Previous Page Next Page 
వసుంధర కధలు -11 పేజి 30


    "తమ ఆజ్ఞ స్వామీ!" అన్నాడు రాజారావు. చిదానందస్వామి వెళ్ళిపోయాడు.
    "మనిషిలో గొప్ప ఆకర్షణశక్తి వున్నది-" అన్నాడు రంగారావు.
    "దేవుడంటే ఏమనుకున్నారు?" అన్నాడు రాజారావు.
    "మళ్ళీ దేవుడి ప్రసక్తి తీసుకుని రాకండి, గాంధీ సినిమా తీసిన అటెన్ బరో కూడా-గాంధీని మానవుడి గానే గుర్తించి ఆయనలోని మానవత్వాన్ని అర్ధంచేసుకుందుకు ప్రయత్నిద్దాం అన్నాడు. మనిషి మనిషిగానే చూడ్డం మనం నేర్చుకోవాలి-" అన్నాడు రంగారావు.
    "కొంతసేపు చిదానందస్వామి సమక్షంలో ఉన్న పుణ్యానికి మీకూ యేమైనా ఇబ్బందులుంటే తొలగిపోతాయి-" అన్నాడు రాజారావు - రంగారావు మాటలు గురించీ పట్టించుకోకుండా.
    సరిగ్గా అప్పుడే-"సార్-టెలిగ్రాం-" అన్న కేక వినిపించింది.
    టెలిగ్రాం రాజారావుకు. అతడాత్రుతగా అది అందుకుని చదువుకుని-ఓ పెద్ద కేక పెట్టాడు.
    "ఏమయింది?" అన్నాడు చౌదరి కారణంగా.
    "కోర్టులో మా దాయాదులు వేసిన దావా ఓడిపోయింది. మా నాన్నగారు టెలిగ్రాం ఇచ్చారు-" అన్నాడు రాజారావు.
    ఈ దావా చాలా కాలంగా నడుస్తున్నది. యెవరు ఓడితే వారికి పాతికవేలు నష్టం. రాజారావీ విషయమై చాలా బెంగగా వున్నాడు. దావా ఓడిన పక్షంలో అతడు తండ్రికి పదివేల రూపాయలు ఎలాగో తెచ్చి ఇవ్వాలి. ఈ పరిస్థితుల్లో చిదానందస్వామి అతడు తన ఇంటికి ఆహ్వానించాడు.
    "కానీ ఈ టెలిగ్రాం చిదానందస్వామి మీ ఇంటికి రాకమునుపే ఇవ్వబడింది-" అన్నాడు రంగారావు.
    "ఆయన్ను నేను మా యింటికి ఆహ్వానిస్తూ నా బాధ చెప్పుకున్నాను. ఇది జరిగి రెండ్రోజులయింది. ఆయన నాతో ఈ రోజు వస్తాననీ-అప్పటికి అన్నీ సద్దుకుంటాయనీ హామీ ఇచ్చాడు-" అన్నాడు రాజారావు.
    "నా కేసుకు కూడా ఏదైనా పరిష్కార మార్గం లభిస్తుందేమో-" అన్నాడు ఇన్ స్పెక్టర్ చౌదరి ఆశగా.
    "తప్పక లభిస్తుంది. చిదానందస్వామి సాక్షాత్తూ దేవుడి అవతారం-" అన్నాడు రాజారావు.
    రంగారావు ఆలోచిస్తూ-"మీరు నాకో ఉపకారం చేయగలరా?" అన్నాడు.
    "చెప్పండి-" అన్నాడు రాజారావు.
    "నన్నూ ఓ సమస్య బాధిస్తున్నది. ఎలా బైట పడాలా అని ఆలోచిస్తున్నాను. చిదానందస్వామి మీ కిచ్చిన గ్లాసును నాకివ్వండి. ఓ వారం రోజులు దానిని మందిరంలో వుంచి మహిమ ఎలాగుంటుందో చూస్తాను. మా యింట్లో పూజామందిరం లేదు. కానీ దీనికోసం ఏర్పాటు చేస్తాను-" అన్నాడు రంగారావు.
    "ఆహా చిదానందస్వామి మహిమ-నాస్తికుడి ఇంట పూజామందిరం వెలయనున్నది-" అన్నాడు చౌదరి.
    రాజారావు ఆలోచిస్తూ- "స్వామీ మాట నాకు శిరోధార్యం! ఆయన నన్ను వారంరోజులపాటు మా యింట పూజామందిరంలో ఆ గ్లాసు నుంచ'మన్నాడు. మీకు కావాలంటే ఆ తర్వాత ఇవ్వగలను-" అన్నాడు.
    రంగారావు అంగీకరించాడు.

                                         2

    "రవీ-ఇంకా ఎన్నాళ్ళిలా?" అన్నది రమ.
    "అదే నేనూ ఆలోచిస్తున్నాను-" అన్నాడు రవి.
    "ఆలోచించి లాభంలేదు. మనం ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్ళిపోదాం-" అన్నది రమ.
    "అదే నేనూ ఆలోచిస్తున్నాను-" అన్నాడు రవి.
    "ఇంకా ఎన్నాళ్ళు ఆలోచిస్తావు?" అన్నది రమ.
    "ఏం చేయను రమా! నా దురదృష్టంకొద్దీ నువ్వు నా వివాహమైన రెండేళ్ళకి కనిపించావు. నా తండ్రి డబ్బు కోసం ఆశపడ్డంవల్ల తప్పితే నాకింత త్వరగా విహహం జరగాల్సింది కాదు. ఇప్పుడు నాకో కొడుకు. నా భార్య మళ్ళీ గర్భవతి. ఈ జంఝాటాన్ని యెలా వదిలించుకోవాలో నాకు అర్ధకావడం లేదు-"
    "ఇలాంటి వాటినుంచి ఉపాయంతోనే బయట పడాలి-"
    "నీకేదైనా ఉపాయం తట్టిందా?"
    "నాకు ఉపాయాలేమీ తట్టలేదు. కానీ నీకు చిదానందస్వామి పైన నమ్మకమున్నదా?" అన్నది రమ.
    "నన్నడుగుతావేమిటి? ఆశ్రమంలో కొన్నాళ్ళుండి వచ్చినదానివి. నువ్వే చెప్పాలి-" అన్నాడు రవి.
    "ఆయన్ను నేను పూర్తిగా అర్ధం చేసుకోలేక పోయాను-" అన్నది రమ ఆలోచిస్తూ-"నాకు ఎవ్వరూ లేరు. జెవెఇథమన్తె విరక్తికలిగిన సమయంలో అనుకోకుండా నాకు స్వామి దర్శనం అయింది. ఆయన ప్రేమగా ఆదరించాడు. ఆశ్రమంలో చేరాను. ఆ జీవితం నాకు నచ్చింది. ప్రపంచంలో నేనే కాకుండా నాకులా కష్టాలు పడుతున్నవారెందరో వున్నారని నాకు అర్ధమైంది. నాకైతే ఎవ్వరూ లేరు. అందరూ ఉండీ, అన్నీ ఉండీ మనశ్శాంతి లేకుండా వున్నవారెందరో ఆశ్రమానికి రావడం చూసేక నాకు మరింత తృప్తి కలిగింది.
    అయితే ఆరునెలల క్రితం స్వామీ నాపట్ల మరోలా ప్రవర్తించసాగాడు. ఆయన నా చేయి పట్టుకుని దగ్గరగా తీసుకున్నాడు. ఆ ఆదరణలో చల్లదనం లేదు. వేడి వున్నది. నేను భయపడ్డాను. అయితే ప్రతిఘటించాను."
    రవి ఆవేష్మగా-"అయితే ఆ స్వామిదంతా బూటకం అన్నమాట-ఈ కథ పత్రికలవాళ్ళకి చెబుదాం-" అన్నాడు.
    "అలా తొందరపడకు. చిదానందస్వామిని అంత తొందరగా అర్ధం చేసుకోవడం కష్టం-" అన్నది రమ. "నేను ప్రతిఘటించినా స్వామి ముందడుగు మానలేదు. ఆయన నన్ను బెదిరించాడు. బ్రతిమాలాడు. ఆఖరికి బలవంతంగా అనుభవించడానికి సిద్దపడ్డాడు. అప్పుడు నే నాయన్ను బలంగా ఒక్క తోపు తోశాను. స్వామి క్రిందపడ్డాడు. కానీ కేకపెట్టలేదు. నేనాయనవంకే చూస్తూ నిలబడ్డాను. ఎందుకీ పారిపోవాలని నాకు అనిపించలేదు. స్వామి నెమ్మదిగా లేచాడు. నా వంక చూసి చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో తాపంలేదు. ప్రశాంతత వున్నది. నేను ఆ చిరునవ్వుకు పరవశించి అప్రయత్నంగా ఆయనకు రెండు చేతులూ జోడించి నమస్కరించాను. అప్పుడాయన ఏమన్నాడో తెలుసా?"
    "ఆయన ఏమన్నాడో చెప్పక్కర్లేదు. అప్పుడేం జరిగిందో చెప్పు-" అన్నాడు రవి ఆత్రుతగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS