"అదే చెబుతున్నాను-" అన్నది రమ-"బాలా-నువ్వింక ఆశ్రమ జీవనానికి పనికిరావు. తాత్కాలికమైన సాంఘిక, ఆర్ధిక బాధలు నిన్ను ఆశ్రమానికి రప్పించాయి తప్పితే - ఆశ్రమవాసానికి తగవు నీవు. నన్ను భగవంతుడిగా భావించి నాకు నిన్ను సమర్పించుకునే స్థాయి కింకా నీవు ఎదగలేదు. పైగా నాతో పొందువల్ల నీ పవిత్రత దెబ్బతింటుందన్న భయంతో వున్నావు. ఈ విషయాన్ని నేనెప్పుడో గ్రహించాను.
ఆశ్రమానికి వచ్చే ఆదాయం చూస్తూంటే నీ కళ్ళు మెరుస్తున్నాయి. భక్తులు సమర్పించే నగలు నీలో ఆశలు రేపుతున్నాయి. నేను నిన్ను చాలా కాలంగా గమనిస్తున్నాను. నీవింక ఆశ్రమంలో ఉండడానికి వీల్లేదు-అని చిదానందస్వామి అన్నాడు. నాకు కోపం కూడా వచ్చి-నీవంటి దొంగస్వాముల ఆశ్రమాల్లో వుండడం నాకూ ఇష్టముండదు. నావంటివారిని వుంచుకునే స్థాయికి నీ ఆశ్రమం ఇంకా ఎదగలేదు-అన్నాను-"
"చాలా బాగా చెప్పావు-" అని రవి ఆమెను మెచ్చుకున్నాడు.
"అప్పుడే ఎక్కడయింది?" అన్నది రమ"-ఆశ్రమం వదిలి ఏం చేస్తావని అడిగాడు స్వామి. అవసరమనిపిస్తే ఆత్మహత్యయినా చేసుకుంటానన్నాను. అప్పుడు స్వామి మళ్ళీ దివ్య మందహాసం చేశాడు -'నా ఆశ్రమంనుంచి బయటపడిన నీకు ఆత్మహత్య అవసరమనిపిస్తే అది నాకు అవమానం. నీకు మంచి వరుణ్ణి చూస్తాను. పెళ్ళి జరిపిస్తాను. హాయిగా జీవితం గడుపుదువుగాని-' అన్నాడు నేను ఆశ్చర్యపోయాను.
రవి ఆశ్చర్యంగా వింటున్నాడు.
రమ చెప్పుకుని పోతున్నది. స్వామి నిజానికి ఆమెను వాంఛించలేదు. పరీక్షించాడు. స్వామి తలచుకుంటే రమ ఆయన్ను ప్రతిఘటించలేదు. ఆమె మనసుబట్టి ప్రతి ఘటించే శక్తి స్వామి ఆమెకు ఇచ్చాడు. ఆ తర్వాత స్వామి రమకు తన భక్తుల్లో ఒకడైన రవిబాబును సూచించాడు.
రవిబాబుకు వివాహమయింది. అతడు లేనికుటుంబం నుంచి వచ్చాడు. అతడి తెలివితేటలు, సామర్ధ్యం గుర్తించిన ఓ ధనవంతుడు అతడికి తన పిల్ల నిచ్చి పెళ్ళి చేయాలనుకున్నాడు. వధువు అనకారి. గయ్యాళి. తండ్రి బలవంతం వల్లనూ, వేరే గతిలేకనూ రవిబాబు ఈ వివాహానికి అంగీకరించాడు. వివాహమైనప్పట్నించీ రవిబాబును అసంతృప్తి బాధిస్తున్నది. గయ్యాళి భార్య అతడిని వేధిస్తున్నది. ఆ యింట్లో అందరూ అతణ్ణి. చిన్న చూపు చూస్తారు. అందుకు ఒక కారణమున్నది.
రవిబాబు అందగాడు. తెలివైనవాడు. అతడిపక్కన భార్య ప్రమీలను చూస్తే యెవరైనా జాలిపడతారు. మీదు మిక్కిలి రవిబాబు ఇప్పుడు ధనవంతుడు. అందువల్ల రవిబాబు చుట్టూ ఎందరో వలపన్నవచ్చును. రవిబాబు కూడా ప్రమీలను పెళ్ళాడి తానేదో పెద్ద త్యాగం చేశానన్న భావనలో వుండవచ్చును. అతడేమిటో, అతడి స్థానమేమిటో అనుక్షణం గుర్తుచేయడం ద్వారా రవి బాబును అదుపులో వుంచవచ్చునని ప్రమీల, ప్రమీల తండ్రి కూడా అభిప్రాయపడ్డారు. అయితే తమ ప్రవర్తన భార్యా భర్తలమధ్య ఎటువంటీ దూరాన్ని సృష్టిస్తున్నదీ వారాలోచించలేదు.
రవిబాబు ఆ యింట్లో యాంత్రికంగా జీవించడం నేర్చుకున్నాడు. మామగారివద్ద, భార్యవద్ద అతడొక బంధువులాకాక జీతానికి కుదిరిన ఉద్యోగిలా ప్రవర్తించే వాడు. అలా రెండు సంవత్సరాలు గడిచాయి. రవిబాబుకో కొడుకు కూడా పుట్టాడు. వాడి బారసాల యెంతో ఆర్భాటంగా జరిగింది. ఆ వేడుకలో కూడా రవిబాబు ప్రాముఖ్యత ఏమీలేదు. అతడి గురించి ఎవరూ పట్టించుకోలేదు. సమయానికి పీటలమీద కూర్చున్నాడు. అంతే! అతడి మామగారి మనుమడిగా, ప్రమీల కొడుకుగా మాత్రమే రవిబాబు కొడుకు గుర్తించబడుతున్నాడు.
ఈ సమయంలో ఆ పట్టణంలో చిదానందస్వామి అడుగుపెట్టాడు. రవిబాబు వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నాడు. చిదానందస్వామి అతడి కథను విని జాలిపడ్డాడు. ఆయన అతడికి రమ గురించి చెప్పాడు.
"జీవితంలో అసంతృప్తి అన్నది వుండకూడదు. యాంత్రిక జీవనం మనిషికీ పశువుకూ భేదం లేకుండా చేస్తుంది. మనిషి మనిషిలా బ్రతకాలి. అందుకే నువ్వు నీ బంధాలు తెంచుకుని రమతో ఎక్కడికైనా వెళ్ళిపో! భగవంతుడి అవతారంగా నేను చెబుతున్నాను. రమ నిన్ను మనిషిని చేస్తుంది. నీ జీవితానికి సార్ధకతను కలిగిస్తుంది-" అని ఆయన రవిబాబుకు చెప్పాడు.
ఇది జరిగి కొద్ది నెలలయింది. రవిబాబు రమతో కలిసి వెళ్ళిపోవడానికి మానసికంగా సిద్దపడడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అతడికి భయంగా వున్నది. ఆ భయంలో బంధాలు లేవు. స్వార్ధం ఉన్నది.
భార్యపైగానీ, పుట్టిన బిడ్డపైగనీ, పుట్టబోయే బిడ్డపై గానీ రవిబాబుకు మమకారంలేదు. ప్రమీలను పెళ్ళి చేసుకోమని ఎప్పుడైతే శాసించారో-అప్పట్నించీ అతడికి తల్లిదండ్రులపైనా మమకారం పోయింది. అతడు రమతో స్నేహం ఆరంభించాడు. ఆశ్రమంలో ఇద్దరూ యెవరికీ తెలియకుండా రహస్యంగా కలుసుకుంటున్నారు. ఆ ఏర్పాటు చాలా పకడ్భందీగా వున్నది.
రవిబాబు యోగాభ్యాసం పేరిట ఆశ్రమంలోని ఓ గదిలోకి వెడతాడు. ఆ గదిలోకి రమ మరో దారిన వస్తుంది.
రమ రవిబాబుకు వచ్చింది. ఆమెలో అందం, ఆకర్షణ, తెలివి-అన్నీ వున్నాయి. ప్రమీలను చూసిన కళ్ళకు ఆమె మరీ అద్భుత సౌందర్యవతివలె కనబడుతున్నది.
కొన్నాళ్ళు గడిచేసరికి రమ అతడికి వ్యసనంలా పరిణమించింది. రోజు కొక్కసారైనా ఆమెను కలుసుకుని మాట్లాడకపోతే వుండలేకపోతున్నాడు.
చిదానందస్వామికి అయిదారు పట్టణాలలో ఆశ్రమాలున్నాయి. ఆయన సంవత్సరంలో ఒకో ఆశ్రమానికింత కాలమని నిర్ణయించి సంచారం చేస్తూంటాడు. ఆయన ఆశ్రమాలకు చాలా మంచి పేరున్నది. రవిబాబు చిదానందస్వామి ఆశ్రమానికి వెళ్ళడం ప్రమీలకూ, ఆమె తండ్రికీ కూడా వచ్చింది.
రవిబాబుకు రమతో కలిసి ఎక్కడికైనా వెళ్ళి పోవాలని వున్నది. కానీ తను పట్టుబడితే?
అందుకు మంచి ఉపాయం కావాలి. తను ఏ విధంగానూ పట్టుబడని విధంగా పారిపోవాలి.
"రమా! నువ్వు చెప్పినదంతా విన్నాక-స్వామినే ఉపాయం అడగడం మంచిదనిపిస్తోంది-" అన్నాడు రవి.
