Previous Page Next Page 
వసుంధర కధలు -12 పేజి 32


    "రైస్ ,మిల్ ఓనర్ కోటేశ్వరరావు హత్య చేయబడ్డాడు. ఆ హత్య మనింట్లో వుంటున్న హంతకుడే చేశాడట. తనే చేశానని వాడు నాకు స్వయంగా చెప్పాడు. ఆ హత్యకు ఒకడు చూసాడని, వాణ్ణి తను చంపేయదల్చుకున్నాననీ కూడా హంతకుడు నాతొ అన్నాడు. అనంతానికి కోటీశ్వరరావుతో పరిచయముంది. అతను తరచుగా కోటేశ్వరరావు ఇంటికి వెడుతుంటాడు. బహుశా అతని హతను చూసి వుంటాడు. అందుకే ఈరోజు మనింట్లో అంతమై పోయాడు."
    'అయితే మనమూ చూశామిప్పుడు ఒక హత్య."
    'అందుకే ఈ విషయం రహస్యంగా వుంచాలి. ఎవ్వరికీ తెలియనివ్వకూడదు. తెలిస్తే అనంతానికి పట్టిన గతే మనకూ పట్టవచ్చు " అన్నాడు జనార్దనం.

                                    8
    'చెల్లాయ్ పాత దుప్పట్లు పోయాయి. ఈరోజు నా గదిలో కొత్త దుప్పట్లు మార్చాలమ్మా" అన్నాడు హంతకుడు.
    "మీ చెల్లాయ్ కి జ్వరం వచ్చింది" అన్నాడు జనార్దనం.
    హంతకుడి ముఖంలో కంగారు కనబడింది. అతను చటుక్కున ఒక అడుగు ముందుకు వేసి ఆమె నుదుటి మీద చేయి వేసి 'అరె నుదురు కాలిపోతోంది. వెంటనే డాక్టర్ని పిలుచుకురా బావా!" అన్నాడు.
    "అవును నేనూ" ఇప్పుడే లేచి తలుపులు తీశాను. నువ్వు వచ్చావు" అన్నాడు జనార్దనం ముక్తసరిగా.
    "రాత్రి కూడా బాగానే వుంది. ఇంతట్లో ఏమయింది . ఏమైనా చూసి జడుసుకుందేమిటి?" అన్నాడు హంతకుడు.
    జనార్దనం ఉలిక్కిపడి హంతకుడి కళ్ళలోకి చూశాడు. అతని కళ్ళలో అనుమానమూ, సన్నని ఎరుపు జీర కనపడుతున్నాయి. 'అబ్బే అటువంటిదేమీ లేదు. అయినా ఈ యింట్లో జడుసుకుందుకే ముంది -- నువ్వు తప్ప!" అన్నాడు.
    'అదే అదే నన్ను కానీ , నా...." అర్ధాంతరంగా ఆగాడు హంతకుడు.
    "నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకు వస్తాను. పని మనిషి వస్తే ఈలోగా కాస్త గిన్నెలు వేసి పెట్టు" అన్నాడు జనార్దనం.
    డాక్టరు వచ్చి చూసి కంగారు పడవలసిందేమీ లేదని దేనికో భయపడినట్లు కనబడుతోందనీ అన్నాడు. డాక్టరు మాటలు విన్నాక హంతకుడి కళ్ళలో మరింత అనుమానం కనబడడం చూసి కలవరపడ్డాడు జనార్దనం. ఏదో టాబ్లెటిచ్చి డాక్టరు వెళ్ళిపోయాక "రాత్రి మీకేదైనా కేక వినబడిందా?" అనడిగాడు హంతకుడు.
    "నాకు ఒళ్ళు తెలియని నిద్ర పట్టేసింది. ఏ కేకలూ వినలేదు. ఏమలా అడుగుతున్నావ్?" అన్నాడు జనార్దనం ఎరగనట్లుగా.
    "ఏమీలేదు. నిద్రలో కలవరించడం నాకు బాగా అలవాటు. ఒకోసారి పెద్ద పెద్ద కేకలు కూడా పెడుతుంటానట. అలాంటి దేదైనా విని చెల్లాయ్ భయపడిందేమోనని ...." అన్నాడు హంతకుడు.
    "లేదన్నయ్య అలాంటి కేకలు నా చెవుల పడవు. నాది మరీ మొద్దు నిద్ర" అంది సీత.  
    "బావా మీ యింటి నుంచి నది ఒడ్డుకు రిక్షా ఏం తీసుకుంటాడు?" అనడిగాడు హంతకుడు.
    "ఎందుకు?" జనార్దనం అడిగాడు.
    "ఓ రిక్షా బేరమాడి పెట్టాలి. నేనూ ఒక ట్రంకు పెట్టి ఉంటాయని చెప్పు. ఓ పావలా డబ్బులు ఎక్కువైనా ఫరవాలేదు. ఈరోజు మళ్ళీ సాయంత్రం దాకా రాను" అన్నాడు హంతకుడు.
    అతను వెళ్ళడం చాలా అవసరమని తోచి తక్షణం పరుగెత్తుకు వెళ్ళాడు జనార్దనం. క్షణాల మీద రిక్షా కుదుర్చుకుని కూడా వచ్చాడు.
    హంతకుడు, జనార్దనం కలిసి ట్రంకును మోసి రిక్షాలో పెట్టారు. మోయడం చాలా కష్టమయింది. అది చాలా బరువుగా వుంది. రిక్షా వెళ్ళిపోయాక జనార్దనం భర్య దగ్గరకు వచ్చి ఆమె పొట్ట మీద చేయి వేసి చూశాడు. ఇంకా వేడిగానే ఉందామె ఒళ్ళు.
    "జడుసుకున్నావా సీతా!" అన్నాడతను.
    "ఏమోనండీ రాత్రి శవాన్ని చూసేక నాకు చాలా భయం కలిగిన మాట నిజం. జడుసుకున్నానని అనుకోలేదు" అంది సీత.
    "ఎలాగైనా హంతకుడు మనకు చాలా ప్రమాదకారిలా గున్నాడు. వీడితో మనకు క్షణక్షణగండమే వీణ్ణి బయటకు పంపడానికేదైనా ఉపాయం పన్నాలి. అదీ తిరుగులేనిది" అన్నాడు జనార్దనం.
    "ఏమో వీణ్ణి వదుల్చుకోగలమని నాకు నమ్మకం కలగడం లేదు" అంది సీత భయంగా.
    "ఈరోజుకి ఆఫీసుకు సెలవు పెట్టేస్తాను. హంతకుడేలాగూ సాయంత్రం వరకూ రాడు. వాడొచ్చేలోగా మనం మంచి పధకం వేయాలి" అన్నాడు జనార్దనం. అతనాప్యాయంగా భార్య కళ్ళలోకి చూస్తున్నాడు.
    అ సమయంలో ఎవరో యింటి తలుపు తట్టారు. జనార్ధనం వెళ్ళి తలుపులు తీశాడు.
    "నమస్కారమండీ జనార్దనం గారు మీరేనా?" అనడిగింది తలుపు తట్టినామే.
    "అవునండి , మీరెవరు ?"
    "నా భర్త పేరు అనంతం. నిన్న రాత్రి అయన మీ ఇంటికని బయల్దేరారు. తను రాత్రికి రాననీ, బహుశా అక్కణ్ణించి అలాగే ఏదైనా అర్జంటు పని మీద పొరుగూరు వెళ్ళవచ్చుననీ అలా అవసర పడే పక్షంలో ఉత్తరం రాసి మీ యింట్లో ఇచ్చి వెడతానని చెప్పారు" అందామె.
    జనార్దనం క్షణం ఆలోచించాడు. ఆమె కేమని చెప్పాలి? అనంతం హత్య చేయబడ్డాడన్న నిజం ఆమెకు తెలియకూడదు. తెలిస్తే తను చిక్కుల్లో పడతాడు. నిజం చెప్పాలంటే అర్ధరాత్రి వేళ చావుకేక విని లేచి వెళ్ళిచూడకపోతే అసలు అనంతం తనింటికి వచ్చినట్లే తెలిసుండేది కాదు.
    'అనంతమంటే ఎవరో నాకర్ధం కాలేదు."
    "మీరు తనకు క్లబ్బులో పరిచయమయ్యారని చెప్పారాయన...."
    జనార్దనం క్షణం ఆలోచించినట్లు నటించి "ఓహో ఆ అనంతమా! అతను నాకు బాగా తెలుసు. కాని రాత్రి అతను మా యింటికి రాలేదే?" అన్నాడు.
    అనంతం భార్య దెబ్బతిన్నట్లు కనబడింది. "న=ఏమన్నారూ? అయన మీ యింటికి రాలేదూ?" అంది.
    "రాలేదండీ " అన్నాడతను.
    ఆ విషయాన్నీ దృవపరచుకుని ఆమె వెళ్ళిపోయింది. జనార్దనం తలుపులు వేసి భార్య దగ్గరకు వెళ్ళాడు. జరిగింది చెప్పాడు. ఇద్దరం అనంతం భార్యను తల్చుకుని జాలిపడ్డారు.
    "పాపం ఆవిడకు భర్త పోయినట్లు తెలియదు, యెంత కాలమూ ఎదురు చూసృందో అతని కోసం --" అంది సీత.
    'హంతకుడసాధ్యుడు బహుశా అనంతం గురించి ఏవిధమైన ఆచూకీ బయట పడనివ్వడనుకుంటాను" అన్నాడు జనార్దనం.
    సీత ఉలిక్కిపడింది. "అనంతం హత్య చేయబడ్డట్లు తెలిసిన వాళ్ళం మన మిద్దరమే -- ఆ విషయం హంతకుడికి తెలిసిందంటే ...."
    "సీతా నాకో ఆలోచన తడుతోంది" అన్నాడు జనార్దనం. "హత్య కళ్ళబడిన కారణంగా నీకు జ్వరం వచ్చింది. జ్వరానికి బదులు నీకు చాలా పెద్ద జబ్బు చేసిందనుకో , నిన్నేదైనా నర్సింగ్ హోం లో చేర్చాలనుకో అప్పుడు మనం చెప్పకుండానే హంతకుడు తనకు తనే ఇల్లు వదిలి వెడతాడు ."
    "కానీ, నాకు పెద్ద జబ్బు చేయలేదు. అది మన దురదృష్టం" అంది సీత.
    "సీతా నా వెర్రి సీతా!" అన్నాడు జనార్దనం "నీకు జబ్బు చేయనవసరం లేదు .అలా నటిస్తే చాలు.'
    "నటనా?" అంది సీత కంగారుగా.
    'అవును, అంతకు మించి ఉపాయం వేరే కనబడ్డం లేదు" అన్నాడు జనార్దనం.
    "సాయంత్రం హంతకుడు వచ్చిన గంటకు నువ్వు మెలికలు తిరిగిపో. దారుణమైన బాధ నభినయించు. నేను నిన్ను నర్సింగ్ హోమ్ లో చేర్చే ఏర్పాట్లు చేస్తాను" అన్నాడు జనార్దనం.
    తర్వాత అతను నెమ్మదిగా పనులు చేసుకోసాగాడు. పక్క వీధిలో టెలిఫోన్ బూత్ లోంచి కంపెనీకి ఫోన్ చేసి తను ఆఫీసుకు రావడం లేదని చెప్పాడు.
    సీత జ్వరం మధ్యాహ్నానానికి దిగిపోయింది. భోజనం చేసేయవచ్చు నని డాక్టర్ చెప్పినప్పటికీ ఆ పూటకు బ్రెడ్ తీసుకుందామె ఎందుకైనా మంచిదని.
    సాయంత్రం హంతకుడు సుమారు అయిదు గంటల ప్రాంతంలో వచ్చాడు. అతడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. వస్తూనే అతను సీత యోగ క్షేమాలు విచారించాడు. ఆమె జ్వరం తగ్గిపోయినందుకానందాన్ని వ్యక్తపరిచాడు.
    'చాలా ఉత్సాహంగా కనబడుతున్నావ్?" అన్నాడు జనార్దనం.
    "అవును ఒక సమస్య తీరిపోయింది. మరో కొత్త బేరం తగిలింది....' అన్నాడు హంతకుడు.
    'బెరమంటే ?" అనుకున్నాడు జనార్దనం తనలో బహుశా మళ్ళీ ఎవరికో మూడి వుండాలి. పాపం ఆ దురదృష్టవంతుడెవరో ?" అతనికి అనంతం గుర్తు కు వచ్చాడు.
    "ఉదయం మా ఇంటి కోకామే వచ్చింది. తన భర్త పేరు అనంతం అని చెప్పింది. అనంతం నాకు క్లబ్బు స్నేహితుడు. అతడు రాత్రి నా యింటికని బయల్దేరి మళ్ళీ తిరిగి ఇల్లు చేరలేదట. ఏమైనా తెలుసునేమో అడుగుదామని వచ్చింది" అన్నాడు జనార్దనం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS