Previous Page Next Page 
తుపాన్ పేజి 30

    ''బ్లాక్   పైరేటు అనే  బొమ్మకు   వెళ్ళామా   మనం  మొన్న?  అందులో  ఆ రాజుగారి  కూతురుకి   నాయకుని  మీద    మొదట కోపం, తర్వాత  ఇష్టం! అదేం ప్రేమండీ ?''

    ''ఎలా  ఉండాలంటావు?''

    ''అతన్ని చూడగానే  ఆమెకు,  ఆమెను  చూడగానే  అతనికి సర్వ  ప్రపంచమూ   మాయమైపోవాలి. ఆమెకోసం  అతడూ, అతనికోసం  ఆమె జన్మించాలి, జీవించాలి.''

    నేను ఆశ్చర్యంతో  మౌనం వహించి  ఆమెవంక  తేరిపార  చూచాను.

    ''ఒక స్త్రీ  కోసం  పురుషుడూ, ఒక  పురుషుని  కోసం   స్త్రీ  అనాది నుంచీ  జన్మల్లో  ప్రయాణాలు  సాగిస్తూ వుంటారు. ఇద్దరూ  ఒకళ్ళకోసం ఒకళ్ళు జీవిస్తారు. వాళ్ళిద్దరూ  ప్రతిజన్మలోనూ  కలుస్తూ ఉంటారు. ఆ కలుసుకున్నప్పుడు  వాళ్లిద్దరే. ఇంక  ఎవ్వరూ  వాళ్లకు  వుండరు. ప్రపంచం మాయమైపోతుంది.

    ''వాళ్ళిద్దరూ  కలుసుకోవడానికి వీల్లేకుండా  ఒకరు  అమెరికాలో, ఒకరు ఇండియాలో పుడితే?  లేక  ఇద్దరూ  వేరు వేరు  కులాలలో  పుడితే?''

    ''ప్రేమదేవత  ఎప్పుడూ  అలా  చెయ్యదు.  అమెరికాలో  ఆమె పుట్టితే  ఇతడు  ఎక్కడ పుట్టినా  అక్కడక్కు పోతాడు. వేరు వేరు కులాల్లో పుట్టితే, వాళ్ళ  ప్రేమ  కులాలను మించిపోతుంది!''

    ''రామీ, చండీదాసుల  ప్రేమలానా?''

    ''అవును. వాళ్ళ ప్రేమ తుచ్ఛం కాదు.  వారు పెళ్ళిచేసుకొని మనోవాక్కాయకర్మల వారు  ఒక్కరిలో  ఒకరు  లీనమైపోతారు. పెళ్ళిచేసుకునే  వీలు లేకపోతే  బ్రహ్మచర్యం  అవలంబిస్తారు.''

    ''లోకంలో  అన్ని ప్రేమలు  అలా ఉన్నాయంటావా?''

    శకుంతల మోము  దివ్యహాసంతో  వెలిగిపోయింది. కుర్చీనుంచి లేచి నా దగ్గరకు వచ్చి నా పాదాలకడ  కూర్చుంది.

    లేచి నడిచి  వస్తూవుంటే వెన్నెల కిరణాలన్నీ ముద్దకట్టి  ప్రవహించి వచ్చినట్లుగా  కనబడింది. ఎంత మహోత్తమ ప్రేమ ఈమెది! ఈ పదునాలుగేళ్ళ  పడుచు, సౌందర్య పరమావధి అయిన  అందాలబాల నన్ను ప్రేమిస్తున్నదన్న భావం  నాకు భయమూ కలిగించింది, అమృతత్వమూ  ఇచ్చింది.

    ఆమెని  నా హృదయానికదుముకున్నాను.  నాకు  మైమరపు  కలిగింది! ఆమె సువాసనలహరి! ఆమె సర్వరసాధిదేవి! ఆమె  ఆనంద విశ్వమూర్తి! ఆమె సౌకుమార్యం  నా మొరకుతనంలో  నలిగిపోయినది.

    '' దేవీ!  ఈ దేహము  శాశ్వతము  కాదుగదా ?  దేహానందం కోసం  కదా భార్యాభర్తల  సమాగమం!  దేహానందం తుచ్ఛం కాదా ?''

    '' అలా అంటారేమిటి ?'' ఆమె మాటలు  నా చెవిలో బుల్ బుల్ పాటలూ స్వనించాయి. ఆమె తన పెదవులతో  నా చెవిని  ముద్దుగొని, '' దేహానందం, మనస్సు  ఆనందానికి  పునాది కాదండీ? మనస్సూ దేహమూ  ఆత్మకు పునాది. మొన్న నాతో  విద్యుచ్ఛక్తిని గూర్చి, మీరన్నీ  పచ్చె లేదా ఏమిటి? తీగైనా  వుండాలి, గాలైనా  ఉండాలి, మరో వస్తువయినా  ఉండాలి   ఆశక్తి   ప్రవహించడానికని  మీరనలేదూ?'' అన్నది  తల ఊపాను.

    '' విద్యుచ్ఛక్తి ఆత్మ  అనుకోండి, మదేహాలు అందుకు  ఉపాధికాదూ? మీరు దొంగలు, నాకు పాఠంచెప్పే విధానం కాబోలు ఇది.''

    ఆ మర్నాడు  సాయంకాలం  బీచికి పోయాము. యిద్దరం కెరటాలు చూస్తూ  కూచున్నాము.  సర్వప్రపంచము  మమ్మల్నిద్దరినీ తేరిపార చూస్తూ  ఉంది.  అందరికళ్ళూ  ముఖ్యంగా నా  శకుంతలమీదే!

    '' నా '' శకుంతల  అంటే  నేను కొన్నానని  కాదు. నా కృష్ణ  పరమాత్మ  అంటే ఎంతో, నా శకుంతల అన్నా అంతే!''

     వెన్నెల, కెరటాలమీద  వాలి  కెరటాలకు జీవం పోస్తున్నది.

    '' ఆ వెన్నెల, కెరటాలమీద  ప్రేమలా  వాలుతున్నది కాదండీ!''

    '' శకూ! కెరటాలలో కుడా ప్రేమికులున్నారు సుమా?''

    '' అదే కాబోలు  ఒక  పెద్దకెరటం   వెనకాల  ఒక  చిన్న  కెరటం వస్తూ ఉంటుంది.''

    పెద్ద కెరటం భార్య, చిన్న కెరటం భర్త .''

    '' అబ్బా! అన్నీ తప్పులు చెప్పి, నాచేత  వాగించాలని మీ  ప్రయత్నం, నేను  మీకన్న  పెద్ద దాన్నా?''

    '' భర్త  వెంట భార్య వస్తుందన్నా?''

    '' ఇద్దరూ కలిసివస్తారు. మధ్య మధ్య  ఒక పెద్ద  కెరటం వస్తూ  వుంటుంది. అది  భార్యాభర్తలిద్దరూ  ఏకమై  రావటం.''

    ఎలాగో బి. ఏ. పరీక్షలు  పూర్తిచేసుకొని, సామానూ, గీమానూ  అంతా సర్దుకొని, మా అమ్మా, శకుంతలా, నేనూ కొల్లిపర వచ్చాము. మేఘ  సందేశమైన  వెనుక, శాపముతీరి  ప్రియురాలిని కలుసుకొన్న యక్షుడు, ప్రియురాలితో విహరించే అతిమహానందం  కూడా  కుంటుపడే  దివ్యానందంతో నేనూ  శకుంతలా  ఆ  వేసవికాలంలో కొల్లిపరలో గడిపాము.

    నిజమైన ప్రవరుణ్ణి  కలుసుకొన్న  వరూధినీయోష  పొందు  అద్భుతానందం, నన్ను  కూడివున్న శకుంతలాదేవి  పరమానందము ఎదుట, జీవకళా కాంతిరహితమై  పోవలసినదే.''

    శకుంతల రోజుకు మూడుసారులు  స్నానం చేసేది. నీళ్ళలో పన్నీరు కలుపుకొనేది. ఒంటికి  అత్తరులు అలముకొనేది. రోజుకు నాలుగుసార్లు చీరలు మార్చేది. ఉదయం ఉప్మా, ఇడ్లీ, పెసరట్టు, దోసె ఏదో చేసేది. కాఫీ అమృతమే. చెన్నపట్నంలో  అరవపురంద్రుల  సావాసం  చేసి నేర్చుకుంది. ఆ గురువులను  మించిపోయే  పాకంతో  తానూ తయారుచేసేది. సాయంకాలం  మళ్ళీకాఫీ, రకరకాల పిండివంటలు  చేసేది. రోజూ  మా మామగారు ఫలహారానికి రావాలి. మా హేమం  అస్తమానమూ  మా యింటిలో  ఫలహారాలను  రుచి చూడవచ్చేది. నా శకుంతల  అత్తగారికి  సేవ,మడిగట్టుకోడం రాత్రిళ్ళు  వంటా, మా ఇల్లంతా  కలకలలాడిపోయింది.

                                     13

    ఒకనాడు  మా పురోహితుణ్ణి  నాకూ   నా శకుంతలకూ  సరిపోయిన మంచి ముహూర్తం పెట్టుమన్నాను. ఆ   ముహూర్తము రాత్రప్పుడు  ఉండాలన్నాను. '' ఎందుకయ్యా శ్రీనాథమూర్తీ  '' అని ఆయన  నవ్వుతూ  నన్నడిగినాడు.

    '' అది వేరే సంగతి. మీరు  ముహూర్తం  పెట్టండి. అన్ని రకాల  బాగుండేది'' అన్నాను. ఆయన  వై శాఖసుద్ద   తదియనాడు  రాత్రి  8-30 గంటలకు  ముహూర్తం పెట్టినాడు. అ ఉదయమే   శకుంతలను తలంటించు   కొమ్మన్నాను. నేనూ  తలంటింపించుకొన్నాను.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS