"వద్దు సార్! వద్దు"
"మారువేషం అంటావ్! మరోప్రక్క వద్దు వద్దు అంటావు, ఏమిటయ్యా నీ ఉద్దేశ్యం!!"
"వాడు మరో మారువేషంలో వస్తాడు. ఎందుకంటే మనం గుర్తుపట్టకుండా ఉండటానికి. వాడు మన పొరబాటునో, మన గ్రహపాటునో ఆ వేషంలో ఉన్న మనల్ని చూశాడనుకోండి. అప్పుడు మనపని ఏమవుతుంది? కనుక, మనమిప్పుడు మరో వేషం ధరించాలి."
"నువ్వు చెప్పిందీ పాయింటే. ఈ తఫా ఏం వేషాలు వేస్తే బాగుంటుందో నువ్వే చెప్పు!"
"రామన్న, లచ్చన్న దొర, కొండదేవర ఆన....!"
"నీకేదో పిచ్చిపట్టినట్టుంది. ఇదేం భాష, ఇదేం గోల. సరిగ్గా చెప్పి తగలడు!"
"కోయవాళ్ళను మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి సార్! మనం ఈ తఫా వేసే వేషాలు కోయదొరల వేషాలు. తలపాగా బరువు మోయనక్కరలేదు. వేషం చాలా తేలిగ్గా వేసుకోవచ్చు. ఆ వేషంలో రూపం పూర్తిగా మారిపోతుంది. కాకపోతే భాషే వేరుగా మాట్లాడాలి. "కొండదేవర ఆన, రామన్న, లచ్చన్న, అయ్య సెప్పిండు, అమ్మ పలికింది. హుస్సో! హుస్సో, హుర్రో, హుర్రో" అని అలా మాట్లాడాలన్నమాట."
'భాష కాస్త గట్టిగానే ఉంది, పలకటంలో పొరపాటు పడను కదా!' తనమీద తనకే అనుమానమొచ్చి అడిగాడు ఇన్ స్పెక్టర్ వర్ధనరావు.
'భాష విషయం, మీ విషయం నేను చూసుకుంటా గదా సార్. పెద్దదొర....'
'మధ్యలో ఈ పెద్ద దొర ఎవడు?'
'మీరే సార్, మీరే, కోయదొరల వేషాలలో ఉన్న మనం అప్పుడు మీరు పెద్దదొర గానూ, నేను చిన్నదొర గానూ మారిపోతాము. మీరెక్కువ మాట్లాడనక్కరలేదు. ఏదన్నా మాట్లాడవలసిన సందర్భం వస్తే నా చెవిలో మాట్లాడండి. ఎవరైనా అదేమిటని అడిగితే "పెద్దదొర పైకి మాట్టాడడు. ఇది కొండదేవర ఆన, నా చెవిలో ఉఫ్ అని ఊదుతాడు. నా కర్థమైపోద్ది" అంటాను అని అహోబిలం చెప్పాడు.
"ఇది బాగుంది?" అన్నాడు ఇన్ స్పెక్టర్.
ఆ తర్వాత కొద్దిసేపు ఇరువురూ కోయదొరల వేషాలు ఏ టైంలో వేసుకోవాలి, ఎలా సంచారించాలి? అని చర్చించుకుంటూ ఉండిపోయారు.
ఇప్పుడు ఇన్ స్పెక్టర్ వర్ధనరావు కళ్ళముందు ఖరీదయిన బుల్లి కెమేరా కనబడటంలేదు. వజ్ర, రత్న, వైడూర్య మణిమాణిక్యాలు కనబడుతున్నాయి.
20
ఆర్ ష ఆయన వెనుకనే సాధన గదిలోకి వెళ్ళారు.
గది తలుపులు నిశ్శబ్దంగ మూసుకున్నాయి.
"ఊ....ఇప్పుడు చెప్పు" అన్నాడు ఆర్ ష.
సాధన వివరంగా చెప్పింది.
సాధన చెప్పింది విని 'ఇంత చిన్న విషయానికి నీవు రావాలా సాధనా! కబురు చేస్తే మనిషిని పంపేవాడిని కదా?' అన్నాడు ఆర్ ష.
'పంపినా పని అవుతుంది కాని నేను వచ్చి స్వయంగా అన్ని విషయాలు చెపితే ఏదైనా పొరపాటు వుంటే సూచనలు ఇస్తారు. నేను వేసిన ప్లాన్ లో అవకతతవకలు వుంటే మీరు చెపితే మరో పథకం వేద్దామని....
'అవసరం లేదు. నీవు రంగంలోకి దిగేముందు ప్లాను వేసి చెప్పావు. నీవు చెప్పినప్పుడే నాకు నచ్చింది. రంగంలోకి దిగి పథకం ఆచరణలో పెడుతున్న విధానం కూడా అద్భుతంగా ఉంది. ఇహ మిగిలింది పూర్తి చెయ్యటం ఒక్కటే"
"నా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను బాస్!"
"సాధన సాధించి తీరుతుంది" చిరునవ్వుతో అన్నాడు ఆర్ ష.
"మీరు నన్ను పొగుడుతున్నారు."
"లేదు ఉన్న వాస్తవాన్ని చెపుతున్నాను."
"నాకేం మాట్లాడాలో తెలియటం లేదు." అని మిన్నకుండిపోయింది సాధన.
'లంబు విషయం తెలుసుకోవాలని లేదా?"
"నాకు అడ్డురాడని మాత్రం తెలుసు."
"ఎలా?"
"ముందరి కాళ్ళకు బంధాలు వేసే మీరుండగా నాకేం దిగులు. లంబా స్వేచ్చగా ఉన్నట్లయితే గ్యారంటీగా నాకు మరోసారి అడ్డుతగిలేవాడు."
"చక్కగా ఊహించావు. మనిషి గట్టివాడే కదా అని రంగంలో ఉంచాను. కాకపోతే గుక్కతిప్పుకోటానికి వీలులేనంత పెద్ద పని అప్పగించి అతన్ని బహుదూరంగా పంపించాను. ఏ నిమిషాన లంబా ఏం చేస్తున్నాడో చూస్తూ మరు నిమిషాన ఆ రిపోర్టు నాకందేలా వేరే మనిషిని అతని నీడలా మసిలేలా పంపించాను. లంబా వెధవ్వేషం వేయబోయే మరుక్షణం నాకు తెలుస్తుంది కాబట్టి చిక్కు లేదు. ఇప్పుడు చూసీ చూడనట్లు ఊరుకున్నాను. రెండోసారి వార్నింగు ఇస్తాను. మూడోసారి సరాసరి....అంతే" అంటూ ఆర్ ష చేయి పైకెత్తి చూపించాడు.
అలా ఆర్ ష చేయి పైకెత్తాడూ అంటే ఆ వ్యక్తి శాశ్వతంగా తిరిగిరాని చోటుకి పోయినట్లే.
ఆర్ ష సంగతి బాగా తెలిసిన సాధన నవ్వీ నవ్వనట్లు నవ్వి ఊరుకుంది ఏ కామెంటూ చేయలేదు.
"అక్కడ నీకెవరూ అడ్డుతగలటంలేదు కదా!"
"ఇద్దరు పిచ్చివాళ్ళు తగులుతున్నారు వాళ్ళని ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాను."
"వాళ్ళెవరు?"
"ఒకడు ఇన్ స్పెక్టరు రెండోవాడు అతనిదగ్గర కానిస్టేబుల్.
ఆర్ ష నవ్వాడు. 'వాళ్ళ సంగతి చెప్పావు కదా! లంబూ జంబుకేశ్వరులు. రామన్న లక్ష్మన్న వేషాలు ఇంకా తియ్యలేదా?'
'ఈతఫా కోయదొరల వేషం కట్టారు, ఎవరి కొంప తీయటానికో' సాధన నవ్వుతూ చెప్పింది.
'వాళ్ళ కొంప వాళ్ళే తీసుకోకుండా వుంటే చాలు. ఆర్ ష పెద్దగా నవ్వుతూ అన్నాడు.
"ఆ వాళ్ళు అంతమాత్రం వాళ్ళే. వాళ్ళిద్దరిలో వర్ధనరావు పప్పు. రెండోవాడు అహోబిలం కాస్త బుర్ర వున్నవాడు."
"ఆ బుర్రలో గుజ్జు తీసేస్తే పోలా!'
"పాపం నలుగురు పిల్లలు గలవాడు. వాళ్ళిద్దరూ ఆ వేషాల్లో వుంటే చూడముచ్చటగా వుంది. వాళ్ళని మరోవిధంగా ఉపయోగించుకుందామా అని ఆలోచిస్తున్నాను.'
