ఆ మాటన్న మాధురి వేపు ఓరగా చూసి.
"సిన్మా యాక్టరునన్నావ్.......ఆ మాత్రం కంపెనీ ఇవ్వలేవా......." విమల్ వేపు చూస్తూ నవ్వుతూ అన్నాడు సుజన్ మిత్ర.
"ఇలాగ కంపెనీలు ఇవ్వడం నా కలవాటు లేదు."
"మా కెనడాలో ఎక్కువగా తాగేది లేడీస్ ......నీకు తెల్సా ఆ విషయం ....." మళ్ళీ అన్నాడు సుజన్ మిత్ర పెద్దగా నవ్వుతూ.
ఏం మాట్లాడలేదు మాధురి.
"ఇలాంటి చిన్న చిన్న మీటింగుల్లోనే నువ్వు కంపెనీ ఇవ్వకపోతే రేపు పెద్ద పెద్ద పార్టీల్లో నాకెలా కంపెనీ ఇస్తావ్" మాధురి కళ్ళవేపు చూస్తూ మెల్లగా నవ్వుతూ అన్నాడు.
విమల్ గ్లాసులోని డ్రింక్ ని నెమ్మదిగా సిప్ చేశాడు.
"మీకు తెలుసా.......విమల్ నిన్నటి వరకూ ఉత్తి మరదలు, ఇప్పట్నించి షీ ఈజ్ మై ఉడ్ బీ......ఇప్పటివరకూ అలవాటు లేదనుకోండి ఈ క్షణం నుంచి అలవాటు చేసుకోవాలి గదండి. ఏమంటారు."
"షీ ఈజ్ మై ఉడ్ బీ" ఆ మాట వినబడగానే , సర్రున విమల్ కళ్ళు మాధురి వేపు తిరిగాయి---
ఏమీ మాట్లాడలేని అసందిగ్ధ పరిస్థితిలో పడిపోయింది మాధురి.
షీ ఈజ్ మై ఉడ్ బీ. షీ ఈజ్ మై ఉడ్ బీ, షీ ఈజ్ మై ఉడ్ బీ
విమల్ కళ్ళల్లోకి ప్రాకిన కోపాన్ని పసికట్టింది మాధురి.
'ఇప్పటివరకూ మాధురి డాడీ తో, అంటే మా అంకుల్ తో ఈ విషయం మాట్లాడలేదనుకోండి. ఈ ప్రపోజల్ ఇప్పటిది కాదు గనుక ----ఎవంటావ్ మాధురి."
తన దారిలో తను చెప్పుకు పోతున్నాడు సుజన్ మిత్ర.
విమల్ చూపుల్ని గాని, విమల్ మదిలోకి ప్రవేశిస్తున్న సంచలనాన్ని కానీ విమల్ ముఖంలో తొంగి చూస్తున్న భావాల్ని గాని గమనించే స్థితిలో లేడు సుజన్ మిత్ర.
విమల్ కి తన కోపాన్ని ఎలా అణచుకోవాలో తెలీలేదు. తనను తాను ఎలా నిలదోక్కుకోవాలో తెలీలేదు.
గబుక్కున గ్లాసులోని డ్రింక్ తాగేశాడు.
పక్కనుంచి వెళ్ళిపోతున్న బేరార్ ని పిలిచాడు, బేరర్ వెంటనే గ్లాసుని డ్రింక్ తో నింపాడు.
డ్రింక్ చేసిన మరుక్షణమే ఆ గ్లాసుని కూడా ఖాళీ చేసేశాడు.
అంతా రెండు క్షణాల్లో జరిగిపోయింది.
విమల్ పరిస్థితిని గమనించింది.
ఇక్కడ విమల్ కంట్రోల్ తప్పితే .......ఆ పరిణామం ఎలా ఉంటుందో తెలుసు మాధురికి.
"మిత్రా ..........ఇప్పుడవన్నీ ఎందుకు ........గెస్ట్ ని ఎంటర్ టెయిన్ చెయ్యాలి తప్ప బోర్ కొట్టకూడదు. యామై కరెక్టు........" పెదవుల మీద నవ్వుని పులుముకుంటూ అంది మాధురి.
"నేను బోరుకొడుతున్నానా.......అయితే సారీ.....సారీ మై ప్రెండ్ నువ్వు ఉడ్ బీ నని విమల్ గారితోనే కదా చెప్పింది........ఇందులో బోర్ కోట్టడాని కేముంది......."
మళ్ళీ ఉడ్ బీ - అనే పదం సుజన్ మిత్ర నోట్లోంచి వచ్చేసరికి విమల్ నరాల్లోకి జివ్వున మత్తు ప్రవేశించింది.
అతని పిడికిలి బిగిసింది. ఆ పిడికిలి లో ఉన్న నాజూకైన గాజు గ్లాస్ భళ్ళున బద్దలై పోయింది.
గాజు ముక్కలు గుచ్చు కోవడంతో అరచేయి ఎర్రగా అయిపొయింది
"వాట్ హేపెండ్ .......విమల్ .....ఎనీ థింగ్ ..........రాంగ్." ఆత్రంగా విమల్ చెయ్యిని పట్టుకోబోయాడు సుజన్ మిత్ర.
ఆ చేతిని విసిరికొట్టాడు విమల్.
ఆ విసురుని ఊహించలేదు సుజన్ మిత్ర-----
బేలన్స్ తప్పిపోయింది------
పక్కకు పడిపోయాడు--------
అదేం పట్టించుకోలేదు విమల్.
మాధురి వేపు సూటిగా చూస్తూ "నేను వెళ్తున్నాను ......మాధురి......."
అని .......గబగబా సిట్టింగ్ రూమ్ లోంచి బయటికొచ్చేసాడు.
మాధురీఏదో చెప్పబోయింది.
పరుగున తనూ సిటింగ్ రూమ్ లోంచి బయటికొచ్చింది.
అప్పటికే ----
విమల్ తన కార్లో కూర్చున్నాడు.
"విమల్ ......"
మాధురి పిలిచినా పిలుపు గాల్లో కలిసిపోయింది ----మారుతీ కారు వెళ్ళిపోయింది.
మాధురి అచేతనంగా వచ్చిన లాన్ లో పచ్చటి బొమ్మలా నిలబడిపోయింది.
సిట్టింగ్ రూమ్ లో పడిపోయి, లేచి కుదుట పడ్డ సుజన్ మిత్ర మెదడులో ఒకేసారి ఎన్నో అనుమానాలు అతను మనుషుల మనస్తత్వాన్ని అంత సులభంగా అర్ధం చేసుకోగలడు. ఆ ఒక్క క్షణంలోనే --
అతను విమల్ మానసిక పరిస్థితి అర్ధం చేసుకున్నాడు.
మాధురి విమల్ మధ్యన ఏదో ఒక సంబరం ఉందని అతని సులువుగా అర్ధమైంది.
గంట తర్వాత ----
ఆ పార్టీ లోంచి వెళ్ళిపోతూ మాధురి-------
"మిత్రా .......నే వెళ్తాను, నువ్వు తెల్లావారు జామున ఫ్లయిట్లో వెళ్ళిపోతున్నావ్ కదూ....." అంది........
"లేదు వెళ్ళడం లేదు" అన్నాడు మిత్ర స్థిరంగా. ఆ మాటకు ఆశ్చర్యపోయింది మాధురి.
"వెళ్ళిపోతానన్నావ్"
"లేదు ఇంకా రెండ్రోజులుంటాను."
'అయితే రేపు ఫోన్ చేస్తాను" మరేం మాట్లాడకుండా వెళ్ళిపోయింది మాధురి.
విమల్ వెళ్ళిపోయాక! అన్ హేపీ గానే అక్కడుంది మధురి.
ఆ అన్ హీపీ నెస్ ని సులభంగానే అర్ధం చేసుకున్నాడు సుజన్ మిత్ర.
