అదే విషయాన్ని చెప్తోంది మిస్ మార్లిన్. ఆమె చెప్పేదానినిబట్టి నేను తెలుసుకున్నది యదార్ధమే అని తేలిపోయింది.
"పూర్వరంగంతోనే ప్రొద్దుపొడుస్తోంది. యింకా అసలు కధ ఆరంభమయ్యే దెప్పుడు?" అన్నాను మిస్ మార్లిన్ తో.
"నీకు కావలసిందేమిటి?" అని అడిగింది మిస్ మార్లిన్ అప్పటికి దాదాపు ఒంటిగంట అయింది. నక్కలు అరుస్తున్నాయి. యెడగండు అరుపుకీ, పులి అరుపుకీ తేడా నాకు తెలియదు. అటువంటిదే యేదో విన్పిస్తోంది మిస్ మార్లిన్ కి యిదంతా విన్పించటల్లేదు. ఆమె పట్టించుకోలేదు కాని నాకు భయంగా వుంది. గురజాడ అప్పారావుగారి గేయం గుర్తుకి వస్తోంది......పూర్ణిమ యింటికి రాదాయె, కాళిక మెడలో హారము లమరెను పూర్ణమ యింటికి రాదాయె అమ్మో! ఆ పదాలు గుర్తొస్తేనే భయంగా వుంది.
ఎట్లాగో నాకు నేనే ధైర్యం చెప్పుకుని ఆ మాటలు వింటూ ఆ కధతో తదార్మ్యం చెందటానికి ప్రయత్నిస్తున్నాను.
"మిస్ మార్లిన్! ఆడతనం అవమానించబడగా తాటాకు మంటలకు తనువు అర్పించిన మహాదేవి మల్లమ్మ యధార్ధకధ కావాలి నాకు చెప్పవూ? ప్లీజ్ చెప్పవూ?" అని అడిగాడు.
"ఆచార్లూ! నా కధ నీకు చెప్పుకోనా? రెండువందల యిరవై మూడు సంవత్సరాల తర్వాత నా రాణీతనాన్ని, నా తల్లితనాన్ని, నా తపనని, నా ఆంతర్యాన్ని కొలవాలని ప్రయత్నించే ఒక మనిషివి నీవు పుట్టావా? యెందుకయ్యా చచ్చిపోయిన చరిత్రమీద నీకింత ఆరాటం?" అంటోంది మిస్ మార్లిన్.
"మహాదేవి, మల్లమ్మా! చరిత్ర యెన్నటికీ చావదు. అది బీజంలో ప్రాణంలా బ్రతికే వుంటుంది. చైతన్యశీలి అయిన కాలం కడుపులో ఒదిగి వుంటుంది. తనకోసం పరితపించేవారి చేతిస్పర్శ తగలగానే పులకించి పరవశించి తన నిజస్వరూపాన్ని చూపుతుంది. చరిత్రకు చావు అంటూ వుంటుందా?" అన్నాను నేను.
మిస్ మార్లిన్ మహాదేవి మల్లమ్మలా నవ్వింది.
"నాలోని తపనకు నిరాశ అనే మత్తుమందు యిచ్చి నిద్రపుచ్చాను. యివ్వాళ మళ్ళీ నీ ఆలోచనలు సూర్యకిరణం తామరపువ్వుని తాకినట్లు నా తపనను తాకుతున్నాయి. మనిషికి బైట ప్రపంచం యెంత వున్నదో అంతకన్నా విశాలమైన ఆంతరిక ప్రపంచం వుంటుంది. మామూలు మనిషి అయినా, మహారాణి అయినా అంతరిక ప్రపంచంలో తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోలేనిదే వెలుపల ప్రపంచంలో మనిషిగా నిలువలేరు. నీవు నా ఆంతరికమయిన విశాల ప్రపంచంలోకి వస్తావా? రా! అక్కడ యెన్ని సుడిగుండాలున్నాయని. అవన్నీ చూచి పారిపోకుండా నిలుస్తావా నువ్వు నిజాన్ని భరించే చేవ వుందా నీకు? అంత శక్తిని నీకు భగవంతుడు యివ్వాలని కోరుతున్నాను.
"రా! నాతోరా! అగ్నిగోళంలా మండుతున్న నా ఆంతర్యపు సరి హద్దులమీద కాలుపెట్టు. రెండుంపావు శతాబ్దాల తర్వాత నాకు దొరికిన మొట్టమొదట అతిధివి నీవు."
"నిప్పు కాలుతుంది. నిజం ప్రేలుతుంది."
"దానిని యెవరూ దాచలేరు మసిపూసి మారేడుకాయని చెయ్యలేరు. రా! నాతో వచ్చి యీ ఆంతర్యమనే అగ్నిగుండంలో దూకు" అంటూ మిస్ మార్లిన్ నా చేయి పట్టుకుంది. ఆమె చేయి నిజంగానే కాలుతోంది.
నాకు యేమయిందో తెలియదు. బహుశా ఆమె మాట్లాడుతోంది అనుకుంటాను. ఆమె మాటలు నాకు మాటల్లా విన్పించటం లేదు. ఒక దృశ్యంలా కన్పిస్తున్నాయి. నేను ఆ దృశ్యం చూస్తున్న క్షణాలు యెన్నో జన్మలలో చేసుకున్న పుణ్యం ప్రసాదించైనా వరాలు అనుకున్నాను.
నేను ఆ దృశ్యం చూస్తూ వుండగా క్షణాలు దొర్లిపోతున్నాయి.
* * *
"అమ్మా, మల్లమ్మా!" పేగులన్నీ మూటకట్టుకుని, ప్రేమనంతా నోటకట్టుకుని పిలిచింది వెంకమాంబ కశింకోట ప్రభువు రామరాయుడు భార్య రామరాయుడు వెంకమాంబలకి మల్లమ్మ పెద్దకూతురు జగ్గమాంబ రెండోకూతురు. తెలివిలోనూ, అందంలోనూ అప్ప చెల్లెళ్ళు ఒకళ్ళకి ఒకళ్ళు తీసిపోరు. బాణాలు వెయ్యటంలోనూ, యీటెని విసరటంలోనూ, కత్తి పట్టటంలోనూ ఒకళ్ళని మించినవాళ్ళు మరొకళ్ళు.
"ఎందుకమ్మా పిలిచావు?" అంటూ దగ్గరగా వచ్చింది మల్లమ్మ. ఆమె కన్నెతనం ఆ చిలిపికళ్ళలోనే కన్పిస్తోంది.
"ఎందుకా? యిలారా చెప్తాను" అని పిల్చింది వెంకమాంబ. మల్లమ్మ నవ్వుకుంటూ దగ్గరగా వెళ్ళింది. ఆమెను పొదివి పట్టుకుని, తలను భుజంమీద ఆనించుకుని నెత్తిమీద ముద్దుపెట్టుకుని" యిందుకు...." అని నవ్వుతూ వదిలేసింది తల్లి.
కూతురు సిగ్గుతోనూ, వల్లమాలిన ప్రేమతోనూ తల్లిని కావిలించు కుని వొదిలిపెట్టలేదు. తల్లిని అల్లుకుపోయింది.
"అందుకు కాదులే! యింకా యెందుకో పిలిచావు?" అంది తల్లిని కౌగిలింతలోంచి విడిచిపెట్టకుండానే.
వెంకమాంబ కూతురు గడ్డం పుచ్చుకుని తలపైకి యెత్తి "నువ్వు అదృష్టవంతురాలివి తల్లీ" అంది.
"ఏమిటబ్బా, నా అదృష్టం?" అనుకుంది మల్లమ్మ. యెంత ఆలోచించినా ఆమెకు అర్ధం కాలేదు.
"ఎందుకేమిటి?" అంది మూతి సున్నాలా చుట్టి గారాలుపోతూ.
"నీకు చెప్పకుండా యెలా? చెప్తాలే! తొందర పడకుమరి!" అంటూ వూరించింది తల్లి.
