Previous Page Next Page 
మారిన విలువలు పేజి 32

                                   

    పెద్ద చప్పుడుతో కుర్చీని వెనక్కు తోసి లేచింది జానకి. ఎదురుగుండా గుమ్మాన్ని రెండు చేతులతో పట్టుకొని నించున్న గోవిందబాబు కనిపించేడు. అతడు నిలిచిన తీరు, చూస్తున్న వైనం పరికిస్తే , చాలాసేపటి నుండి అతనలాగే నించున్నట్లు అగుపిస్తున్నది.
    "ఓహో....మీరా.... గోవింద బాబూ! లోపలికి రండి. అలా బయట నిలబడి పోయారేం?' అన్నది జానకి తడబడుతూ.
    "నానుంచి మీ తపోభంగమైనట్టుందే?' అన్నాడు నవ్వుతూ గోవిందబాబు.
    "తపోభంగమా?"
    "అదే. ఎదుటి వారినీ, పరిసరాలను మరిచిపోయి ఆలోచనల్లో మునిగిపోవడం. అయిదు నిమిషాలుగా నన్ను, గుమ్మాన్ని మార్చి మర్చి చూస్తె కాని, నేను గోడ కన్నా భిన్నమైన వాణ్ణి నీ, నా పేరు గోవిందబాబనీ మీ మనసులోకి రాలేదు. అటువంటి ఏకాగ్రతనే తపస్సంటారు. అటువంటి సాధనేమైనా చేస్తున్నారేమో , మీ దీక్షని ఎందుకు పాడు చెయ్యడం, వెళ్ళి పోదామనుకొంటుండగానే....."
    "పోల్చేసుకున్నానంటారు!" అతని మాటను పూర్తీ చేసింది జానకి.
    "ఇంతకీ ఏమిటంత దీర్ఘాలోచన?"
    "ఆలోచనలు లేని మనుష్యులుంటారా , గోవిందబాబూ?"
    "అది ప్రశ్నగా కాక ఆమె వ్యాకుల పాటుకు రూపుగా నిలిచింది.
    "ఉండరనుకొండి. కాని ఆలోచనల్లో ధీరులు, ఆచరణ లో ధీరులు అయినవారికి ఆలోచనలు ఎక్కువే ఉంటాయంటారు. మనసులోకి వచ్చిన ఆలోచనని, తక్షణం క్రియా రూపంలో పెట్టేవారు, ఎప్పటికప్పుడు వాటిని చెల్లు బెడుతూ , కొత్త వాటికీ స్థానం కల్పిస్తారు. కొందరు ఏ ఒక్కదాన్ని కార్యరూపంలో పెట్టలేక, వదిలివేయలేక తమతో పాటు తిప్పుకు తిరుగుతుంటారు. ఆలోచనలు వారి జీవితంలో ఒక భాగంగా మారిపోతాయి. వారికి వాటి నుంచి విముక్తి ఉండదు."
    "ఈ రెండు తరహల్లో నేనే తెగకు చెందేదాన్నను కొంటారు?"
    "ఏ తెగకు చెందినా, అసలు అంతగా ఆలోచించవలసిన విషయాలే మీకు ఉంటాయనుకొను నేను."
    "మా ఇంటిని గురించి, నా జీవితం గురించి మీకేమీ తెలియదు. అందుచేత మీరిలా భావించడం లో పొరపాటు లేదు" అన్నది జానకి.
    "నాకు మీ గురించి తెలిసినదల్లా పట్టుదలతో పనిచేస్తూ, చంటి పాపలతో సహితం కేరుతూ, తుళ్ళుతూ ఆడిపాడగల నిర్మల హృదయం గల జానకిగా మాత్రమే. అంతకు మించి మీ గురించి ఆలోచించింది కి కూడా మీరు అవకాశం ఇయ్యలేదు."
    'అవును, గోవిందబాబూ! మనిషికి రెండు బ్రతుకులు ఉంటాయంటారు. నవ్వు నవ్వుతూ నిష్సూచీగా నలుగురి ఎదుట చూపేదోకటి. అంతర్యంలో మనసుని కలవరపెట్టి, మనిషిని శ్రమ పెట్టేది ఇంకొకటి.
    "చాలామందికి మనిషి మొదటి రూపంతోనే పరిచయం ఉంటుంది. అతనికేం? అదృష్టవంతుడంటారు. ఏ కొద్ది మందో అతని జీవితంలోకి తొంగి చూసిన వాళ్ళు , సానుభూతితో రెండు దశలను అర్ధం చేసుకొని హెచ్చుతగ్గులు బేరీజు వేసి, అతని మానసిక వేదన స్వయంకృతమో, పరిస్థితుల ప్రాబల్యం వల్ల కలిగిందో నిర్ణయించ ప్రయత్నిస్తారు. ఆ మనిషి రూపురేఖలు ఏ కొద్ది గా నైనా వారికి మాత్రమే తెలుస్తాయి."
