Previous Page Next Page 
ప్రేమకు పగ్గాలు పేజి 31

   

                                  41

    బళ్ళో కెళ్ళటం రావడం, స్నేహితులూ లేదా పరిచయస్తులు ఎవరేనాతప్ప, పదిమందీ పదిరకాలుగా ఉండే చోటకు పేరంటానికనీ, పెళ్ళి కనీ రావడం పడనే లేదు.
    ఇదివరకోసారి గుంటూరులో వాళ్ళ 'క్లాసు మేటు' జయంతి వాళ్ళ యింట్లో బొమ్మలకొలువు పెట్టేమంటే పద్మావతి సంబరపడి వెళ్ళింది.
    చాలాసేపూ పడుచుదనం గల పిల్లలంతా కలిసి కులాసాగా గడిపేశారు కాని అంతలో ఒక ముత్తయిదువ "ఇంతకీ జయా! అడిగానని ఏమీ అనుకోకూ! ఆ అమ్మాయి ఎవరే మరీ అలా నవరత్నాలూ రాల్తున్నాయన్నట్లు అలా గర్వంగా నవ్వుతోందీ?" అని అడిగింది జయంతిని.
    ఈమాటలు విన్న పద్మావతి అప్పటికే నొచ్చుకుంది. పైగా "మా ఫ్రెండు" అని జయంతి చెప్పడం పూర్తికాకుండానే ఆవిడ మరింత చనువుగా "ఆహా ..... యీ వూరేనా? అన్నది సూటిగా పద్మావతిని చూస్తూనే.
    "ఈ వూరే నన్నది" పద్మావతి.
    "మీ నాన్నగారేం చేస్తుంటారు?"
    "వాళ్ళ నాన్నగారు పోయారు దొడ్డగారూ" జయంతి చెప్పింది.
    "అయ్యో ! పాపం !" ఆవిడ విచారించి "అలాగా, మరి అన్నదమ్ములున్నారా?" అన్నది. అలా రకరకాల ప్రశ్నలు అడిగింది.
    "మరి పెళ్ళి చెయ్యరూ? ఈ చదువు లెందుకు చెప్పూ!" అని వ్యాఖ్యానించింది.
    'దవడమీద ఒక్కటి యిద్దునా?' అని ఆనాటి నుంచి ఈనాటి వరకూ ఆ సంఘటన జ్ఞాపకం వచ్చినప్పుడల్లా అనుకుంటుంది పద్మావతి.
    ఆరేఖను దగ్గరిగా అంటిపెట్టుకొనే తిరుగు తున్నా, లోపల లోపల పద్మావతికి 'తను ఈ పెళ్ళివారికి చాలా దగ్గర దానివి' అనే ఆలోచన మాత్రం సాధిస్తూనే ఉంది.
    వాస్తవానికి యిక్కడ పెళ్ళి సందడిలో సగంతనూ పాలు పంచుకోవాలి....... కాని........ఎవరన్నారు ఆమాట? అసలీ పద్మావతిని ఎవరెడుగుదురు?
    "సరే! నాకు అదోలా ఉందే."
    "నువ్వు తప్ప    ఎవ్వరూ తెలియరూ?" అన్నది. నిజానికి పెళ్ళికి వచ్చినవారిని ఎవరివేపు వారెవరూ?" అనేదిచూసి పల్కరిస్తారు. కాని, నేరుగా సురేఖ నేస్తంగా వచ్చిన పద్మావతికి-తానే ప్రయత్న పూర్వకంగా, తప్పించుకు తిరగడంవల్ల భాస్కరం వూపిరిసలపని హడావుడిలో ఉండటం వల్ల, సురేఖ తప్ప ఎవ్వరూ తెలియడంలేదు.
    "సరేలే, నాకూ అంతే! మా దొడ్డమ్మని చూశావుగా రా! వాళ్ళ పిన్నిగారిని చూద్దువు గాని, ఆనక వసంతని చూద్దాం."    
    సురేఖ చొరవగా జానకమ్మగారున్న దిక్కుగా వెళ్ళింది. ఆమె "వీళ్ళిద్దరూ తనవేపు చూస్తున్నారు "ఒకవేళ నాకోసరమా?" అనుకుని యిటు తిరిగి "ఏమమ్మా! నా కోసమా?" అన్నది సురేఖ నుద్దేశించి.
    "నమస్కారమండీ! మీ కోసమే" నంది సురేఖ.
    అని "ఈమె పద్మావతి అండీ!" అన్నది. జానికమ్మగారిని చూస్తూనే అదో బిడియం కలిగింది యిద్దరికీ.
    "అలాగా ! అమ్మాయ్! నువ్వు యిక్కడ ఏ సదుపాయంలేకపోయినా నాతో చెప్పు. మొహమాట పడకు!" అని పద్మావతిని చూసి, సురేఖ కేసి తిరిగి "మీ స్నేహితురాలా?" అన్నది. పద్మావతి అంటే ఆమెకేం తెలుసూ?
    తలూపింది సురేఖ-పద్మావతి చేతులు జోడించింది. అంతలో ధనమ్మగారు విసవిసా వచ్చింది అక్కడికి!
    "అయ్యో! ఒదినెగారూ ! మర్చేపోయాను, మీ సురేఖను రాగానే మీ దగ్గర అప్పచెప్పాల్సింది" అంటూనే పద్మావతిని చూసి "ఆహా! అమ్మాయ్ పద్మకుమారీ! నువ్వూ ఉన్నావా తల్లీ!" అని తిరిగి చూడూ! ఈమె పెళ్ళికుమార్తె తల్లి-ఆమాట కొస్తే నాకు కాబోయే వియ్యంకురాలనుకో! సురేఖ అత్తగారు" అన్నది గర్వంగా.
    "బాగున్నారు ఇద్దరూ" అన్నది జానికమ్మ గారు అమ్మాయిలను కలిపిచూసి.
    సురేఖ "దొడ్డమ్మా! యీమె పేరు పద్మ కుమారి కాదు, పద్మావతి" అని చెప్పలేదు. పద్మకుమారి అనగానే వచ్చిన నవ్వు కూడా సగంలోనే చెరిగిపోయి ఆమె నుదుట నెత్తురు లేనట్లు పాలిపోయింది కూడా!
    పద్మావతికి భూమి క్రుంగుతున్నట్లుంది.
    ధనమ్మగారి ధోరణి వేరు.
    "ఈ పద్మకుమారి వాళ్ళది గుంటూరట!" అంటూనే ఆమె పద్మావతినీ చూసి "నువ్వు నీ స్నేహితురాలి పెళ్ళికి కూడా వారం రోజులు ముందుగానే రావాలిసుమా!" అన్నది.
    "అబ్బబ్బ !......" అన్నది సురేఖ. ఎంత నిగ్రహించుకున్నా దాగలేదు. భావోద్వేగం సురేఖకు ధనమ్మగారి నోరు నొక్కేద్దామా అనిపించింది అంతలో "అయ్యో! చూశారా! రండీ ! రండీ! నా మతి! మిమ్మల్ని పీల్చుకెళ్దామని కబుర్లమధ్య పడ్డాను." అంటూ ధనమ్మగారు గభిక్కున చనువుగా జానికమ్మగారి చెయ్యి పట్టుకుని తీసుకు వెళ్ళిపోయింది.
    పద్మావతికి నెత్తురు మరిగిపోతున్నంత కోపం వచ్చింది. నేలకు కృంగిపోతున్నంత దుఃఖం కలిగింది. పెదాలు ఒణుకుతాయే తప్ప నిడటం లేదు.
    సురేఖ అనుకోని అఘాత మిది! పద్మావతి వేపు చూడటానికే ధైర్యం చాలలేడు-ఎట్టకెలకు "రా!" అన్నది.
    పద్మావతి గిరుక్కున అటు తిరిగింది.
    "కదిపితే కన్నీళ్ళయిపోతుంది!" ఏం చెయ్యాలి? సురేఖ పరిశితి కూడా ఆందోళన ఆందోళనగానే ఉన్నది!
    పద్మావతి "ఛీ" అనడం పూర్తిగా వినిపించలేదు గాని, ఆమె తొట్రుపాటుగా వెళ్ళిపోతూండటంతో నలుగురి దృష్టిని ఆకర్షించనంత జాగర్తగా ఆ పిల్లతోనే వెళ్తున్నట్లు వెళ్ళింది సురేఖ కూడా!
    "అందరూ దగాకోరులే!...... ప్రపంచమే దగా.... వీళ్ళంతా దగాకోరులు."
    పద్మావతి బుర్రలో సుత్తి దెబ్బలు కొడుతున్నట్లు అనే మాటలు. మనసులో దుఃఖం.
    "ఛీ! స్నేహం? ......అదీ దగా! ప్రేమా? పచ్చి మోసం......"
    గదిలోకి వెళ్తూనే సూట్ కేసు తీసుకుంది ఉన్నపళాన మూత తెరిచి గట్టిగా వేసి భగభగ మండిపోయే కనులెత్తి ఒకసారి సురేఖను చూసింది.
    "చూడూ!....." సురేఖ నిగ్రహంతో వారించబోయింది.
    "అక్కర్లేదు....."విదిలించుకుంది పద్మావతి.....
    "ఇలా వెళ్ళిపోడం బాగుండదు....."
    సురేఖ మెత్తగా బతిమాలుతున్నది.
    "ఎవరికి బాగుండదు? అసలేది బాగు? ఇంత నాటకమాడి, ఇలా ఇంత డ్రమటిక్ గా నన్ను వంచన చేయడం బాగుందా? ......నన్ను, నన్ను.......ఒక కీలుబొమ్మగా చూసి ....." బుసకొడుతూ నిగ్రహం కోల్పోయి తడబడుతూ మాట్లాడుతోంది పద్మావతి.
    "చూడటమే గాక పిలిచి.....యిలా యిలా....." మధ్యలోనే అందుకని సురేఖ "నువ్వు ఆవేశం తగ్గించుకొడం మంచిది పద్మావతీ!" అన్నది గట్టిగా.
    "థాంక్స్! నువ్వూ నీ కాబోయే పెళ్ళి కుమారుదూ ఉండండి-ఈ అవమానం చాలు."
    "షటప్! యూ ఫూల్! సురేఖ కళ్ళల్లో నీళ్ళు నిప్పులూ రెండూ నిండిపోయాయి.
    "గోటూ హెల్!" పద్మావతి పెట్టి తీసుకుని చకచక వెళ్ళిపోయింది.
    సురేఖ మంచంమీద కూలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది!
    పద్మావతి దెబ్బతిన్న పాములా తప్పించుకుని పారిపోయినట్లు వెళ్ళిపోయింది.
    అంత పెళ్ళి సందడిలోనూ తప్పించుకుని, రిక్షా ఎక్కి స్టేషనుకి వెళ్ళిపోయింది.

                       
    స్నేహానికి పరీక్ష, ప్రేమకి పరీక్ష, నిగ్రహానికి పరీక్ష అన్నీ పరీక్షలే ........ వెధవ పరీక్షలు ...... సురేఖ గభిక్కున లేచింది. కళ్ళు తుడిచేసుకుంది. పద్మావతి యిలా అర్ధ్ర్హరహితంగా పెళ్లిపందిరి నుంచి వెళ్ళిపోడం ఎంత అపవాదో గ్రహించినట్లు గబగబ యివతలికి వచ్చింది.
    అటూ యిటూ సాధ్యమైనంత వరకూ గాభరా అగుపించనివ్వకుండా చూసింది.
    "ఏమిటి సురేఖా! వెతుకుతున్నావు?" ఒకావిడ అడిగింది.
    "అబ్బే!.....ఏమీ లేదండీ! దొడ్డమ్మ కోసరం" సురేఖ సంభ్రమంగా అక్కన్నుంచి వెళ్ళిపోయింది.
    "నీతో ఉన్నావిడేగా అక్కా?" ఒక పదేళ్ళ పాప జరిగిన ఉదంతమంతా ప్రత్యక్షంగా చూసినట్లు-సురేఖ ఎవరికోసం వెతుకుతున్నదో తెలిసినట్లు అడిగింది.
    సురేఖ ఆశగా ముందుకు వొంగి "ఆఁ! ఎటు వెళ్ళిందో చూశావా?" అన్నది.
    "ఆఁ ...... అదో రిక్షా ఎక్కి లా వెళ్ళింది...." మరేఁ ఆవిడేమో కోపంగా ఉంది ..... నీ పెట్టెకూడా......"
    "హే భగవాన్!" సురేఖ బెంగపడిపోయి సర్దుకుని "మరేం లేదులే పాపా! ఆవిడ నా పెట్టె బాగుచేయించడానికి వెళ్ళింది" అని గబగబా పందిరిదాటి రోడ్డుకేసి వెళ్ళింది.
    కాని ...... కాని .......
    "ఏం చెయ్యాలి?"
    సురేఖకు కాళ్ళల్లో సత్తువ పోయింది. విపరీత మైన కోపం వచ్చింది.
    "ఛీ! గంగలో దూకమను! మనుషులన్న తరువాత మనుషులకు విలువ నిచ్చి అర్ధం చేసుకో గలగాలి....." అని బాధపడ్డది.
    "గంగలో దూకమను......గంగలో దూకమను?"
    "గంగ?! కృష్ణానది?! పద్మావతి?"
    "అమ్మయ్యో! భాస్కరంగా రెక్కడ?"
    సురేఖకు అధైర్యం కలిగింది. ఒక ఆత్మహత్యా పాపం తన పీకెలకు ఒక జీవితమంతా చుట్టుకుంది.
    "ఛీ! ఛీ! చవట పెద్దమ్మ........ప్రేమించాడట? ప్రేమా?......"
    కోపమంతా భయంగా మారి భయం భాస్కరం మీద అసహ్యంగా మారింది.
    "ఎక్కడ? ఎక్కడ? భాస్కరంగారు భాస్ కరమ్ గారట!" వెతుకుతున్నట్లు తెలియకుండా పదిమందిలోనూ, అపహాస్యంపాలు గాకుండా వెదకాలి......    
    భాస్కరం వస్తున్నా డటునుంచి, బజారు నుంచి కర్పూరం కాడలు కొనుక్కుని.
    సురేఖను చూడగానే చిన్న మనిషై పోయి "ఉహుహు.....వచ్చారుగా! పద్మావతి ఎక్కడ? అన్నాడు. నవ్వు తెచ్చుకుని.
    ఎంత కోపం వచ్చిందో అంతా పెదవిమీద మునిపంట నొక్కుకుని-
    "పద్మావతి యిప్పుడే వెళ్ళిపోయింది" అన్నది సురేఖ.
    "ఆఁ! వెళ్ళిపోవడమా?" భాస్కరం నమ్మలేకపోయాడు.
    'పైగా మీ చతురతవల్ల నామీద నిష్ఠురాలు వేసి మరీ వెళ్ళిపోయింది."
    "త్వరగా వెళ్ళండి అది కృష్ణలో దూకుదేమో" అని కూడా చెబుదా మనుకున్న సురేఖ ఆ మాటలను మింగేసింది. పై మాటలను మాత్రం కసిగా అన్నది ఆమె కళ్ళల్లోని ఆందోళనను చూస్తూనే భాస్కరం నీళ్ళు గారిపోయాడు.
    "ప్లీజ్! దయచేసి చెప్పండి! ఏం జరిగిందో" నన్నాడు.
    "మా దొడ్డమ్మ మీ పిన్నిగారు మాట్లాడుకోడంలో మీమీదా, నామీదా కోపం వచ్చింది ..... వెళ్ళిపోయింది ....."
    సురేఖ అతనివైపు క్రోధంగా చూస్తూ చెప్పింది.
    "ఎటు? మై గుడ్నెస్ ..... నేనేం చెయ్యనూ?" భాస్కరం ఆ 'కర్పూరం  పూలు' ఆమె చేతుల్లో పడేశాడు.
    "నేను వెళ్ళనా?" అన్నాడు.
    "కాని ఎటు అని వెతుకుతావు?" మొదట యిక్కడ యీ వందలాది జనం ఎదుట, యీ అకారణ ఉపద్రవం గురించి ఏమని చెబుతావు?" అన్నట్లు చూసింది సురేఖ.
    "ఔను!....... ఔను! నా కర్మ!" భాస్కరం అక్కడే పందిరి గుంజకి చేరబడి పోయాడు.
    అట్నుంచి ఎవరో నలుగురు వచ్చి "రా బాబూ! అక్కడ కాఫీలు నలుగురు పెద్దలకీ యివ్వాలి...." అంటున్నారు.
    "పదండి వస్తారు......ఆయనకు కాస్త తల తిరుగుతోంది....." సురేఖ తాను రెండడుగులు వేయబోయింది. కాని ఆ మాటలు మరింత ఉపద్రవ కారణాలయ్యాయి.
    ఒకతను "అరె! అలాగా?" అని పాలిపోయి పీక్కుపోయిన భాస్కరం మొహం చూసి "ఏం బాబూ? కాస్త విశ్రాంతి తీసుకో" అంటూ సానుభూతి చూపబోతే.......
    "ఔను మరీ! పెళ్ళి బరువా? మరొకటా? పైగా ఎంతైనా చెల్లెలు పెళ్ళి కదా?" అంటూ పరిశీలనగా చూడబోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS