Previous Page Next Page 
పన్నీటి కెరటాలు పేజి 31


    అదసలే పగిలిన అద్దం, వర్ధనరావు అటూ ఇటూ దాన్ని త్రిప్పటంతో పగిలిన అద్దం పెంకు క్రిందకి జారి భళ్ళుమని పెద్ద శబ్దంతో వెయ్యిముక్కలై ఊరుకుంది.
    వర్ధనరావు మొహం పాలిపోయింది.
    అద్దం పెంకులన్నీ క్రిందవుంటే తన గదిలోకి ఎవరో వచ్చారని అతను గ్రహిస్తాడు. అతను అలా గ్రహించకుండా ఉండాలంటే అద్దం పెంకులన్నీ ఏరి అవతల పారవెయ్యాలి. ఇప్పుడు ఆ పెంకులన్నీ ఏరుతూ కూర్చుంటే గంటపైనే పడుతుంది.
    'దిక్కుమాలిన అడ్డం పడిచచ్చింది. ఆదిలోనే హంసపాదు_ ఇప్పుడు నేనేమి చెయ్యాలి?' అని వర్ధనరావు తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటే చటుక్కున పిల్లి గుర్తుకు వచ్చింది. 'ఆ... గదిలోకి పిల్లి దూరి బల్ల ఎక్కి అద్దాన్ని క్రిందకి తోసేసుంటుంది. దాంతో అద్దం పగిలి ఉంటుంది అనుకుంటాడులే అతను" అని వర్ధనరావు అనుకుని తృప్తిచెందాడు.
    అద్దంలో ఏ రహస్యం లేదు కాబట్టి అద్దాన్ని బల్లమీదనే ఉంచి ఇవతలకి వచ్చాడు. ఒకవేళ అద్దాన్ని పిల్లి పడవేసినా అద్దం మొత్తం నేలమీద పడిఉండాలి. ఆ ఆలోచన వర్ధనరావుకి రాలేదు. అసలుని వదిలేసి కొసరుని పట్టుకుని వ్రేలాడటం వర్ధనరావుకి అలవాటే.
    బ్యాగ్ కి కాని, పెట్టెకి కానీ తాళం వేసి లేదు. ఈ తఫా వర్ధనరావు పెట్టెని, బ్యాగ్ ని క్షుణ్ణంగా పరిశీలించి యధా స్థానంలో పెట్టాడు. పెట్టేలోనూ బ్యాగ్ లోనూ మామూలు వస్తువులే ఉన్నాయి. అనుమానించదగినవి ఏవీ కానరాలేదు. అన్నీ మామూలు వస్తువులే. అతి ఖరీదైన బుల్లి కెమెరా మాత్రం ఉంది. ఆ కెమెరా తీసుకుందామని వర్ధనరావు మనసు మహా పీకింది. కెమెరా తను తీసుకువస్తే అతనికి అనుమానం కలుగుతుంది కనుక తీసుకెళ్ళకపోవటమే ఉత్తమం. అతనిని ఎలాగూ రెండు మూడు రోజులలో తను ఎలాగూ పట్టుకుంటాడు కాబట్టి అప్పుడు కెమెరా లాక్కుంటే సరిపోతుంది. నా కంటపడ్డ వస్తువు ఎక్కడికి పోతుందిలే అని తృప్తి చెందాడు.
    ఇంక ఆ గదిలో పరిశీలించటానికి ఏమీ కనపడలేదు, అప్పటికే దాదాపు గదిలోకి వచ్చి గంటయింది.
    ఇంక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా గదిలోంచి బయటకి వచ్చి, యధాప్రకారం ఆ గదికి తాళం వేశాడు వర్ధనరావు. అక్కడినుంచీ వేగంగా బయలుదేరి పుల్లారావు కొట్టు దగ్గరికి వచ్చి కూర్చున్నాడు.
    అహోబిలమూ, వర్ధనరావు పుల్లారావు కొట్టు దగ్గర కలుసుకుందామని ముందే అనుకున్నారు.
    అందువల్ల.
    వర్ధనరావు అహోబిలం రాకకై అక్కడ నిరీక్షిస్తూ కూర్చున్నాడు.

                         19

    "ఛీ ....ఛీ.... థూ...."
    "ఛీ ....ఛీ.... థూ...." అనుకోటం తెల్లారి లేచి ఇది రెండొందల మూడోసారి ఇలా అనుకున్నది ఎవరో కాదు ది గ్రేట్ ఇన్ స్పెక్టర్ వర్ధనరావు.
    ఇన్ స్పెక్టర్ కళ్ళముందు మాటిమాటికీ ఖరీదైన బుల్లి ఫారెన్ కెమెరా (అతి ఖరీదైనది ఈ విషయం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి) కనపడుతున్నది.
    "నేను చాలా పొరపాటు చేశాను"
    "నా అంత దగుల్ బాజీ వెధవ ఎక్కడా ఉండడు"
    "పరమ నికృష్ట నా కొడుకుని...."
    "నా ముఖానికి తోడు....నా తెలివికి తోడు....ఈ ఇన్ స్పెక్టర్ పదవి యాక్ ధూ...."
    "ఛీ....ఛీ....థూ...." తన్నితాను దూషించుకున్న తర్వాత రెండొందల నాలుగోసారి 'ఛీ....ఛీ....థూ....' అనుకున్నాడు ఇన్ స్పెక్టర్ వర్ధనరావు.
    ఇన్ స్పెక్టరు ఛీ ఛీ లు థూ థూ లు అనుకుంటున్న వేళ అహోబిలం బిక్కుబిక్కుమంటూ లోపలికి వచ్చాడు.
    'సార్' భయపడుతూ పిలిచాడు అహోబిలం.
    "ఛీ....ఛీ....థూ....నీయ__!" ఈ తఫా రెండొందల అయిదోసారి పైకే ఈ మాట అనుకున్నాడు ఇన్ స్పెక్టర్ వర్ధనరావు. అంతేకాదు పిడికిలి బిగించి తన ఎదురుగా ఉన్న బల్లమీద గుద్దాడు.
    బల్ల గట్టిది కాబట్టి విరగలేదు. దానిమీద వస్తువులు ఎగిరెగిరి పడలేదు.
    అహోబిలం ఈ తఫా సార్ అనటానికి కూడా భయపడిపోయి బిక్కచచ్చిపోయిన వాడిలా ముఖంపెట్టి నోరు కట్టేసుకున్నట్లు అలా కర్రలా బిగుసుకుని నుంచుండిపోయాడు.
    ఏదో వాసన బజ్జీ ముక్కులో దూరటం వల్ల రెండుసార్లు చప్పుడు చేస్తూ ఎగబీల్చి తలెత్తి చూశాడు వర్ధనరావు.
    ఎదురుగా గాలిలేక ఎగరని జెండా బొంగులాగా అహోబిలం నిలబడి ఉన్నాడు.
    "నువ్వొచ్చి ఎంతసేపు అయింది?" వర్ధనరావు అడిగాడు.
    "ఇ....ఇప్పుడే సార్!"
    'ఇప్పుడే అంటే ఎప్పుడు? అప్పుడు నేనేం చేస్తున్నాను!"
    'మీరు....మీరు....'
    'నాన్చొద్దు విషయంలోకి రా!'
    'అప్పుడు సరిగ్గా మీరు....'
    "ఆపొద్దు కానియ్యి. ఇలా నాన్చబట్టే బంగారంలాంటి కెమెరా ఛీ....ఛీ.... శనిలాగా నన్ను వెంటాడుతూనే ఉంది. థూ.... ఊ.... అది నా స్వవిషయంలే నీ సంగతి కానియ్యి."
    "అప్పుడు సరిగ్గా మీరు ఛీ....ఛీ....థూ....నీయ.... అన్నారు. అలా అంటూనే పిడికిలి బిగించి బల్లమీద గుద్దేరు, అంతేసార్! అదిచూసి నేను మారు మాట్లాడలేక నిలబడిపోయాను" అహోబిలం ధైర్యంగా ఉన్నమాట చెప్పాడు.
    "అంతకుమించి నేనేమీ పైకి మాట్లాడలేదు కదూ?"
    "లేదు సార్!"
    "సరిగ్గా అంతేనంటావ్?"
    "సరిగ్గా అంతేసార్!"
    'మరి నీవు లోపలికి రాంగానే పిలవలేదెందుకని?'
    "పిలిచాను సార్!"
    "ఏమని పిలిచావు?"
    "సార్! అని సార్!"
    "నీ పిలుపు నాకు వినపడలేదే?"
    'ఎలా వినపడుతుంది సార్! మీరు సీరియస్ గా ఆలోచిస్తుంటిరాయె'
    'ఏ విషయం గురించి ఆలోచిస్తున్నానంటావ్!'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS