"పోతురాజు పద్దతి నాకు నచ్చింది. పాపాత్ములను అతడు ఈ లోకంలోనే శిక్షిస్తాడు. ఆ విధంగా పాపులకు నరకంలో కొంత శిక్ష తగ్గుతుంది. సరే మీరు కమీషన్ లేని ఏజంటు గా అతడికి పనిచేస్తూ వుండండి. మరి మేము సెలవు తీసుకుంటాం." అంటూ శాస్త్రి అక్కణ్ణించి బైటకు దాటితీశాడు.
బైటకు వచ్చేక శర్మ - "పాపం ఆ నరసరాజు ని చూస్తె జాలేస్తోంది. ఆయనకు సాయపడదామా -" అన్నాడు.
శాస్త్రి శర్మ వైపు చిరాగ్గా చూసి - "నీకు గుర్తుందా? మనల్ని కుర్చీల్లో కూర్చోబెట్టి హింసించిన రోజున నరసరాజు ముఖం ఎలా వుంది? అపురూపమైన దృశ్యం చూస్తున్న వాడిలా గుంది? మనం కళ్ళు తిరిగి మేడలు వాల్చేస్తే అయన ఎంతో ఆనందంగా నవ్వాడు. అదే మనిషి తన మనుమడ్ని మనం బంధించామనేసరికి ప్రపంచంలోని దీనత్వమంతా సంతరించుకున్నాడు. ఎదుటి వాడి కష్టాలకు ఆనందించి, తన కష్టాలు భరించలేని వాళ్ళు మహా క్రూరులు. ఆ నరసరాజుకు పోతురాజు తగిన శిక్షే ఇస్తున్నాడు. నాకు చాలా సంతోషంగా వుంది. దేవుడు ఈ ప్రపంచంలో అన్నీ బ్యాలెన్స్ చేస్తాడు. మనం యాభయి వేలివ్వడమే నరసరాజు కో పెద్ద ఉపకారం" అన్నాడు.
తర్వాత ఇద్దరూ అప్పారావు ఇంటికి వెళ్లి ఇరవై వేలూ ఇచ్చేసి -- "మిగతాది మా బాకీ కింద, వసూలు కింద జమ కట్టుకుంటున్నాం. మీకు అంగీకారమే కదా!" అన్నారు.
"గోడకు వేసిన వెల్ల తిరిగొస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. మీరు మహానుభావులు. మీ చేతుల మీదుగా నాకు లభించిన ఈ డబ్బు మహా ప్రసాదం...." అన్నాడు అప్పారావు.
ఇద్దరూ రూం చేరుకొని కాసేపు నిద్ర పోయారు. నిద్ర లేచాక కాసేపు జరిగిన కధంతా ఒకరికొకరు చెప్పుకున్నారు. అప్పుడు శర్మ -- "అన్నట్లు నీకాకలి వేయడం లేదూ--" అన్నాడు.
'అవును, రూం లోనే భోజనం తెప్పించుకుందాం -" అన్నాడు శాస్త్రి.
మంచం పక్కనే వున్న సర్వీసింగ్ మీట నొక్కాడు శాస్త్రి. తక్షణం కాలింగ్ బెల్ మ్రోగింది.
"ఈ హోటల్లో సర్వీస్ చాలా బాగుంది. ఎప్పుడొచ్చినా ఇక్కడే దిగాలి!" అన్నాడు శర్మ . అతనే లేచి వెళ్ళి తలుపు తీసి వులిక్కిపడ్డాడు.
ఎదురుగా పోతురాజు మనిషి వున్నాడు. అతను లోపలికి వచ్చి -- "వడ్డీ కట్టడానికి మీకు ఇంక ఇరవై నాలుగు రోజులు మాత్రం వున్నది-" అన్నాడు శాస్త్రితో.
"నాయనా -- నన్నిలా హెచ్చరించడానికి నీకు రోజుకు ఎంత ముడుతుంది?" అన్నాడు శాస్త్రి.
"టైము ఎనిమిదయింది -" అని ఆ మనిషి వెళ్ళి పోయాడు. ఆ తర్వాతనే గదిలోకి బేరార్ వచ్చాడు. మిత్రులిద్దరూ రెండు భోజనాలు అర్దరిచ్చారు. బేరర్ వెళ్ళిపోయాడు.
"పోతురాజు విషయం మనం సీరియస్ గా తీసుకోవాలి-" అన్నాడు శర్మ.
అవును , ఈ విషయమై మనమోసారి భూషణరావు ను కలుసుకోవాలి --" అన్నాడు శాస్త్రి సాలోచనగా.
9
"మనం మంచి మిత్రులం -" అన్నాడు శర్మ.
'అవును...." అన్నాడు భూషణరావు నీళ్ళు నములుతూ.
"మానుంచి మీకు ఎటువంటి అపకారమూ జరుగదు. ఎటొచ్చీ మీరు మాకిచ్చిన మాటకు కట్టుబడి వుండాలి. ఆ తర్వాత చిన్న సాయం చేయాలి" అన్నాడు శాస్త్రి.
"సాయమా? నేను మీకు సాయమా?" అన్నాడు భూషణరావు.
'అవును, ఈ ఊళ్ళో ఓ స్నేహితుడికి ప్రతి నెలా పది వేలిస్తామని మాటిచ్చాం. మాటిచ్చామంటే ఉత్తినే ఇవ్వలేదు-- మీ ధైర్యం చూసుకునే ఇచ్చాం-..."అన్నాడు శాస్త్రి.
"పదివేలా -- ఇటీజ్ టూ మచ్ -" అన్నాడు భూషణరావు.
"అలాగనే మేమూ అనుకున్నాం కానీ మా స్నేహితుడు పోతురాజు వినడం లేదు. ఇందుకో ఉపాయం కూడా వుంది. నిజానికి అతడి వద్ద మేము లక్ష రూపాయలు మాత్రమే తీసుకున్నాం. అతడు నెలకు పది వేలు వడ్డీ అన్నాడు. అవసరానికి లక్ష ఇచ్చిన వాడా మాత్రం వడ్డీ అడగడం తప్పు లేదుకదా అని ఒప్పుకున్నాం. ఏ నెలనుంచి పదివేలు ఇవ్వక్కర్లేదనుకుంటే ఆ నెలకు లక్షా పదివేలూ ఇచ్చేస్తే ఆ బాకీ శాశ్వతంగా చెల్లుబడి అయిపోతుంది.... మీ యిష్టం.... మీరెలా చేసినా సరే."
"పోతురాజు మీకు డబ్బిచ్చాడా? అతను డబ్బిస్తాడని ఎంతోమందికి తెలియదే?' అన్నాడు భూషణరావు ఆత్రుతగా. శాస్త్రి, శర్మ, మరింత అసాధ్యులని ఆయనకు అనుమానం కలిగింది.
"పోతురాజు సంగతి మీకు తెలుసా?" అన్నాడు శాస్త్రి.
"నాకు తెలియడమేమిటి? అతను నా మనిషే. - తన దగ్గరకు వచ్చి అడిగిన ప్రతీవారికి ఎంత కావాలంటే అంత అప్పిస్తాడు పోతురాజు. వడ్డీ పదిశాతం. ఎటొచ్చీ ఏడాదికి కాదు నెలకు. లాభాల్లో ఒక శాతం మాత్రమే అతనిది. అయినా ప్రతి నెలా వేలకు వేలు సంపాదించుకుంటాడు. కానీ పోతురాజు గురించి సమాచారం అందరికీ తెలియదు. మీరు నిజంగా అసాధ్యులు...." అన్నాడు భూషణరావు.
"అడ్డమైన వాళ్ళకి అప్పులిస్తే బాకీ వసూలు ఎలా అవుతుంది?" అన్నాడు శర్మ.
"వసూలుకు పోతురాజు దగ్గర ఎన్నో పద్ధతులున్నాయి-" అన్నాడు భూషణరావు.
"అతడి వద్ద పద్దతులుండోచ్చు , కానీ పుచ్చుకున్న వాడు పాపర్ అయితే -...." అన్నాడు శర్మ.
"సైన్సు బాగా అభివృద్ధి చెందింది. ఫ్రెష్ గుండె కాయను ఏ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ కైనా సరఫరా చేయగలిగితే ఆదాయం లక్షల్లో వుంటుంది. మనిషి శరీరంలో కళ్ళు, ముక్కు, చెవులు, ఎముకలు, ఊపిరితిత్తులు కాలేయం..... ఒక టేమిటి? అన్ని భాగాలకూ డిమాండ్ పెరిగి వున్న ఈ రోజుల్లో - మానవ శరీరంతో లక్షలు సంపాదించడం పెద్ద కష్టం కాదు. బాకీ వసూలు మాకో సమస్య కాదు...." అని -- "నా రహస్యాలు కాస్త ఎక్కువగానే మీముందు బయట పెడుతున్నాను. కారణం తెలుసా?" అన్నాడు.
"మిమ్మల్ని మళ్ళీ చంపాలని పధకం వేశావా?" అన్నాడు శాస్త్రి.
'అబ్బే-- అలాంటిదేమీ లేదు. మిమ్మల్ని నాతొ కలుపుకుందామని, మీరు నాతొ చేతులు కలపకూడదా- సరదాగా -- ఈ ప్రపంచాన్నే ఓ అట అడిద్దాం!" అన్నాడు భూషణరావు.
"మేము ఎవరితోనూ చేతులు కలపం. మేము చేతులు కలిపితే గట్టిగా చప్పుడవుతుంది. దొంగలు చప్పుడు చెయ్యకూడదు. నిశ్శబ్దంగా వుండాలి. కాబట్టి దొంగలు మాతో చేతులు కలపాలని అనకూడదు. కాబట్టి ఆ విషయమలా వదిలి పెట్టి -- ముందు పోతురాజు సంగతి తేల్చు -- " అన్నాడు శాస్త్రి.
భూషణరావు పోతురాజును రప్పించి బాకీ చెల్లుబడి చేయించేశాడు.
"పాపం మీకు లక్ష రూపాయలు నష్టం -- " అన్నాడు శర్మ జాలిగా.
"ఏమీ నష్టం లేదు. లక్షల విలువ చేసే మీ పరిచయం లభించింది. ఏదో ఓ రోజున మనం చేతులు కలుపకపోము. మీవల్ల నాకు ఇంతకింతా లాభం రాకపోదు-" అన్నాడు భూషణరావు.
10
ఇంటాయన మళ్ళీ మళ్ళీ లెక్క పెడుతూ -- "లెక్క బాగా సరిపోయింది. అంతా సరిగ్గా వుంది ...." అని పదిసార్లు అన్నాడు.
శాస్త్రి, శర్మ అయన దగ్గర సెలవు తీసుకున్నారు.
ఇంటాయన-- "ఈ కుర్రాళ్ళు అఖండుల్లాగున్నారు. పాతిక వేలంటే పాతికవేలు బాకీ ఇట్టే వసూలు చేసుకొచ్చారు....' అన్నాడు భార్యతో.
"అవునూ-- అందులో అయిదు వేలు వాళ్ళ కెందుకిచ్చారు? అసలే వాళ్ళు మనకు అద్దె కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. మీరు వాళ్ళకు ఎదురిస్తే ఇంకా లోకువగా ఉండదూ -- " అయినా డబ్బంత చేదుగా వుందా మీకు?" అంది ఇంటాయన భార్య.
"బాగుందే -- ఈ కుర్రాళ్ళు దుడుకు మనుషులు. ఇంటద్దె ఇవ్వరు. వీళ్ళనేలా వదుల్చుకుందామా అని చూస్తున్నాను. విశాఖపట్నం లో అప్పారావని ఒకడున్నాడని -- వాడు పట్టపగలు నడిబజార్లో హత్యలు చేయగలడనీ ఎవరో అంటే వాడు నాకు బాకీ వున్నాడని అబద్దం చెప్పి -- లేని బాకీ వసూలుకు వీళ్ళని పంపించాను. వాడి చేతిలో వీళ్ళు ఏదో అయిపోతారనే అనుకున్నాను. కానీ వీళ్ళు నా బాకీ వసూలు చేసుకుని వచ్చారు. ఎలా వసూలు చేశారో ఏమిటో?.... ఇరవై వేల రూపాయలు.... ఎన్నేళ్ళు వుంటే మాత్రం అద్దె కింద ఇది తీర్తుందో నువ్వే చెప్పు...."అన్నాడు ఇంటాయన.
ఇంటాయన భార్య వెర్రి ముఖం వేసుకుని...." ఇరవై వేలు....వుత్తినే వచ్చాయా?" అంది.
హుషారుగా రోడ్డు మీదకు వెళ్ళిన శాస్త్రి, శర్మ ఏదో సందేహం వచ్చి మళ్ళీ వెనక్కు వెళ్ళాలను కుని మానేశారు. అదే మంచిదయింది. లేకుంటే ఈ సంభాషణ అంతా వాళ్ళు విని- అసలు అప్పారావు, నరసరాజు బాకీల విషయాలు కూడా ఎంతవరకూ నిజం- అని మధనపడిపోయేవారు.
ఈ సంగతి భూషణరావు కు తెలిస్తే! వున్న బాకీలు వసూలు చేసే పోతురాజునే అయన ఆకాశాని కేస్తున్నాడు. లేని బాకీలు వసూలు చేసే వీళ్ళ సంగతి తెలిస్తే అయన ఏమంటాడో?
------అయిపొయింది ---------
