Previous Page Next Page 
వసుంధర కధలు -12 పేజి 31

   
    "ఏం జరిగింది ?' జనార్దనం కంగారుగా అడిగాడు.
    జరిగింది చెప్పడం హంతకుడు ముగించే సరికి సీత వచ్చి, "పోరుగింటావిడతో కబుర్లు చెబుతున్నాను. మీరు వచ్చినట్లే తెలియలేదు" అంది.
    "మధ్యాహ్నం మనింటికి సి.ఐ.డి వచ్చేడా?" అనడిగేడు జనార్దనం.
    "వాడు సి.ఐ.డి ఏమిటీ బావా -- ఎవడో దొంగ వెధవ. అయినకాడికి లకించుకుందామని వచ్చాడు. నేనుండడంతో వాడి ఆటలు సాగలేదు" అన్నాడు హంతకుడు.
    జనార్దనం హంతకుడి వంక ఆశ్చర్యంగా చూసి, "నీకు భయంగా లేదూ, ఒక వేళ వాడు నిజంగా సి.ఐ.డీ ఎమోననీ! వాడు సి.ఐ.డి అయుంటే నువ్వు పట్టుబడే అవకాశా లింకా పెరిగి పోయినట్లు లెక్క!" అన్నాడు.
    హంతకుడు నవ్వి, "వాడెవరో , ఎందుకోచ్చాడో నాకు వివరంగా తెలుసు!" అన్నాడు.
    "టిఫినేం చేయమంటారు?" అంది సీత.
    "ఈరోజు నీవంట చవి చూశాను చెల్లాయ్! నువ్వాడగక్కర్లేదు ఏం చేసినా బాగానే వుంటుంది" అన్నాడు హంతకుడు.
    "పకోడీలు వేస్తాను" అని ఇద్దరి వంకా అనుమతికోసం చూసి అక్కణ్ణించి వెళ్ళిపోయింది సీత.
    "ఎవరంటావు వాడు?" కుతూహలంగా అడిగాడు జనార్దనం.
    "నిజంగా తెలియకుండానే అడుగుతున్నావా" అదోలా అన్నాడు హంతకుడు. "సరే - అయినా అడిగావు కాబట్టి చెబుతున్నాను. వాడు నువ్వు నన్ను బెదరగొట్టాలని పంపిన మనిషి..."
    'అబద్దం" అన్నాడు జనార్దనం వెంటనే, కానీ, అతని ముఖంలో భయం స్పష్టంగా కనబడుతోంది.
    "బుకాయించవద్దు అన్నీ నేనూహించగలను. నిన్న నేను మీ యింట్లో మకాం పెట్టాను. ఈరోజు మీ ఇంట్లో హంతకుణ్ణి వెతుక్కుంటూ సి.ఐ.డీ వచ్చాడు. వెంటనే గ్రహించాను నేను - నీ పనయుంటుందని . సి.ఐ.డీ ల కనుమానం తగిలిందని తెలిస్తే, బెదిరిపోయి పారిపోతాననుకున్నావు కానీ, నేను నువ్వుహించిన రకం మనిషిని కాదు" హంతకుడు ఆగి, "నేను మొదట్లోనే నిన్ను హెచ్చరించాను. నన్ను రెచ్చగొట్టడం ప్రాణాలతో చెలగాటమేనని" అన్నాడు.
    జనార్దనం మరింత భయపడ్డాడు. అతను నెమ్మదిగా, "పొరపాటయింది" అన్నాడు తల వంచుకుని.
    'పొరపాటున ఉప్పు పాలలో పడితే, విరిగిన ఆ పాలను మళ్ళీ అతికించడం కష్టం. పొరపాటున విషం మింగితే, పోయిన ఆ ప్రాణాలింక తిరిగి రావు. నా విషయంలో పొరపాటు చేయడం అంతకంటే ప్రమాదకరం. అయినా నీ మొదటి తప్పును క్షమించాను. ఎటొచ్చీ ఇంక క్షమించను."
    జనార్దనం తల వంచుకునే, "నేను వివరాలేమీ చెప్పలేదు. మా ఇంటికి వెళ్ళి ఈ మాటలు చెప్పి రమ్మన్నాను. మా యింట్లో హంతకుడున్నాడని అతనికి చెప్పలేదు" అన్నాడు.
    "మంచిది, లలితారాణి మనిషికి అంతకంటే ఎక్కువ సమాచారం మివ్వడం మంచిపని కాదు!" అన్నాడు హంతకుడు.
    ఆశ్చర్యంగా చూశాడు జనార్దనం అతని వంక - ఎవరితను? అన్ని వివరాల నెలా సంపాదించగల్గుతున్నాడు?

                                     7
    "వాడు మీరు నియమించిన మనిషా? వాడు బాకు తీసేసరికి నాకెంత భయం వేసిందో చెప్పలేను. సమయానికి మన అతిధి ఆపద్భాంధవుడిలాగోచ్చాడనిపించింది" అంది ఆశ్చర్యంగా సీత.
    "హంతకుణ్ణి కదిలించుకుందామని నేను వేసిన మొదటి ప్లాను భగ్నమైంది. అతను నన్ను చాలా తీవ్రంగా హెచ్చరించాడు. ఇలాంటి పొరపాటు మళ్ళా జరిగితే ప్రాణాలు దక్కవని చాలా గట్టిగా చెప్పాడు" అన్నాడు జనార్దనం నిట్టురుస్తూ.
    "ఇంక మనం వాడి జోలికి వెళ్ళవద్దండీ. హంతకుడయినప్పటికీ మనిషి మంచి వాడిలా కనిపిస్తున్నాడు. ప్రవర్తన కూడా మెచ్చుకోదగ్గ విధంగా వుంటోంది -- తనేవరైతే నేం - ఏం చేస్తేనేం - మన జోలికి రాననంత వరకు వాడి జోలికి మనమూ వెళ్ళవద్దు" అంది సీత.
    'అవుననుకో , కానీ ఇంట్లో తిరుగుతున్న పాము ఏదో ఒకరోజున మననీ కాటు వేయదని నమ్మకమేమిటి?" అన్నాడు జనార్దనం.
    'అది నిజమే కానీ, వాడసలు పామే కాదేమో! నిజంగా సి.ఐ.డి యేమో, ఆ పేరుతొ వుండడం ఇష్టం లేక, హంతకుడన్న పేరుతొ వుండదల్చుకున్నాడేమో! మనిషిని, మనిషి ప్రవర్తననూ గమనిస్తుంటే ఏదో సదుద్దేశ్యంతో మనింట్లో మకాం పెట్టినట్లుంది తప్పితే మరో విధంగా అనిపించడం లేదు నాకు" అంది సీత.
    జనార్దనం ఆశ్చర్యంగా భార్య ముఖంలోకి చూసి, "మొత్తానికి హంతకుడు అసాధ్యుడేలాగున్నాడు. నిన్ను బుట్టలో వేసుకున్నాడు" అన్నాడు.
    భార్యాభర్తలిద్దరూ రాత్రి పన్నెండు గంటల వరకు మెలకువగానే వున్నారు. ఇంట్లో ఉన్న హంతకుడు వాళ్ళకు మన స్థిమితం లేకుండా చేశాడు. దాంతో వాళ్ళకు నిద్ర పట్టడం లేదు. టైము పన్నెండయ్యే సరికి ఇంక లాభం లేదని మాట్లడుకోవడం మానేసి ఇద్దరూ కళ్ళు మూసుకున్నారు. కానీ, యిద్దరికీ నిద్ర వచ్చే సూచనలు కనబడలేదు.
    ఉన్నట్లుండి జనార్ధనానికి ఒక ఆర్తనాదం , చావుకేక లాంటిది వినబడింది. చటుక్కున సీత అతనికి మంరింత దగ్గరగా జరిగింది. "నీకూ వినిపించిందా ఆ కేక?" అన్నాడు జనార్దనం.
    "మీరూ మెలకువగానే వున్నారా?" అంది సీత.
    'ఊ....ఆ కేక మనింట్లోంచే వచ్చింది. ఒకసారి లేచి చూద్దామా?" అన్నాడు జనార్దనం.
    "వద్దండీ " అంది భయంగా సీత.
    జనార్దనం లేచాడు. "ఏమిటో చూడాల్సిందే -- నీకు భయంగా వుంటే నువ్వు రాకు ."
    'అమ్మో - ఒక్కర్తీనీ భయం నాకు, నేనూ మీతో వస్తాను" అంది సీత.
    ఇద్దరూ లేచారు కానీ , గదిలో లైటు వేయలేదు. చప్పుడు కాకుండా తమ గది తలుపులు తీశారు....
    హంతకుడి గది తలుపులు బార్లా తెరిచి వున్నాయి. గదిలో మంచం మీద ఒక మనిషి వెల్లకిలా పడి వున్నాడు. అతని గుండెల్లో కత్తి దిగబడి వుంది. ఆ ప్రాంతమంతా ఎర్రగా వుంది. మనిషి అప్పటికే చచ్చినట్లున్నాడు. ఎక్కడా చలనం లేదు. హంతకుడు గదిలో లేడు.
    సీత వణికిపోతోంది. జనార్దనం ఆమె వీపు నిమిరాడు. కంగారు పడవద్దన్నట్లుగా . అంతలో యిద్దరికీ అడుగుల చప్పుడు వినపడి చీకట్లో కి తప్పుకున్నారు.
    హంతకుడు దొడ్డి వైపు నుంచి గదిలోకి వచ్చాడు. అతను శవాన్ని పరీక్షగా చూసి తృప్తిగా నిట్టూర్చాడు. మనిషి ముఖంలో కసి కనబడుతోంది. చూడ్డానికతనిప్పుడు భయంకరంగా వున్నాడు.
    హంతకుడి గదిలో ఇప్పుడొక ట్రంకు పెట్టె వుంది. హంతకుడు దాని మూత తెరిచాడు. అది చాలా పెద్దదైన పెట్టె. ఖాళీగా వుంది. హంతకుడు శవాన్ని సమీపించాడు. కాళ్ళు ముడవడానికి ప్రయత్నిస్తున్నాడు.
    ఇంక అక్కడుండటం ప్రమాదమని తోచింది జనార్ధనానికి. అడుగుల చప్పుడు కాకుండా వారిద్దరూ అక్కణ్ణించి నెమ్మదిగా తమ గదిలోకి జారుకున్నారు. గది తలుపు వేసుకుని మంచం మీద పడుకున్నాక, "నాకు చాలా భయంగా వుంది" అంది సీత.
    "భయపడకు, హంతకుడి అసలు స్వరూపం చూశావిప్పుడు నువ్వు -- నేనెప్పుడో ఊహించాను" అన్నాడు జనార్దనం.
    "అ మనిషెవరో పాపం - మనింటి కేప్పుడోచ్చాడో " ఎందుకొచ్చాడో -- ఇక్కడిలా అర్ధంతరంగా చావాలని రాసి పెట్టి వుంది " అంది సీత.
    "నా అభిప్రాయంలో - హంతకుడే అతన్ని మనింటికి పిల్చుకు వచ్చి వుండాలి " అన్నాడు జనార్దనం.
    "అంటే హంతకుడికి బాగా తెలిసినవాడై వుండాలి!" అంది సీత.
    "హంతకుడికే కాదు, ఆ చనిపోయిన మనిషి నాకు తెలుసు!" అన్నాడు జనార్దనం. అతని కంఠం బాధగా వుంది.
    "ఎవరండీ అతడు!" కుతూహలంగా అడిగింది సీత.
    "అతని పేరు అనంతం. చాలా చలాకీ అయినవాడు. అప్పుడప్పుడు నాకు క్లబ్బులో కలుస్తుండేవాడు. అనంతానికి హంతకుడితో పరిచయమేలాగో మాత్రం నాకు తెలియదు...." అన్నాడు జనార్దనం.
    "పేపర్లలో హత్యల గురించి చూడ్డమే కానీ, ఇలా కళ్ళెదుట ఒక హత్యను చూస్తానని అనుకోలేదు" అంది సీత, ఆమె ఇంకా వణుకుతున్నదని స్పర్శ ను బట్టి, మాటలను బట్టి జనార్దనం గ్రహించాడు.
    జనార్దనం భార్యను దగ్గరగా లాక్కుని, "జాగ్రత్త! మనకేం భయం లేదు. కానీ, ఈ హత్యను చూసీ చూడనట్లు పొరపాటున కూడా ఎవ్వరికీ తెలియకూడదు ముఖ్యంగా హంతకుడికి ..."
    "ఏం?" అంది సీత.
    "హత్య చూసినవాళ్ళెవ్వరూ బ్రతికి బయట పడడం హంతకుల కిష్టముండదు" అన్నాడు జనార్దనం. అతను హటాత్తుగా ఉలిక్కిపడ్డాడు. 'ఓహ్ - అందుకే యితన్ని చంపెశాడేమో కూడా" అన్నాడు.
    సీత కర్ధం కాలేదు , "ఏమిటండీ మీరనేది?" అంది. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS