Previous Page Next Page 
వసుంధర కధలు -12 పేజి 33

 

    "ఆమెకు నీ ఇల్లెలా తెలుసు?" అనుమానంగా అడిగాడు హంతకుడు.
    "మా ఇంటి నుంచి అనుకోని పనితగిలితే పొరుగూరు వెళ్ళాల్సి వుంటుదని అలా జరిగే పక్షంలో ఒక ఉత్తరం మా ఇంట్లో ఇచ్చి వెడతానని చెప్పాడట. బహుశా భర్త ఆమెకు చిరునామా యిచ్చి వుంటాడు---" అన్నాడు జనార్దనం.
    "ఏం చెప్పావ్ నువ్వు ?"
    'అనంతంతో నాకు కాస్త పరిచయమున్న మాట నిజమే కాని, మా ఇద్దరికీ ఒకరిళ్ళ కొకరు వెళ్ళేటంత పరిచయాలు లేవు. రాత్రి నాకు తెలిసినంత వరకూ మా ఇంటి కెవ్వరూ రాలేదని చెప్పాను. నిరుత్సాహంగా వెళ్ళిపోయింది. చాలా జాలి కలిగిందామేను చూస్తె నాకు."    
    హంతకుడు తెలుగ్గా నిట్టూర్చాడు. "అనంతానికి నీతో పని లేదు. కానీ నాతో పని వుంది. అతను నీ యింటికని బయాల్దేరాడు. కానీ, నీ ఇంటికి రాలేదు. మధ్యలోనే పొరుగూరు వెళ్ళిపోవలసి వచ్చింది. నేనే స్వయంగా అతన్ని పంపేశాను. వెళ్ళేముందు తన భార్యకో ఉత్తరమిచ్చాడు. అదామెకు నేనీ రోజు మధ్యాహ్నం అందజేసాను."
    ఇద్దరూ అవీ ఇవీ కబుర్లలో ఉండగా లోపల్నుంచీ ఆర్తనాదం లాంటిది వినపడింది. జనార్దనం తో పాటు హంతకుడు కూడా లేచాడు. కంగారుగా లోపలకు ప్రవెశించారిద్దరూ. లోపల మంచం మీద సీత కడుపు పట్టుకుని మెలికలు తిరిగిపోతోంది. వీళ్ళను చూస్తూనే "బాధ భరించలేక పోతున్నాను. కడుపులో నొప్పి" అంటూ అరిచినట్లు చెప్పింది.
    హంతకుడు కంగారుగా "బావా నువ్వు చెల్లాయ్ దగ్గరుండు నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకు వస్తాను " అన్నాడు.
    "నువ్వే వుండిక్కడ మా ఫామిలీ డాక్టర్ని పిలుచుకు వస్తాను...." అన్నాడు జనార్దనం.
    "నువ్వెందుకులే బావా చెల్లాయ్ కి నువ్వు పక్కనుంటే ధైర్యంగా వుంటుంది. ఫామిలీ డాక్టరు అడ్రసివ్వు. క్షణాల మీద తీసుకువస్తాను" అన్నాడు హంతకుడు.
    "లేదు నేను వెడితే కానీ ఈ సమయంలో అయన రాడు. పేషెంట్లతో చాలా రద్దీగా వుండే సమయమిది" అన్నాడు జనార్దనం. అతని బాధ వేరు, సీత జబ్బు గురించి ఫామిలీ డాక్టరు కి కాస్త వివరించాలని అతననుకుంటున్నాడు.
    కానీ హంతకుడు వినలేదు. "ఏం మనిషివి నువ్వు బావా అవతల చెల్లయలా అవస్థ పడుతుంటే నీకు కాళ్ళూ చేతులూ ఎలా ఆడతాయి. డాక్టరెందుకు రాడు. రివాల్వర్ చూపించినా లాక్కోస్తాను. నీకా భయం లేదు" అంటూ సమాధానం కోసమైనా ఎదురు చూడకుండా వీధిలోకి పరుగెత్తాడు. అతని వెనుకనే వెళ్ళి వీధి తలుపులు వేసి భార్య దగ్గరకు వచ్చి తల పట్టుకున్నాడు జనార్దనం.
    "అతను వెళ్ళడమే మంచిదయింది. లేకపోతే డాక్టర్ వచ్చేదాకా ఇలా నటించడం నావల్లనయ్యేది కాదు" అంది సీత.
    "చాలా బాగుంది నువ్వో గంట నటన గురించి ఆలోచిస్తున్నావ్, కానీ ఈ హంతకుడ్ని వదిలించుకునే ఓ గొప్ప అవకాశం పోయిందని నాకు బాధగా వుంది."
    'అలా భయపడకండి. డాక్టర్ వచ్చేక పక్కకు వెళ్ళి విషయం చెప్పండి."
    "అందుకీ హంతకుడు అవకాశమిస్తాడని నాకు తోచడం లేదు" అన్నాడు జనార్దనం.
    హంతకుడు డాక్టర్ని తీసుకురావడానికి గంట కూడా పట్టలేదు. డాక్టర్ కంగారుగా "ఏమైంది మిస్ సీతాదేవి!" అన్నాడు.
    సీత నానా అవస్థ నూ నటిస్తూ "కడుపులో బాధ డాక్టర్ గారూ భరించలేక పోతున్నాను. ఈ బాధ భరించే కంటే ప్రాణం పోయినా బాగుండుననిపిస్తోంది అంది.
    "నోనోనో - అలా ప్రతిదానికి అసహనం కూడదు" అంటూ డాక్టర్ సీతను పరీక్ష చేశాడు. అయిదు నిమిషాల అనంతరం డాక్టర్ జనార్దనం వంక చూసి "జ్వరం తగ్గిపోయింది. ఒంట్లో ఏమీ అనారోగ్యమున్నట్లనిపించలేదు. ఇంక నాకు ఒక్కటే అనుమానం మిగిలింది. నేను లైటు గా మీల్సు తీసుకోమన్నాను. జిహ్వ చాపల్యం కొద్దీ కాస్త స్ట్రాంగ్ గా పుడ్ తీసుకుని ఉండాలి" అన్నాడు.
    "నాకు తెలిసినంత వరకూ సీత బ్రెడ్ తప్ప ఇంకేమీ తినలేదు. హార్లిక్స్ తప్ప మరేమీ తాగలేదు" అన్నాడు జనార్దనం.
    "ఏమైనప్పటికీ కంగారెమీ లేదు. ప్రస్తుతానికి తత్కాలికోప శాంతి కలిగించి , నిద్ర పట్టేలా మందిస్తాను. ఉదయానికేమీ కంగారు లేకపోతె ఇంక నా దగ్గరకి రావలసిన అవసరం లేదు" అన్నాడు డాక్టర్.
    "ఏమీ ప్రమాదం లేదంటారా డాక్టర్ సీతది చాలా డెలికేట్ బాడీ. దేనికీ తట్టుకోలేదు. ఉదయం జ్వరం వచ్చింది, సాయంత్రానికి కడుపు నొప్పి వచ్చింది. మళ్ళీ రాత్రికి ఏమవుతుందోనని భయంగావుంది. కొన్ని రోజుల పాటు మీ నర్శింగ్ హోమ్ లో ఉంటె మంచిదేననిపిస్తోంది." అన్నాడు జనార్దనం.
    "వ్వాట్! కడుపు నొప్పికి నర్సింగ్ హోమా భలే కంగారు మనుఘులండి మీరు" అని నవ్వి "పోనీ మీకంత భయంగా వుంటే నాకేమీ అభ్యంతరం లేదు" అన్నాడు డాక్టర్.
    జనార్దనం తృప్తిగా నిట్టూర్చి "నామనసిప్పుడు తేలిగ్గా ఉంది" అన్నాడు.
    హంతకుడు కలగజేసుకుని "ఇలాంటి చిన్న చిన్న వాటికి నర్సింగ్ హోమ్ లో చేర్చడం మనిషి ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదు. పది రోగుల మధ్య వుంటే ఆరోగ్యం గా వున్న మనిషి క్కూడా జబ్బు పడ్డ అనుభూతివచ్చేస్తుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణములో ఉంటె మరే ఇబ్బంది ఉండదు" అన్నాడు.
    "కానీ, కాస్త కనిపెట్టి చూసుకునేవారు కావాలి గదా....అవసరమైన వెంటనే డాక్టర్ రావాలి గదా" అన్నాడు జనార్దనం.
    "చెట్టంత అన్నగారిని నేనున్నాను. ప్రాణప్రదంగా చూసుకునే భర్తవు నువ్వున్నావు. పిలిస్తే పలికే దేవుడి లాంటి డాక్టరీయనున్నాడు. ఇప్పుడు సీతకు వచ్చిన లోటేముంది? అంతగా అనుక్షణం కనిపెట్టుకు చూసేవారు కావాలనుకుంటే నాకు తెలిసిన లలితారాణి అనే నర్స్ ఒకామె వుంది. ఆమెను పిల్చుకు వస్తాను" అన్నాడు హంతకుడు.
    "జనార్దనం తడబడ్డాడు. అతని నోరు మూతపడింది.
    డాక్టరు "మీ బావగారి మాటలు నిజం. అలా జరిపిస్తే బాగుంటుంది" అన్నాడు.
    జనార్దనం మౌనంగా తలూపాడు.
    ఆ రాత్రి అతడు భార్యతో, "ఈ హంతకుడు అసాధ్యుడు. వీణ్ని వదుల్చు కోవడం మనకు సాధ్యపడేలా లేదు. మనకింకే నర్సూ అవసరం లేదు. రేపటికి నీ కడుపు నొప్పి పూర్తిగా తగ్గిపోవాలి" అన్నాడు.

                                     5
    "ఈరోజు రాత్రి నేను బయట భోజనం చేస్తాను" సాయంత్రం ఆరు గంటలకు భార్య భార్తలిద్దరకూ చెప్పి హంతకుడు బయటకు వెళ్ళిపోయాడు.
    అతడు వెళ్ళిపోయాక దంపతులిద్దరూ హంతకుడి గురించి చర్చించుకున్నారు. ఏం చేయాలో ఇద్దరికీ పాలు పోలేదు. జరిగిన సంఘటనలు భయాన్ని కలిగిస్తున్నాయి. జరుగుతున్నా సంఘటనలు నవ్వాలో, ఏడ్వాలో తెలియకుండా చేస్తున్నాయి. జరగబోయే సంఘటన లేలా వుంటాయోనని ఉత్కాంటను కలిగిస్తున్నాయి. కానీ, తాము చేయగలిగినదేమీ లేదు. నిస్సహాయంగా చూస్తూ ఊరుకోవడమే!
    తొమ్మిది గంటల ప్రాంతంలో నిద్రపోయే ముందు "హంతకుడింకా రాలేదు, దొడ్డి తలుపు తీసి వుందో లేదో, చూసి, తీసి వుంచక పొతే అనవసరపు గొడవ" అన్నాడు జనార్దనం. ఇద్దరూ ఆ సంగతి చూడడానికి వెళ్ళారు. చూడడం మంచిదే అయింది. దొడ్డి తలుపు వేసి వుంది. గడియ తీసి ఇద్దరూ తమ పడక గదిలోకి వెళ్ళిపోయారు. హంతకుడి నింట్లోంచి పంపించేయటానికి యింకా ఏం పధకాలు వేయాలా కాసేపు చర్చించి నిద్రకు పడ్డారిద్దర్తూ.
    ఒక రాత్రి వేళ ఎవరో తలుపు తడుతున్న చప్పుడు విని గబుక్కున లేచాడు జనార్దనం. సీత అతని చేయి పట్టుకుంది. " చప్పుడు నేనూ విన్నాను. నాకేదో భయంగా వుంది. మీరు వెళ్ళొద్దు" అందామె.
    తలుపులు మరింత గట్టిగా బాదారెవరో?
    "ఫరవాలేదు - భయపడకు ' అంటూ మంచం దిగాడు జనార్దనం. దుప్పటిని లాక్కుని కప్పుకుంది సీత.
    జనార్దనం గదిలో లైటు వేశాడు. తలుపు లింకా ఎవరో బాడుతూనే వున్నారు. "ఎవరది?" గట్టిగా అన్నాడు జనార్దనం.
    "నేను " అని సమాధానం వచ్చింది. కంఠం హంతకుడిది.
    'అమ్మయ్య!" అని తేలిగ్గా నిట్టూర్చింది సీత. హంతకుడంటే వాళ్ళకు క్రమంగా భయం తగ్గుతుందనే అనుకోవాలి. అతనేలాంటి వాడైనా తమకేమీ అపకారం చేయడన్న అభిప్రాయం సీతకు కలిగింది.
    జనార్దనం వెళ్ళి తలుపులు తీశాడు. బయట హంతకుడు నిలబడి వున్నాడు. "ఇద్దరి కిద్దరే మొద్దు నిద్ర" అన్నాడు చిరాగ్గా. అతని ముఖం ప్రసన్నంగా లేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS