Previous Page Next Page 
మల్లమ్మదేవి ఉసురు పేజి 32


    "అబ్బ చెప్పమ్మా త్వరగా!" మల్లమ్మ జాలిగా ముఖంపెట్టి అడిగింది.
    "బొబ్బిలి గురించి విన్నావా నువ్వు?" అని అడిగింది తల్లి మల్లమ్మ విన్నానని తల వూపింది. బొబ్బిలి గురించే కాదు ఆమె రంగారావు గోపాలకృష్ణ గురించికూడా వింది.
    షేర్ ఖాన్ యిచ్చాడు కాబట్టి బెబ్బులి రాజ్యం అది. బొబ్బిలి యెలా అయింది? అని అడిగింది తల్లిని తల్లి నవ్వి చెప్పింది.
    "భృంగవాదం కాస్తా బొంగునాదంకాగా లేంది బెబ్బులిరాజ్యం బొబ్బిలిరాజ్యం కావటంలో విచిత్రం యేముంది?"
    పదిమంది నోళ్ళల్లో పడ్డాక పదాలు మారిపోతాయని ఆమె తాత్పర్యం.
    అంతలో తారాజువ్వలా వచ్చిపడింది జగ్గమాంబ మల్లమ్మ చెల్లెలు.
    "మరేమో అక్కా! బొబ్బిలినించి ఒక దూత వచ్చాడు. గోసాల కృష్ణ రంగారావుగారు పంపారట. రాజాము జమీందారు పాపారాయుడుగారు లేరూ వారి బావగారు. గోపాలకృష్ణరంగారావుగారు నిన్ను పెళ్ళాడుతారట. యిదంతా నాన్నగారు అమ్మకు చెప్తూవుంటే నేను తలుపుచాటు నించి విన్నాను. నీకు పెళ్ళి అయి నువ్వు వెళ్ళిపోతే నేను ఒంటరిగానే వేటకు పోవాలి కాబోలు" అంటూ చక చకా తన సంతోషాన్ని విచారాన్ని వ్యక్తం చేసింది జగ్గమాంబ.
    "అక్కకు పెళ్ళి అయి వెళ్ళిపోయాక నువ్వుమాత్రం యిక్కడే వుంటావా గడుగ్గాయీ! నువ్వు మాత్రం పెళ్ళిచేసుకోవూ నిన్ను మాత్రం మేము నెత్తిన పెట్టుకు కూర్చుంటామా? పెళ్ళిచేసి భర్తవెంట తరిమెయ్యమూ!" అంటూ కూతురుతో సరాగం పలికి ప్రక్కకు తిరిగి కళ్ళు వత్తుకుంది తల్లి.
    కూతుళ్ళు యెదిగివచ్చారు. పెళ్ళి అయి వెళ్ళిపోతారు. రాణివాసం కత్తిమీది సాము వంటిది. భర్త పెళ్ళాడే యితర భార్యల యీర్ష్యా అసూయలమధ్య ప్రాణాలమీదికి ముంచుకువచ్చే యుద్దాలమధ్య కొడుకులు పుడితే వాళ్ళకి రాజ్యం దక్కించుకోవాలనే తపన, ఆలోచన, రాజకీయాల మధ్య జీవించాలి రాణి. రాణివాసమంటే పంచాగ్ని మధ్యమే!
    కూతుళ్ళకి పెళ్ళి కుతూహలమే తెలుసుకొని యివన్నీ తెలియవు.ఒకసారి రాణి అయ్యాక ఆమె యెలా బ్రతుకుతుందో, యెలా చస్తుందో యెవరూ వూహించలేరు అదంతా అనుభవించి చూచింది తను. యెన్నో వింది కాబట్టి తెలిశాయ సంగతులు. యీ వయస్సులో కూతుళ్ళకి యివన్నీ చెప్పి వాళ్ళకి యింకా కొద్దికాలం వుండే ఆనందాన్ని పాడు చెయ్యటం వెంకమా బకు యిష్టం లేకపోయింది. అందుకే పైకి నవ్వుతూ, కూతుళ్ళతో సరాగాలు ఆడుతూ పక్కకు తిరిగి వాళ్ళు చూడకుండా కళ్ళు తుడుచుకుంది ఆమె.
    తన పెళ్ళిసంగతి యెత్తేసరికి మల్లమాంబకు సిగ్గు మరింత ముంచుకు వచ్చింది. మాట్లాడకుండా వూరుకుంది.
    "నా తల్లికి అప్పుడే పెళ్ళికళ వచ్చేసింది" అంటూ బుగ్గలు పుణి కింది తల్లి. అప్పటికి సంధ్యాసమయం అవుతోంది. యిహ యిప్పటినించీ యెన్నో పనులు చక చకా చేసుకుపోతేకాని రామరాయుడికి భోజనమూ, పడక యేర్పాట్లు పూర్తికావు. ఆయన దయాబుద్ధి యెట్లాగుందో? ఏ అంతఃపురానికి యే వేళప్పుడు వస్తారో తెలియదు. ముందుగా కబురు వచ్చినరోజు పండుగే తల్లి వెళ్ళిపోయింది.
    కశింకోట ప్రభువుకి యీమధ్య సంవత్సరాలలో ఆదాయం బొత్తిగా పడిపోయింది. వంటలు అస్తవ్యస్తం సశిస్తులు వసూలు కావు శ్రీకాకుళం పంపవలసిన శిస్తు పంపక తప్పదు. యితర ఖర్చులు తప్పవు. రాజు పోకడ మానుకుందుకు వీలులేదు. వైశ్యుల్లో వుద్దండులున్నారు. రాజులకు అప్పు యివ్వగలిగిన స్థితిలో వున్నారు.
    కళింగపట్నంనించీ, గంజాంనించీ, దంతపురం నించీ, విశాఖనించీ యితర దేశాలతో వ్యాపారం చేసేవాళ్ళున్నారు. గంజాయి, నల్లమందు యిప్పపూత (ఎండబెట్టింది సంవత్సరం దాదాపు నిలవ వుంటుంది) రత్నాలు, బంగారం, కలప వగైరా వ్యాపారాలుంటాయి వాళ్ళకి. ఒక్కొక్క వ్యాపారానికి విడి విడిగా ఓడలవంటి పడవ లుంటాయి. రాజ్యాల్ని కొనాల్సివస్తే అప్పుడప్పుడూ చిన్ని చిన్ని రాజ్యాలని వాళ్ళు కొనగలరు. కొంత లాభం చూచుకుని  ప్రక్కనున్నవాళ్ళకి అమ్మనూగలరు.
    భూమార్గాన తిరుగుతూ వ్యాపారం చేసేవాళ్ళుకూడా వున్నారు. వాళ్ళు గుర్రాలమీదా ఒంటెలమీదా సరుకులు యెత్తుకుని యిటు వంగ బీహారాల తోనూ, అటు గుజరాత్ రాజస్థానులతోనూ వ్యాపారం చేస్తారు.
    కశింకోట ప్రభువు అటువంటి పెద్ద వ్యాపారుల దగ్గర చిక్కుపడి పోయినాడు యిది రెండోకంటికి తెలియకుండా కాపాడుకుంటున్నాడు.
    రామరాయుడు నిజాయితీ వున్న ప్రభువు. శాంతిని కాంక్షించేవాడు ఆ బుద్ధులే మల్లమ్మదేవికి కూడా అంటినాయి. యుద్దమంటే యిష్టం వుండదు. తన రాణీతనంలో వున్న రాజ్యం యింకా విస్తృతం కావాలన్న కోరిక వుండదు. ప్రశాంతమయిన జీవితంమీద దృష్టి నిలుస్తుంది.
    "అక్కా, యీ పూట గుర్రపుస్వారీ యెగగొట్టినట్లేనా?" అని అడిగింది జగ్గమాంబ రోజూ గుర్రపుస్వారీ చెయ్యాలి రాచబిడ్డలు.
    మల్లమ్మ చెల్లెలిని వెంటపెట్టుకుని గుర్రపుస్వారి చెయ్యవచ్చింది. అడవిలోకి చాలదూరం పోయారు. చీకటి పడిందికూడా గుర్రాలకు విశ్రాంతి యివ్వటంకోసం క్రిందికి దిగారు.
    "అక్కా యీ అడవి పండువెన్నెలలో యెంతో అందంగా వుంది కదూ!" అని అక్క దగ్గరగా వచ్చింది జగ్గమాంబ.
    "ఆ అందం చాటున అతి క్రూరమయిన మృగాలుకూడా వుంటాయి. అందానికి పరవశించి ఒళ్ళు మర్చిపోతే అవి మనల్ని భోంచేస్తాయి, పద పోదాం" అంది మల్లమ్మ. చెల్లెలికి చిరుకోపం వచ్చింది.
    "నువ్వు యెప్పుడూ యింతే! కన్పించేదానిని వదిలేసి దాని వెనుక వున్న అర్ధాలను వెతుకుతావు నాకు యిక్కడే కాస్సేపు వుండాలని వుంది" అంటూ రాగం తీసింది జగ్గమాంబ. మల్లమ్మ ఒప్పుకోక తప్పలేదు.
    "అక్కా, యేదయినా సంగతులు చెప్పు."
    "ఏం చెప్పమంటావు?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS