Previous Page
స్వాతి జల్లు పేజి 33

 

    ఈ అన్న దుష్టుడా? ఇతనిలో నీచత్వం చోటు చేసికోగలడా?
    "త్రాగు సుచీ! చేతులారా ఇంతవరకు తెచ్చుకొన్నావు. ఇప్పుడైనా నేను చెప్పిన మాట విను. డాక్టర్ ను చేరనియ్యవు. ఆహారం తీసికోవు. నువ్వు నేను చెప్పినట్లు వింటే, నీకేం కావాలన్నా ఇస్తాను."
    "నిజంగానా? అయితే నువ్వీ దొంగతనం మానెయ్య."
    "సరే! మానేస్తాను . నువ్వు ముందిది త్రాగు."
    "అన్నయ్యా! నీ మాట నమ్ముతాను. కానీ నువ్వు ముందిక్కడ్నించి పారిపో!"
    "నువ్వు ముందు త్రాగు! తరువాత మాట్లాడు కొందాం!"
    పసిపిల్లతో తల్లి త్రాగించినట్లు సుచరితతో ఆ పళ్ళ రసాన్ని త్రాగించాడు బాలూ.
    "నువ్వు వెంటనే పారిపో అన్నయ్యా!"
    ఆత్రుతతో తొందర పెట్టింది సుచరిత.
    "ఎందుకూ?' నిదానంగా నవ్వుతూ అన్నాడు.
    "నీకు తెలియదు . నేను పోలీసులకు రిపోర్టిచ్చా!-"
    "నాకు తెలుసు!"
    సుచరిత నివ్వెర పోయింది.
    "తెలుసా?"
    "ఆహా! ఈ ఇంట్లోంచి ఎవరు అడుగు బయటకు పెట్టినా, లోపలకు పెట్టినా, ఆ వివరాలన్నీ నా కేప్పటి కప్పుడు చేరి పోతుంటాయి. ఆమాత్రం రక్షణ లేకుండా ఉన్నాననుకొన్నావా?"
    "అన్నయ్యా!"
    సుచరితకు మాటలు కష్టంగా వస్తున్నాయి.
    "అయితే నువ్వెందుకు పారిపోలేదూ?"
    "ఎందుకు పారిపోవాలి? స్వంత అన్నను పోలీసులకు పట్టిచ్చి, నా చెల్లెలు ఉన్నతమైన వ్యక్తీ కదలచుకొంటె, అడ్డు వచ్చేటంత పిరికివాణ్ణ?"
    హాయిగా నవ్వుతూ అన్నాడు బాలూ.
    సుచరిత ముఖం తెల్లగా పాలిపోయింది.
    "పారిపో అన్నయ్యా! వెంటనే పారిపో! ఉన్నతురాలిని కావాలనే ఆశ నాకేమీ లేదు. ఇంక దొంగతనం చెయ్యనని మాతిచ్చావు . అది చాలు నాకు! తొందరగా వెళ్ళు."
    "వెళ్ళను! నీ కిచ్చిన మాట ఎలా నిలబెట్టుకొంటానో చూద్దువు గాని! అందువల్ల నీకు నిజంగా సంతృప్తి కలుగుతుందా అని కొంచెం అనుమానంగానే ఉంది. కానీ, నువ్వు వెంటనే శ్రీధర్ దగ్గిరకు వెళ్ళిపో! నువ్వు నీవారిని తలుచుకొని అవమానపడవలసిన నేచులేవరూ ఇక ఉండరు--"
    బాలూ ఈ మాటలు పూర్తీ చేయడమూ, టెలిఫోన్ మ్రోగటమూ, బాలూ పిస్టల్ మ్రోగి గుండు అతని గుండెల గుండా దూసుకు పోవటమూ పోలీసులకు లోపలకు ప్రవేశించటమూ , ఒకే క్షణంలో జరిగిపోయాయి.
    బాలూ శవమూ, ఒళ్ళు తెలియని జ్వరంతో స్మృతి తప్పిన సుచరిత, చిందరవందరగా ఉన్న పుస్తకాలూ, పాతరకపు ఫర్నిచరూ, సాధారణమైన బట్టలూ, సుచరిత, శ్రీధర్ లున్న ఫోటో తప్ప పోలీసులకు ఏమీ దొరకలేదు.
    ఫోటో ఆధారంతో శ్రీధర్ ను పోలీసు స్టేషన్ కు పిలిపించారు. శ్రీధర్ ను పోలీస్ వారేవిధంగానూ అనుమానించలేకపోయారు. కానీ సుచరిత ను మాత్రం వదలలేదు. శ్రీధర్ తన సమస్త శక్తులూ వినియోగించి అతి కష్టం మీద సుచరితను విడిపించుకోగలిగాడు.
    శ్రీధర్ హాస్పిటల్లో కళ్ళు తెరిచిన సుచరిత కొక్క క్షణం అంతా అయోమయమయింది. శ్రీధర్ ను చూడగానే ఆమె ముఖం వెలిగింది.
    "నా ప్రాణాలు పోకముందు ఒక్కసారి మిమ్మల్ని చూడాలను కొన్నాను చూడగలిగాను" అంది.
    "నీ ప్రాణాలు పొతే, నా వైద్య వృత్తి ని వదిలేస్తాను. విపరీతమైన మానసికాందోళన , ఆహారమూ విశ్రాంతి లేకపోవటమూ , నిన్నీ స్థితికి తెచ్చాయి. నువ్వా నీచుల మధ్య కెందు కెళ్ళావు సుచరితా?" సుచరిత కళ్ళ నిండా నీళ్ళు నిండుకోన్నాయి.
    "క్షమించండి! ఎవ్వరినీ నీచులని అనకండి-- వెలుగు నీడలలాగా ప్రకృతి లో ద్వందాలన్నీ అన్నిటా అంతటా అందరిలోనూ, ఏర్పరింపరానివిగా కలిసి పోయి ఉన్నాయి. మనకు కన్పించే భేదం తరతమాలతో మాత్రమే!"
    డాక్టర్ సుచరిత కళ్ళు తుడిచాడు. లాలనగా  ఆమె తల నిమురుతూ "నీ మాటలతో మనసారా, ఏకీభవిస్తున్నాను. నువ్విప్పుడు విశ్రాంతి తీసికో! దేన్నీ గురించి ఆలోచించకు-- నాకోసం , కనీసం నామీద జాలితో దేన్నీ గురించీ ఆలోచించకు" అన్నాడు.
    శ్రీధర్ చల్లని స్పర్శ గుండెలలోని మంటలకు కొంత ఉపశమనం కలిగిస్తుండగా , భారంగా కనురెప్పలు వాల్చింది సుచరిత.

                                *    *    *    *
    అంత నీరసం లో, అంత జ్వరంలో మెరిసిపోతున్న సుచరిత సౌందర్యాన్ని చూసి నివ్వెర పోయింది అరుంధతి.
    "చూసారా! ఈవిడే సుచరిత! ఇప్పుడు మాట్లాడగలిగే పరిస్థితిలో లేదు. తరువాత మాట్లడుకో వచ్చు. మా ఇంటికి పదండి!"
    అరుంధతి మౌనంగా బయటికి నడిచింది. శ్రీధర్ రెండు రిక్షాలు మాట్లాడుతుంటే అరుంధతి ఆశ్చర్యంగా "మీకారేమయిందీ?" అంది.
    "అమ్మేశాను" నవ్వుతూ అన్నాడు శ్రీధర్. అరుంధతి చాలా ఆశ్చర్యపోయింది. కాని , అతని నింకేమీ అడగలేదు.
    రిక్షాలు ఆగాయి.
    అరుంధతి ఆశ్చర్యపోతూ , "ఇది మీ ఇల్లా?' అంది.
    "అవును, ప్రస్తుతం ఇదే! వెనుకటి ఇల్లు అమ్మేసాను. ఇది అద్దె ఇల్లు. లోపలికి రండి" అన్నాడు శ్రీధర్ తలుపు తాళం తీస్తూ.
    చిన్న ఇల్లు! ఒక్కడే నౌకరు! సోఫాలు లేవు. రెండు కుర్చీలు, ఒక బల్ల ఉన్నాయి.
    అరుంధతి వింతగా చూస్తూ ఒక కుర్చీలో కూర్చుంది. శ్రీధర్ ఫ్లాస్కు లో కాఫీ ఒక కప్పులో పోసి, అరుంధతి కందిస్తూ "మిమ్మల్ని ఎక్కువ సేపు సస్పెన్స్ లో ఉంచను. సుచరితను పోలీసుల నుండి విడిపించుకోవడానికి నేను చాలా జరిమానా చెల్లించుకోవలసి వచ్చింది. నేను ఎంత సంపాదిస్తానో అంత ఖర్చు చేస్తాను. అందుకే కారూ, ఫర్నిచర్ తో కూడా, ఆ ఇల్లూ అమ్మేయవలసి వచ్చింది. తాతగారి లైబ్రరీ వదులు కొన్నందుకే బాధగా ఉంది. పోనీయండి! నా సుచరిత నాకు దక్కింది! మిగిలినవన్నీ అల్ప విషయాలు' అన్నాడు.
    నవ్వుతూ, అతి సామాన్యంగా ఇంతటి దారుణాన్ని చెపుతున్న శ్రీధర్ ను విభ్రాంతి తో చూసింది అరుంధతి. చక్కని పూల తోట, స్వేమ్మింగ్ ఫూల్ , లైబ్రరీ , ఆఇల్లు తలచుకొంటే అరుంధతికే కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
    "మీ దగ్గిర చివరిసారి సెలవు తీసికొందామని వచ్చాను."
    ఎంత ప్రయత్నించినా గంబీరంగా ఉండలేక గద్గస్వరంతో అంది.
    "ఏమిటీ?' ఆశ్చర్యంగా అడిగాడు శ్రీధర్.
    "నాకు విముక్తి లభించింది. ఇంక నన్ను నేను మోసం చేసికొంటూ బ్రతకనక్కర్లేడు. ఒక నర్సరీ స్కూల్లో నాకు టీచర్ ఉద్యోగం దొరికింది. వెళ్ళిపోతున్నాను."
    అరుంధతి జరిగినదంతా క్లుప్తంగా చెప్పింది. తనకు ప్రాణ ప్రదమైన లైబ్రరీ తో సహా, ఇంటిని అమ్మేసానని నవ్వుతూ చెప్పిన శ్రీధర్ కన్నీళ్ళాపుకోలేక, చటుక్కున ముఖం తిప్పుకొన్నాడు.
    అది గమనించిన అరుంధతి హృదయం ఆనందంతో పరవళ్ళు తొక్కింది. ఒక్కసారి కూర్చున్న చోటు నుంచి లేచి, డాక్టర్ శ్రీధర్ పాదాలకు నమస్కరించింది.
    శ్రీధర్ కంగారు పడిపోయాడు.
    "ఇదేమిటి?"
    "జీవితంలో ఒక్క క్షణం నాకు కావాలనిపించింది డాక్టర్ గారూ!"
    డాక్టర్ స్థాణువయి నిలబడ్డాడు.
    "అరుంధతి గారూ! మీకేన్నోసార్లు ఏమేమో చెప్పాలను కొన్నాను. కానీ ఏమీ చెప్పలేక పోయాను. ఇప్పుడు.... ఉహు! ఇప్పుడు కూడా ఏమీ చెప్పలేను."
    "ఏమీ చెప్పనక్కర్లేదు డాక్టరు గారూ! మనుష్యులు ఒకరో నొక రర్ధం చేసికోవడానికి కావ్య భాషలో మాట్లాడుకొనక్కర్లేదు. రేడియో లో వినేపాట గుర్తు కొస్తుంది.
    "పూవులు పూయును పదివేలు
    భగవానుని మెడలో ఏది వ్రాలూ?
    ప్రాణములున్నవి అందరికీ.
    ప్రణయము తెలిసే దెందరికి?"
    నాకంటే సుచరిత, వెంకటలక్ష్మీ , మరణించిన తార ఎన్నో రెట్లు అదృష్టవంతులు. అన్నేమూ, పున్నేమూ తెలియని అమాయకులకు  ఉపాధ్యాయునిగా వెడుతున్నాను. నా గుండెల్లో నిండిన ప్రేమను ఆ పసి కందుల మీద కురిపించి, సంతృప్తి పొందుతాను. నాకిదొక్కటే మార్గం!"
    "జీవితాంతము ఉండవలసిన వివాహబంధాన్ని ఒక లాటరీ లాగ మార్చేసి, కళ్ళు మూసుకొని, వైవాహిక జీవితంలోకి అడుగు పెడ్తున్న మన దురదృష్టాన్నేమనుకోవాలో అర్ధం కావటం లేదు."
    "ఎక్కడో నాలాంటి దౌర్భాగ్యులిద్దరూ ముగ్గురున్నంతమాత్రాన , అందరినీ ఎందుకంటారూ? ఇన్ని లక్షల మంది హాయిగా సంసారాలు చేసుకోవటం లేదా?"
    "హాయిగా కాదు. గుట్టుగా! ఇంటి నుండి బయట పడిన తరువాత, తన భవిష్యత్తు ఎంత భయంకరమో, ప్రతి హైందవ యువటికీ పుట్టుక నుండే తెలుసు! ఆ కారణం చేత మన సంసారాలన్నీ గుట్టుగా సాగి తీరతాయి. ఈలోగా ఉన్నవాళ్ళు లేరని కాదు. కానీ, అంతా లాటరీ! అదృష్టవంతులయినవారు, అనుకూల దంపత్యాన్ని పొందగలిగితే, దురదృష్టవంతులు కర్మసిద్ధాంతాన్ని ఆశ్రయిస్తున్నారు. గుట్టుగానే కాక హాయిగా కూడా సంసారాలు చేసికొనే అవకాశాలు ఉన్నా, మనం వదిలేసుకొంటున్నామని వాపోతున్నాను."
    'అట్లాంటి అవకాశాలు ఏమున్నాయి?'
    "ఏం? వివాహానికి ముందే , ఒకరి నొకరు కొంత వరకైనా అర్ధం చేసికోగలిగితే పరిస్థితులు మరీ ఇంత దారుణంగా ఉండక పోవచ్చు గదా!"
    "ఇంకా నయం! అంతటితో ఆగారు. ఈనాటి మన సమాజంలో , అట్లాంటిది సాధ్యమేనా మీ ఉద్దేశ్యం? మీబోటి వారి మాటను నమ్ముకొని అమాయకులెవరైనా , అట్లాంటి ప్రయోగాలు మొదలు పెడితే, ఆ స్త్రీల పని ఉభయ భ్రష్టుత్వమవుతుంది."
    "నిజమే! సమాజం ఇప్పుడున్న స్థితిలో ఇందుకు సాహసించిన స్త్రేలకు అసభ్యతే మిగుల్తుంది. ముందు మన సమాజం మారాలి. నీతి నిజాయితీలు, ఇంకొకరి కొరకు కాదు. మనకోరకే నని అందరూ గుర్తించాలి. ఒకరి పట్ల ఇంకొకరికి నమ్మకం పెరగాలి. ఆనాడు కానీ, నేను చెప్పిన మాటలు, ఆచరణ యోగ్యాలు కావు. అట్లాంటి స్థితి మన మనల తరాని కైనా వస్తుందో? రాదో?"
    అరుంధతి సమాధానం చెప్పలేదు.
    చెప్పేందుకేముందీ?
    కొంతసేపు అలానే కూర్చున్న తరువాత డాక్టర్, "నేను మీకొక బహుమతి ఇస్తాను. మీరు స్వీకరించాలి." అంటూ చిన్న పెట్టెను అరుంధతిముందుంచాడు-- అరుంధతి దాన్ని తెరిచింది. ఒక్క జత బంగారు గాజులు!
    అరుంధతి ఆశ్చర్యంగా అతని వంక చూసింది. డాక్టర్ ముఖంలో చిరునవ్వు కనుపించింది.
    "మనోరంజని గారి ద్వారా , మీ గాజులు పోయిన సంగతి విన్నాను. ఆ తర్వాతి కధ కూడా తెలిసింది. మీ గాజులేమైనాయో ఊహించగలిగాను. మీ గాజులు నాకు గుర్తు లేవు. అందుకని నాకు నచ్చిన ఈ జత కొన్నాను. ఈనాడు నాకున్న సమస్తమూ అమ్ముకొన్నా, ఈ గాజులు మాత్రం మీ కోసమే దాచాను. తీసికోండి."

 

                                 


    అరుంధతి ఆ గాజులను పెట్టిలోనే ఉంచేసింది.
    "నా కిప్పుడు వేటి మీదా మమకారం లేదు డాక్టరు గారూ! ఈ గాజులు ధరించే అర్హత నాకు లేదు. సుచరిత కివ్వండి."
    "ఈ లోకంలో "నాది" అనేదంతా ఏనాడో సుచరిటది. ఆమెకు నేను క్రొత్తగా ఇచ్చేదేమీ లేదు. ఇవి మీవి. తీసికోండి."
    అరుంధతి ఇక కాదనలేక పోయింది. ఆ గాజులను చేతికి తీసికొంది. డాక్టర్ సంతృప్తిగా చూసాడు.
    డాక్టర్ శ్రీధర్, ప్రకాశరావు, వెంకటలక్ష్మీ అరుంధతిని సాగనంపడానికి స్టేషన్ కు వచ్చారు. కన్నీళ్ళతో తనకు వీడ్కోలిస్తున్నవారికి , కన్నీటి తెర లడ్డురాగా, సరిగా చూడలేకపోయింది అరుంధతి. క్రమంగా అందరూ కనుమరుగయ్యారు. అరుంధతి కళ్ళు తుడుచుకుని , సూట్ కేస్ లోంచి పసివాడి కాలెండర్ బొమ్మ పైకి తీసింది.
    "ముందు ముందేమోగాని ఇప్పటికి మాత్రమేపాపమెరుగ డితడు."

 

                            (అయిపొయింది)


 Previous Page

WRITERS
PUBLICATIONS