Previous Page Next Page 
వసుంధర కధలు -9 పేజి 32

 

                                   3
    "ఎవరూ?' అంది రాజేశ్వరి.
    జవాబుగా మరోసారి తలుపు చప్పుడయింది.
    రాజేశ్వరి చిరాగ్గా తలుపు దగ్గరకు వచ్చి డోర్ వ్యూ లోంచి చూసింది. బయట ఉన్న వ్యక్తీ ఆమెకు సుపరిచితుడే. సందేహించకుండా తలుపు తీసి, "ఆయనింట్లో లేరండీ ఆనంద్ గారూ" అంది.
    ఆనంద్ నవ్వుతూ - "నాకు తెలుసు....' అన్నాడు.
    రాజేశ్వరి కంగారు పడుతూ -- "బహుశా ఈరోజుకు రానన్నారు. వారం పది రోజుల దాకా రాకపోయినా ఆశ్చర్యం లేదన్నారు....' అంది.
    ఆనంద్ ఇంకా నవ్వుతూనే , "అసలు రాకపోయినా ఆశ్చర్య పోనవసరం లేదు" అన్నాడు.
    రాజేశ్వరికి అర్ధం కాలేదు. అదోరకంగా అతని వంక చూసింది. అయితే ఆమె చూపులతో కలిసిన అతని చూపులు రోజులా లేవు. ఎదోలాగున్నాయి.
    తన భర్త మిత్రుడి గా ఒక మంచి మనిషి గా ఆనంద్ ఆమెకు తెలుసును. ఆ మంచి మనిషి చాలా పర్యాయాలు తనింటికి రావడం జరిగింది కానీ ఈరోజు చూస్తున్న చూపులు చూడడం ఇంతవరకూ ఇదే ప్రధమం.
    ఆనంద్ నవ్వు నాపి - "ఒక విధంగా నేను చాలా అదృష్ట వంతుడి ననుకుంటాను...."
    రాజేశ్వరి మౌనంగా వింది కానీ మాట్లాడలేదు. అతని అదృష్టం గురించి తెలుసుకోవాలని కూడా ఆమెకు కుతూహలంగా లేదు. ఆనంద్ చెప్పుకుపోతున్నాడు.
    అందాన్ని ప్రేమించడం మగవాడి అలవాటు. అందమైన ఆడది ఎవరో ఒక మగవాడి సొత్తు కావడం సంప్రదాయం. ఆపైన ఆ ఆడదాన్ని అడదాన్నిగా చూడడం మరో మగవాడి తప్పు. తప్పులు చేయకపోవడం ఆనంద్ బలహీనత. ఈ కారణంగా అతనింతకాలమూ తన మనసు హరించుకు పోయిన రాజేశ్వరి ని దూరాన్నించి చూస్తూ గుటకలు మింగుతూ వచ్చాడు. కానీ ఈరోజు ఆ అవసరం తప్పిపోయింది.
    సంభాషణ ఈ రకంగా సాగడం నచ్చకపోయినా "ఎందువల్ల?' అనడిగింది రాజేశ్వరి.
    "నీ భర్త అసలు రంగు ఈరోజు బయట పడింది...." అన్నాడు ఆనంద్.
    రాజేశ్వరి ఉలిక్కిపడి - "అంటే?" అంది.
    "రంగారావు నిన్ను చంపాలను కుంటున్నాడు. ఈ రాత్రికే నిన్ను హత్య చేయడానికి ఏర్పాట్లు చేశాడు. అది తెలియడం తోనే నా మనసుండబట్టలేదు. నిన్ను దక్కించుకుని పారిపోవాలను కుంటున్నాను...." అన్నాడు ఆనంద్ త్వరగా.
    'అయన నన్ను చంపడ మెందుకూ?" అంది ఆశ్చర్యంగా రాజేశ్వరి.
    'అతను మకాం మార్చదలుచుకున్నాడు. ఇక్కడ అతనికి చాలా కష్టంగా ఉన్నట్లుంది. విశాఖపట్నం లో ఒక మధ్య తరగతి అమ్మాయిని పెళ్ళాడాలని నిశ్చయించుకున్నాడు. అక్కడ మళ్ళీ కొత్త జీవితం ప్రారంభిస్తాడు. అందుకోసం నిన్నంతం చేయదల్చుకున్నాడు."
    "నేను నమ్మను...."
    "నమ్మకపోతే ఈ రాత్రికే చస్తావ్. నమ్మితే ఇప్పుడే నాతొ వచ్చేయ్. ఈ ఊరు వదిలిపోదాం....:" అన్నాడు ఆనంద్.
    "నేను రాను. అయన మీద నాకు నమ్మకముంది. చావంటే నాకు భయం లేదు....: అంది రాజేశ్వరి.
    'అయితే నేను వెడుతున్నాను. కానీ కాస్త జాగ్రత్తగా ఉండు...." అని వెళ్ళిపోయాడు ఆనంద్.
    
                                    4
    రాజేశ్వరి ఆశ్చర్యపడింది. ఎవరో తన నోట్లో బలవంతంగా ఏదో పొడి వేశారు. తన రెండు చేతులు కట్టి వేయబడి ఉన్నాయి. నోరు మూసేశాడు. గిలగిలా తన్నుకున్నా ఏమీ ప్రయోజనం కనపడలేదు. ఆమె కన్నులు మూతపడుతున్నాయి. ఆలోచనాశక్తి నశిస్తోంది. అలా ఆమె అచేతనంగా ఉండి పోయింది.
    ఆమెకు మెలకువ వచ్చేసరికి ఎవరో తలుపు తడుతున్నారు. కదలడానికి ప్రయత్నించిందామె. చేతులు ఫ్రీగానే ఉన్నాయి. చటుక్కున మంచం మీంచి లేచి - పడక గది కిటికీ తలుపులు తీసింది. గదిలోకి బాగా వెలుతురూ వచ్చింది.
    "బాగా పొద్దెక్కిందన్నమాట -" అనుకుందామె.
    ఎవరో ఇంకా తలుపులు బాదుతున్నారు - "ఆ ఆ " అంది రాజేశ్వరి. తలుపులు బాదడం ఆగింది.
    త్వరగా బట్టలు సవరించు కుందామె.
    అప్పుడే ఆమె మంచం మీదున్న ఒక కాగితాన్ని చూసింది. అది పక ఉత్తరం. రంగారావు నన్నిటి ఉదయం బయటకు వెళ్ళేటప్పుడు జేబులో పెట్టుకున్నాడు. ఇప్పుడింట్లో కి ఎలా వచ్చింది? అంటే అయన రాత్రి ఇంటికి వచ్చారన్న మాట.    
    ఖచ్చితంగా అయన వచ్చి ఉండాలి. ఎందుకంటె కిటికీ తలుపులతో సహా అన్నీ తలుపులూ తను బంధించేసింది. వీధి తలుపు దగ్గరగా వేస్తె ఆటోమేటిక్ గా వేసుకుపోయే మోడల్. ఒక తాళం ఎప్పుడూ తన బొడ్లో నూ. మరో తాళం అయన జేబులోనూ ఉంటుంది. ఆ తాళం లేకుండా ఎవరైనా ఇంట్లోకి రావడం అసాధ్య మని చెప్పవచ్చు.
    మళ్ళీ తలుపుల మీద చప్పుడు. రాజేశ్వరి పరుగులాంటి నడకతో అక్కడకు వెళ్ళింది. తలుపు తీసేటప్పుడామే గమనించింది. గుమ్మం దగ్గర పడి వున్న తాళాల గుత్తిని.
    అది రంగారావు తాళాల గుత్తి. హడావుడిలో రంగారావు వెళ్ళేటప్పుడు దీన్ని గుమ్మం దగ్గర పారవేసుకున్నాడన్నమాట.
    లోపలకు ఆనంద్ వచ్చి "అమ్మయ్య క్షేమంగానే ఉన్నవన్న మాట. ఆఫ్ కోర్స్ అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసినప్పుడు క్షేమంగా ఉండకపోతే ఏమవుతావులే" అన్నాడు.
    "నువ్వనేదేమీ నాకర్ధం కావటం లేదు" అంది రాజేశ్వరి.
    "రంగారావు నన్ను విషం అడిగాడు. ఎందుకంటె కారణం చెప్పాడు. అలాగేనని నేను విషానికి బదులు మత్తు మందు లాంటి దిచ్చాను. నామీద అతనికి బాగా నమ్మకముంది. అది నీ నోట్లో వేసి నువ్వు చచ్చావనుకుని ఇంట్లో ఉన్న విలువైనవన్నీ ఇందులోనే ఉన్న రహస్య స్థలం లోకి మార్చేసి వుంటాడు. నాలుగైదు రోజుల దాకా ఇక్కడికి రాడు. ఆ తర్వాత వచ్చి మొసలి కన్నీళ్లు కార్చి నెమ్మదిగా తన డబ్బు తీసుకుని ఈ ఊరు వదిలేస్తాడు . అది కధ."
    రాజేశ్వరి కళ్ళు ఎర్రబడ్డాయి. తనమీద ఇంత మోసాన్ని తలపెట్టినందుకు భర్త మీద ఆమెకు విపరీతమైన కోపం వచ్చింది. ఆనంద్ తృప్తిగా ఆమె ముఖభావాలు చదువుతూన్నాడు.
    "ఇంత అన్యాయమా? కట్టుకున్న భార్యను..." ఆవేశంలో ఆమెకు నోట మాట రాలేదు.
    "ఇందు కొక్కటే ప్రతీకారం. ఏదో వంక చెప్పి ఈరోజే మనమీ ఇల్లు ఖాళీ చేసేద్దాం. ఇంట్లో ఉన్న విలువైన వసువు లేక్కడున్నది నీకు తెలిస్తే అవి తీసుకుని రంగారావు కనుక్కోలేని చోటికి వెళ్ళిపోదాం. నీవు నా ఆరాధ్య దేవతవు. ఇద్దరం హాయిగా జీవితం గడిపి వేద్దాం. నా అన్న వాళ్ళెవరూ ఇంక నాకూ లేరు. నీకూ లేరు. ఒకరికొకరం తోడుగా ....."
    "పద. ముందు రహస్య స్థలంలోని వస్తువులు తీసుకుందాం" అంది రాజేశ్వరి. రాత్రి ఓ ఆగంతకుని చేతిలో ప్రాణ భయంతో గిలగిలలాడడం తలచుకుంటే  ఆమె ఆపాదమస్తకము వణికిపోతోంది. ఆనంద్ తనని ప్రేమించి రక్షించి ఉండకపోతే ఈపాటికి తనెక్కడ ఉండేది!
    ఆనంద్ ఊహలు వేరుగా వున్నాయి. రాత్రి రాజేశ్వరికి స్పృహ తప్పించాక అతను వజ్రాల గురించి ఇల్లంతా వెదికాడు. ఎక్కడా ఏమీ దొరకలేదు. అవి ఎక్కడో రహస్య ప్రదేశంలో దాచబడి ఉండాలని అతనికి తోచింది. ఎలాగూ తనకు ప్రయోజనం లేని తాళాలతను రాజేశ్వరి అనుమానాలను పెంచేటందుకు వీలుగా వీధి గుమ్మం వద్ద పడవేశాడు. ఇప్పుడు రాజేశ్వరి కా రహస్య స్థలం తెలుసునంటోంది కాబట్టి వనిత, విత్తం రెండూ దొరికినట్లే భావించాలి.
    గోడలోకే ఉన్న ఓ అల్మారా అట్టడుగులా కనబడుతున్నది --- నిజానికి ఒక ప్రత్యేకమైన అర. అందులో ఉన్న వస్తువులు చూస్తుంటే ఆనంద్ కి కళ్ళు చెదిరిపోయాయి. ఆ అస్తువుల నుంచి దృష్టి మరల్చి రాజేశ్వరి వంక చూస్తె అతనికి కళ్ళు మళ్ళీ చెదిరాయి.
    అతనామెను చటుక్కున కౌగలించుకోబోగా, ఆమె వారించి "ఉష్ ఇప్పుడు కాదు" అంది.

                                  5
    "చాలా పెద్ద ట్రంకు తెచ్చావ్ , దేనికి?" --- అంది రాజేశ్వరి.
    "ఇది మునుపు మనముండే ఊరి నుంచి తెచ్చాను. ఇది వరలో దీని రంగు వేరే వుండేది. ఇప్పుడు కొత్త రంగు వేయించాను. ఎలా ఉంది?
    "బాగానే ఉంది కానీ రంగు మర్పించడం దేనికి? దీన్నా ఊర్నించి తీసుకు రావల్సినంత అవసరమే మొచ్చింది?" అంది రాజేశ్వరి.
    "పాత రంగు పాడయిందని కొత్త రంగు వేయించాను. ఒకసారి షాపులో రంగు వేయమని ఇచ్చాక అది మళ్ళీ మనం కలెక్ట్ చేసుకోకపోతే ఎలా. అందుకని ఆ ఊరు వెళ్ళి ట్రంకు తీసుకుని వచ్చాను ...." అన్నాడు ఆనంద్,
    "చాలా బాగుంది. మనిషి పట్టేంత ఉంది..." అంది రాజేశ్వరి దాని సైజు చూసి ఆశ్చర్యపడుతూ.
    ఆనంద్ దానిని పడక గదిలోకి తీసుకు వెళ్ళాడు. అక్కడ మంచం కింద తోసేసి, "ఈ పెయింట్ కల కాలముంటుందని ఆశిస్తున్నాను. దీన్ని వాడాలని నాకు లేదు. వాడితే మళ్ళీ రంగు మార్పించాలి గదా" అన్నాడు రాజేశ్వరి తో.
    "బాగుంది. వాడినప్పుడల్లా రంగు మార్చాలేమిటి?" అంది రాజేశ్వరి. అతని వంక అదోలా చూస్తూ. అతడు చటుక్కున రాజేశ్వరి ని దగ్గరగా లాక్కుని -- " మార్పులో అందముంది రాజూ. చీర మార్చినప్పుడల్లా ఓ కొత్త అందం నీలో కనిపిస్తుంది." అన్నాడు.
    తన్మయంగా కళ్ళు మూసుకుంది రాజేశ్వరి. ఆమెకు ఆనంద్ నచ్చాడు. అతను నిజంగానే ఆమెను అరాదిస్తున్నాడు. రంగారావు తన పట్ల చాలా బాధ్యతలు నిర్వర్తించేవాడు కాదు.
    ప్రస్తుతం రాజేశ్వరి కి రోజులు బాగా వెళ్ళిపోతున్నాయి. బయటకు కనపడకపోయినా చీకూ చింతా లేకుండా ఏ బాదరబందీ లేకుండా దర్జాగా జీవితం వెళ్ళబుచ్చుతున్నారిద్దరూ . ప్రస్తుతం వాళ్ళు విశాఖపట్నం లో ఉంటున్నారు. వాళ్ళుంటున్న ఇంట్లో అలమారాలో రంగారావు చేసిన విధంగానే ఒక రహస్యపు అర ఏర్పాటు చేసుకున్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS