46
"దయచెయ్యండి సార్.....దయ చెయ్యండి సార్......." అన్నాడు రంగయ్య చౌదరి అప్పుడప్పుడే కారు దిగుతున్న సేతుపతి నుద్దేశించి.
"శంకర నారాయణ గారిలా ఉన్నారు?"
"ప్రాణం పోవడం లేదు. ఎందుకో....ఉట్టినే కొట్టుకు లాడుతున్నట్టుంది. మీ ధర్మపత్ని గారు వచ్చినప్పటి నుంచి అదే పరిస్థితి."
"పాపం, ఆయన మనసులో ఏముందో? పదండి!"
ఇద్దరూ వెళ్లి, శంకర నారాయణ గారు జీవచ్చవం లా పడి ఉన్న ఆ గదిలో అడుగు పెట్టారు.
"వ.....చ్చ్గా......రా? న......మ......స్కా......రం......ఆ..........రు......కుర్చీ....."
"ఏమీ అవసరం లేదు. మీరలా ఆయాస పడకండి. అలా ఆరాట పడడం మానండి."
"నా మూ......;లా.........న్ని.....ఆ......రు.......ణ

అరుణ ఏడ్చింది. ఏడుస్తూనే ........"నేనేమీ బాధ పడడం లేదు నాన్నగారూ. మీకోసం నేను చేసిన త్యాగామేమీ లేదు. ఎప్పుడూ ఇదే వరస మామయ్యగారూ! నాన్నగారు నాకేదో తీరని ద్రోహం చేసినట్లు బాధపడి పోతున్నారు" అని, అరుణ, మరింత బేలలా మారిపోయి, బిగ్గరగా ఏడవడం మొదలు పెట్టింది.
మాట్లాడాలని శంకర నారాయణ గారు తనలో మిగిలిన శక్తి నంతటిని పోగు జేసుకుంటున్నారు.
"ఊరుకోమ్మా అరుణా. నీవిలా ఏడిస్తే నాన్నగారు మరీ బాధ పడిపోరూ? ఒకరు బాధపడితే వారి బాధను మనలో ఎవరో ఒకరు పంచుకోవచ్చు. అందరూ బాధపడితే, ఇక ఆ బాధకు అంతెక్కడ తల్లీ? ఊరుకో?' అన్నారు సేతుపతి!
"నేను...మాట్లాడాలి . మీరు.....నేను.....రంగయ్య.....అంతే. ఎవ్వరూ.....వద్దు...."
"అలాగే, అరుణా, అమ్మనూ, అత్తయ్య నూ , చెల్లాయి ల్నీ తీసుకుని నువ్వు కూడా వెళ్ళమ్మా."
అరుణ హృదయం బద్దలై పోయేలా ఏడ్చింది.
"భగవదనుగ్రహం వల్ల నాన్నగారు కోలుకుంటే సరేసరి. మా కర్మ కాలి వారు పొతే....... పోవడం తృప్తిగా......ఎవరిని గురించి ఏ బాధా లేకుండా వారు పొతే చాలు మామయ్యగారూ."
దుర్గ బావురుమంది.
"ఛీ ఛీ అవెం మాటలమ్మా ఆరూ? ముందు మీరందరూ ఇక్కణ్ణించి వెళ్ళండి. నాన్నగారు మాతో ఏదో మాట్లాడాలిట."
ఆడవారంతా వెళ్ళిపోయారు.
"దా.........హం......."
చౌదరి గారు శంకర నారాయణ గారిని లేవనెత్తి తన హృదయానికి అనిన్చుకున్నారు. సేతుపతి దాహం ఇచ్చారు. రెండు గుక్కలు త్రాగి, "ఇక చాలు " అన్నట్టు అభినయించారు శంకర నారాయణ గారు . ఎందుకో గాని...చూపులను ఇంటి కప్పు కు అప్పజెప్పి , చేతులు జోడించారాయన.
"తమరు ....తిరుపతి ఎందుకు....వచ్చారూ ? దేవుడు.....అంతటా ఉన్నారు...."
"నిజమే ....మేము రాకుంటే , నాలాటి వాడికి మీవంటి మహనీయుని పరిచయ భాగ్యం అబ్బేది కాదుగా?"
"హు ....జరిగింది ....జరిగి.....పోయింది! నే....ను పోతున్నాను..... గోవిందా! ....నాకు నా సంసారం ...గొడవ లేదు..... అంతా అరుణ కు.....అమ్మా....అప్ప జెప్పాను! మరి మా అరుణ గతి...."
"అరుణకేమీ ఫరవాలేదు! నేను లేనూ?"
"వాగ్దానం....."
"రామచంద్రా , మీకిదేక్కడి పిచ్చి? అరుణ కేమీ ఫరవాలేదు నేను వాగ్దానం చేస్తున్నాను."
"కృత...జ్ఞుడ్ని ! ...రంగయ్యా......"
"సార్?"
"నాకు...కొడుకు వైనా.. స్నే....హి....తు......డి వైనా ...నీవే! నీవే....కొరివి పెట్టు...."
"అలాగే సార్."
"చాలా ఋణపడి శ్రీరామా .......పోతున్నాను! అందరికీ ...మీకు ....నీకు.....నా అరుణ కు....." ఆవేశం ఎక్కువై పోతుంది ఆయనకు.
"ఏ జన్మలో మేము మీకు ఋణపడి ఉన్నామో సార్? ఈ జన్మలో దాన్ని తీర్చు కుంటున్నామనుకోండి. మీరు ఎవ్వరికీ ఋణపడి పోవడం లేదు."
"సరే....గోవిందా ! ...ఇక .....సెలవా?....అందరినీ....రామా! కళ్ళ....:
రంగయ్య చౌదరి వెళ్లి అందరినీ తెచ్చారు. అందరూ అయన కాళ్ళ వద్ద నిలుచున్నారు.
"ఆరూ...."
"నాన్నా....?"
"చెప్పకుండా ...వెళదాం అనుకుంటే....మనసు ఒప్పదం లేదు తల్లీ..... శ్రీరామా ! ....నీవు ...చెల్లాయిల పెళ్ళిళ్ళు ....చేస్తావు కదూ?"
"చేస్తాను నాన్నా!"
"నీ....కు ఏమీ ... భయం ....లేదు....సే...తు... గోవిందా , దాహం!"
"సీతా, సరూ , నాన్నగారికి దాహం ఇవ్వండి ...త్వరగా...."
రంగయ్య చౌదరి భార్య కౌసల్య రెండు తులసి దళాల్ని తెచ్చి నీటిలో వేసింది . కనదుర్గ గొల్లుమంది.
"ఆరూ..."
"నాన్నా?"
"నీవూ ....నా ...బిడ్డవే తల్లీ! నీవు....కూడా ....రా! నీ....చల్లని చేతులారా......శ్రీ రామ చంద్రా! ....ఒక్కగు....క్కే....డు...."
ముగ్గురు పిల్లలూ అయన చేత నీళ్ళు తాగించారు.
"దు....ర్గా..... సెలవు...మరి! సీతా.....సరూ....ఆరూ.... అమ్మా....అయ్యా......రంగా!" అంతే, ఆ పుణ్యాత్ముడు తనువూ చాలించాడు. ఎవరెవరి హృదయారాటం కొద్ది వారు వారు వాపోయారు.
47
ఫ్యాక్టరీ మూసేసి అప్పటికే ఆరు నెలలయింది. సేతుపతి గారు నిశ్చింతగా ఇంట ఉండిపోయారు. రఘు మాత్రం వర్కర్ల ఇళ్ళ చుట్టూ కాలుగాలిన పిల్లిలా తిరిగాడు. జయం మనదే అంటూ, ఈ వేళ కాకపొతే రేపయినా ఫ్యాక్టరీ తెరుస్తారంటూ , తెరిచినప్పుడు మళ్ళీ అందరికీ ఉద్యోగాలిచ్చి తీరతారంటూ.
మొదటి రెండు, మూడు నెలలూ ఎవరికీ అట్టే బాధ అనిపించలేదు. వారి జీతాలు....వారి వారి సర్వీస్ కొద్ది వారికి వచ్చిన బోనస్సు లూ, ఇవన్నీ ఉండడం మూలాన్నీ....ఫ్యాక్టరీ రెండు, మూడు నెలల కయినా తెరిచి తీరుతారన్న ధీమాతో నూ...అందరూ హాయిగానే కాలక్షేపం చేశారు. కొత్త గుడ్డలు కుట్టించుకున్నారు; కోళ్ళు కోసుకున్నారు; సినిమాలు చూశారు; జల్సాలు చేసుకున్నారు.
కానీ...నెల తరవాత నేల గడిచే కొద్ది వారందరికీ భయం వేసింది. తమకు లాభదాయక మైనప్పుడు పాలిటిక్స్, కానప్పుడు కేవలం తమ పొట్ట కూడె తమ పాలిటిక్సు గా కలవారు కొందరు నెమ్మదిగా గొంతు విప్పాదం మొదలెట్టారు. "ఎన్నాళ్ళీ అవస్థ " అనీ, "ఈనెల ఫరవాలేదు, ఇక ఆ తరవాత వస్తే" అనీ.
రఘు అందరికీ ధైర్యం చెప్పాడు. వెల్ ఫేర్ ఫండ్ లో దాదాపు పదమూడు వందలున్నాయి. అవసరాన్ని బట్టి , అందులో నించి కొంత కొంత పంచడం మొదలు పెట్టాడు. ఇంతమంది అవసరాల ముందు ఆ ఇంత డబ్బూ ఏ మూలకు?
కొందరు మరీ దీనావస్థ లో పడి, "చిన్నయ్య గారూ, ఇక మా గతేమిటి? మా పిల్లల గతేమిటి? ఆ ఓబులేసు కేం నొప్పా? ఆరు వేలు ఎనకాలేసు కున్నాడు. కడుపులోపలి చల్ల కదలకుండా కూర్చున్నాడు!' అన్నారు.
"తప్పు ! మీరలా అనరాదు! ఓబులేసు కు ఇంకా న్యాయం జరగలేదు. అయినా...నెలనెలా ఐదున్నర లక్షలు నష్టం వస్తున్నప్పుడు వాళ్ళు మాత్రం ఎన్నాళ్ళు ఫ్యాక్టరీ మూసుకు కూర్చుంటారు?"
"ఆళ్ళకేంటి బాబూ ....మారాజులు! సమ్మెలో కలవని గుమాస్తాల కూ ..సూపర్ వైజర్ల కూ ...ఇంజనీర్ల కూ ...ఆఫీసులో పెద్దలకూ అందరికీ జీతాలు ముడుతూ న్నాయిట! ఇక పొతే మేమూ....మా పిల్లలూ నోట్లో దుమ్ము కొట్టుకుని పోవలసి నట్టుంది!"
"ఛీ ఛీ....నేను బ్రతికి ఉండగా మీకాగతి పట్టదు!"
"ఇయ్యాల ఎంకట్రాముడి ఇంట్లో పొయ్యి లో పిల్లి పడుకుంది. వాడి పిల్లల్ని చూసి జాలి పుట్టి, మేమే ఇంత పెట్టాం!"
"మరి, వెంకట్రాముడు నా దగ్గిరి కెందుకు రాలేదు?" అంటూ రఘు పర్సు తీశాడు. అందులో పన్నెండు రూపాయలున్నాయి.
"ఇదుగో ....నా దగ్గిర పన్నెండు రూపాయలున్నాయి! అన్నీ వెంకట్రాముడి కి ఇచ్చెయ్యండి!"
"మిగిలి నోళ్ళ గతో?"
"సాయంత్రానికి నేను చూస్తాగా?" అంటూ రఘు వెళ్ళిపోయాడు.
ఎక్కడికి వెళతాడూ పాపం? వెళ్లి అమ్మ నాశ్రయించాడు. అతణ్ణి చూడగానే చాముండేశ్వరి గుండె లవిసి పోయాయి.
"ఏమిట్రా బాబూ నీకీ అవస్థ? ఆ మొహం చూడు. అసలు కూడు తిని ఎన్నాళ్ళ యింది?"
"అదేమిటమ్మా? లక్షా దికారి బిడ్డ లేనాడయినా పస్తులుంటారా?"
"నీవు అందరు లక్షాధికారులు బిడ్డల్లా టి వాడివయి ఉంటె, ఇక ఈ జీవితంలో మేము కోరుకో దగినది ఏమి ఉండేది బాబూ? మా కర్మ. నీవేం చేస్తావులే! వెళ్లి, స్నానం చేసి, ఆ గుడ్డలు మార్చుకుని రా!"
"స్నానానికి ....గుడ్డలు మార్చుకోడానికి ఏమిటమ్మా తొందర? నాకవసరంగా రెండు వేలయినా కావాలి!"
"రెండు....."
"వేలు."
"ఏం? అంత అవసరం ఏం వచ్చింది డబ్బుతో?"
"జీతం డబ్బులు కళ్ళ జూసి నాలుగు నెలలకు పైగా అయింది. మరి కారూ....పెట్రోలూ ....అదీ...ఇదీ...."
"నాన్నగారేమీ ఇవ్వడం లేదా?"
"నన్నగారినే అడగలేక పోయావా ఆ మాట?"
"సరిలే, ముందు వెళ్లి స్నానం చేసిరా! ఆ తరవాత చూద్దాం."
"చూద్దామంటే కాదు!"
"వేలూ లక్షలూ కావాలంటే నేనేక్కడ్నించి తెచ్చి ఇవ్వను రఘూ? ఉన్నదేదో పట్టుకు వెళుదువు గానీలే, వెళ్ళు!"
మరీ గోము చేస్తే అసలుకు మోసం వస్తుందేమో నని భయపడ్డాడు రఘు. అదీగాక....ఈలోగా సేతుపతి గారు వచ్చారంటే సరేసరి! అందుకని రఘు అవసరంగా వెళ్లి, షేవ్ చేసుకుని , స్నానాదులు పూర్తీ చేసుకుని వచ్చాడు. చూడ ముచ్చట వేసింది చాముండే శ్వరికి!
"ణా తండ్రే.... ణా బంగారు బాబే....అలా ఉంటె ఎంత లక్షణంగా ఉంటుంది?"
"సరేలే, డబ్బు లివ్వు!"
"అగరా తండ్రీ....నాయర్ వేడి వేడి గారెలు వేస్తున్నాడు. తిని వెళుదువు గాని, కూర్చో" అంటూ ఒక అల్మేరా తెరిచి , రెండు సున్ని ఉండలూ....అవీ, ఇవీ తెచ్చి అతని ముందుంచింది. ఆ తల్లి. తినక తప్పింది కాదు. తిన్నాడు. ఘుమఘుమ లాడే కాఫీ వచ్చింది; తాగాడు.
"ఇక వెళతానమ్మా, పనుంది. నిజంగానే. సయ్యద్ బాకర్ లో ఆరు సూట్లు కుట్టమని చెప్పా. కనీసం పదిహేను వంద చిల్లర అవుతుంది. ఇంకా షర్టు లూ.... టై లూ......"
"నాయనా, రఘు, నీవు సూట్లు కుట్టించుకుంటానని వెళ్లి నాన్నగారి నడిగితే రెండు వేలు కాదు , ఇరవై వేలయినా ఇస్తారు. ఒక్కగానోక్కడివి! లేనిపోని గొడవ లన్నింటి లో పడి ఎందుకు పాడై పోతావు? ఎందుకు మా కడుపుల్ని కోస్తావు? నా మాట విను. "అయిందేదో అయిపొయింది. ఇక మీరేది చెబితే అది చేస్తా' అని, నాన్నగారితో రెండు ముక్కలను! ఆ తరవాత అందరి ప్రాణాలూ హాయిగా ఉంటాయి బాబూ!"
"దేనికయినా సమయం రావాలమ్మా . అది వచ్చినప్పుడు అలానే చేస్తాలే. ఇవ్వు; నీ వద్ద ఎంత ఉంటె అంత ఇవ్వు. మిగిలింది వచ్చే నేలలోనో....ఆపై వచ్చే నెలలో నో తీరుస్తానని వాడ్నే బ్రతిమాలు కుంటాలే."
"ఛీ ఛీ...నీకేం కర్మారా దర్జీ వాణ్ణి బ్రతిమాలు కోడానికి? రెండు వేలూ పట్టుకు వెళ్ళు నాయనా! కానీ...నేను చెప్పిన మాట ......."
"అలాగే నమ్మా. సమయం రానీ!"
"నాన్నగారు అన్ని కంపెనీ లోని షేర్లు అమ్మేశారట! పంతొమ్మిది లక్షల దాకా.........."
"అబ్బబ్బ! డబ్బివ్వ మంటే ? నీవు చెప్పే పురాణం పూర్తీ అయ్యేలోగా నాన్నగారు రానే వస్తారు. నీవు డబ్బులివ్వడం చూడనే చూస్తారు........"
వెళ్లి చాముండేశ్వరి రెండు వేలు తెచ్చి ఇచ్చింది. అన్నీ వంద రూపాయల నోట్లే! లెక్క పెట్టి , జేబులో పెట్టుకో బోతున్నాడు. ఏనాడూ వంట ఇంటి మొగం చూడని సేతుపతి అందులో కాలు పెట్టారు.
"చండీ, ఆ కాలింగ్ బెల్ కు ఏమయిందీ ? ఎంత నొక్కినా........."
అంతటితో ఆగిపోయాడాయన . డబ్బుల్ని జేబులో పెట్టుకునే ప్రయత్నాన్ని విరమించాడు రఘు. తండ్రికి కళ్ళప్పగించి నిలుచున్నాడు.
"అరె, అదేమిటి బాబూ? నన్ను చూచి భయపడతావెం? నేను నీ నాన్ననురా! నీవేం ...దొంగతనం చేశావా? అమ్మ నడిగి తీసుకున్నావు . అంతేగా? మరేం ఫరవాలేదులే! ఏదో అవసరమైన పని మీద వెళుతున్నట్లున్నావు. వెళ్ళు, పాపం!"
'అది కాదండీ.....అబ్బాయి సూట్లు కుట్టించు కున్నాడట.........."
"ఆ? అలాగా? ఏం బాబూ! ఏ రష్యా అయినా.......చైనా అయినా ప్రయాణం ఉందా?"
"అబ్బే...లేదండి....వస్తా!"
"ఎప్పుడయినా ఒక గంట సేపు తీరుబడి దొరికితే వచ్చి, నాతొ మాట్లాడు నాన్నా!"
"అలాగే నండీ, సెలవు" రఘు వెళ్ళిపోయాడు.
"ఆసలు మిమ్మల్ని చూస్తేనే పెద్ద పులిని చూసినట్లు వాడు హడలి పోతుంటే? అందుకనే వాడు ఇంటి పట్టున ఉండడం లేదు! శుభమా అంటూ వాడు సూట్లు కుట్టించు కుంటే చైనా వెళతావా అంటారేం, ప్రపంచం లో మరో దేశం లేనట్టు?"
"ఏదో....నోరు జారానులే గానీ....అబ్బాయికి ఏమాత్రం ఇచ్చుకున్నావు?"
"ఇచ్చుకోడానికి ఇక్కడేం ముల్లె కట్టుకు కూచున్నానా? ఏదో...మూడు వందలున్నాయి , ఇచ్చాను!"
"అంతేనా? చూడగానే అవి ఏ ఇరవై వందలో ఉన్నట్టున్నాయి?"
"అవ్వ! అవ్వ! ఆవలిస్తే పేగులు లెక్క బెట్ట గలవారు! ఇక నాయర్ మేడ పైకి టిఫిన్ ఏం మోసుకు వస్తాడు గానీ....ఇక్కడే కూచుని తినండి" అంటూ ఆదరాబాదరాగా అన్నీ ఏర్పాటు చేసింది.
"ఇంతకూ నీవు వాడికి ఇచ్చింది రెండు వేలేనా?"
"అవును సామీ, అవును! రెండు వేలే ఇచ్చాను!"
సేతుపతి గారు మరి మాట్లాడలేదు!
