అతని మాటలకు సీత చలించింది. రవంత అతని మీద జాలి కూడా కలిగింది. జనార్ధనానికి మాత్రం అతనట్నించి నరుక్కువస్తున్నాడని అర్ధమైపోయింది. సీతను నెమ్మదిగా మంచి మాటలతో లోబరచుకుని ఈ ఇంట్లో తన స్థానాన్ని పటిష్టం చేసుకుందామనుకుంటూన్నాడని గ్రహించాడతను.
"నీకు గది సిద్దమై పోయింది" అన్నాడు జనార్దనం.
'అయితే ఇప్పుడు నా ప్రయాణం సరాసరి గదిలోకే. దారి చూపిస్తావా?" అన్నాడు హంతకుడు. జనార్దనం ముందుకు నడుస్తుంటే హంతకుడు వెనుక నడిచాడు. సీత వెళ్ళి వీధి తలుపులు వేసింది. ఆమె కూడా హంతకుడి కేర్పాటు చేసిన గదిలోకి వెళ్ళేసరికి హంతకుడు గదిని చూసి సంతృప్తిని వ్యక్తపరుస్తున్నాడు.
"చాలా బాగుంది - నాకింకా మీతో ప్రమేయం లేదు. ఈ గది తలుపులు దొడ్లో కి వున్నాయి కాబట్టి పగలు నేనలా దొడ్డి వేపు తలుపులు వేసుకుని వెళ్ళిపోవచ్చు. ఎటొచ్చి మీరనవసరపు టనుమానాలేమీ పెట్టుకోకుండా రాత్రిళ్ళు కూడా, దొడ్డి తలుపులు గడియ వేయకుండా బార్ల వేసి మాత్రం వుంచండి" అన్నాడు హంతకుడు.
'అలా చేయడం ప్రమాదం. ఈ ఊళ్ళో దొంగల భయం బాగా ఎక్కువ" అన్నాడు జనార్దనం.
"నేనుండగా నీకూ, చెల్లాయికి ఏం భయం లేదు బావా - ధైర్యంగా వుండండి. ఎవరైనా ఈ ఇంట్లో అడుగు పెట్టాడో వాళ్ళ గతి ఏమవుతుందో తెలుసుకోవాలంటే చూడండి " అంటూ అతను తన సూట్ కేస్ ఓపెన్ చేశాడు. సీత, జనార్దనం కుతూహలంగా చూశారు. సీతకు సంబంధించినంతవరకూ ఒక రివాల్వర్, కత్తి కనబడ్డాయి. జనార్దనాన్నాకర్షించిన మూడో వస్తువులో సీతకు ప్రత్యేకత కనబడలేదు.
అది లలితా రాణి ఫోటో !
5
మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో సీత, ఎవరో తలుపు తట్టిన చప్పుడు విని, వెళ్ళి తలుపులు తీసింది. ఆ అగంతకుడేవరో ఆమెకు తెలియలేదు.
"మీ ఇల్లు సోదా చేయాలి !" అన్నాడతను.
"ఎవరు మీరు?" అంది సీత.
'అది మీరడగకూడదు- నేను చెప్పకూడదు " అన్నాడతను.
'అయితే నేనసలు తలుపులు తీయ్యనే తియ్యకూడదు" అంటూ అతను వీధి గుమ్మంలో వుండగానే తలుపులు వేసేయబోయింది సీత.
"ఆహా - ఆగండి " అంటూ అతను బలవంతంగా లోపలకు వచ్చి, "నేను ప్రమాదకరమైన వ్యక్తిని కాదు, దొంగనూ కాదు. ఒక ముఖ్యమైన విషయంలో ఈ వీధిలోని ఇళ్ళన్నీ సోదాచేస్త్గూ మీ ఇంటికి వచ్చాను" అన్నాడు.
"బాగుంది -- అలాగైతే మీరు సాయంత్రం రండి. అప్పుడు నా భర్త ఇంట్లో వుంటాడు " అంది సీత.
'సాయంత్రం దాకా ఆగడానికి వీల్లేదు. ఇప్పుడే అర్జంటుగా సోదా చేయాలి" అంటూ అతను చాలా కంగారుగా లేచి లోపలకు వెళ్ళబోయాడు.
"లోపలకు వెళ్ళవద్దు. దొంగ దొంగ అని పెద్దగా అరుస్తాను...." అంది సీత.
'అరుస్తావెం ?.... అరిస్తే చస్తావ్ " అతను హటాత్తుగా చిన్న బాకు తీశాడు.
సీత నివ్వెర పోయింది. ఒక్క క్షణంలోనే తమాయించుకుని, "ఏమిటి దౌర్జన్యం - ఇంట్లో మగవాళ్ళు లేరను కుంటున్నావేమో , మా అన్నయ్యున్నాడు" అంది, ఈ క్షణంలో హంతకుడామె కాపద్భాంధవుడిలా తోచాడు.
"ఉన్నాడా -- ఉంటే మరీ మంచిది. నా పని మరింత సులభమవుతుంది" అన్నాడతను.
'అయితే చేసుకో నీ పని సుకరం, నేను వచ్చాను" అన్న మాటలు విని ఉలిక్కిపడి ఇద్దరూ అటువైపు చూశారు. హంతకుడక్కడ నిలబడి నవ్వుతున్నాడు.
కొత్త ఆగంతకుడు బాకును జేబులో పడేసుకుని, "ఇలా వచ్చి కూర్చోండి - మీతో రెండు ముక్కలు మాట్లాడాలి" అన్నాడు.
"చిత్తం -- అలాగే చేస్తాను" అంటూ హంతకుడు వెళ్ళి కుర్చీలో కూర్చున్నాక ఆగంతకుడు కూడా ఇంకో కుర్చీలో కూర్చుని "మీఇల్లు సోదా చేయాలి? ఆ విషయం అంగీకరించకపోవడం వల్లనేమీ చెల్లాయిని బాకు చూపించి బెదిరించాల్సి వచ్చింది" అన్నాడు.
"ఎందుకు మా ఇల్లు సోదా చెయాడం? ఇల్లు సోదా చేస్తామంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు? చెల్లాయి రైటే చేసింది. మీరెవరో మీ పని ఏమిటో చెప్పండి...." అన్నాడు హంతకుడు కాస్త తీవ్రంగా.
"చెప్పక తప్పేలా లేదు" అన్నాడా ఆగంతకుడు. "ఈ వీధిలో ఒక నర హంతకుడు మకాం పెట్టినట్లు మాకు సమాచార మందింది. వాడు పరమ దుర్మాగుడు. వాడి నేలాగో అలా పట్టుకోవాలని శతవిధాలుగా ప్రయత్నిస్తున్న మాకీ సమాచారం అదృష్టవశాత్తు లభించింది."
"అలాగా -- అయితే ఈ ఇల్లు మీరు సోదా చేయడం అనవసరం. ఆ మకాం చేసేవాడు మాకు తెలియకుండా యిక్కడుండడు కదా" అన్నాడు హంతకుడు.
'అలాగనకండి - ఒకోసారి అనుకోకుండా సమాచారం లభించవచ్చు. ఉదాహరణకు మీరీవిడకు అన్నయ్యనంటున్నారు. కాని కాకపోవచ్చు. ఈవిణ్ణి బెదిరించి ఈ ఇంట్లో ఉంటుండవచ్చు" అన్నాడా ఆగంతకుడు.
ఈ మాటలు వింటూనే సీతకళ్ళు మెరిశాయి. దేవుడు తమ మొర విని ఈ మనిషిని పంపించాడా అనుకుందామే. అతనికి నిజం చెప్పి హంతకుడి బారి నుంచి తప్పించు కోవాలనుకుందామే. అయితే వెంటనే ఆ పని చేయడానికి ధైర్యం చాలలేదు.
"ఇంతకీ తమరెవరు స్వామీ?" అన్నాడు హంతకుడు.
"ప్రభుత్వ ఇంటెలిజెన్సు శాఖ మనిషిని!" అన్నాడతను.
"ఓహ్ -- తమరు సి.ఐ.డి అన్నమాట " అంటూ హంతకుడు నవ్వి , "నాకూ సమాచారం వచ్చింది - ఈ మధ్య ఓ దొంగ బయల్దేరాడట. సి.ఐ.డి నని చెప్పి ఇళ్ళలో చొరబడి అందినవి పట్టుకుని పోతున్నాడట!" అన్నాడు.
సి.ఐ.డి ముఖం ఇబ్బందిగా పెట్టి, "ఏది యేమైనా నేను వచ్చిన పని ముగించకుండా వెళ్ళను. మీరు నన్నాపలేరు" అంటూ కుర్చీలోంచి లేచాడు.
"నన్ను మీరూ ఆపలేరు. ముందు మీ ఐడెంటిఫికేషన్ చూపించనిదే నేను మిమ్మల్ని అడుగు ముందుకు వెయ్యనివ్వను సరిగదా -- పోలీసులకు పట్టిస్తాను" అన్నాడు హంతకుడు.
"నన్ను పోలీసులకు పట్టివ్వడమా. అది మీవల్ల కాదు. అంతగా అవసరమనుకుంటే మీ యిల్లు సోదా చేయడానికి పోలీసుల్నీ సాయంగా పిలవగలను" అన్నాడు సి.ఐ.డీ.
'అలాగా - అయితే మరి నన్ను సాయంగా పిలవలేదెం?" అన్నాడు వెటకారం గా హంతకుడు.
"మీరు పోలీసు మనిషి కాదు గదా -"
"నేనెవరో ఇది చూసి తెలుసుకోండి" అంటూ హంతకుడు సి.ఐ.డీ కి ఒక కార్డు చూపించాడు. సి.ఐ.డి అది చూసి తొట్రు పడి , "అయితే మీరూ, నేను కొలీగ్సన్నమాట. అయితే ఇంకేం - మన పని మరింత సుకరమవుతుంది!" అన్నాడు.
కార్డు తిరిగి జేవులోకి తోసేసి "మనమిద్దరమూ కోలీగ్సు కావచ్చు, కానీ నాకు సంబంధించినంత వరకూ ఈ వీధిలో హంతకుడు మకాం పెట్టిన వార్త డిపార్టుమెంటుకు వచ్చినట్లు తెలియదు" అన్నాడు.
"వచ్చింది లెండి. కానీ, మీరున్న ఇల్లు సోదా చేయడం ఆనవసరం" అంటూ వెళ్ళిపోయాడు సి.ఐ.డి.
అతను వెళ్ళిపోయాక హంతకుడు సీతకేసి చూసి నవ్వి , "చెల్లాయ్ - నిజంగా నేను పోలీసు మనిషి ననుకునేవు. ఆ వచ్చిన వెధవని బెదరగొట్టి పంపడానికి నేనాడిన నాటకం. ఇలాంటి నాటకాలేన్నాడితే , నా రహస్య నే దాచగలను? ఇంతకు నీకు నిజం తెలిసిందో లేదో, ఆ వచ్చిన వాడు సి.ఐ.డి కాదు, ఆ పేరుతొ వచ్చిన దొంగ వెధవ. నేను లేకుంటే ఇల్లు దోచు కెళ్ళి పోయుండేవాడు " అన్నాడు.
నిజమే ననిపించింది సీతకు. వాడు తన్ను బాకు చూపి బెదిరించాడు కూడా. హంతకుడి మీద మరికాస్త గౌరవం కల్గింది సీతకు.
6
జనార్దనం ఇంట్లో అడుగు పెట్టగానే "రా - బావా !" అన్నాడు హంతకుడు.
జనార్దనం యిబ్బందిగా ముఖం పెట్టి , "నువ్వింకా యింట్లోనే వున్నావా?" అన్నాడు.
"అయ్యో - అన్నప్రకారం ఇంకా నేను వెళ్ళవలసిన టైము రాలేదే? ఈ ఇంట్లో నేను అన్న కంటే ఎక్కువే కానీ, తక్కువ రోజు లుండదలచు కోలేదు" అన్నాడు హంతకుడు.
'ఆదే నాకు సంతోషం" అన్నాడు జనార్దనం అదోలా.
'అందుకే - అందుకే , దొరక్క దొరక్క నాకో చెల్లి బావా దొరికారు. ఇంకే విధంగానూ చేతకాకపోయినా ఇలాగైనా మిమ్మల్ని సంతోష పెట్ట గలుగుతున్నాను" అన్నాడు హంతకుడు.
జనార్దనం హంతకుడితో ఏం మాట్లాడకుండా , "సీతా!" అని అరిచాడు.
"వస్తుందిలే బావా! చాలా భయపడింది తనీ రోజున" అన్నాడు హంతకుడు.
