22
గది నిండా చీకటి.
రవిచంద్ర ఒక్కడే ఆ గదిలో కూర్చొని ఉన్నాడు.
అతని కిప్పుడు ఉదయం, సాయంత్రం, పగలు, రాత్రిళ్ళు భేధమేమీ కనపడటం లేదు. జీవితానికి ఒక అర్ధము, ప్రయోజనము, ఉన్నట్లు కూడా అనిపించటం లేదు. తప్పొప్పుల మధ్య అంత అగాధముందని, మంచిచెడ్డల మధ్య అంత పెద్ద లోయ ఉందని అతను మొదటిసారిగా అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాడు.
కొన్ని క్షణాలు తను రాక్షసుడుగా మారిన భయంకర సత్యం పదేపదే గుర్తుకు వస్తుంటే భరించలేక , ఉపశమనం కోసం తాగడానికి ప్రయత్నించాడు. కాని తాగలేకపోయాడు. నోటి దగ్గర ఉంచుకున్న గ్లాసును నిస్సహాయుడుగా కాసేపు తదేకంగా పరీక్షించి, గదిలో ఒక మూలకు గిరాటేశాడు.
తన హృదయం లాగానే గ్లాసు కూడా పదహారు వక్కలయింది. గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. మనః ఫలకంమీద ప్రియంవద తళుక్కున మెదిలింది. ఉలిక్కిపడి లేచాడు. విసురుగా అటు, ఇటు ఎవరో వెంబడే పరుగెత్తుకొని వస్తున్నట్లుగా వడివడిగా తిరిగాడు. అశాంతి తోనూ, పశ్చాత్తాపం తోనూ, ఉదయించిన వివేకంతో నూ, ఊగిపోయాడు; వేగిపోయాడు. అశక్తుడుగా చీకట్లో ఒక మూల చతికిల పడ్డాడు. తనలోని పశ్చాత్తాప పర్వతం బద్దలయి, కన్నీటి రూపం లో ఆవేదన బయటికి వస్తుంటే అలాగే చలనం లేకుండా కూర్చున్నాడు.
గదిలోకి ఎవరో వచ్చారు.
"ఎవరూ?"అన్నాడు నిర్జీవంగా రవిచంద్ర.
టప్పున లైటు వెలిగింది. గదిలో లైటు తో బాటు చిరునవ్వు ను పెదిమల మీద వెలిగిస్తూ "నేను" అన్నాడు రాజగోపాలం.
రవి బెరుగ్గా చూశాడు.
అతను దగ్గిరికి వస్తూ "చీకట్లో కూర్చున్నారేం?" అని అడిగాడు.
రవి మాట్లాడలేదు.
రాజగోపాలం అతని పక్కనే కూర్చున్నాడు. ఇద్దరికీ మాటలు కరువయ్యాయి. సిగ్గుతో మాట్లాడలేక పోతున్న రవిచంద్ర! రవిచంద్రను ఏ విధంగా మాట్లాడిస్తే బాగుంటుందో ఇంకా తేల్చుకోలేక పస్తాయిస్తున్న రాజగోపాలం!
సెకండ్లు నిమిషాలుగా, నిమిషాలు గంటలు గా దోర్లుతున్నట్లు గా ఉన్న కాలం అసలే పేరుకున్న బరువును ఇంకాస్త అధికం చేస్తున్నది.
"రవిచంద్ర గారూ!" చాలాసేపటి తరవాత రాజగోపాలం అతణ్ణి స్నేహపూర్వకంగా చూస్తూ పిలిచాడు.
రవిచంద్ర ఈసారీ వంచిన తల ఎత్తలేదు.
"మీరు చేసిన చాలా చిన్న తప్పుకు చాలా పెద్ద శిక్ష విధించు కున్నారు."
కుంగి పోసాగాడు రవిచంద్ర.
"మీరు ఉద్యోగానికి రాజీనామా ఇవ్వవలిసిన అవసరం ఎందుకు ఏర్పడింది?"
రవి మాట్లాడలేదు. "ఏదో ఉద్రేకంలో మిమ్మల్ని మీరు మరిచి పోయారు! దాని కెందు కింత బాధపడుతున్నారు?"
క్షణాలు కాసేపు మూగబోయాయి.
"మీ పరిస్థితిని నేను అర్ధం చేసుకున్నాను. ఇప్పుడు నేనేం చెప్పినా సమంజసంగా ఉండదు. కాని నేను మీ స్నేహితుడుగా ఒకటి కోరుతున్నాను. మీరు ప్రతిసారి చిన్నపిల్లాడిలా బాధపడటం మానుకోండి. మీకిక్కడ ఉండటం ఇష్టం లేకపోతె వెళ్ళిపొండి. కాని మనం మంచి స్నేహితులుగానే విడిపోదాం. ప్రియ మిమ్మల్ని చూడాలను కుంటున్నది. వెళదాం, పడండి.
రవిచంద్ర ద్రవించాడు. "రాజగోపాలం గారూ, ఈ విశ్వాస ఘాతకుడి కి దూరంగా వెళ్ళిపొండి. మీ మంచితనపు నీడ సోకతానికి కూడా అర్హుడు గాడు వీడు. వెళ్ళిపొండి . వెళ్ళండి!" అని అందామనుకున్నాడు. కాని, అనలేదు. మాటలు పెగల్లేదు. అవి గుండెలోనే కొట్టు మిట్టాడాయి!
"రవీ, పొరపాట్లు మానం కాకపొతే ఇంకెవరు చేస్తారు? మీరు పశ్చాత్తాపం తో నిలువెల్లా దహించుకొని పోతున్నారు. అందుకనే మీరు నిష్కళంకులని హృదయ పూర్వకంగా నమ్ముతున్నాను. నా చిన్న తమ్ముడు తప్పు చేస్తే నేను క్షమించనూ? నా మాట నమ్మండి. మీమీద నాకెంటు వంటి కోపమూ లేదు. ప్రియ కూడా మీ పరిస్థితి అర్ధం చేసుకుంది. రండి, వెళదాం."
శోకం రవిచంద్ర లోంచి ఒక్కుమ్మడిగా పెల్లుబికింది. తన పాపాన్ని ప్రక్షాళనం చేయడాని కా అన్నట్లు గా ఎగసి ఎగసి వచ్చింది అతనిలోంచి దుఃఖం. కాస్సేపు కనుమరుగయిన అతని వ్యక్తిత్వపు విలవలు దుఃఖంతో బాధామయుడుగా మారిన అతనిలో తళతళమని మెరిసినట్లుగా రాజగోపాలానికి కనిపించాయి.
మంచితనం ఉన్న మనిషి పశ్చాత్తాపం ఎంత విలవయిందో , ఎంత పరిపూర్ణంగా ఉంటుందో రాజగోపాలం మొదటిసారిగా చూసి కదిలి పోయాడు.
కళ్ళు చెమర్చుతుంటే శోక తప్తుడైన అతణ్ణి రాజగోపాలం గుండెకు దగ్గిరగా తీసుకొని, "రవీ ఇక చాలు, ఊరుకోండి" అన్నాడు.
ప్రపంచం లోని సమస్త శాంతి ఆ మాటల్లో పొదిగినట్లనిపించింది రవికి. కొంచెం తేరుకొని, "మీరు వెళ్ళండి, రాజగోపాలం గారూ. ప్రియంవద గారి ముఖం చూసే ధైర్యము , అర్హత నేను కోల్పోయాను. నేను అపవిత్రుడ్నీ. క్షణక్షణము కాటేసే నన్ను గురించిన జ్ఞాపకాలు మాత్రం మీ మంచితనానికి బదులుగా వదిలి వెళుతున్నాను. క్షమించమని అడిగే అర్హత , ధైర్యము లేవు. నన్ను మరిచి పొండి" అన్నాడు.
ఆ మాటలన్న చాలాసేపటి తరవాత , రాజగోపాలం వెళ్ళినట్లుగా దూరమైన అతని బూట్ల చప్పుడు ను బట్టి గ్రహించాడు రవిచంద్ర.
ఒక్కకుదుపుతో మద్రాసు ఎక్స్ ప్రెస్ నాగపూర్ స్టేషను ను వదిలి పెట్టింది. జీవితానికి పరిపూర్ణమైన అర్ధాన్ని తెలియ జెప్పి, జ్ఞాపకాల బరువును మిగిల్చిన ఆ ఊరు మసక మసగ్గా దూరమవుతుంటే , మూడవ తరగతి పెట్టె లో కూర్చున్న రవిచంద్ర కడసారిగా చూశాడు.
ఆలోచన అతనిలో కమ్ముకు వచ్చింది.
ఎందుకు వచ్చాడు తను ఇక్కడికి?
జీవితం అర్ధాన్ని తెలుసుకోడానికి!గమ్యం లేదనుకున్న అప్పటి తన ప్రయాణం, ఈ అనుభవాన్ని తెలియజెప్పడానికే తీసుకు వచ్చిందా? అసలు ఎలా రాగలిగాడు ఇక్కడికి?
విధి విసిరేసిన బంతిలా తను ఇక్కడ వచ్చి పడ్డాడు. తనకు తెలియ కుండానే, తను అనుకోకుండానే, తను వాంచించకుండానే ఇక్కడికి వచ్చాడు. బ్రతుకు లోని తీపి, చెడు, సుఖము, దుఃఖము అనుభవించాడు. జీవితంలోని ఎత్తు పల్లాలు తెలుసు కున్నాడు.

స్నేహం లోని గొప్పతనం ఇలాంటిది అని తెలుసు కున్నాడు.
మనిషి లోని కరుణ, జాలి, మంచితనం కళ్ళారా చూశాడు.
జీవితంలో ఎన్నడైనా తిరిగి సురేంద్ర ను....చిన్ననాటి సురేంద్ర ను కలుస్తా ననుకున్నాడా?
రాజగోపాలం ప్రియంవద లాంటి వ్యక్తులతో పరిచయమవుతుందనుకున్నాడా?
తను ఐ.ఎ.యస్. ఆఫీసరుగా హోదా ని, పదవిని, దర్జాను పొందడాన్ని ఎన్నడైనా ఆశించాడా?
చివరకు తనను ప్రాణసమానంగా ప్రేమించిన సురేంద్ర ఆ విధంగా విధి చేత వంచించబడతాడని ఎన్నడైనా కలగన్నాడా? ఒక మధురమైన ఊహలా తన జీవితంలోకి ప్రవేశించిన సురేఖ, విషాదమైన జ్ఞాపకపు మచ్చను మిగిల్చి, తన బ్రతుకును అలా తెల్లవార్చు కుంటుందని ఎన్నడైనా తను ఊహించాడా?
బ్రతుకు చేత వంచించబడ్డ తను చివరకు ప్రియంవదను ఆ విధంగా వంచింప బూనుకుంటానని ఏ పాపిష్టి ఘడియలో నైనా తలపోశాడా? అన్ని ప్రశ్నలకు ఒకటే జవాబు! అన్ని ప్రశ్నలకు "లేదు" అనేది ఒకటే జవాబు!
తన బ్రతుకును తను మలుచుకోవలిసింది పోయి ఎవరు, ఎందుకిలా తమ అదుపాజ్ఞాలలో ఉంచుకుంటున్నారు? ఎవరిచేత తను ఇలా వంచింపబడుతున్నాడు?
తన అధీనంలో ఉండవలిసిన తన జీవితం , తనకు తెలియకుండానే , ఎందుకిలా తెలియని అడ్డ దారులలోకి గుంజుతున్నది?
తను అస్వతంత్రుడా?
తన చేతిలో ఏమీ లేదా? తన సుఖాన్ని, తన గమ్యాన్ని నిర్ణయించు కునే హక్కు, అధికారం తనకు లేవా?
తను విధి చేతిలో కీలు బొమ్మ?
అస్పష్టంగా ఏదో గొణుక్కుంటూ రవిచంద్ర ఎదురుగా కూర్చున్నాయన చేతిలోని పుస్తకం వైపు దృష్టి నిగిడ్చాడు. మసగ్గా, అస్పష్టంగా భగవంతుడి బొమ్మ ఏదో కనపడింది.
అసహయుడుగా తల వంచు కున్నాడు.
