మద్త్రాసు సెంట్రల్ స్టేషను లో అతడు చిన్న సూట్ కేసు పట్టుకొని దిగేడు. అతని వెనకే ఆమె దిగింది. టాక్సీ లో కూర్చుని ఏదైనా హోటలు కు పోనీమన్నాడు.
"ఏదైనా కాస్త ప్రశాంతంగా, మారు మూలగా ఉన్నది కావాలి."
' మాదిరి హోటలు ముందు టాక్సీ ఆగింది.
"పట్నం మధ్యలో ఉంటె అంతా తెలిసిన వాళ్ళే. ఈగల్లా మూగి పోతారు. ఇద్దరం కాస్త సేపు కులాసాగా కూర్చుంది కైనా సమయం చిక్కదు. నేను ఈ ఊరు వచ్చినట్లు తెలిసినా, నాకోసం తెలిసినవాళ్ళు చూసే హోటళ్ళ లో ఇది చివరిది. ఇటువంటి దాంట్లో నేను దిగుతానని వాళ్ళు కలలో నైనా అనుకోరు" అన్నాడు అతడు.
ఆఅమ్మాయికి ఆ హోటలు ఎంతో గొప్పగా ఉంది. నున్నటి పాల గచ్చులు, నిలువెత్తు అద్దాలు, తెల్లటి వాష్ బేసిన్లు, బెల్లు నొక్కగానే హాజరయ్యే పనివాళ్ళు. ఇతని కంటికి ఇది నాసిరకమా? మరింకేలాటి వాటిలో దిగుతాడు? అనుకొంది. అతడు అలవాటుగా దిగే హోటళ్ళ ను ఊహించుకొందుకు కూడా అ అమ్మాయికి శక్తి లేకపోయింది.
అతని ఆశయం నెరవేరింది. అ నాలుగు రోజులూ పరిచయస్తులు,ఎవరి కంటా పడకుండా పట్నం అంతా తిరిగేరు. బీచి ఒడ్డున, పార్కు ల్లోనూ మైమరిచి కబుర్లు చెప్పుకొన్నారు. కాలం ఎలా గడిచి పోతున్నదో, రాత్రో, పగలో ఆ అమ్మాయికి తెలిసేది కాదు. గాలిలో తేలిపోతున్నట్లు అతని చేయి పట్టుకొని అడుగులు వేసేది.
ఆరోజు రాత్రి తిరిగి తిరిగి హోటలుకు వస్తున్నారు. అక్కడో ఇంటికి అతి శోభయామానంగా దీపాలు అమర్చేరు. ఇంటిలోనుండి మృదుమధురమైన సంగీతం విన వస్తున్నది.
"ఏమిటిదంతా? ఏమవుతున్నది వీరి ఇంట?' ఆసక్తిగా అడిగింది అమ్మాయి.
"ఇది కళ్యాణ మండపం. మద్రాసు లో ఇంటువంటివి చాలా ఉన్నాయి. వీటిని అద్దెకు తీసుకొని ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకొంటారు." నోటి లోంచి మాట బయటికి వచ్చేక ఎందుకు చెప్పేనా అని బాధపడ్డాడు అతడు. అతడు చేసిన పొరపాటు ఆమె ముఖంలో వెంటనే ప్రతిఫలించింది.
ఆ రాత్రి ఎంత చెప్పినా ఆమె వినలేదు. బలీయమైన ఆ కోర్కె ను ఏ వ్యామోహమో జయించలేక పోయింది. "ఏమైనా రేపు బయలుదేరవలసిందే. ఏ సరదాలైనా, ఏ సౌఖ్యాలైనా తిరుపతి నుండి తిరిగి వచ్చేకనే" అని పట్టుబట్టింది.
అతడు మరునాటి ప్రయాణానికి అనేకమైన ఆటంకాలు చెప్పేడు. అమెవినే దశ లో లేదు.
వాదించి, వాదించి అతడు విసిగిపోయేడు.
"సరే, అలాగే చేద్దాం" అన్నాడు పక్కపై ఒక వారగా తిరిగి పాడుకొంటూ.
"కోపం వచ్చిందా?" అన్నది ఆమె అతన్ని తన వైపు లాక్కుంటూ.
"లేదు. నీ మూర్ఖత్వానికి విసుగొచ్చింది" అన్నాడు అతడు చిరాకుగా.
'అది కాదండి. ఇదొక్కటే నా ఇష్ట ప్రకారం జరగనీండి. ఆపైన మీ మాట ఎప్పుడైనా కాదంటానెమో చూడండి" అన్నది ఆమె అతని జుట్టు సవరిస్తూ.
"పడుకో మరి. ఉదయాన్నే లేవాలి."
"తెలివి వస్తుందో, రాదో? బేరర్ తో చెప్తే?"
"అక్కరలేదు. నేను లేపుతాను లే" అన్నాడు అతడు. తలుపు పై ఎవరో తట్టిన చప్పుడుతో తెలివి వచ్చింది ఆమెకు. బేరర్ తలుపు తోసుకొని వచ్చి కాఫీ కప్పులు టేబిలు మీద పెట్టేడు. ఆమె పక్కకు తిరిగి చూసింది. అతడు బాత్ రూమ్ లోకి వెళ్ళినట్లున్నాడు . తన కాఫీ తాగి అతని దాని పై మూత పెట్టింది. అరగంట గడిచినా అతడు బయటికి రాలేదు.
"ఇంక ఈరోజుకి తిరుపతి ప్రయాణం లేదా? ఎంతసేపైనా తెమిలిరారేం?' అన్నది తలుపు దగ్గరకు వెళ్ళి.
లోపలి నుండి జవాబు లేదు. కొద్దిగా తలుపు తెరవనిదే లోపలి మాటలు వినిపించవని ఓరవాకిలిగా తలుపు తోసింది. లోపల అలికిడి లేదు.
గాభరాగా గదిలోకి చూసింది. అతని సూట్ కేసు ఉండవలసిన స్థలంలో లేదు. స్టాండు కు రాత్రి విడిచిన బట్టలు లేవు. ఆమెకు దుఃఖం ముంచుకువచ్చింది. గది, గదిలో వస్తువులు ఆమె కళ్ళ ముందు గుండ్రంగా తిరుగసాగేయి. అయోమయంగా చూస్తున్న ఆమెకు తలగడా కింద చిన్న కాగితం మడత కనిపించింది. అత్రతగా తీసి చదువుకొంది.
'అందాల రాణీ!
నీ మీద మోజింకా నాకు తీరలేదు. మరికొన్ని రోజుల పాటు హాయిగా నీతో కలిసి తిరుగుదామనుకొన్నాను. ఆ అవకాశాన్ని నువ్వు మూర్ఖంగా పాడు చేసేవు. హోటలు బిల్లు చెల్లించెను.నీ బాగ్ లో పాతిక రూపాయలు ఉన్నాయి. బుద్దిగా టిక్కెట్టు కొనుక్కొని ఇంటికి వెళ్ళిపో. ఎప్పుడైనా అవకాశం కలిసి వస్తే మళ్ళా కలుద్దాం. అంతవరకు
గుడ్ బై"
పక్క మీద పడుకొని తనివి తీరా ఏడ్చింది. ఊరడించే వారు లేరని దుఃఖం తనంతట తనే దారి చూసుకు వెళ్ళిపోయింది. ముందు సంగతేమీటని మనసు ప్రశ్నించింది . రకరకాల ఆలోచనలు బుర్రలో తిరిగేయి. అవేవీ తన వల్ల కానీ పనులని తీర్మానించుకొంది. తిన్నగా స్టేషను కు వెళ్ళి టికెట్ కొనుక్కొని ధర్డు క్లాసు లో బెంచి మీద ఓ మూలగా ఒదిగి కూర్చుంది ఆమె.
వారం రోజులనాడు ఇదే సమయంలో సుందర ప్రకృతిని చూసి మైమరిచి పోయింది. ఈనాడు ఆమె దృష్టి , ముందు గతేమిటి! తనెలా బ్రతకాలి?అన్న సమస్యల మీద నిలిచి ఉంది.
ఆమె ఆలోచనలతో సంబంధం లేనట్లు రైలు రోద చేసుకొంటూ పరుగులు తీస్తున్నది.
* * * *
రాత్రి పది గంటలకు ఇల్లు చేరెడు ప్రకాశం. ఇంట్లో అంతా జీవచ్చవంలా తలొక మూలా కూర్చున్నారు. సుందరమ్మ ఆఖరి దశలో మీద విరుచుకు పడుతున్న కష్టాల్ని తలుచుకొంటూ ఏడ్చినట్లు వాచీ ఉన్న కళ్ళు, బొంగురు పోయిన గొంతుక చెపుతున్నాయి. జానకి ముఖం ఏ ఒక్క భావం కనిపించడం లేదు. ప్రాణం లేని రాతి బొమ్మలా ఉన్నది. సూర్యారావు అప్పటి వరకూ అందరి మీదా కేకలేసి అలసిపోయినట్లు భారంగా ఊపిరి తీస్తున్నాడు.

ఈ ఆవేదన లో భాగం పంచుకోవలసిన వ్యక్తీ ప్రకాశం అంతవరకూ రాకపోవడానికి కారణం ఏమిటా అని కనకం అత్రతగా ఎదురు చూస్తున్నది. తను, శాంత రాలేదని చెప్పగానే ప్రకాశం బయటికి వెళ్ళేడు. శాంతను వెతికిందికే వెళ్ళేడెమో? ఎక్కడైనా ప్రకాశానికి కనిపించిందేమో-- అని ఆశగా అతని కోసం చూస్తున్నది.
వీధి గుమ్మం లో ప్రకాశాన్ని చూసేక అందరిలో చలనం వచ్చింది. ఇంటిలో కాలు పెట్టేవరకు ఇంకా ప్రకాశాన్ని కొన ఆశ పీకుతున్నది.
ఇదంతా తను అనవసరంగా ఊహిస్తున్నాడెమో? శారద ఇంటికి వెళ్తానన్న శాంత, దారిలో మనసు మార్చుకొని ఇంకొక స్నేహితురాలి ఇంటికి వెళ్ళిందేమో? అలాగైతే శాంత ఈసరికి ఇంటికి వచ్చే ఉంటుంది అనుకొన్నాడు. కాని, ఇంట్లో వాళ్ళ ముఖాలు చూసేసరికి తన అనుమానం నిజమే అయిందని తెలుసుకొన్నాడు. మెల్లగా చావిట్లో అడుగు పెట్టేడు. ప్రకాశం వస్తూనే "ఏమిటిలా దిగాలు పడి ఉన్నారని" అడుగుతాడనుకొంది కనకం.
కాని అతనేమీ మాట్లాడలేదు. అక్కడ ఉన్న బల్ల మీద చతికిలబడ్డాడు.
"అవసరానికి ఎప్పుడూ ఇంటికి రావేం, ప్రకాశం?' అన్నది కనకం నిష్టూరంగా.
"అవసరం అనుకొన్న చోటునే తిరిగెను వదినా!"
"శాంత ఇంటికి రాలేదు, తెలుసా? శారద ఇంటికి పోలేదుట."
"మీకన్న నాకు ముందే తెలిసింది, వదినా. కాని అప్పటికే ఆలస్యమైపోయింది. వాళ్ళు వెళ్ళిపోయేరు."
"ఆ...ఆ... వాళ్ళెవరు, ప్రకాశం?' సూర్యారావు అత్రతగా ప్రశ్నించేడు.
"శాంత , మరో అబ్బాయి."
జానకి నమ్మలేనట్లు చూసింది. శాంత కింత తెగింపు ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? తనకు చదువు ఇష్టం లేక, సంసారమే కావాలనుకొంటే, ఆ మాట ఇంట్లో ఎవరితోనైనా చెప్పవచ్చునే! ఇంతమంది ఉండి, దానికి పెళ్ళి చెయ్యాలేమనే అనుకుందా? అందరిలోకి చిన్నదని అతి ముద్దుగా చూసుకొంటున్న శాంత ఇటువంటి పని ఎందుకు చేసింది? అనుకొన్నది జానకి.
"ఇలా జరగబోతుందని నీకు ముందే తెలుసా? తెలిసే ఏమీ ఎరగనట్లు ఊరుకోన్నావా , ప్రకాశం?" సూర్యారావు తీక్షణంగా ప్రశ్నించేడు.
"ఇప్పుడు నాకేం తెలియదన్నయ్యా! చాలా రోజుల క్రితం ఓసారి ఆ పిల్లాడితో శాంతని పార్కులో చూసేను. ఆ పిల్లాడెందుకో నాకు నచ్చలేదు. వాడితో స్నేహం పెంచుకోవద్దని శాంతని హెచ్చరించెను. అటు తరువాత వాళ్ళు కలుసుకొంటున్నట్లు నాకు తెలియదు. అసలు ఆ విషయమే నా మనసులోంచి పోయింది."
"ఎంత పని చేసేవురా, ప్రకాశం! అప్పటి కప్పుడే ఆ విషయం నాతొ చెప్తే, తల తాకట్టు పెట్టయినా ఏదో సంబంధం చూసి శాంతకి పెళ్ళి చేసేసేవాడిని. ఇదంతా నువ్వు చేతులారా చేసిన నాశనం రా. తెలిసి తెలిసి ఇంటికి నిప్పు పెట్టేవు."
"వాడెం చేసేడు అన్నయ్యా? ఇలా అవుతుందని వాడికి మాత్రం తెలుసా? ఏదో చిన్న పిల్ల, ఒకసారి భయం చెప్తే బుద్దిగా ఉంటుందనుకొన్నాడు."
"మీరందరూ కలిసి బుద్దులు చెప్పబట్టే అది ఇలా తయారైంది. నా అక్క అలా తిరుగుతున్నది; నా అన్న ఇలా తిరుగుతున్నాడు . నేను మాత్రం మంచికి, మర్యాదకి ఎందుకు కట్టుబడి ఉండాలి? అనుకోని ఉంటుంది. ఇదంతా మనం నేర్పిన పాఠమే, తల్లీ!"
"అన్నయ్యా! అందర్నీ అన్నీ అంటున్నావు కాని శాంత ఇలా పరారి అవడానికి దోహదం చేసిన వారిలో నువ్వూ ఉన్నావని మరిచిపోతున్నావు.
"సాంబుకి రాబోయే కట్నానికి, శాంత పెళ్ళికి ముడిపెట్టి మాట్లాడుతుండేవాడివి. శాంత తన భావి జీవితపు పునాదుల దృడత్వం సాంబు చదువుతో ముడిపడి ఉన్నదని భావించింది. ఆ ఆశ తెగిపోయింది. ఇంక మనం ప్రయత్నించి పెళ్ళి చేసినా, కట్నం తక్కువగా చూసి, ఏ గుమస్తా కో , రెండో పెళ్ళి వాడికో ముడి పెట్టేస్తామని శాంత భయపడి ఉంటుంది. దాని మనసులో విత్తు నాటినవాళ్ళం , దాని భయాలు కూడా తెలుసుకోవలసింది" అన్నాడు ప్రకాశం.
"మీరు ఇలా వాదించుకొంటూ కూర్చుంటే అది తిరిగి వస్తుందటర్రా? నలుగురి నోళ్ళలో పడి నగుబాటు కాకముందే వెతికి తీసుకు రావాలి గానీ!" అన్నది సుందరమ్మ.
"ఊరు దాటిపోయినదాన్ని ఎక్కడని వెతుకుతామమ్మా?" అన్నాడు సూర్యారావు.
"నేను కళ్ళతో చూడలేదు, అన్నయ్యా! ఇది నా అనుమానం మట్టుకే. ఎందుకైనా మంచిది, పోలీసు రిపోర్టు ఇచ్చి వద్దాం రా" అన్నాడు ప్రకాశం.
"అందువల్ల ఏమౌతుంది?"
"సాంబు కనిపించకపోతే ఏమౌతుందని రిపోర్టు ఇచ్చాం?"
"అది వేరే విషయం రా. ఆడపిల్ల గుమ్మం దాటిందంటేనే పుట్టెడు నిందని మోసుకు తిరుగుతుంది. అది తిరిగి వచ్చినా ఆ మచ్చ పోదు."
'అయితే ఏం చెయ్యాలని నీ ఉద్దేశం?"
"దానంతట అది తిరిగి వస్తే, అప్పుడు ఆలోచిద్దాం!"
"నీ అభిప్రాయంతో నేను ఏకీభవించడం లేదన్నయ్యా! శాంత ఉనికిని తెలుసుకోడం మన ప్రధమ కర్తవ్యం. దానికి అది ఉన్న చోటు బాగుండి, అక్కడే ఉండి పోతానంటే , నా అభ్యంతరం లేదు. అలా కాక మోసపోయి అగచాట్ల పాలవుతుంటే ఆదుకోవలసిన బాధ్యత మనందరి పైన ఉంది" అన్నాడు ప్రకాశం బయటికి వెళ్ళిపోతూ.
"ప్రకాశం! మన ప్రయత్నాలు మనం చేద్దాం గాని, పోలీసు రిపోర్టు ఇవ్వకు. నలుగురి నోళ్ళలో పడితే, దానికి తిరిగి పెళ్ళి కాదు. ఊర్లో బుర్రేత్తుకోని తిరగలెం" అన్నది సుందరమ్మ.
"ఈ ఊర్లో తిరగలేక పొతే ఇంకో ఊరు ఉంటుందమ్మా. శాంతకి పెళ్ళి కాకపొతే ఉద్యోగం చేసుకు బ్రతుకుతుంది. కాని, ఈ అవమానం భరించలేక శాంత ఏ నుయ్యో, గొయ్యో చూసుకొంటే, నీకు ఇంకో కూతురు రాదు. వాడినీ వెళ్ళనీ" అన్నది జానకి.
సుందరమ్మ వెళ్ళనిచ్చెందుకు , మానేందుకు ప్రకాశం అక్కడ లేడు. వీధి చివర మలుపులో లీలగా కనిపిస్తున్నాడు.
