Previous Page Next Page 
వసుంధర కథలు-14 పేజి 31

 

                                     4
    "అప్పుడే వెళ్ళిపోతానంటే ఎలా? మీరాకతో మా యింటికి సందడి వచ్చింది. కనీసం మరో రెండ్రోజులుండాలి " అన్నాడు సీతాపతి -- పెళ్ళి చూపులైన మర్నాడు!
    "మీరంత అభిమానంగా అడుగుతుంటే మాకూ ఉండాలనే ఉంది. కానీ అబ్బాయుండనంటున్నాడు ..." అన్నాడు రాం కుమార్ తండ్రి.
    "పాపం -- అతనికిక్కడ కాలక్షేపం కావడం లేదనుకుంటాను.... ఈ వీధిలోనే నా స్నేహితుడి కొడుకున్నాడు. అతడు భలే సరదా మనిషి. ఒకసారి అల్లుడికి పరిచయం చేస్తాను....' అన్నాడు సీతాపతి.
    రాం కుమార్ అసలు బాధ వేరు. వారం రోజులు గడువు పూర్తీ కాగానే అతడు వెంకటేశ్వర్లును కలుసుకుని - "నన్ను వెతుక్కుంటూ వచ్చే అమ్మాయిని తప్ప నేను ప్రేమించలేను. నా తెలివందుకంగీకరించడం లేదు . ఆమె ప్రియుడెవరో వెతికి మీ కప్పగించి ఒక జంట మధ్య విలన్ గా మారడానికి కూడా నా తెలివి అంగీకరించలేదు. వేరేవ్వరినో గాడంగా ప్రేమించిన యువతి మనసును నా వైపు తిప్పుకోవాలను కోవడం తెలివి కాదు. నన్నలాంటి పనికి ప్రోత్సహించిన మీ వద్ద ఉద్యోగం చేయడమూ తెలివి కాదు - ' అని చెప్పి ఉద్యోగానికి రాజీనామా యివ్వలనుకున్నాడు.
    అప్పుడు వెంకటేశ్వర్లు రాం కుమార్ వంటి సమర్దుడిని పోగొట్టుకున్నందుకు విచారిస్తాడు. రాం కుమార్ని ఉద్యోగంలో కొనసాగమని బ్రతిమాలుతాడు.
    రాం కుమార్ తన తెలివిని నిరూపించుకుంటాడు. కానీ వెంకటేశ్వర్లిచ్చె ప్రతిఫలాన్ని మృదువుగా తిరస్కరిస్తాడు.
    అప్పుడు వెంకటేశ్వర్లు ముఖ భావాలు చూడ్డం కోసమైనా ఒకసారి ఆయన్ను కలుసుకోవాలని రాం కుమార్ ఆత్రుత పడుతున్నాడు. అందుకే శోభ ఆకర్షణను కూడా జయించి అక్కణ్ణించి వెళ్ళి పోవాలనుకుంటున్నాడు.
    కానీ సీతాపతి ఇంకా అంతా అనరాని బలవంతం చేశాడు. శోభ కూడా అతణ్ణి ఏకాంతంలో వేడుకుంది.
    రాం కుమార్ మనసూగిసలాడుతోంది.
    వారం రోజుల తర్వాత వెంకటేశ్వర్లుకి కనపడకపోతే ఆయనకు తనను మోసగాడనుకుంటాడేమో! తనపై ఆగ్రహిస్తాడెమో?
    అప్పుడు తనది కావలసిన పైచేయి ఆయనదవుతుంది అలా జరగడం అతడి కిష్టం లేదు.
    రాం కుమార్ మనోభావం తెలియని సీతాపతి అతణ్ణి తన స్నేహితుడి కొడుక్కు పరిచయం చేశాడు. అతడి పేరు కిశోర్.
    కిశోర్ మహా చొరవ మనిషి.
    "మీరు చాలా అదృష్టవంతులు. నిన్ననే నేను ఈర్నించి తిరిగి వచ్చాను. రెండు రోజుల్లో మళ్ళీ వెళ్ళి పోతున్నాను. కొత్తగా ఉద్యోగం వచ్చింది. జాయినవ్వాలి . మీరు నా కంపెనీ లభించే అదృష్టముంది --" అన్నాడు కిశోర్.
    మాటవరుసకి -- "ఎక్కడ మీ ఉద్యోగం ?" అన్నాడు రాం కుమార్.
    'అంతా అనుకోకుండా జరిగింది. ఏదో పని మీద ఆ ఊరెళ్ళాను. మా బంధువుకు తోడుగా వెళ్ళి వెంకటేశ్వర్లనే ఆయన్ను కలుసుకున్నాను. అయన నా వివరాలడిగి ఉద్యోగ మిస్తాను చేస్తావా అన్నాడు. ఆయనకు పెర్సనల్ సెక్రటరీ . నెలకు రెండువేలు జీతం ...."
    రాం కుమార్ తెల్లబోయి -- "ఆయనకు పర్సనల్ సెక్రటరీ అంతవరకూ లేరా?" అన్నాడు.
    "ఉన్నాడు. కానీ అతగాడోకసారి పొరపాటున అయన కూతురు పడక గదిలోనికి వేళ్ళాడుట. అలాంటి పొరపాటును వెంకటేశ్వర్లు సహించడు. అందుకని అతణ్ణి ఉద్యోగం లోంచి తీసేశాట్ట" అన్నాడు కిశోర్.
    రాం కుమార్ కు నోట మాట రాలేదు.
    కిషోర్ మళ్ళీ తనే ఇలా అన్నాడు - 'అయన చాలా తెలివైనవాడు. పాత సెక్రటరీ నాయన ఉద్యోగం లోంచి తీసేస్తున్నట్లు చెప్పలేదుట. పరోక్షంగా అతడి తప్పును గురించి వివరించాట్ట. ఉద్యోగం లోంచి తీసేసినపుడు మూడు నెలల జీతం ఇవ్వాలిట. తీసేస్తున్నానని చెప్పక పోయినా మూడు నెలల జీతమూ ఇచ్చేశాట్ట. బుర్రలో తెలివిన్నవాడి కేవరి కైనా విషయం అర్ధమవుతుంది. అతడికా తెలివి లేకపోతె మళ్ళీ వస్తాడట. అప్పుడతడిని నాకు చూపిస్తానన్నాడు...."
    రాం కుమార్ తేరుకుని "చాలా విచిత్రంగా ఉంది.' అన్నాడు.
    "విచిత్రమే ....ఆ వెంకటేశ్వర్లు చాలా తెలివైనవాడు. నేనడక్కుండానే పాత సెక్రటరీ వివరాలన్నీ అయన చెప్పడానికి కారణం నన్ను హెచ్చరించాలని!" అన్నాడు కిషోర్.
    'అంతే అయుంటుంది - అన్నాడు రాం కుమార్ అన్యమస్కంగా.
    "ఇంతకీ వెంకటేశ్వర్లు అంచనా నిజమవుతుందో కాదో - అయన దృష్టిలో తెలివైనవాడుగా భావించబడ్డ ఆ పాత సెక్రటరీ తెలివి తక్కువగా -- నా జాయినింగ్ డేట్ కి వస్తాడేమోనని ఆశగా ఉంది. అలాంటి తెలివితక్కువ వాళ్ళని నాకు చూడాలంటే యిష్టం! ఎందుకంటె వెంకటేశ్వర్లు వంటివాడు తన కూతుర్నిచ్చి తన సెక్రటరీ కే పెళ్ళి చేస్తాడని నమ్మేవాడుంటే అతణ్ణి నేను చూడ్డమే కాదు....వీలుంటే మీక్కూడా చూపిస్తాను ...." అన్నాడు కిషోర్.
    అతడితో మాటలు ముగిశాక రాం కుమార్ తిన్నగా తల్లి దగ్గరకు వెళ్ళి - "అమ్మా! టేలిగ్రామిచ్చి నువ్వు మహోపకారం చేశావు. నా తెలివిని నిలబెట్టావు. ఇకమీదట అన్నిటికి నువ్వు చెప్పినట్లే వింటాను. ఇక నా యజమానిని కలుసుకునే ప్రయత్నం చేయను....' అన్నాడు.
    సీతాపతి విషయం విని - "కిశోర్ చాలా సరదా మనిషి . నేను చెప్పానుగా అల్లుడు మనసు మార్చుకుంటాడని ...." అన్నాడు రాం కుమార్ తండ్రితో.
    తను వెంకటేశ్వర్లు ను కలుసుకోకుండా అక్కణ్ణించి తన సామాను తెప్పించుకోవడమెలాగా అని ఆలోచిస్తున్నాడు రాం కుమార్ .

                                   ***


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS