చెన్నపట్టణం నుంచి ఆరోజు ఉదయానికి తెనాలికి నా పేర వేలకొలది గులాబిపూలు వచ్చే ఏర్పాట్లు చేశాను. చుట్టుప్రక్కల గ్రామాలనుంచి బుట్టలు బుట్టలు మల్లెమొగ్గలు వచ్చేటట్టు చూచినాను. అనేక రకాలైన పళ్ళు చెన్నపట్నం నుంచి వచ్చినవి. చబుల్ దాసునుండి నగల ప్యాకెట్టు వచ్చినది. నూట యాభై రూపాయల బెంగుళూరిచీర జిలుగులు తళుకులున్న వికుసుంబాపువ్వు వంన్నెకలది కొన్నాను. దానిమ్మ పూవురంగు పట్టురవిక కుట్టించాను.
మా పురోహితుడు పెట్టిన ముహూర్తం పదినిమిషా లుందనగా శకుంతలను ఆ చీర పసుపు పెట్టి కట్టుకొమ్మన్నాను. ఆ రవిక తొడుక్కోమన్నాను. మా గదిలో తూర్పువైపు గోడదగ్గిర కమలపుపట్టు వేశాను. ఆ పీట పైసరిగ పూలపట్టు రూమాలు పరచినాను, దానిపై వేయి గులాబిపూవులు చల్లినాను. ఆ పీటపై శకుంతలను కూర్చోమన్నాను.
'' ఇదేమిటండీ?''
'' శకూ, నేను చెప్పినట్లు చెయ్యి , దీనిలో ఒక పరమార్థముంది. అది తర్వాత చెప్తా!''
శకుంతల వెరగుపడిన చిరునవ్వుతో ఆ పీటలమీద కూర్చున్నది. ఆమె మోము కోలనైనది. స్నిగ్ధమై, మెత్తనై, కమల కుట్మలాలైనవి ఆమె చెక్కిళ్ళు. వెడదలై, సోగలై, నల్లని పొడుగాటి రెప్పలు కరిగిన వామె కన్నులు. సమంగా వచ్చి చిట్టచివర సెలయేటి వంపు తిరిగిన దామె ముక్కు. పల్చనై, వెడల్పు తక్కువైన కనకాంబర పూపుటము లామె ముక్కు పుటములు. కుడిముక్కు పుటాన ఏడురవ్వల బేసరి ఉంది. పై పెదవి పై భాగము ఒత్తుగా వికసించైన కాశ్మీర కుసుమ క్షేత్రంలా ఉంది. మధ్య నొక్క చిన్న పాలయేరులా ఉంది. ఉదయించే సూర్యుని పై అంచు వంపుకు, అందాలు దిద్దే పై పెదవి రేఖకు రెండు వంపుటంచులు. ఆ పైపెదవి సూర్యకిరణాలు ప్రసరించిన పాలసముద్రపు వీచిక. వీచికల తాకుడుచే మధింపబడి, తేరిన వంపు వెన్నె రేఖపై అరుణకిరణాలు ప్రసరించిన క్రింద పెదవి, కొంచం విడివడిన ఆ రెండు పెదవుల మధ్య, తఱిమెన పట్టిన ఆణిముత్యాల వరుస ఆమె పళ్ళు. వసంతకాలపు మధ్యాహ్నాలమాల ఆమె పళ్ళు వరుస. పాలసంద్రంలోని సహస్రకమలముకుళ మామె చిబుకము.
ఆకసపు లోయలోని స్వర్ణది ఆమె కంఠము. ఆమె బుజాలు ఉదయ సాయంకాలాలు. లోకంలోని మధురాలు సేకరించి, కరిగిన బంగారులో ఒలికించి, పోతపోసి, మొనలుతేల్చి, ఆ మొనలపై స్విన్నత నందిన సరస్వతీ కంఠహారసోణ రత్నాలు పొదిగినవి ఆమె ముగ్ధవక్షోజాలు. ప్రాణముపోసి కొన్న బంగారువర్ణం ఆమె దేహకాంతి, శిల్పుల తపఃఫలం ఆమె రూపం.
ఆమెను పూజించాను.ఆమెకు షోడశోపచారాలు అర్పించాను. మల్లె పూలు వర్షము కురిపించాను. గులాబిపూలు ధారలు కట్టాను. మాలతీ జాజీ మాధవీ పుష్పాలు దోసిళ్ళర్పించాను. ఆణిముత్యాలు గుప్పిట సేసలు చల్లాను. నగల అర్పణలిచ్చాను. ఆమె ఎదుట మోకరిల్లాను. మృదులాలై, సౌందర్య శ్రీలు చెన్నారే, ఆమె చిన్నారి పాదాలు నా హృదయాన్ని చేర్చుకొని ఫాలానా అదుముకొని ప్రతివేలు, పాదము యావత్తూ తనివోవ ముద్దు పెట్టుకొన్నాను.
ఆమెను సువ్వున పూలమాలలా యెత్తి నా హృదయాని కద్దుకొని, తీసుకొనిపోయి, మా తల్పం మీద పరుండబెట్టాను. ఆమె వివశయై ఈ లోకంలో లేదు. ఆమె మోము దివ్య కాంతులు ప్రసరిస్తున్నవి. '' శకుంతలా! శకుంతలా!'' అని భయముతో, డగ్గుత్తికతో పిలిచాను. ఆమె చైతన్య రహితయై మారు పలకలేదు. '' శకుంతలా! శాకుంతలా!'' అని అస్పష్టంగా వణికిపోతూ, నా కన్నుల నీరు జల జల వర్షిస్తుండగా పిలిచాను.
ఆమె చిరునవ్వు నవ్వుతూ కన్నులు తెరిచింది. బంగారు వెన్నెల కిరణాలైన ఆమె చేతులు రెండూ నావైపు చాచి '' నేను మీ పూజకు తగుదునా ప్రాణేశ్వరా!'' అన్నది.
'' నా సర్వస్వము, నా తపస్సు, నా జన్మాశ్రయం, నీ పాదాల మ్రోలకాదా శకూ!''
'' ఈ కల వినండి! మీరు పూజించగానే, నేనో గంధర్వ బాలికనై ఒక విమానంలో ఎగిరి వెడుతున్నానట. '' నా ప్రాణేశ్వరుడేడీ'' అని దిక్కులు చూస్తూ వణికిపోతూ విమానంమీద కూర్చున్నాను. ఆ విమానం తిన్నగా చంద్రలోకం పోయిందట. అక్కడ ఓ కలవపూవుపై నామూర్తే పవళించి నిదురపోతూన్నదట. నేను వెళ్ళగానే ఆమూర్తి పెదవులు కదిపి '' నేను పూర్ణరూపాన్ని. నువ్వు నాలోసగం. పూర్తిగా మన తపఃఫలాన్ని నువ్వెలా అనుభవిస్తావు?'' అన్నదట! భయపడి ఆమె పాదాలమీద వాలానట. ఇంతట్లో మీరు '' శకుంతలా!'' అని దూరాన్నుంచి నన్ను పిలిచినారు, విని కూడా లేవలేకపోయాను. మళ్ళీ మీ పిలుపు వినబడింది. లేచాను. ఇంతలో నాకు మెలకువ వచ్చింది. నాకు చాల భయం వేసిందండీ.!''
'' శకుంతలా! నువ్వు లేవకు, తలగడపై చెయ్యి ఉపధానం చేసుకొని పడుకో! నీ మీద నా పాట నీకు అంకితం ఇవ్వాలి, నీవు రాణివి, నేను నీ కవిని.
'' ఓ దేవీ! నీ దివ్యజన్మకే
నాడు సర్వస్వమ్ము ఇత్తునో!
నా జన్మ,నా బ్రతుకు, నా కలలు
ఏ జీవితాద్భుత రహస్య మ్మొ
ప్రత్యక్ష మొనరింపవచ్చేనో
ప్రజ్వలిత మొనరింపవచ్చేనో!
ఆ దివ్య సిద్ధియే నీవునై
ఆ దివ్య మోక్షమే నీవునై
నీ పరమ పాదాబ్జముల నేను!
నీ పవిత్ర హృదయాన నేను.''
అని పాడి, మంచముకడ మోకరించి, పరుపు అంచుననున్న ఆమె పాదాలపై నా మోము నంచినాను. ఆమె లేచి నా చేతులు రెండును పట్టి తనకడకు లాగుకొని, నీరు తిరుగు కన్నులు వాన వెలిసిన చంద్రకాంతిలా మెరిసిపోవ, నా మోము చూస్తూ '' మీరు నా దేవుళ్ళు, నా సర్వస్వమూ మీలోని భాగం, మిమ్ము మీరు పూజించుకొంటారా? మనం ఇద్దరం కలిసి పూర్ణ రూపం అవుతాము. ఆ పూర్ణపురుషునిలోని దివ్యత్వం మీరు, నేను మానవత్వాన్ని, నేను మిమ్ము పూజించాలి. అదే కాదూ, సీతా, సావిత్రీ మొదలైన వాళ్ళు చెసిందీ? అదే నిజం!'' అన్నది.
