Previous Page Next Page 
వసుంధర కధలు -9 పేజి 31

 

                       రంగు మారిన ట్రంకు పెట్టె

                                                                         వసుంధర

    "సూర్యం -- నీ గది తాళాలు కావాలిరా.' అన్నాడు ఆనంద్.
    "ఎందుకు?"
    "చిన్న పనుంది. మళ్ళీ సాయంత్రానికి నీకందేలా చూసే బాధ్యత నాది...."
    బాగా జనం రద్దీ ఉండే వీధి నానుకుని ఉన్న ఓ ఇరుకు సందులో ఉంటున్నాడు సూర్యం. ఆ సందులో పెద్ద రద్దీ ఉండదు.
    సూర్యం బ్రహ్మచారి. ఉదయం తొమ్మిది గంటల కిల్లు వదిలిపెడితే మళ్ళీ రాత్రి ఏడు గంటలకే ఇల్లు చేరతాడతను. అతను పనిచేసే ఆఫీసు ఉదయం పది నుంచి సాయంత్రం అయిదు వరకూ ఉంటుంది. అందుకే ఆ టైములో గది తాళాల అవసరం లేదు.
    'అలాగే కానీ, ఆ టైములో ఏ ఆడపిల్ల నీ గదికి తీసుకు వెళ్ళకు. ఏదో పరువుగా బ్రతుకుతున్నాను....' అన్నాడు సూర్యం.
    "ఛా -- ఏం చేసినా నీ పరువు పోయే పని చేస్తానా?" అన్నాడు ఆనంద్.
    సూర్యం దగ్గర తాళాలు తీసుకుని అతను తిన్నగా బజారుకు వెళ్ళాడు. కాస్త పెద్ద సైజు ట్రంకు కొన్నాడు. ఆ తర్వాత ప్లాస్కు ఒకటి కొన్నాడు. దాని నిండా కాఫీ పోయించాడు.
    వాటితో సూర్యం గదికి వెళ్ళాడు. అన్నీ లోపల పెట్టాడు.
    గది గోడలోకి ఉన్న అలమారా తెరిచాడు. అందులోంచి ఒక కప్పు , సాసరు తీశాడు. అతని జేబులో ఏవో ట్యూబు లాంటిది ఉంది. దాన్ని నొక్కితే - వచ్చిన పేస్టును కాప్పు అడుక్కి రాశాడు. ఒక పర్యాయం కప్పులోకి పరీక్షగా చూశాడు. ఏమీ తెలియడం లేదు, సాసరు మీద కప్పు బోర్లించాడు.
    ఆ తర్వాత బాత్రూం లోకి వెళ్ళి పేస్టు తగిలిన వ్రేలికి --చేతులు కూడా శుభ్రంగా కడుక్కుని బయటకు వచ్చాడు.
    గదంతా పరిశీలించి చూశాడు. తృప్తిగా నిట్టూర్చాడు. బయటకు వచ్చి గది తలుపులు తాళం వేశాడు.

                                   2
    "ఈవేళ నాక్కాస్త అర్జంటు పనులున్నాయి. ఇంటికి రాకపోయినా కంగారు పడవద్దు. అవసరపడితే ఊరు దాటి వెళ్ళినా ఆశ్చర్యం లేదు. సాధ్యమైనంత వరకూ రాత్రి కింటికి వచ్చేయటనికి ప్రయత్నిస్తాను...." అన్నాడు రంగారావు.
    'అలవాటే కదా. వెళ్ళి రండి.' అంది రాజేశ్వరి.
    రంగారావు కి వూళ్ళో చిన్న ఫ్యాన్సీ దుకాణముంది. కానీ నిజాని కతని అసలు వ్యాపారం అది కాదు. అతడు స్మగ్లర్. టేపు రికార్డర్ల దగ్గర్నుంచి వజ్రాల దాకా అన్ని రకాల వస్తువులూ అతని ద్వారా స్మగుల్ అవుతుంటాయి. కానీ ఈ సంగతి మాములుగా గ్రహించడం కష్టం. అతనిది సామాన్యమైన ఫ్యాన్సీ షాపు.
    రంగారావు సామాన్యుల మధ్య అతి సామాన్యంగా జీవిస్తున్నాడు. అతని ఆస్తి కనీసం కొన్ని లక్షలుంటుంది. కానీ అంతా నల్ల ధనం, దానిని తెల్లబర్చడానికి -- ఎవరి కైనా లాటరీ వస్తే ఎక్కువ డబ్బిచ్చి కొందామని చూస్తున్నాడు-- ఇంకా అలాంటి అవకాశం రాలేదతనికి.
    రాజేశ్వరి చాలా అందంగా ఉంటుంది. భర్త చేసే వ్యాపారం ఆమెకు తెలిసినా , ఆమె నోట్లో నువ్వు గింజ నానింది. ఆదాయ రీత్యా భర్తంటే ఆమెకు ఇష్టమే. ప్రమాదాలున్నా ఫరవాలేదని ఆమె అనుకొంటోంది కానీ భర్త ప్రమాదంలో ఇరుక్కునేలోగాతన నల్లదనం తెల్లగా మరాలని అమే కోరుకుంటోంది.
    "రంగారావింట్లోంచి బయటపడి వీధిలోకి వచ్చాడు. వీధిలోంచి బజారు దారి పట్టాడు. అతను బజార్లో నాలుగడుగులు వేశాడో లేదో అతని భుజం మీద ఎవరిదో చేయి పడింది. వెనక్కు తిరిగి చూసి "నువ్వా ఆనంద్-" అన్నాడు.
    ఆనంద్ రంగారావు కి తెలుసును. అప్పుడప్పుడు స్మగ్లింగ్ లో ఆనంద్ , రంగారావు కి సహాయం చేస్తుంటాడు. ఆనంద్ కూడా సామాన్యుడిలా సంచరిస్తూ ఇంకా పట్టుబడని చిల్లర నేరస్తుడు. కానీ ఇంకా అట్టే సంపాదించలేదు. ఏవో ఖర్చులు వెళ్ళి పోతున్నాయి.
    "ఎవరికో లాటరీ టికెట్ కావాలన్నావు గదా - ఎక్కువ డబ్బిచ్చి కొనుక్కుంటారన్నావు కదా -- ఆ అవకాశం వచ్చింది. నా గదికి వస్తే వివరాలు మాట్లాడుకోవచ్చు- " అన్నాడు ఆనంద్.
    "ఎక్కడ నీ గది?"
    "దగ్గర్లోనే ఉంది. పద...."
    ఇద్దరూ త్వరగా అడుగులు వేశారు. పది నిముషాల్లో సూర్యం గది వచ్చింది. ఆనంద్ జేబులోంచి తాళం తీసి గది తలుపులు తెరిచి రంగారావు లోపల వచ్చేక మళ్ళీ తలుపులు ఎసేశాడు.
    ఇద్దరూ చెరో కుర్చీలో కూర్చున్నాక -- ఆనంద్ టేబుల్ మీద ససార్లో బోర్లించిన కప్పు తీసి , అందులో ఫ్లాస్కు లోంచి కాఫీ పోశాడు. అలమారా తెరిచి ఇంకో కప్పు తీసి అందులో కూడా కాఫీ పోశాడు. అది తను తీసుకుని టేబిల్ మీద కప్పు రంగారావు కి ఆఫర్ చేశాడు.
    రంగారావు కాఫీ సిప్ చేసి, "చాలా బాగుంది. నువ్వే చేశావా?' అన్నాడు.
    "కాదు, ఎల్లయ్యా .... అన్నాడు ఆనంద్ నవ్వుతూ,
    "వాడేవాడు?"
    "భారత్ రెస్టారెంట్ సర్వర్ -- " అన్నాడు ఆనంద్.
    రంగారావు ఇంకో గుక్క తాగి నవ్వాడు. నవుతుంటే అతనికి వెక్కు వచ్చింది. తమాయించుకుని ఇంకో గుక్క తాగాడు. మళ్ళీ వెక్కు వచ్చింది.
    "కాఫీ చాలా బాగుంది. కానీ నాకే ఏదోలా గుంది." అన్న రంగారావు కు మరి మాట పెగలలేదు. అతని చేతులు వణుకుతున్నాయి. ముఖంలో ఏదో అనుమానం తొంగి చూస్తోంది.
    తను ఇంకో గుక్క కాఫీ తాగి, "ఏమయింది?" అంటూ లేచాడు ఆనంద్. అతడు రంగారావు చేతిలోని కాఫీ కప్పుతీసి బల్ల మీద పెట్టాడు.
    మరో నిముషంలో రంగారావు తలవాల్చేశాడు. ఆనంద్ చేయి చాపి అతని ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు. తృప్తిగా తలాడించాడు. రెండు కాఫీ కప్పులూ బాత్ర్రూం లోకి తీసుకు వెళ్ళాడు. కాఫీ పారబోసి శుభ్రంగా కదిగేశాడు. బాత్రూం లో కాఫీ చాయలు మిగలకుండా చేశాడు.
    ఫ్లాస్కు లో ఇంకా కాఫీ ఉంది. తాపీగా తాగేసి ఫ్లాస్కు కూడా శుభ్ర పరిచేశాడు. మళ్ళీ రంగారావు దగ్గరకు వెళ్ళాడు.
    ట్రంక్ తెరిచి రంగారావు ని జాగ్రత్తగా అందులో సర్దాడు. మళ్ళీ ట్రంక్ మూసి ఓసారి బరువు టెస్ట్ చేశాడు. 'చాలా బరువున్నాడు" అనుకుని నవ్వు కున్నాడు.
    మళ్ళీ ట్రంక్ తెరిచాడు. అతని జేబులన్నీ తడిమాడు. ఏవోకాగితాలతో పాటు తాళాలు కూడా దొరికాయి. అతని కళ్ళు మెరిశాయి.మళ్ళీ ట్రంక్ మూసేశాడు. ఓ పర్యాయం గది వంకచూశాడు. తను రాక మునుపు గది ఎలాగుందో మళ్ళీ అలా తయారు చేశాడు. ఫ్లాస్కు భిజానికి తగిలించుకుని బయట కెళ్ళాడు. తిన్నగా టాక్సీ స్టాండు కు వెళ్ళి తనక్కావలసిన వ్యక్తీ కోసం చూశాడు.
    "హలో సార్ --" అంటూ పలకరించాడు ఒకతను.
    "సింహాచలం --" అన్నాడు ఆనంద్.
    "మళ్ళీ ఏదైనా పని తగిలిందాండీ. ఇలా వచ్చారు."
    ఆనంద్ నవ్వి జేబులోంచి ఓ వంద రూపాయల నోటు తీసి సింహచలానికిచ్చి "పనంటే పనే ఓ రెండుమూడు గంటలు నీ టాక్సీ నాక్కావాలి" అన్నాడు.
    సింహాచలం నోటు అందుకుని తాళాలు తీసి ఆనంద్ చేతికి అందించాడు. వాళ్ళిద్దరికీ అది అలవాటే. ఆనంద్ నేరస్తుడని సింహచాలానికి తెలియదు. మంచివాడని, తక్కువ అవసరానికి ఎక్కువ డబ్బిస్తాడని మాత్రం అతనికి తెలుసు.
    ఆనంద్ టాక్సీ ఎక్కి నెమ్మదిగా పోనిచ్చాడు. సందు ముందు టాక్సీ ఆపాడు. సందు ఇరుగ్గా ఉన్నా టాక్సీ వెడుతుంది. కానీ కాస్త ఇబ్బంది అవుతుంది. అదీ గాక నలుగురినీ ఆకర్షించినట్లవుతుంది. నడుచుకుంటూ సూర్యం గదికి వెళ్ళి ఫ్లాస్కూ భుజానికి తగిలించుకునే ట్రంకు బయటకు తెచ్చాడు. గది తలుపు తాళం వేసేశాడు.
    ఒక్కడూ ట్రంకు మోయడం కాస్త కష్టమే అయింది. ఎలాగో అతి కష్టం మీద దాన్ని మోసుకుని టాక్సీ డిక్కీ లో వేశాడు. అతని అవస్థను రోడ్డు మీద పోతున్న ఒకరిద్దరు గమనించారు కాని అడగనిదే మనకెందుకని సాయం ఆఫర్ చేయలేదు.
    డిక్కీ మూసి టాక్సీ ఎక్కాడు. టాక్సీ స్టార్టు చేశాడు.
    పది నిముషాల్లో టాక్సీ ఊరి పొలిమేర చేరుకుంది. అక్కణ్ణించే తనకు తెలిసినట్లుగా కొత్త దారి తొక్కాడు ఆనంద్. గంటకు అరవై కిలో మీటర్ల వేగంతో సుమారు అర్ధగంట ప్రయాణం చేసి టాక్సీని  ఓ పక్కగా ఆపాడు.
    రోడ్డుకు సుమారు వంద గజాల దూరంలో ఒక పెద్ద గొయ్యి వుంది. ఆనంద్ వెళ్ళి ఆ గోతిలోకి తొంగి చూశాడు. చాలా లోతుగా ఉంది. కాకాతాళీయంగా రెండ్రోజుల క్రితం దాన్ని చూసి గుర్తు పెట్టుకున్నాడు ఆనంద్.
    టాక్సీ దగ్గరకు వెళ్ళి ట్రంకు మోసుకు వచ్చాడు. ట్రంకు లోని రంగారావు ను బయటకు లాగాడు. నెమ్మదిగా ఆ శవాన్ని గోతిలో పడవేశాడు. చాలా లోతుగా ఎక్కడో పెద్ద శబ్దమైంది.
    ఆనంద్ ట్రంకు ని దులిపి- "అమ్మయ్య ఇప్పటికి తేలికైంది - " అనుకున్నాడు. ఒక్క క్షణం తటపటాయించాడు. ఆ గోతిని మూయాలా అవసరం లేదా అని. కానీ జాప్యం చేయడం అతని కిష్టం లేదు. ట్రంకు ని మళ్ళీ తీసుకు వెళ్ళి డిక్కీలో పారవేసి టాక్సీ ఎక్కాడు.
    అతని ఊహలో ఏమాలోచనలున్నాయో చెప్పడం కష్టం. కానీ మనిషి మాత్రం చాల ఉత్సాహంగా ఉన్నాడు. అక్కడి నుంచి టాక్సీ తిన్నగా ఊళ్ళోకి వెళ్ళింది. ఒక పెయింటింగ్ దుకాణం ముందు టాక్సీ ఆపి, ట్రంకు తీసి దుకాణం లోకి తీసుకు వెళ్ళి , :ఇది కొత్త ట్రంకు పెయింట్ కొద్దిగా దెబ్బతింది. దీని మీద మరేదైనా పెయింట్ చేయగలరా?' అనడిగాడు.
    దుకాణం వాడు శ్రద్దగా ట్రంకు ని గమనించి, సాధ్యపడుతుందన్నట్లుగా తలాడించి తన దగ్గరున్న కలర్ చార్టు ఒకటి ఇచ్చాడు. ఆనంద్ ఒక రంగు సెలక్ట్ చేసుకున్నాడు.
    ఆ షాపు నుంచి ఆనంద్ టాక్సీ స్టాండు కి వెళ్ళి సింహచలానికి టాక్సీ తిరిగిచ్చేశాడు. ఆ తర్వాత సూర్యం ఆఫీసుకు వెళ్ళి అతని తాళాలు తిరిగిచ్చేశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS