Previous Page Next Page 
కరుణా మయి అరుణ పేజి 31


    రెప్ప పాటు కాలంలో అనర్ధం జరిగింది. వెళ్ళుతున్న ట్రాలీ చక్రం ఏదో ఎత్తైన ఇనుపతుండును ఎక్కడ మేమిటి....వాటు పడిపోతుందే మోనన్న భయంతో వర్కర్లు హెచ్చరిక చెయడ మేమిటి.....ఓబులేసు పడిపోవడమేమిటి......ట్రాలీ చక్రం ఆతని కాలి మీదుగా దాటి పోవడ మేమిటి.....అంతటి బాధను ఊగించ గల శక్తి లేని ఆ వయసు మళ్ళిన ఓబులేసు మూర్చ పోవడ మేమిటి....అంతా అలా అలా జరిగిపోయింది!"
    రఘు వచ్చాడు, అయ్యం గార్ వచ్చాడు. ఫ్యాక్టరీ మేనేజర్ వచ్చారు. స్వయంగా సేతుపతి గారే వచ్చారు! అప్పటికే ఏవేవో శైత్యోపచారాలు జరిగాయి. కాని ఓబులేసు , కోన ఊపిరితో ఉన్నవాడలా నీరసంగా పడి ఉన్నాడు, మూలుగుతూ బాధపడుతూ.
    "మిస్టర్ రఘూ!"
    "సర్?"
    "అందరూ వాడి చుట్టూ మూగి, మీరు చేసేదేమిటి? అంబులెన్సు కు ఫోన్ చేశారా?"
    "వెళ్ళారు సర్, ఫోన్ చెయ్యడానికి."
    "అప్పటికి చాలా ఆలస్యం కావచ్చు. జనరల్ హాస్పిటల్ కు ఇతడ్ని నా కారులో తీసుకు వెళ్ళండి. నేను వెళ్లి రేసిడెంట్ మెడికల్ ఆఫీసర్ గారికి ఫోన్ చేస్తాను."
    "రైట్ సర్."
    సేతుపతి గారు చరచరా వెళ్ళిపోయారు. "పట్టండ్రా అంటే పట్టండ్రా " అన్నారు.
    "అయ్యో......అయ్యో.....బగమంతుడా! బాధ.....చస్తున్నాను.......సిన్నయ్య గారూ......నా పెల్లాం ....పిల్లలు...పెద్దదానికి ముప్పై రెండే ల్లోచ్చి నై ...అయ్యో రామా....ఆళ్ళంతా కూటికీ గుడ్డకూ లేక ఈదుల్లో అడక్క తినే రాత ఆళ్ళ నొసట ఎందుకు రాశావురా దేవుడా.......' ఓబులేసు , అతి దినంగా తనలో తాను గొణుక్కుంటూన్నాడు.
    "ఏం ఫరవాలేదు తాతా. నీకేం ఫరవాలేదు . మేమంతా లేమూ? కాస్త ఓపిక పట్టు. బాధ ఎంత ఉన్నా ఓర్చుకో! అయ్యగారి కారిక్కడే ఉంది. హాస్పిటల్ కి వెళదాం! ఆలస్యమైతే ప్రమాదం!"
    "ఆ ప్రమాదం జరిగే పోయింది చిన్నయ్య!"
    "ఏమీ జరగలేదు నువ్వూరుకో! ఇదుగో ....సుందరం ....నరసింహులూ ...ఏళు మలై....వడివేలూ ...కష్ట ఓపిక పట్టు తాతా! పట్టండి. నెమ్మదిగా......నెమ్మదిగా......"
    ఎలాగైతే నేం,ఓబులేసు ను కారులో వేసుకుని హాస్పిటల్ తీసుకు వెళ్ళారు.
    బుధవారం గడిచింది. గురువారం గడిచింది. శుక్రవారం నాడు డాక్టర్లు ఓబులేసు కాలు మోకాలి పైకి కోసేశారు. ఓబులేసు సంసారమంతా గోడు గోడు మన్నారు. 'మనిషి బతికాడు గదా , అంతే చాలురా బగమంతుడా!' అనుకుని కన్నీరు తుడుచుకున్నారు.
    ఆ ఆదివారం నాడు అరుణ రాలేదు. ఆమె వ్రాసిన ఉత్తరం ఎక్స్ ప్రెస్ డెలివరి లో వచ్చింది.
    "రెండు మూడు రోజులుగా నాన్నగారి ఆరోగ్యం బొత్తిగా బాగాలేదు. వచ్చే డాక్టర్లూ, పోయే డాక్టర్లూ గా ఉన్నారు. నాన్నగారు అన్నీ తెలిసిన వారు. అందుకనే ధైర్యంగా ఉన్నారు. ఆయనకున్నంత ధైర్యం నాకూ ఉందనే అయన గారి ఉద్దేశం. నిన్న రాత్రి అన్నారు. "అరుణా, చిన్నతనం లో రాత్రికి రాత్రి నీవు మమ్మల్ని అందరినీ విడిచి ఎలా వెళ్ళావో ....నేనూ దుర్గనూ, సీతనూ, సరస్వతీ ని నీకు వదిలేసి చెప్పకుండా ఏ రాత్రికి రాత్రో పయనమవుతాను. నీ బాధలు నీవు పడు౧క్ ఆ ఇద్దరు పిల్లల్ని ఉద్దరించు. దుర్గ కేం ఫరవాలేదు లే! దాని తలిదండ్రులకు సంబంధించిన ఇల్లు ఒకటి ఉంది. మూడు నాలుగు ఎకరాల పొలం ఉంది. దానితో దాని జీవితం గడిచి పోతుంది. ఈ ఏర్పాట్లన్నీ చేశాక నీవు సేతుపతి గారి ఇంటికి వెళ్ళచ్చు. ఇప్పుడు.....ఈ అంత్య దశలో నాకు స్వార్ధం ఎక్కువయింది. అందుకనే ....నిన్నిలా ఖైదీని చేసి, సేతుపతి గారి వంటి ధర్మాత్ముని మనస్సు ను నొప్పించ వలసి వస్తుంది.' అన్నారు. అంతా విని అయన చూడకుండా రెండు కన్నీటి చుక్కలు రాల్చి ఊరుకున్నాను. నాన్నగారు అన్నంత పనీ చేసేవారి లానే ఉన్నారు. నాకు భయంగా ఉంది. వీలుంటే రఘును ఒకసారి వచ్చి వెళ్ళమనండి...." అదీ ఉత్తరం లోని అసలు విషయం!
    సేతుపతి గారు నిజంగా బాధపడ్డారు. తాను వెళ్ళడానికీ వీల్లేదు. ఈ ఓబులేసు గొడవను గురించి, చీఫ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్తరీస్ విచారణ జరుపుతున్నాడు. మేనేజింగ్ డైరెక్టర్ కాబట్టి తాను ఉండి తీరాలి! రఘు వెళ్ళాడు. అతనికి శంకర నారాయణ గారి చావు బ్రతుకుల సమస్య కన్నా, ఓబులేసు కు ఇప్పించే కంపేన్సేషన్ ముఖ్యం!
    "చండీ!" అన్నారు ఇక ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదనుకుని,
    "ఏమండీ?"
    "శంకర నారాయణ గారు చావు బ్రతుకుల్లో ఉన్నారట...."
    "అయ్యో రానూ...."
    "నేను వెళ్ళడానికి వీల్లేదు. రఘుకు చేబుదామన్నా వాడిప్పుడు మన కళ్ళ బడడు. కారేసుకుని నీవైనా వెళ్లి వస్తావే మోనని...."
    "అయ్యో.....తప్పకుండా వెళ్లి వస్తానండీ. అరుణ మనపిల్లె అనుకున్న తరువాత తప్పుతుందా?"
    "అందులోనూ.....ఇంకా ఈ చుప్పనాతి తనమెందుకే చండీ?"
    "రామరామ!నేనిప్పుడు అనరాని మాట ఏమన్నానండీ.."
    "నీవేమీ అనలేదులే! నా మనసే పాడై పోయి ఏదో వాగాను. ఏమీ అనుకోకు. త్వరగా బయలుదేరు మరి!" చాముండే శ్వరి నిలుచున్నా పళంగా బయలుదేరింది!
    సేతుపతి గారికి దాదాపు పిచ్చి పట్టినట్టుంది. మనసు, బోనులో నించి తప్పించుకు పోయిన వన్య మృగం లా తిరుగుతుంది. ఎన్ని సమస్యలు! నీటి బుడగ లాటి ఈ జీవితం కోసం, ఎందుకు మానవుడు ఇంత పరితపించి పరిశ్రమ చేసి పడిపోవాలి? అబ్బా!
    రఘు ఒక్కడూ జోక్యం కలగ జేసుకోకుంటే ....అన్నీ సవ్యంగా జరుగుతాయి. మిగిలిన వర్కర్లందరూ ఒప్పుకుంటారు. అసలు ఓబులేసే ఒప్పుకుంటాడు, కానీ, రఘు?....
    జరగకూడనిది జరిగింది. ఎవరి దానికి బాధ్యులు? తాను ఒడులేసు ను ఆ చక్రం కిందికి తోశాడా? వాడే పడ్డాడు!.....
    ఏదో......పాపం పడ్డాడు. పధ్నాలు గేళ్ళు సర్వీసున్నవాడు! మేనేజి మెంటు మాత్రం ఆ సంగతులన్నీ మరిచిపోయిందా? ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్ బాబతు రెండు వేలు వస్తున్నాయి ఓబులేసు కు,. కంపెనీ అంత మొత్తాన్ని దానం చేస్తుంది. పనిచేసిన పద్నాలుగు సంవత్సరాలకూ , పద్నాలుగు నెలల బేసిక్ వేజేస్ ముట్టజేబుతుంది. ఇంకా ...ఆశ కెక్కడా పరిమితి?
    రఘు ఏదో గొడవ తెస్తాడు! ఆ నమ్మకం తనకే కాదు. మేనేజి మెంటు కూ కంపెనీ డైరెక్టర్ల కూ అందరికీ ఉంది!
    "ఓహ్ , ఈ లాయర్లందరూ ఏరీ? అయ్యం గారేడీ? సుబ్బారావేడీ? ఎక్కడ వీళ్ళందరూ? కబురు పెట్టిన గంటన్నర కు కూడా ప్రత్యక్షం కాకపొతే ఎందుకూ వీళ్ళందరి కీ ఫీజులూ....జీతాలూ ఇవ్వడం ?........."
    "నాయర్!"
    "అయ్యా?"
    "ఓ కప్పు బ్లాక్ కాఫీ చేసి తీసుకురా! నా గదిలో ఉంటా. ఎవరైనా వస్తే అరగంట ఆగి, కేక వెయ్యమను!"
    "సరి సర్!" నాయర్ అటూ, సేతుపతి గారిటూ బయలు దేరారు.
    తన గది చేరుకున్నాడన్న మాటే గాని, నానా విధాలయిన ఆలోచనలతో సేతుపతి గారి తల బద్దలై పోతుంది. పరుపరుగున వెళ్లి ఒక డ్రాయర్ తెరిచాడాయన ! ఏదో .....మాత్రలున్న సీసా తీశారు. మూడు మాత్రలు మింగారు. కాఫీ వచ్చింది. ఒక్క గుక్క త్రాగి మంచం మీద వాలిపోయారు.
    "నాయర్!"
    "అయ్యా?"
    "అర గంట కాదు. కాస్త ఆలస్యమైనా .......నన్ను డిస్టర్బ్ చెయ్యవద్దని చెప్పు. హల్లో నే ఉండమను. వాళ్ళ పనులు వాళ్ళు తెమల్చు కొనేలోగా నేనే వచ్చేస్తానని చెప్పు."
    "సరి సర్."
    సేతుపతి గారి కళ్ళు నెమ్మదిగా ......బరువుగా మూతలు పడ్డాయి. స్లీపింగ్ పిల్స్ వల్ల. పాపం, ఆయనకు ఆ మాత్రం హాయి అబ్బింది. ఇప్పుడే బాధా లేదు.

                                                                45
    ఫ్యాక్టరీ మేనేజ్ మెంట్ చేసిన ఏర్పాటు, లేబర్ ఉద్యోగులకు పూర్తిగా సంతృప్తి కరంగా అగుపడింది. కానీ, రఘు కు అది అక్రమమ నిపించింది. అన్యాయ మనిపించింది.
    "ఒక మనిషి జీవితం నాశనమై పోయింది; ఇక వాడు దేనికీ పనికి రాడు; ఏ పనీ చెప్పలేడు! బిచ్చ మెత్తుకుంటే తప్ప, ఒక్క పైసా సంపాదించ లేడు! ఓబులేసు కు పెళ్ళికి ఎదిగిన ఆడపిల్లలు ముగ్గురున్నారు. వారు కాక నలుగురు కొడుకున్నారు. భార్య ఉంది. వీరిచ్చే అరువేలా చిల్లర తో ...ఓబులేసు మహా చేస్తే రెండు పెళ్ళిళ్ళు చెయ్య గలడు! మిగిలిన వారి గతేమిటి? వారి తిండి మాటేమిటి? బిడ్డ మాటేమిటి? మగపిల్లల చదువు మాటేమిటి? రూల్స్ ప్రకారం ఇచ్చారట! ఇటువంటి విషయాల్లో మనం పాటించ వలసినది మానవత్వాన్ని! రూల్ సును కాదు! ఓబులేసు కిచ్చే ఆరు వెలతో అతనికొక చిన్న ఇల్లు కొని పెట్టాలి. ఆ ముగ్గురు ఆడపిల్లల పెళ్ళిళ్ళ ఖర్చు మేనేజు మెంట్ భరించాలి. ఓబులేసు జీవిత పర్యంతం, ఇప్పుడు ఓబులేసుకు వస్తున్న జీతాన్ని పెన్షన్ గా ఇవ్వాలి. కుర్రాళ్ళ లో ఏ ఒక్కడి కైనా ఓబులేసు చేస్తూన ఉద్యోగం ఇప్పించాలి. అదీ ధర్మం! అదీ న్యాయం! ఆ న్యాయం ఓబులేసుకు జరగనిదే ఫ్యాక్టరీ లో పని జరగదు!" అన్నాడు రఘు వర్కర్ల నుద్దేశించి.
    అయిదారు వందల గొంతుకలు, "జరగదు! జరగదు!" అన్నాయి!
    "రఘుపతీ...."
    "జిందాబాద్!"
    "సేతుపతీ...."
    "ముర్దాబాద్....."
    "రఘుపతి గారికీ....."
    "జై!"
    "రఘుపతీ...."
    "అప్! అప్!"
    "సేతుపతీ...."
    "డౌన్! డౌన్! " పోలి కేకలు పెట్టుకుంటూ ఫ్యాక్టరీ చుట్టూ తిరిగారు పనివారు.
    సేతుపతి గారి ఇంటికీ వెళ్లి, అక్కడా అవే నినాదాలు చేశారు. తను షరతులు న్న మోమోరాండాన్ని సేతుపతి గారికి ఇవ్వవలసినదిగా అయ్యం గార్ గారి కిచ్చారు. ఆయన్ని గురించి....ఏవేవో బూతు కేకలు పెట్టారు , వెళ్ళిపోయారు.
    మోమోరాండాన్ని తీసుకుని అయ్యం గార్ సరాసరి సేతిపతి గారి వద్దకు వెళ్ళాడు. తన కొడుకు ఉచ్చ దశను గురించీ తన హీన దశను గురించీ వర్కర్లు చేసిన నినాదాల్ని ఆయనా విన్నారు. ఏడుగురు డైరెక్టర్లు , లీగల్ అడ్వయిజర్లూ అసిస్టెంట్ లేబర్ కమిషనరూ అందరూ అక్కడే ఉన్నారు.
    మోమోరాండాన్ని సుబ్బారావు చదివి వినిపించాడు. విన్న తర్వాత లేబర్ కమిషనరే నవ్వి ఊరుకున్నాడు.
    "అర్ధం లేదు!"
    "మీనింగ్ లెస్!"
    "అబ్సర్డ్!"
    "కొవ్వెక్కి చేసే చేష్టలు!"
    "అట్టర్ రాట్!" డైరెక్టర్ అభిప్రాయాలివి!
    'అయితే.....మరి, ఇప్పుడెం చేద్దామన్నారు సర్?" అన్నాడు సేతుపతి . లేబర్ కమీషనర్ ని ఉద్దేశించి.
    "నేను ప్రభుత్వోద్యోగిని. నేను మీకు సలహా ఇవ్వరాదు. న్యాయం మీ పక్షాన ఉందని ఇదివరకే తెలిసింది గా? మీ లీగల్ అడ్వయిజర్స్ తో సంప్రదించి మీకు తోచినట్టు మీరు చేసుకోవచ్చు. సెలవు. గుడ్ డే!' మిగిలిన వారందరూ ఆయనకూ, అయన సహచరు లకూ వీడ్కోలిచ్చి వచ్చి యధాస్తానాల్లో కూర్చున్నారు.
    సేతుపతి గారు మాత్రం ....ఒక విపరీతమైన నిర్ణయానికి వచ్చినట్టున్నారు. ఆ నిర్ణయం కలగ జేసిన ఆవేశంతో అయన తబ్బిబ్బై పోతున్నారు. అల్లల్లాడిపోతున్నారు. అలమటించి పోతున్నారు.
    "శాంతించండి, శాంతించండి సేతుపతి గారూ, మీరింతగా బాధ పడతారు."
    "బాధా? నాకా? ఇప్పుడిక నాకే బాధా లేదు. నేనొక నిశ్చయానికి వచ్చాను.ఆ నిశ్చయం కొనసాగవలసిందే!"
    "అంటే?"
    "ఫ్యాక్టరీ మూసి వేస్తున్నట్టు అందరికీ నోటీసులివ్వండి. వారి వారి సర్వీస్ ను బట్టి , జీతాలూ, బోనస్ లూ, అడ్వాన్సు లూ ఏమేమి వస్తాయో అన్నీ ఫలానా తేదీన వచ్చి, తీసుకు వెళ్ళ వలసిందిగా వర్కర్లందరికీ తెలియ జేయ్యండి. ఎక్ స్త్రార్డనారీ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చెయ్యండి. నా మేనేజింగ్ డైరెక్షర్ షిప్ కు నేను రాజీనామా ఇస్తున్నాను. మిస్టర్ అయ్యంగర్ స్టాక్ బ్రోకర్స్ కు ఫోన్ చేసి, నా తాలుకూ షేర్లు, ఏ కంపెనీ లో ఉన్నా సరే......ఎన్ని ఉన్నా సరే.....అన్నింటినీ అమ్మకానికి పెట్ట మనండి. ఇక ఈ జీవితంలో నేను పోరాటం సాగించలేను. నాకు కావలసింది శాంతి. మనశ్శాంతి. భగవంతుడిచ్చింది ఉంది. అది చాలు. ఇంకా ఎందుకు నేను పాటు పడాలి? ఎవడి కోసం?...." అంటుండగానే ఆయనకు దుఃఖం ముంచుకు వచ్చింది . అందరి ఎదటా పసిపాపలా ఏడ్చారు.
    "సేతుపతి గారూ....సేతుపతి గారూ...."
    "సార్/....సార్......."
    "దయచేసి మీరంతా వెళ్ళిపొండి. నేను వెల్లడించింది నా తుది నిశ్చయం. ఇక ఎవరెవరు చేసుకోవలసిన పనుల్లో వారు నిమగ్ను లు కండి. సుబ్బారావు గారూ!"
    "సర్?"
    "సంతకా లేవైనా కావలిసి వస్తే నేను ఇంటిలోనే ఉంటాను. మరే విషయం లోనూ నన్ను ఎవరూ......ఏ పరిస్థితుల్లో నూ ట్రబుల్ చెయ్యవద్దండీ. గుడ్ డే" అని ఆయన మేడ మెట్ల వైపు అంగలు వేశాడు.
    ఫోన్ మోగింది. సుబ్బారావు రిసీవర్ ఎత్తాడు.
    "యస్.?.........ఆ.......అయ్యా, మీకు ట్రంక్ కాల్ వచ్చిందండీ!"
    అది అరుణ ఎమోనన్న అనుమానం కలిగింది సేతుపతి కి. పరుగున వచ్చి రిసీవర్ తీసుకున్నాడు.
    "హలో....యస్, సేతుపతీ హియర్....అమ్మా అరుణా, నేనే తల్లీ .....ఆ?......అలాగా?...ఇప్పుడే బయలుదేరతానమ్మా" అని, రిసీవర్ ని పెట్టేసి, "సుబ్బారావు గారూ! అంబాసిడర్ సిద్దంగా ఉంచండి. శంకర నారాయణ గారి పరిస్థితి అలాగే ఉందిట! క్విక్!" అంటూ మేడ మీదికి దారి తీశాదాయన ప్రయాణానికి సిద్దం కావడానికి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS