
ఇదొక వంచన కాబోలు అనుకున్నాడు మోహన్.
రామయ్యగారు మోహన్ తండ్రి ని చూస్తూ "నిజమే నండి! మీ కిష్టమైతే మా గీతను మీవాడి కిద్దామని--" అన్నారు.
మోహన్ ఒక్క ఉదుటున వంగి రామయ్య గారి కాళ్ళకు నమస్కారం చేశాడు. "నేను సినిమాల జోలికి వెళ్ళను" అంటూ.
* * * *
మరి కొన్ని రోజులకు రామయ్యగారు కళను సుధాకర్ కు, గీతను, మోహన్ కు, ఉషను ప్రభాకర్ కు, చిత్రను సారంగ కు, శారద ను శేఖర్ కు యిచ్చి ఒకే పందిట్లో పెళ్ళిళ్ళు చేశారు.
పెళ్ళయిన కొద్ది రోజుల తర్వాత ఒకరోజు మోహన్ తీరిగ్గా గీతనో చిక్కు ప్రశ్న అడిగాడు. "అయిదు రెళ్ళు ఎంత?' అని.
గీత బుగ్గలు లోత్తలు పడేట్లు నవ్వింది.
"రానురాను ఎక్కాలు కూడా మరచిపోతున్నట్లున్నారే? అయిదు రెళ్ళు ఎంతో చంటి పిల్లాడి కైనా తెలుస్తుంది...."
'అదే మరి! ఆ చంటి పిల్లాడిని కలుపుకోవటం మర్చిపోతే ఎలా?--
ఈ పాటికి యిద్దరం
పై ఏటికి ముగ్గురం.
ఆ పై ఏటికి నలుగురం......"
పాట పాడుతూ మధ్యలో మోహన్ తలెత్తి చూశాడు. గీత గదిలో లేదు.... ఉంటుందని తను అనుకోలేదు కూడా .
(అయిపొయింది.)