    "నా ఉద్దేశం లో ఈ బాహ్య అంతర్గత జీవితాలు ఎంత దగ్గరగా వస్తే అంత మంచిది, జానకీ! ఈ రెండింటి వ్యత్యాసం ఎంత తక్కువతో నిల్పుకోగలిగితే , మనిషి అంత త్వరగా కోలుకొనే అవకాశం ఉంటుంది.
    "బాధనంతా తనలో నింపుకొని, బయట ప్రపంచానికి తను మహా సుఖపడుతున్నట్లు భ్రాంతి కలుగ జేద్దామనుకొని, రోజులు గడుపుతుంటే, ఒంటరిగా ఉన్నప్పుడు, అణిచి పెట్టిన ఆ బాధ అతన్ని శాయశక్తులా హింసిస్తుంది. అంటే కనిపించిన ప్రతి వారి ముందు తమ సోద వెళ్ళబోసుకోవాలని కాదు నా అభిప్రాయం. కష్టసుఖాలు పంచుకోదలిచిన ఆత్మీయులతో నైనా మనసు విప్పి మాట్లాడి దాన్ని చులకన చేసుకోవలసిన అవసరం ప్రతి మనిషికి ఎప్పుడో అప్పుడు కలుగు తుంటుంది."
    జానకి అతని మాటకేమీ బదులు చెప్పలేదు. టేబిల్ మీద పడి ఉన్న కాగితాలు ఇటు అటు సర్ది, "ఇంక వెళదామా , గోవిందబాబూ' అన్నది.
    తను అన్న మాటలో తప్పేమైనా ఉందా? అంతవరకు సరిగా మాట్లాడుతున్న జానకి అంతలోనే సంభాషణ తుంచి వెయ్యడంతో కారణం ఏమైనా ఉంటుందా?- అనుకొన్నాడు గోవిందబాబు.
    జానకి ఆలోచనలు వేరు విధంగా ఉన్నాయి. ఈ గోవిందబాబు ప్రతి చిన్న అవకాశాన్ని తన జీవితంలోకి తొంగి చూసేందుకే ఎందుకు ఉపయోగించుకొంటున్నాడు? తను మాట్లాడిన మాట అర్ధం కాక, ఆ మాట వెనక మనసులో దాగిన భావాన్ని పసికట్టాలని ఎందుకు తాపత్రయ పడుతున్నాడు?
    ఇంతకాలంగా తామిద్దరూ కలిసి పని చేస్తున్నారు. దగ్గరగా కూర్చిని అనేకమైన సంగతులు మాట్లాడుకొంటున్నా, మనసులు మాత్రం అంతంత దూరంగానే నిలిచి పోయేయి. మొదటి రోజు చెప్పిన సమాచారం తప్ప గోవిందబాబు గురించి తనకేమీ తెలియదు. తన గురించి అతనికి తెలిసింది కూడా అతి స్వల్పం.
    కాని ఇటీవల తమ మధ్య ఆ దూరం తగ్గుతున్నట్లనిపిస్తుంది. దానికి కార్య కారణాలను వెతకాలన్న ఆసక్తి ఏనాడూ తనకు కలుగలేదు. చాలాకాలం కలిసి మెలిసి తిరుగుతున్న వ్యక్తుల మధ్య సాన్నిహిత్యం దానంతట అదే బలపడడం లో అసహజమేమీ ఉన్నట్లు అనిపించలేదు తనకు.
    అతడు అధికారి అయినా, తను అతని మాట ప్రకారం నడుచుకోవలసిన అవసరమున్నా, తానూ చేస్తున్న పని, ఇతర సంస్థల లో లాగ అంత దూరంలో నిలపగలిగేది కాదు. ఒకవిధంగా చూస్తె బాలవిహార్ ఒక అవిభక్త కుటుంబం లాంటిది. ప్రతి సమస్యనూ అన్ని కోణాల నుంచి పరిశీలించి ఆచరణలో పెట్టాలి.
    "సమిష్టి కుటుంబం సరిగా సాగిపోవాలంటే కుటుంబం లోని అందరి సహకారం ఎంత అవసరమో, ఇటువంటి సంస్థలు పటిష్టంగా నడవాలంటే అందులో పనిచేసే వారి చిత్తశుద్ది, సహకారం అంత అవసరం." అనేది అనసూయమ్మ.
    "ఏదైనా ఒక మంచి కార్యం సాధించాలంటే దాని సారధ్యం పూనిన ఒక్క వ్యక్తీ వల్లా అది సాధ్యం కాదు జానకీ! దానిలో పనిచేస్తున్న అందరి సహకారం అతనికి అవసరం. అందుకు సంబంధించిన వారంతా పరస్పర అర్ధం చేసుకొని పని చేసినప్పుడే , సహృదయంనెలకొని చేసే పనిలో పూర్తీ ఫలితం పొందే అవకాశం ఉంటుంది అనేవాడు గోవిందబాబు.
    కేవలం అటువంటి ఉద్దేశ్యంతోనే, తన్ను సరిగా అర్ధం చెసుకొందుకు , తన మనసును తెలుసుకో ప్రయత్నిస్తున్నాడా గోవిందబాబు? ఇంతకాలం గడిచిన తరువాత , ఇంక కొద్ది కాలంలో అతను వెళ్ళిపోనున్న సమయంలో, ఇప్పుడు దీనికి ఆవశ్యకత కలిగిందా?-- అనుకొన్నది జానకి.
    అలా ఉలుకూపలుకూ లేకుండా నిలబడడం గోవిందబాబుకు చేత కాలేదు. ఏదో మాట చెప్పి, అక్కడ నుండి వెళ్ళిపోవాలనుకున్నాడు.
    "ఆ.. జానకీ! మిమ్మల్ని ఆ పరిస్థితిలో చూసి, నేవచ్చిన పనే మరిచిపోయెను. మీరు మౌనం వహించి నా జ్ఞాపకశక్తి మేలుకొనిందికి ఈపాటి సమయం ఇయ్యబట్టి కాని, లేకుంటే ఇలాగే ఏదో మాట్లాడుతూ ఉండిపోయేవాడిని...."
    "ఇంతకీ మీరు వచ్చిన పని?"
    "మీరు, ఇంటికి వెళ్లి పోయే ముందు తన్నోక్కసారి కలుసుకోమంది అనసూయక్క."
    "పదండి. ఈరోజుకి నా పని పూర్తయినట్టే . ఇంటికి వెళ్ళే ప్రయత్నంలో ఉండగానే మీరు వచ్చేరు" అన్నది జానకి.
    "నాకు వేరే పనున్నది. మీరు వెళ్ళండి" ఆమె జవాబు ఆశించకుండానే గోవిందబాబు వెళ్లిపోయేడు.
    అతను వెళ్ళిన వైపే చూస్తూ నిలబడి పోయింది జానకి. సంధ్య వెలుగులో ఆకుపచ్చని తివాచి లా పరుచుకొన్న లాన్ దాటి , రంగు రంగుల పూల మొక్కలతో , తీర్చిదిద్దిన అంచుల్లా ఉన్న, పూల మళ్ళు తప్పించుకొని, తిన్నని కాలి బాట వెంట పాలసరి చెట్ల వైపు వెళ్ళి పోతున్నాడు అతడు. ఆ చెట్ల వెనకనే పిల్లల హాస్టలు ఉన్నది. ఆ పాలసరి చెట్ల వరస ఆఫీసుకు , హాస్టలు కు సరిహద్దు వంటిది.
    కాస్త సేపు పిల్లలతో కబుర్లు చెప్పుకొందుకే అతను వెళ్తున్నాడని జానకికి తెలుసు. రోజూ ఏదో సమయాన వాళ్ళతో, ఆటలాడి, పోట్లాడి, వాళ్ళను కాస్త సేపు నవ్వించి, మరికాస్త సేపు ఏడిపించనిదే అతనికి తోచదు. పెద్ద పిల్లలు, పెద్ద వాడన్న భావంతో ఊరుకొన్నా, చిన్న పిల్లలు అన్న చేసిన తప్పుకి అతన్ని శిక్షించనిదె విడిచి పెట్టరు. అతని జుట్టు పీకి, రంగు సుద్దముక్కలతో తెల్లని అతని షర్టు మీద రాక్షసుడి బొమ్మలు వేసి సంతృప్తి పడతారు.
    "గోవిందూ! నీకు పిల్లలంటే ఇంత సరదా కదా? మరి, పెళ్ళేందుకు చేసుకోవూ?" అని ప్రశ్నించింది అనసూయమ్మ , ఒకరోజు అతను అటువంటి అట పాటలలో మునిగి తేలుతుండగా.
    "పెళ్ళా!? పెళ్ళి చేసుకుంటే ఇంతటి ముద్దుల పాపలు పుడతారని నమ్మకమేమిటి?" అన్నాడు తన చేతిలో ఉన్న చిట్టి పాప బుగ్గలు చిదిపి ముద్దు పెట్టుకొంటూ.
    "ఏం, ఎందుకు పుట్టరు? చక్కని అమ్మాయినిచూసి పెళ్ళి చేసుకో!"
    "కొంపతీసి పిల్లలకి నా పోలిక వస్తే?"
    "ఏం, నీ పోలికొస్తే? నీకేం తక్కువ?"
    "నువ్వు మా అక్కవి కాబట్టి ఆ మాట అంటున్నావు. ఇంకేవర్నాయినా అనమను" అన్నాడు అతడు చిలిపిగా.
    తన పక్కనే నడుస్తున్న జానకి వైపు తిరిగి, "నువ్వు చెప్పు , జానకీ! గోవిందబాబు చక్కని వాడు కాడూ?" అన్నది ఆవిడ అడుగులు ముందుకు వేస్తూనే.
    "గోవిందబాబుకేం లోటు? అతనిలాటి వాళ్ళు యెంత మంది ఉన్నారు?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS