'అంత పెద్ద సీటులో కూర్చున్న మీరు యింకే విషయం గురించి ఆలోచిస్తారు సార్! కేసు గురించి తప్ప!'
'కరెక్ట్, నేను కేసు గురించే చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నాను. నాలుగయిదు రోజులు ఆ వెధవని వెంటాడాము, చేతికి చిక్కే సమయంలో ఉడాయించాడు."
"అవును సార్! చిక్కీ చిక్కనట్లు చిక్కి, చటుక్కున మాయమయ్యాడు" అహోబిలం అన్నాడు.
'సరిగ్గా అదే జరిగింది అదే నా బాధ"
'బాధపడకండి సార్!'
'బాధపడకుండా ఎలా ఉంటాను బంగారం లాంటి (కెమెరా కాదూ!) కేసు అందినట్లే అంది అందనంత దూరం పోతే బాధగాక సంతోషం కలుగుతుందా!'
'నిఅజ్మే సార్!'
'గుడిలో త్రవ్వటము నా తప్పే. గుడిలో హత్యలు జరగటము నా తప్పే అంటారు నా మొగుళ్ళు. నేను నేను.... దొంగనాకొడుకులని పంపించి త్రవ్వమన్నానా! చంపమన్నానా. అక్కడికీ మన అదృష్టంకొద్దీ దొంగల ముఠాలోని ఓ వెధవ సన్యాసి మనకి కనపడి చచ్చాడు. వాడు గుడి గోడలని నేలని గోపురాన్ని ఎవరూ చూడకుండా పరిశోధిస్తుంటే మనం చూసి మనం అంటే నేనులే. చూసి పరిశోధిస్తే క్లూ అందిన సమయంలోనే వాడు ఉడాయించె, నేను చావనా!'
'వద్దు సార్! అది మీ తప్పు ఎంతమాత్రం కాదు. మనం వాడివెంట పడుతున్నామని గ్రహించాడు. పక్షిలా ఎగిరిపోయాడు. ఎప్పటికయినా వాడిని మీరు పడతారు చూడండి."
'మనం వాడి....వెంట....పడుతున్నామని....వాడు.... గ్రహించాడంటావ్ అంతేనా!'
"అంతే సార్!"
"ఎలా గ్రహించావ్?"
'చచ్చితిని ఈ పిచ్చిముండా వెధవతో ఒకమాట ఎక్కువ మాట్లాడినా తప్పే తక్కువ మాట్లాడినా తప్పే. వెధవ కేసు పోతే పోయింది. మారువేషాలు వేసుకుని తిరగటం వల్ల వూహించని విధంగా నాలుగు రాళ్ళు దొరికాయి. తిక్కనా కొడుకుతో ఏదొచ్చినా కష్టమే' అనుకున్నాడు అహోబిలం.
"ఏమిటి ఆలోచిస్తున్నావు! వాడిని వెంటాడమని వంటరిగా వాడి వెంట నిన్ను పంపించినప్పుడు వాడికంట నీవు పడ్డావా?" ఇన్ స్పెక్టర్ వర్ధనరావు గాంభీర్యంగా ముఖం పెట్టి గట్టిగా అడిగాడు.
"లేదు సార్! నేను చాలా జాగ్రత్తగా మెలిగాను. వాడు అనుమానించే పని ఏదీ నేను చెయ్యలేదు, మీరు వాడి గది వెతికినప్పుడు ఏమన్నా....."
అహోబిలానికి అడ్డు తగిలి "ఏమిటి? ఏమన్నా?" గద్దిస్తూ అడిగాడు ఇన్ స్పెక్టర్ వర్ధనరావు.
"మీరు ఏమన్నా పొరపాటు చేశారని నేనటం లేదు సార్! వాడి గదిలో వాడి సామాన్లలో ఏదయినా చిన్న క్లూ దొరికిందా అని అడగబోయాను. చిన్న క్లూ దొరికితే చాలుకదా సార్ మనం ముందుకి సాగవచ్చు. లేని ఉత్సాహాన్ని తెచ్చుకుని పొరపాటుగా అనబోయిన మాటని కప్పిపుచ్చుకుని తెలివిగా అన్నాడు అహోబిలం.
"నేనక్కడ చాలా జాగ్రత్తగా వెతికాను. తీసిన వస్తువుని తీసిన స్థానంలో పెట్టాను. ఒక మనిషి లోపలికి వెళ్ళి సామానులు వెతికి మళ్ళీ బయటకి వెళ్ళిపోయాడు అన్న విషయంలో ఏమాత్రం పొరపాటు లేకుండా చేశాను"
వర్ధనరావు చక్కగా బొంకాడు. "కానీ, అతని కళ్ళముందు చేయి జారి పగిలిన అద్దం పెంకులు కానవస్తూనే వున్నాయి. తన తెలివితక్కువ వలననే అద్దం పగిలింది. వాడా రాత్రికి గదిలోకి వచ్చి చూసుకుని ఉంటాడు. 'ఎవరో తన గదిలోకి దూరారని గ్రహించగానే ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా రాత్రికి రాత్రే ఉడాయించాడు. అపశకునంలాగా అద్దం ఎలాగూ పగిలింది కాబట్టి ఆ రాత్రి వాడిని అరెస్ట్ చేసినట్లయితే సరిపోయేది. నాలుగు ఉతికినట్లయితే చచ్చినట్లు నిజం చెప్పేవాడు' అనుకున్న వర్ధనరావు తగ్గిపోయాడు. గాలి తీసిన బెలూన్ లాగా ముఖం పెట్టి "ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు పాలుబోవటంలేదు అహోబిలం" అన్నాడు.
"మళ్ళీ మనం మారువేషాలు ధరించి అన్నిచోట్లా తిరుగుతూంటే వాడు మనకి కనబడకపోడు సార్!"
"టోపీ పెట్టుకున్నంత తేలికగా మాట చెప్పావు. అంత లావు తలపాగా నెత్తిన పెట్టుకుని మోయాలంటే నా పని చచ్చే చావుగా ఉంది. ఇదేమన్నా ముఖ్యమంత్రి పదవా! నిమిషానికో వేషం మార్చటానికి. మణుగుబరువుండే తలపాగా మొయ్యటానికీనూ" వర్ధనరావు చికాకు పడుతూ అన్నాడు.
"ఇహ్హిహ్హీ!" అని నవ్వబోయి అలా నవ్వితే వర్ధనరావు గజం ఎత్తున లేస్తాడని గుర్తుకురాగా చిరునవ్వు మాత్రమే చిందిస్తూ "ఇప్పుడు మనం ఆ వేషం వదిలెయ్యాలి సార్" అన్నాడు అహోబిలం.
"ఆ వేషం వదిలేసి ?..."
"మరే వేషం ధరించాలి"
"ఎందుకు?.... ఎందుకు అలా చెయ్యటం? నా బుర్ర పనిచేయటం లేదు. అదేదో నువ్వే చెప్పు."
'అదికాదు సార్! ఆ దొంగవెధవ కన్ను ఇంకా గుడిమీద ఉన్నది అన్నమాట ఖాయం. వాడి వెనక పెద్ద ముఠా ఉండి వుంటుంది, నాలుగుసార్లు గుడిని త్రవ్వారు నలుగురిని హత్య చేశారు. అయినా వాడెవడో ఇంకా గుడిని పరిశీలిస్తున్నాడంటే ఏదో ఆశించే కదా? నా ఉద్దేశ్యంలో ఆ గుడిలో ఎక్కడో మణిమాణిక్యాలు పాతేసి ఉండి వుంటాయి. వాటికోసం వెతుకుతున్నారేమోనని అనుకుంటున్నాను. దేనిమీదైనా దొంగ కన్ను పడ్డా, పోలీసు వాడి కన్ను పడ్డా 'అది ఫినిష్' అని ఈ మధ్యనే 'వీధిలో వెధవలు" అనే నవలలో చదివాను సార్! వాడి కన్ను గుడిమీద ఉంది. మన కన్ను వాడిమీద ఉంది, కనుక...."
అహోబిలం చెబుతూంటే ఆ మాటలు భలే నచ్చాయి వర్ధనరావుకి. "కనుక అంటూ ఆగుతావేమిటయ్యా! తొందరగా చెప్పక' అన్నాడు ఆత్రుతగా వర్ధనరావు.
'కనుక వాడు ఇంతటితో ఆ గుడిని వదలడు. వాడు ఏదైనా కనిపెట్టగానే మరోసారి గుడి త్రవ్వకానికి ప్రయత్నిస్తాడు. వాడిని గుడిని త్రవ్వనిద్దాము. సరైన సమయంలో లటుక్కున మనం వాడిని పట్టేద్దాము. వాడు దేనికోసం త్రవ్వుతున్నాడో, అక్కడేం ఉందో మనకి కనబడుతుంది. నా ఉద్దేశ్యంలో అక్కడెక్కడో మణిమాణిక్యాలే పాతేసి ఉంటాయి.'
'మణిమాణిక్యాలే!' అంటూ నోరు తెరిచాడు ఇన్ స్పెక్టర్.
'ఖచ్చితంగా చెప్పలేనుగాని, మణిమాణిక్యాలు కాకపోతే వజ్రాలు, రత్నాలు, కెంపులు, మరకతాలు కూడా కావచ్చు. కనుక....'
'చెప్పు చెప్పు!' ఆత్రుతగా ముందుకి వంగి అన్నాడు వర్ధనరావు.
"చెప్పేదేముంది సార్! అంతే" అన్నాడు అహోబిలం.
'అయితే ఇప్పుడు మనం ఏంచేద్దాం?'
'మళ్ళీ మరువేషం వెయ్యటమే!'
'ఏమిటి? నెత్తిన మణుగు తలపాగా, గోచీపాత గుడ్డలూ, ఇంక పొగాకు చుట్ట....'
