భాస్కరం ఆ యిద్దర్నీ పీకె పిసికి చంపేద్దునా? అనుకున్నాడు. ఇంతలో మరో పెద్ద మనిషి యీ వార్త కాస్త జానికమ్మ, ధనమ్మల చెవిని వేశాడు.
ఆ యిద్దరూ ఎలా ఉన్నవాళ్ళలా పరుగెత్తుకు వచ్చారు.
భాస్కరం నిజంగా కూలబడ్డాడు. సురేఖ, వసంత కూడా రాకుండా కాపాడాలన్నట్లు పెళ్ళి కూతురున్న గదివేపు నరాల్లో బలం పుంజుకొని వెళ్ళిపోయింది!
"అమ్మా! నాకేం లేదమ్మా! కాస్త ఎండ అంతే" భాస్కరం లేచి "పదండి" అనబోయాడు.
"ఉహూఁ! కాస్త నిమ్మరసం తాగందే లేవనివ్వండి వొదినా?" కూచుని కొంగుతో అతని మొహం తుడిచి విసనకర్రతో విసురుతూన్న జానికమ్మగారిని ధనమ్మగారు హెచ్చరించింది.
పళ్ళు పటపట కొరకడం తప్ప గుండెల్లో పగులుతున్న అగ్నిపర్వతాలను అట్టే అదుముకోడం వినా ఏం చేయలేకపోయాడు భాస్కరం.
ఎట్టకేలకు మరి పదినిముషాల్లో భాస్కరం తల్లితో కలిసి మామూలుగా నాలుగూ చూస్తూ ఉన్నా మరో గంటదాకా సానుభూతి పరంపరలు, "ఏం జరిగిందిటా?" పశ్నలవర్షం ఆగలేదు.
భాస్కరం మతి పోయిందెప్పుడో. "పిన్నీ! సురేఖతో వచ్చిన అమ్మాయికి టెలిగ్రాం ఏదో వచ్చిందట! వెంటనే రమ్మనీ" అన్నాడు.
"అయ్యో పాపం! ఎలాగరా మరీ, వాళ్ళ దేవూరు? ....." ఆమె బాధపడ్డది.
"విశాఖపట్నం ....... ఒక్కర్తే వెళ్ళిందిట. స్టేషన్ కి ఈ రైల్లోనే వెళ్తానందిట."
"అయ్యో ! ఆ అమ్మాయి ? పరాయి ఆడకూతురు కదా? మనకి అప్రతిష్టరా! ఎలా? ఎవర్నేనా పంపకపోయావూ సాయం?" ఆమె భర్తకోసరం అటూ ఇటూ చూసింది.
భాస్కరం అన్నాడు "అక్కర్లేదమ్మా. ఇట్టే పోయి నేనే దిగబెట్టి వచ్చేస్తా ...." నన్నాడు "వూఁ" అంటే పరిగెడదామని ఉంకిస్తున్నట్లు.
"ఉండు ...... పెళ్ళికి వచ్చిన పడుచు ..... పసుపూ ....."
"అబ్బ! అది కాదమ్మా! ఆ అమ్మాయి వెళ్ళిపోయింది." మొహాన చెమటలు పోయగా విసుక్కొంటున్నట్లు అన్నాడు భాస్కరం.
కొడుకు ఆందోళన ఆమెకు అవగాహన కాలేదు.
"ఊఁ ఐతే...... వెళ్లిరా...... త్వరగా."
* * *
భాస్కరం సైకిలెక్కి వెళ్ళిపోయాడు. నలుగురూ చూసి తన నంత అడావుడిగా వెళ్ళిపోయిన భాస్కరం వైనం అడిగితే ఏం చెప్పాలీ? అన్నట్లు రెండు క్షణాలు ఆలోచిస్తూ అక్కడే నిలబడి పోయింది జానికమ్మగారు.
"వసంత పెళ్ళయిపోయింది. ఇంకేం కావాలి? తనకి? ఇంకెవరూ తన నేమీ చెయ్యలేరు!" చాలా దైర్యంగా రివ్వు రివ్వున సైకిలెక్కి వెళ్ళి స్టేషన్ లో దిగుతూనే ఫ్లాట్ ఫారమంతా వెతికేడు భాస్కరం.
కాని పద్మావతెక్కడ?
భాస్కరం ఎవరిని అడుగుతాడు? ఏమని అడగాలి?-
కుప్పలా కూలబడిపోయాడు?
ఫలానీ పోలిక లున్నాయి-ఫలానీ పేరుగల అమ్మాయి యిలా వచ్చిందా? అని అడగాలి. కాని ఎవర్ని?.....
అప్పుడే ఒక పాసింజర్ రాజమండ్రికేసి వెళ్ళిందన్నారు. అందులో వెళ్ళిపోయి ఉంటుంది!
"ఔను! ఇప్పటికే పద్మావతి పూర్తిగా కారాలు - మిరియాలు నూరుతున్నది. ఇక ఇవాళ్టితో "సరి! పూర్తిగా వెళ్ళిపోయింది"-
భాస్కరానికి చెమటలు పోశాయి.
"ఛీ! వెధవ బ్రతుకు....." తిట్టుకున్నాడు-బెంచీమీద కూచుని ఆలోచించాడు.
"వాల్తేరు టెలిగ్రామిస్తే......?"
"ఉహూఁ ...... ఎవరికిస్తాము? ఏమని?"
"పోనీ! ...... ఏం చెయ్యడం, నా కర్మ ..... అసలు మనుషులమీద అంత అపనమ్మకం ఉన్న వాళ్ళని అస్సలు నమ్మకూడదు. ఛీ. ఛీ. నేరకపోయి యీ పద్మతో స్నేహం చేశాను. అబ్బ!..... దుఃఖపడ్డాడు.
"ఉహూఁ ...... లాభంలేదు ..... పద్మావతికి నాలాంటివాడు సరిపోడు ...... వూఁ ..... వెళ్ళనీ ఎవన్నో నీ గేదెపెయ్యలాంటి వాన్నో కట్టుకుని సుఖపడమను...... అంతే ..... కనీసం పిన్నేనా సంతోషిస్తుంది .... వెధవ జీవితం ..... ఎవరో ఒకరు సుఖపడితే చాలు ....." పరిపరివిధాల బాధపడుతూ, కాళ్ళీడ్చుకుంటూ, యివతలికి వచ్చాడు భాస్కరం.
గుండె రాయి చేసుకున్నా "ఒకవేళ కీడెంచి మేలెంచను"న్నారన్న వ్యథ అతనిని పీడిస్తూనే ఉంది.
తన బాధ ఎవరికేనా చెప్పుకోవాలన్నా, చెప్పుకుని ఏడవాలన్నా కూడా - తన ప్రేమగాధ యావత్తూ ఒక అపరాధమే అయినట్లు దాచుకున్నాడు కద!
పద్మావతి తనను శంకించడం మాని దూరమాలోచిస్తే ఈ యిబ్బందులు, మానసిక వ్యధలూ, మనఃక్లేశమూ ఉండకపోను - కాని......
భాస్కరం తిరిగి వెళ్లిపోవాలి.......తన చెల్లెలు పెళ్ళి-వసంత పెళ్ళి అయింది. కాని ఇంకా ఒక్క రోజేనా అవలేదు. పిన్నికి మహదానందంగా ఉంది. నాన్నగారికి ఘనంగా ఉంది. అందరికీ ఆనందంగా ఉంది. తనకీ?
తనకు ఒక చెంపను దుఃఖం, ఇంకో చెంపను సంబరంఒకవేపు మిన్ను విరిగి మీద పడినట్లు మనసు క్రుంగిపోతూ ఉంటే-ఇంకోవేపు సంతోషంగా ఎదను ఉద్దేలంగా-తేలిపోతున్నట్లుగా ఉంది.
"తప్పదు-పద్మావతి వాళ్ళమ్మ కోసరం నేరుగా ఇంటికే వెళ్తుంది" అనే ఆశతో తిరిగి 'విడిది'కి చేరుకున్నాడు భాస్కరం.
42
పద్మావతికి గుండెలు నిండిన దుఃఖం వచ్చింది. మనసును పట్టి పిండుతున్నట్లు బాధ కలిగింది. వెక్కివెక్కి ఏడవాలి! కసిదీరా భాస్కరాన్ని సురేఖని, ప్రపంచాన్ని దేవుణ్ణి, అందర్నీ తిట్టాలి-ఏడవాలి ..... కాని ఎక్కడ? అందుకే నేరుగా స్టేషనుకి అనుకున్న తన గమ్యాన్ని బస్ స్టాండుకి మార్చుకుంది. రిక్షావాడు అడిగాడు కాస్త అనుమానంగా "ఏవూరు పోవాలిటండి?"
"మా వూరే......నువ్వు పోనీ!"
వాడు మాట్లాడలేదు! గంట మరి రెండుసార్లు గట్టిగా కొట్టి బస్ స్టాండుకి తీసుకు వెళ్ళాడు.
తిన్నగా గుంటూరు వెళ్ళింది.
తన తాళాల గుత్తి చూసుకుంది.
ఇంటి తాళం చెవి తన దగ్గిర ఒకటి ఉన్నది.....గుంటూరులో నేరుగా అత్యవసరమైన పనిఉన్న దానిలా ఇంటికే వెళ్ళి మెట్లు ఎక్కుతూ ఉంటే క్రింది ఇంట్లో అద్దెకున్నవాళ్ళు చూశారు.
"ఏమమ్మా! అమ్మ రాలేదూ!" అని పలకరించిందామె.
"లేదండి! నేనే మా స్నేహితురాలి పెళ్ళికి బెజవాడ వచ్చాను!" అని గబగబా పద్మ్వతి గది తెరుచుకుని లోపలికి వెళ్ళిపోయింది.
కిటికీలు తెరవలేదు. ధూళి పట్టిన మంచం మీద, పీచు పరుపు మీదనే కుప్పలా కూలి పోయింది. సత్తువ తెచ్చుకుని లేచి తలుపు దగ్గరకు వెళ్ళి గడియ వేసుకుని వచ్చి ప్రక్కమీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది. ఎన్నో సంవత్సరాలుగా దాచుకున్నదా? అన్నట్లు కన్నీళ్ళు కట్టలు తెంచుకుని ప్రవహించాయి.
ఎంత సేపయిందో తెలియదు కాని లేచి కన్నీళ్ళు తుడుచుకుంది. వెనుకవేపు కిటికీ తెరిచింది. అద్దం దుమ్ము అరచేత తుడిచింది. కళ్ళు వాచి పోయాయి. కన్నీటి చారికలా కట్టాయి మొహం మీద. మళ్ళీ దుఃఖం పొర్లుకు వచ్చింది!
తను ఏం చేసిది?
తను ఏం చెయ్యాలి?....
వెంటనే ఎవరో కొట్టి చెప్పినట్ల జ్ఞాపకం వచ్చింది! "ఒకవేళ సురేఖ విశాఖపట్నం అమ్మకి ఉత్తరం వ్రాస్తే."
"అమ్మ నా గురించి బెంగపడితే?" వెంటనే లేచింది. ఇవతలికి వచ్చింది. "ఇంటిగల చిన్నమ్మ గారు ఒక్కర్తే వచ్చిందని తెలియగానే క్రిందియింటి పనిమనిషి వచ్చింది. నీళ్ళు పట్టుకుని వచ్చిందల్లా పద్మావతిని చూస్తూనే "మరి, మీ రెప్పుడు పప్పూ వొన్నం పెడ్తా రమ్మాయిగారూ!" అన్నది.
పద్మావతికి వొళ్ళు మండిపోయింది!
'అదొక్కటే యీబ్రతుక్కి తక్కువో అన్నది విసుగ్గా.
పనిమనిషి చెప్పింది "మీ అన్నయ్యట ఒకబ్బాయి నిన్న మద్దెనేళ వొచ్చిపోయారు. దిగునింటామె మీ చదువుకని వెళ్ళినారని చెప్పింది."
"అరె! అన్నయ్యా?! అతను ఆవూరు వెళ్తానన్నాడా?" పద్మావతి ఆందోళనకు పనిమనిషి ముందు విస్తుపోయింది. తర్వాత పద్మావతి ఉన్న వాలకాన్ని గమనించి ఏదో పసి కట్టినట్లు చూసి "అమ్మాయిగారూ! మీరుగాని ఇంట్లో పోట్లాడ లేదుగందా" అనడిగింది.
"ఏడ్చినట్లుంది!" విసుక్కుంది పద్మావతి. మళ్ళీ ఏదో స్ఫురణకు వచ్చినట్లు ఆ పనిమనిషిని వెనక్కు పిలిచి ఒక అర్ధరూపాయి యిచ్చింది.
గబగబా స్నానంచేసి "అన్నయ్య? మా అన్నయ్య? మా కోసరమా?"-అనుకుంటూ గబగబ ఎవరో తరుముతున్నట్లు దుస్తులు మార్చుకుని తిరిగి పెట్టె ఎలాఉన్న డలాగే మూతవేసి పట్టుకుని బయలుదేరింది.
"అమ్మ పాత కళ్ళజోడు మరిచిపోయాను పిన్నమ్మగారూ! వచ్చాను గదాని తీసుకెళ్తున్నాను" అన్నది దిగువింటావిడతో......వెంటనే స్ఫురించిన అబద్ధం ఆడి.
ఆమె నాలుగూ అడిగి కాఫీ యిచ్చి "ఈ రాత్రికి యిక్కడ ఉండు అమ్మాయీ! అక్క గారికి నే నుంచేశానంటే కోపంరాదూ" అన్నది ఆప్యాయంగా.
"లేదండీ! పాఠాలు పోతాయి." అని రిక్షా ఎక్కిపోయింది పద్మావతి.
* * *
"అమ్మకి తెలుస్తే యీ గొడవంతా అమ్మ యిక తనను క్షమించదు" అన్న బాధతోనే రైలెక్కింది.
"పోనీ! వెధవ బ్రతుకు ఇంత దగాపడ్డ తర్వాత ఇక బ్రతికి ఏం లాభం! చస్తే పోతుంది!" -
