ఇప్పుడెలా?
ఆమె ఆదరాబాదరగా అన్నీ వడ్డించుకుంది.
పదార్ధాలన్నీ ఏంతో రుచిగా ఉన్నాయి. తిన్నకొద్దీ తినాలనిపించేలా ఉన్నాయి.
కానీ -- ఏ క్షణంలో తలుపు తెరచు కుంటుందోనన్న బెంగ ఆమెకు మనస్థిమితం లేకుండా చేస్తోంది.
భోజనం చేస్తోంది కాని తృప్తిగా లేదు.
అన్నీ పదార్ధాలు రుఛి చూశాక -- ఇంకా తలుపు తెరుచుకోబోయే సరికి కాస్త స్తిమితపడి నెమ్మదిగా మిగిలిన పదార్ధాలు మళ్ళీ తినసాగింది.
భోజనానికి పదిహేను నిమిషాలంటే -- కాఫీ టిఫిన్ల కు అయిదు నిమిషాల కంటే టైమివ్వడెమో!
'వేడి వేడి కాఫీ -- నెమ్మదిగా సిప్ చేయకపోతే ఏం బాగుంటుంది ?
ఆమె తన గతి గురించి ఆలోచిస్తుండగానే తలుపు దగ్గర అలికిడయింది.
ఆమె బాత్రూం లోకి పరుగెడుతూ - 'ఇలా ఇంకా వారం రోజులు. భగవంతుడా! పరాయి వాడి కూడా ఇలాంటి అవస్థ కల్పించకు" అనుకుంది.
కులభూషణ్ తన పరిశోధనలు సీరియస్ గా కొనసాగిస్తున్నాడు.
నర్సింగ్ హోం చీఫ్ ఏడుకొండలుతో - "మీరు నా వైద్యం గురించి ప్రచారం కానివ్వండి. అది కాకతాళీయం గా తయారైన మందు. మళ్ళీ తయారు చేయగలనో లేదో తేలియదు. నా ప్రయత్నం మాత్రం అది తయారు చేయాలనే! అయితే కొత్త రోగులను చేర్చుకుని వారిలో ఆశలు కల్పించారంటే అది నా పరిశోధనకు ఆటంకమవుతుంది" అని చెప్పాడు.
ఏడు కొండలు సరేనన్నాడు. కాని కులభూషణ్ పరిశోధనలు త్వరలోనే ముగియగలవన్న ఆశాభావం వ్యక్త పరిచాడు.
వేదాంతం డీప్ ఫ్రిజ్ లో ఉంచిచ్చిన ఆకుల్లోని రసయానాలనతడు పరీక్షించాడు. ఆ ఆకులను మైక్రో స్కోపులో ఎగ్జామిన్ చేసాడు.
అంతవరకూ తెలియని కొత్త రసాయనాలా ఆకుల్లో ఉన్నాయి. అవేమిటో ఐడెంటిఫై చేయాలి.
తమ ఇంటి పెరట్లో మొక్క నుంచి తీసిన ఆకులను కూడా కులభూషణ్ వివిధ పరీక్షలకు గురిచేసాడు. విచిత్రమేమంటే చూస్తుంటే ఒక్కలా కనపడే ఆ ఆకుల్లో మైక్రో స్కోప్ కొన్ని చిన్న బేధాలు చూపించింది. వాటి రసాయన గుణం కూడా తేదాగానే ఉంది.
కులభూషణ్ తన ఇంటి పెరట్లోని ఆకులను - ఇతర హాస్పిటల్లో కొందరు రోగుల చేత తినిపించాడు. వారికది మందు అని చెప్పలేదు.
అయితే తన దొడ్లో ఆకులూ క్యాన్సర్ కు పనికి రావని అతడు నిర్ధారించడానికి ఎన్నో రోజులు పట్టలేదు.
రెండాకులూ ఒకటే వంటాడు వేదాంతం.
డీప్ ఫ్రిజ్ లో ఉంచడం వల్ల రెండాకుల్లోనూ తేడా వచ్చిందేమోనని అనుమానించి కులభూషణ్ తన దొడ్లోని ఆకులను కూడా డీప్ ఫ్రిజ్ లో ఉంచి చూశాడు.
అప్పుడతడికి రెండాకులూ ఒకటి కాదని తెలిసిపోయింది.
వేదాంతాన్నతడు నిలదీసాడు.
"నాకు తెలిసింది నేను చెప్పాను. నన్నికసిగించకు ...." అన్నాడు వేదాంతం చిరాగ్గా.
"విసుక్కోకు. మానవాళికి మహోపకారం చేసే సాధనం గురించిన వివరాలడుగుతున్నాను నేను -" అన్నాడు కులభూషణ్.
"మానవాళికి మహోపకారం చేసే మరో ప్రయత్నంలో నేనున్నాను. నువ్వు నన్ను విసిగించకు " అన్నాడు వేదాంతం.
"వేదా -- ఒక్క ఉదయను బ్రతికించుకోగానే-- అలాంటి ఉదయ రెందరి గురించో మనం మర్చిపోవాలా?' అన్నాడు కులభూషణ్.
"మనదేశంలో క్యాన్సర్ వల్ల బాధపడుతున్నడెందరు? కొన్ని లక్షల మంది ఉంటారేమో ! డెబ్బయి అయిదు కోట్ల భారతవనిలో ఆ లక్షలో లెక్కలో విశేషం కాదు. నువ్వు జీవితంలో క్యాన్సర్ గురించి ఆలోచిస్తున్నావు. కానీ మనిషికి జీవితాన్నే క్యాన్సర్ గా మార్చేసిన మహానుభావులు కొందరున్నారు. వారి కారణంగా కనీసం నలభై కోట్ల మంచి భారతీయులు మృగాల్లా జీవిస్తున్నారు. నీ క్యాన్సర్ కంటే - నా క్యాన్సర్ ప్రమాదమైనది. ఆ క్యాన్సర్ నివారించే ఉపాయం నాకు తెలిసింది. మనదేశానికి అవసరమైన ఆ విశేషం గురించి ముందు నేను పాటుబడాలి-' అన్నాడు వేదాంతం.
'ఆసలు నువ్వేం చేస్తున్నావు?"
"ప్రస్తుతానికి ధనుష్టాంకారం కొనసాగుతుంది ...."
"నీ మాటలు నాకర్ధం కావడం లేదు. నువ్వేం చేస్తున్నావో నాకు తెలియడం లేదు. నీ మానసిక స్థితి నార్మల్ గా ఉందొ లేదో నాకు తెలియడం లేదు. కానీ వేదా ఈ మొక్క ఎక్కడిదో నువ్వు నాకు చెప్పలేవా ?" అన్నాడు కులభూషణ్.
'చెప్పగలను. కానీ నువ్వెళ్ళి తెచ్చుకోలేవు...."
"చెప్పు బాబు! నా తంటాలు నేను పడతాను ..."
'అయితే అలౌకికానంద స్వామి ఆశ్రమానికి బయల్దేరు. ఆశ్రమ ప్రవేశ ద్వారంలో ప్రవేశించాక వెనక్కు తిరుగు . తిన్నగా నడు. ముందుకు వెడితే కొండ అంచున పెద్ద అగాధం.....అక్కణ్ణించి అగాధంలోకి దూకెయ్...."
'దూకితే ?"
"బ్రతకడానికి వన్ బిలియన్ చాన్సు కూడా లేదు. చాన్సుంటే మాత్రం నీకా మొక్క దొరకవచ్చు...."
'అంటే?"
"నే నా మొక్కనలాగే సంపాదించుకుని వచ్చాను..."
కులభూషణ్ ఆశ్చర్యంగా మిత్రుడి వంక చూసి "ఇంతకుమించి ఏమీ చెప్పనా?" అన్నాడు.
"చెప్పను " అన్నాడు వేదాంతం.
కులభూషణ్ వెళ్ళిపోయాడు. అతడిలా వెళ్ళగానే అలా వచ్చింది ఉదయ గదిలోకి!
ఆమెను చూడగానే వేదాంతం ముఖం వికసించింది.
"విస్సీ బావను వదిలి ఇలా వచ్చావెం?" అన్నాడతడు.
"విస్సీ బావ వాళ్ళమ్మ చూట్టూ తిరుగుతున్నాడు"
'అయితే ఏం -- నువ్వు విస్సీ బావ చుట్టూ తిరుగు-"
"ఎవరు లేనప్పుడే నేనెలా తిరుగుతాను ....'
"ఇప్పుడు నీకు నాతొ ఏం పని?"
'మురహరికి హెచ్చరిక అందింది."
"ఓహ్' అన్నాడు వేదాంతం.
"మురహరి తయారవుతున్నాడు"
'అంటే"
"అతడిని చాటు దెబ్బ తీయాలనుకున్న వారే సర్వ నాశనమయ్యారు. ఎదురు దెబ్బ తీసే మొనగాడు లేదని మురహరి బాధ పడుతుంటాట్ట..."
"కానీ ఎవరూ అతణ్ణి దెబ్బ తీయరు. మార్పు అతడి మనసులో వస్తుంది "
అతడి ముఖంలో కనబడ్డ నమ్మకం చూసి ఆశ్చర్య పడింది ఉదయ. ఒక్క నిముషమాగి- "అదంతా నా కెందుకులే గాని - నువ్వు భూషణ్ కెందుకు సాయపడవు ?' అంది.
'అంటే "
"నేను బయట నిలబడి మీ సంభాషణ విన్నాను.'
"ఇప్పుడు భూషణ్ నిన్ను పంపాడా?"
"పంపాడే అనుకో ఇందులో అతడి స్వార్ధం లేదు గదా!"
"లేదు. కానీ నా కార్యక్రమం దెబ్బ తింటుంది ..."
ఏమిటా కార్యక్రమమని ఉదయను అడగలేదు. అలా అడిగితె కధ మొదటికి వస్తుందని ఆమెకు తెలుసు.
"మృత్యునెలాగుంటుందో కళ్ళారా చూశాన్నేను. చేతులు సాచిన మృత్యువు కౌగిలిలోంచి మృత్యువు కోరల నుంచి బయట పడ్డాను నేను. నా జీవితంలో అదో పెద్ద విశేషం. మంత్రం వేసినట్లు నా వ్యాధి మటుమాయమయింది. ఇదెలా జరిగిందో భూషణ్ తెలుసుకోవాలనుకుంటున్నాడు. అతడికది నువ్వు చెప్పక తప్పదు. నా కోసం....నా జీవితాన్ని వ్యాధి నివారణకు ఉపయోగించాలని కోరిక. వేదాంతం.... ప్లీజ్! ఈ వ్యాధి నివారణకు నువ్వేం చేయమన్నా చేస్తాను. భూషణ్ కి సహకరించు.... ప్లీజ్౧"
"ఏం చేయమన్నా చేస్తానా?"
ఉదయ తాపీగా "నీ సంస్కారం గురించి నాకు తెలుసు ..." అంది.
ఏదో అనబోయిన వేదాంతం ఆగిపోయాడు.
ఆమె మాటలతడి చెవిలో గింగురుమంటున్నాయి.
"నీ సంస్కారం గురించి నాకు తెలుసు ..."
ఆమె ఆగకుండా అలా అంటున్నట్లే ఉంది.
"ఉదయ! నా కోసం నువ్వేమీ చేయవద్దు. నీ కోసం నేనేమైనా చేస్తాను" అన్నాడు వేదాంతం.
"భూషణ్ " కు నువ్వు సహకరిస్తావా ?" అంది ఉదయ ఆశగా.
"ఇప్పుడు కాదు- మురహరి పని పట్టెక!" అన్నాడు వేదాంతం.
"నిజంగా నువ్వే మురహరి పని పడతావా?" అని అడగబోయి ఆగిపోయింది ఉదయ. అలా అడిగితె కధ మళ్ళీ మొదటికి వస్తుందని ఆమెకు తెలుసు.
ఆరోజు మురహరి ఉదయమే లేచి తలంటు స్నానం చేశాడు.
అతణ్ణి కలుసుకుందుకు వచ్చిన వారందర్నీ తగు విధంగా సమాధానాలిచ్చి పంపించాడు.
