పశ్చాత్తాపంతో దహించుకు పోతున్న సారంగ ను చూస్తె చిత్రకూ ఏడుపొచ్చింది. దిక్కుమాలిన సవరం కోసం సారంగ ను ఎంత ఏడిపించింది? రంభ లేచి నిలబడి చెవులు గట్టిగా దులుపుకున్నది.
"నన్ను క్షమించాననండి... అంతవరకు నాకు శాంతి ఉండదు......"
దీనంగా మరొకసారి అర్ధించాడు సారంగ.
చిత్ర కనికరం తో ' ఇందులో నా తప్పు కూడా ఉంది లెండి... ఊర్వశి నిస్తారా? బావ దాని కోసం బెంగ పెట్టుకున్నాడు -- " అంది.
సారంగ ఒక్క ఉదుటున ముందుకు వంగాడు.
"మీరు ....మళ్ళా మొదటి కే వస్తారు! మీ బావ కుక్కను దొంగతనం చేయలేదంటే నమ్మరేం? ఇది నా కుక్క రంభ!"
రంభ కోసం సారంగ కలయజూశాడు. రంభ గదిలో లేదు. గది బైట పడుకుని చల్ల గాలికి సుఖంగా నిద్రపోతున్నది.
చిత్ర మనస్సు కోపంతో నిండిపోతున్నది.
"మీరు రంభ అనండి, మరొకటి అనండి! అది మా బావ కుక్క.... చూసి ఆనవాలు పట్టలేనంటారా? హూ!" అంటూ హుంకరించింది.
కోపంగా ఉన్న ఆడవాళ్ళ ని మరి కాస్త రెచ్చగొట్టాలనిపిస్తుంది. కాని, చిత్రను చూస్తె చిత్రం ఏమిటో తెలియదు కాని జాలేస్తున్నది. బ్రతిమాలుకోవాలనిపిస్తుంది....దూరంగా ఉన్న సముద్రం చల్లని గాలిని చెంతకు పంపుతున్నది. చిత్ర నుదుటి మీద ముంగురులు కంగారుగా పరిగేట్టాయి. చిత్ర ఆగ్రహం చూసి అవి ఎలా బెదిరిపోతున్నాయో అనుకున్నాడు సారంగ.
చిత్ర గదిలో లేదు. రంభకు కాస్త దూరంలో నిలబడి దురుసుగా "మీరిచ్చినా, యివ్వకపోయినా నేను దీన్ని తీసుకెళ్ళి బావకిస్తాను" అంది.
సారంగ నీరసంగా మూలిగాడు.
"ఇస్తే ఇవ్వండి. నేనేం బెంగ పెట్టుకోను -- కాని అది వూర్వశి కాదని వాడికీ తెలుసు!"
చిత్ర ఆశ్చర్యంగా చూస్తూ గదిలోకి వచ్చింది.
"వూర్వశి , రంభ ఒకే వూరకుక్కకు ఒకే రోజున పుట్టాయి. వాడో కుక్క, నేనో కుక్క తీసుకున్నాం. ఒకేలా పెంచుకోన్నాం..... వాడి వూర్వశీ పొతే దీన్ని పట్టుకోవచ్చు. కాని వాడు అదీ, ఇదీ ఒకటే అని సరిపెట్టుకోగలడా అని సందేహం!"
చిత్రకూ ఆశ్చర్యం తో పాటు అనుమానం కూడా వేసింది. సారంగ మాటలు ఎంతవరకు నిజం?
"వూర్వశీ - రంభ -- నిజమేనా? చిత్రమైన పేర్లు!...." అనుకున్నది చిత్ర పైకి.
"చిత్రంగా ఉన్నాయంటారా? వూర్వశికి ఉత్పత్తి అర్ధం వూరకుక్క అని.... నేనే సజెస్ట్ చేశాను. శేఖర్ కు చాలా నచ్చింది --"
చిత్ర మనోహరంగా నవ్వింది. చిత్ర నవ్వగా చూడటం ఇదే మొదటిసారి! సారంగ తన్మయత్వంతో చూశాడు.
"వూరకుక్కకి ఊర్వశీ ఎలా ముడి పెట్టారండి? భలేవారే! మొత్తానికి మీది బ్రహ్మాండమైన ఐడియా!"
సారంగ నవ్వబోయి బుగ్గలు బాధపెట్టగా ఆ ప్రయత్నం మానుకున్నాడు.
"నా స్వంత ఐడియా కాదులెండి! ఈ రోజుల్లో అందరూ అలానే చేస్తున్నారుగా? సూర్యనారాయణ, సురేష్, సత్యనారాయణ సతీష్ అయినట్టే....ఆ మాట కొస్తే నా పేరు కూడా అంతే....మా నాన్నగారి పేరు రంగయ్య.... నా పేరు సారంగ!...."
"వూ! మరి మీ కుక్కకి రంభ అని ఎందుకు పేరు పెట్టారు?"
"రెండూ ఒక తల్లి పిల్లలు. ఒకదానికి ఊర్వశి అని పెట్టాక మరో దానికి ఏ 'టామీ' యో పెడితే ఏం బాగుంటుంది? అందుకని ఊర్వశి, రంభ అని పెట్టాం...."
చిత్ర గది బైటకు చూపులు సారించి హడావుడి గా కుర్చీలో నుంచి లేచింది.
"చాలా చీకటి పడింది. మరి నేను వెళ్ళాలి..."
సారంగ రెండు చేతులూ జోడించి "నన్ను క్షమిస్తారు కదూ?' అన్నాడు.
చిత్ర మనస్సు ఆర్ద్రమయింది. ఉత్త పుణ్యానికి దొంగతనం కూడా అంటగట్టింది! తనే అతని స్థితిలో ఉంటె క్షమించమనటం దాకా ఎందుకు గుమ్మంలో కూడా కాలు పెట్టనిచ్చేది కాదు. అతని మంచితనం తను భరించలేకపోతున్నది.... తను తొందరపడి ఎంత మోటుగా ప్రవర్తించింది?
చిత్ర కను కొలకుల్లో నీళ్ళు తిరిగాయి. ముఖాన్ని మరో వైపుకు తిప్పి "నన్ను క్షమించరూ?' అన్నది.
* * * *
శేఖర్ గదిలో శారద పుస్తకాలు ముందేసుకుని కూర్చున్నది. ఇంగ్లీషు పుస్తకం చేతిలోకి తేసుకుని చదవపోయింది. వాక్యాలన్నీ ఎడతెగని చీమల బారుల్లా కనిపిస్తున్నాయి.......
ఈ మధ్య బావ తనకు పాఠాలు చెప్పడం మానివేశాడు.... ఎందుకో తెలీదు తనని తప్పుకు తిరుగుతున్నాడు. బావకు కోపం తెప్పించే పని తనేం చేసింది? బావ సంతోషిస్తాడని రోజూ కష్టపడి పాఠాలు చదువుతున్నది. అయినా బావ మాత్రం ఉత్సాహంగా కనబడటం లేదు. తనకేమిటో భయంగా, బెంగగా ఉన్నది.
గది తలుపులు తెరచి ఉన్నాయి -- అవతల వరండా లో కూర్చుని శూన్యంగా ఆకాశంలోకి' చూస్తున్నశేఖర్ కనిపించాడు.
గది గుమ్మం ముందు నిలబడి శారద "బావా! పాఠాలు చెప్పటమే మానివేశావ్?.... నువ్వు చెప్పినట్టే చదువుకుంటాలే బావా! నీ మాట జవదాటను --" అంది ప్రాధేయపడుతున్న ధోరణిలో.
శేఖర్ మవునంగా శారద వంక చూశాడు. అమాయకంగా కనబడుతున్న ఆ వదనం ;ఓ ఎంత దిగులు! తను ఏం చెప్పినా నమ్మించగలడు?
"నాకు వంట్లో బాగుండలేదు. నీమట్టుకు నువ్వు చదువుకో శారదా! లేకపోతె మీ అక్క దగ్గర నేర్చుకో"
శారద త్రుళ్ళిపడింది.
"అదేం బావా అలా అంటావ్? వంట్లో బాగుండక పొతే డాక్టరు కు చూపించుకో. అశ్రద్ధ చేస్తే ఎలా? నీకు వంట్లో బాగున్నప్పుడే చదువు నేర్పుదువు గాని....ముందు ఆరోగ్యం సంగతి చూసుకో.... అత్తయ్య కి చెబితేనే గాని నువ్వు డాక్టరు దగ్గరికి వెళ్లావ్!"
శేఖర్ గాభరా పడ్డాడు.
తనకేం నిక్షేపం లా ఉన్నాడు. లేనిపోని రోగం నటించి ఏ డాక్టర్ దగ్గరి కెళ్ళడం? అమ్మకి తెలిస్తే తనని నిలబడ నివ్వదు, లేచి తిరగనివ్వదు--
"జబ్బేమీ కాదులే -- తలనొప్పిగా ఉంది... పాఠాలు చెప్తూ కూర్చుంటే మరీ ఎక్కువవుతుందని...."
శారద మనస్సు తేలిక పడింది.
"బైటికలా వెళ్ళి తిరిగొస్తే ఏ తలనొప్పి ఉండదు బావా!... అన్నట్టు లక్ష్మీ లో మంచి తెలుగు సినిమా వచ్చింది. నన్ను తీసికెళ్ళవా?' అంది గోముగా.
గదిలో గోడ మీది గడియారం టంగు, టంగు మని నాలుగు గంటలు కొట్టింది. మరో రెండు గంటలకు మొదటి అట ప్రారంభం.... రెడీ కావటానికి కావాల్సినంత టైముంది.
శేఖర్ కు ముచ్చెమటలు పోసాయి వికసించి ఉన్న శారద మోమును చూడలేక తల దించుకున్నాడు. తనూ, శారదా కలిసి సినిమా కెళ్తే ఇద్దరూ కలిసి తిరిగి ఇంటికి రాగలరా? తన ప్రాణాల గురించి తనకు బెంగ లేదు. కాని అన్నీ తెలిసి ఉండి శారదను హంతకుని చేతి కప్పగించడానికి తనకు ప్రాణం ఒప్పటం లేదు. తను కటువుగా ఉండకపోతే శారద ప్రాణాలు దక్కవు. సున్నితమైన శారద హృదయాన్ని బాధపెట్టాలంటే తన ప్రాణం గిలగిలలాడుతున్నది.
"నన్ను వేధించకు శారదా! నాతొ నువ్వు రావద్దు. నాకిష్టం లేదు -- " అంటూ శేఖర్ గభాలున లేచి వీధిలోకి వెళ్ళాడు.
శారద నిశ్చేష్టురాలైంది.
బావ! ....బావేనా ఇలా మాట్లాడింది..? తనేం తప్పుచేసిందని?...శారద నీరసంగా పుస్తకాలు పడి ఉన్న చోటికీ వెళ్ళింది. ఇందాక తాను తెరిచి ఉంచిన పుస్తకం అలానే ఉంది. యాంత్రికంగా పుస్తకం చేతిలోకి తీసుకుంది. చీమల బారుల్లా కన్పించిన వాక్యాలు ఇప్పుడు అలుక్కుపోయి అగమ్యగోచరంగా ఉన్నాయి. ముత్యాల్లాంటి నీటి బిందువులు టప టప్ మంటూ వాటి మీద నుండి జారాయి. ఓహ్! తను ఏడుస్తున్నది.........
తన తలను ఎవరో ఆప్యాయంగా నిమురుతున్నారు.
'ఏడ్వకు శారూ! బావ సంగతి నేను చూస్తాను నా మాట నమ్ము!"
కళ ఓదార్పుతో శారద దుఃఖం కట్టలు త్రెంచుకుని ప్రవహించింది. ముఖాన్ని రెండు చేతులతో కప్పుకుని మనస్సు స్థిమిత పడేంత వరకు కన్నీళ్లు కార్చింది.
రాత్రి ఎనిమిది గంటలకు శేఖర్ ఊడి పడ్డాడు. కళ శేఖర్ రాక కోసం కాచుకుని ఉంది. శేఖర్ భోజనం చేసి వచ్చాక మెల్లిగా దగ్గర కెళ్ళి మొదలు పెట్టింది.
"నాన్నగారి ఉత్తరానికి జవాబు ఏం రాయాలను కుంటున్నావ్?"
శేఖర్ జ్ఞాపకం లేనట్టు "ఏ ఉత్తరం ?" అడిగాడు.
"అదే! గీతను చేసుకోమని......"
శేఖర్ నిర్లక్ష్యంగా నవ్వటానికి తంటాలు పడుతూ 'అప్పుడే పెళ్లికేం తొందర ? నాకసలు పెళ్ళి చేసుకోవాలని లేదు..........." అన్నాడు.
కళ గంబీరంగా అంది.
"మగవాడికి ఏది చేసినా చెల్లుతుంది. అయినా నీకోసం శారద ఎంత ఏడుస్తున్నదో ఒక్కసారి అలోచించి చూడు!........."
శేఖర్ గుండె రాయి చేసుకుని అన్నాడు.
.jpg)
"నేను శారదను చేసుకుంటానని ఎప్పుడు చెప్పాను? శారదకు మంచి సంబంధం చూసి చేసుకోండి. అదే అన్ని విధాల శ్రేయస్కరం............."
కళ తెల్లబోయింది.
అవున్లే! ఆడదానికి ఒక మనస్సంటూ ఉండకూడదు, మగవాడు రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి...." అంది కసిగా.
అయినా శేఖర్ చలించలేదు. హృదయం లేని మగవాళ్ళు అని చీదరించుకుంది కళ.
పడుకోబోయే ముందు కళ గీతకు ఉత్తరం వ్రాసింది.
"........బావ శారదతో చనువుగా ఉండేవాడు. శారదను చేసుకుంటాడని ఎంతో అనుకున్నాం. కాని దురదృష్టం కొద్దీ బావ చాలా మారిపోయాడు..... ఇప్పుడు బావకి శారద పోడటేనే గిట్టడం లేదు. సడన్ గా బావ ఎందుకలా మారిపోయాడో మాకేం అంతు బట్టటం లేదు........."
పరిస్థితులు గీతకు వెళ్ళబోసుకోవటం తో మనస్సు కొంచెం తేలికపడింది. కళ వుత్తరం పూర్తీ చేసి పక్క మీద ఆలోచిస్తూ పడుకున్నది. కళకు తెలియకుండానే మనస్సు సుధాకర్ ను చేరుకుంది.
సుధాకర్ తనను పెళ్ళి చేసుకుంటాడట! అనందంతో ఊపిరి సల్పటం లేదు తనకు. ఎన్ని సందేహాలతో సతమతమైనది? ఎంత నిరాశను అనుభవించింది?.......ఇప్పుడు తలచుకుంటే నవ్వొస్తున్నది. సుధాకర్! ఇదివరలా ఇప్పుడు తను అతన్ని ధైర్యంగా కళ్ళెత్తి చూడగలదా?"
కళ సిగ్గుతో ముఖం తలగడ లో దూర్చింది.
