"వీటి ఖరీదు లక్షరూపాయలు అన్నీ ఒరిజనల్సు. మీ భర్తకు చేరకుండా అన్నీ మీకే అప్పగించేస్తాను..." మళ్ళీ అన్నాడతను.
"లక్ష రూపాయలా?" ఆమె నోరు తెరిచింది అప్రయత్నంగా.
"లక్ష రూపాయలని ఒక్కసారి నేనడంవల్ల మీకది చాలా పెద్ద మొత్తంలా అగుపించవచ్చు. కానీ సులభవాయిదాల పద్ధతి ఒకటున్నది. నెలకు రెండువేలు చొప్పున యాభై నెలలకు ఇమ్మన్నాననుకోండి-అప్పుడాలోచించి చూడండి-నేనడిగింది-ఎంత చిన్న మొత్తమో!" అన్నాడతను.
నెలకు రెండువేలు! తన భర్త తనకు నెలకు రెండువేలిస్తాడు-నీ సరదాలకు ఖర్చు చేసుకొమ్మని. యాభై నెలలపాటు ఆ రెండువేలనూ ఇతగాడికివ్వలా? ఆ రెండువేలూ తనేం చేస్తున్నదీ భర్తకు చెప్పవలసిన బాధ్యత కూడా తనకున్నది. తన బాధ్యత తను నిర్వహించకపోతే ఏదో ఓ రోజున రహస్యం బయటపడవచ్చును.అప్పుడు భర్త తనను అసహ్యించుకుంటాడు.
"హలో....హలో....." అన్నాడతను.
"ఊఁ" అన్నదామె.
"మీరేమీ మాట్లాడడం లేదు...."
"ఏం మాట్లాడాలో తెలియడంలేదు...."
"నెలకు రెండువేలు నాకివ్వలేరా?"
"ఇవ్వగలను..."
"అయితే ఊఁ అనండి...."
"నాకు కొంత వ్యవధి కావాలి"
"ఎందుకు?"
"నా భర్త నుంచి రహస్యాలు దాచడం నాకిష్టముండదు. మీ కారణంగా ఇప్పుడాపని చేయవలసి వస్తోంది...."
ఫోన్ లో అవతల నవ్వు వినిపించింది-"మీరు మీ భర్తకు శామ్యూల్ విషయం చెప్పారా?"
"లేదు...." అందామె విసుగ్గా.
"విసుక్కోకండి. మీరు మీ భర్తనుంచి రహస్యాలు దాచే అలవాటులేదన్నారుగా- అందుకని అనుమానం వచ్చింది...." గొంతులో వెటకారం ఉంది.
అవును-శామ్యూల్ విషయం తను భర్తకు ఎందుకు చెప్పలేదు? తను చేసిన దాంట్లో తప్పేముంది? వయసు ప్రభావంతో ఓ యువకున్ని ప్రేమించింది. అతడిని పెళ్ళి చేసుకోవాలనుకుంది. కానీ అది సాధ్యపడలేదు.
ఇప్పుడు....
ఆ విషయం భర్తకు తెలియబరుస్తానని ఒకడు బెదిరిస్తున్నాడు.
నిజానికి తాను శారీరకంగా ఏ తప్పూ చేయలేదు. చేసిందనడానికి ఆధారమూ లేదు. కానీ వివాహానికి పూర్వం ఓ పురుషుడికి తానంత దగ్గరగా వెళ్ళిందంటే తన భర్త సహిస్తాడా?
"నాకు వ్యవధి కావాలి...." మళ్ళీ అంది కవిత.
"సరే-యిస్తున్నాను. కానీ ఇరవై నాలుగు గంటలు మాత్రమే! ఆ తర్వాత నేను మీనుంచి ఇంకేమీ వినదల్చుకోలేదు. రెండువేలు పుచ్చుకోవటం ఒక్కటే నేనుచేయబోయేది...." అవతల ఫోన్ క్లిక్ మంది.
కవిత రిసీవర్ని క్రెడిల్ చేసింది. చరచరా వెళ్ళి మళ్ళీ బీరువా తలుపులు తీసింది. అందులోని లాకర్లో వున్నాయి తన డైరీలు.
కవిత లాకర్ తలుపులు తెరిచింది. ఆత్రుతగా వెతికింది.
ఒకే ఒక్క డైరీలేదు.....అందులోనే ఉన్నాయి తను శామ్యూల్ కలిపి గడిపిన ప్రేమ వివరాలు.....
తను తప్పుచేయలేదు. కానీ భర్త నమ్ముతాడా?
అసలీ డైరీ ఎలా సంగ్రహించబడింది? ఆ లాకరు తాళాలను తానెంతో భద్రంగా దాచుకుంటుంది?
ఆలోచిస్తూంటే కవితకు గుర్తుకు వస్తోంది.
ఆ పని శామ్యూల్ చేశాడు. నిస్సందేహంగా శామ్యూల్ చేశాడు.
అయితే శామ్యూల్ తను చేసిన తప్పుకు విచారించలేదు. బాహాటంగా ఆ పని చేశాడు.
వివాహమైనాక తానింకా పుట్టింట్లో వుండగానే అతడు వ్రాసిన ఉత్తరం ఆమెకింకా గుర్తున్నది. అదింకా ఇప్పటికీ ఆమెవద్దనే వున్నది.
"నీతో పరిచయం నాకెంతో విలువైనది. నా అసమర్ధతతో నేనది పోగొట్టుకున్నాను. అందువల్ల నిన్ను దేనికీ తప్పుపట్టను. అయితే నీతోటి అనుభవాలన్నీ నా డైరీలో పదిలంగా దాచుకున్నాను. నీ స్వదస్తూరీతో నీ డైరీలో మన గురించి వ్రాసుకున్న అనుభవాలు కూడా నా వద్దనే వుండాలన్నది నా కోరిక. ఆ కోరిక ఎప్పటి కైనా ఎలాగో అలాగ తీర్చుకుంటాను. నీకు నామీద జాలివుంటే ఆ ఒక్క డైరీ నాకు పంపించు....."
తానా ఉత్తరాన్ని చింపిపారేసింది. ఆ డైరీని అతడికి పంపకూడదనే నిశ్చయించుకుంది.
ఉత్తరం వ్రాసిన వారం రోజులకు శామ్యూల్ వచ్చాడు.
"పెళ్ళయిపోయాక కూడా నా వెంటబడతావేం?" అంది తాను.
"నేను నీ వెంటబడను. నీ జ్ఞాపకాలు మిగుల్చుకుని నిన్ను మరిచిపోవాలనుకుంటున్నాను...." అన్నాడు శామ్యూల్.
"ఆ డైరీ నీకివ్వను...." అంది తను.
"ఒక్కసారి చూడనీ...." అన్నాడతడు.
కాసేపటికి జాలిపడి తానతడికి డైరీ చూపించింది. అతడు డైరీ చదువుతున్నప్పుడు తానక్కడలేదు. తను తిరిగి వచ్చేసరికి అతడక్కడలేడు. డైరీ మాత్రం ఉన్నదక్కడ.
సిమెంటు రంగు కవరు చూసి అది తన డైరీయేనని భ్రమపడింది. కానీ అది తనదికాదు.
శామ్యూల్ తెలివిగా డైరీ మార్చి వెళ్ళిపోయాడు. అప్పుడు తను పరీక్షించి చూడనైనా లేదు. అలాంటి అనుమానం తనకు రాలేదు.
ఆ డైరీలోని కొన్ని అనుభవాల్ని ఇద్దరూ చాలాసార్లు కలిసి చదువుకున్నారు. అతడి డైరీతనకూ, తన డైరీ అతడికీ కవరు పేజీ రంగుతో సహా గుర్తుండి పోయాయి. అందువల్ల అతడికి తన డైరీ బాగా తెలుసు. అలాంటిదే మరొకటి ముందుగా కూడా తెచ్చుకుని ఆ మార్పిడిచేసి వుంటాడు.
తనకు వివాహం నిశ్చయం కాగానే ఆ డైరీని కొనసాగించకుండా వేరే మరో డైరీని ప్రారంభించింది. అందువల్ల మళ్ళీ ఆ దైరీలోకి చూసే అవకాశం కూడా రాలేదు.
ఇప్పుడు తన డైరీల్లో సిమెంట్ రంగు డైరీ ఒకటి ఎక్స్ ట్రాగా వున్నది. కానీ అది తన డైరీ కాదు.
శామ్యూల్ ఎంత పనిచేశాడు?
చివరికిప్పుడు బ్లాక్ మెయిలింగుకి దిగాడు!
అతడికి మొదట్నుంచీ ఇదే ఉదేశ్యమున్నదా? లేక పరిస్థితుల ప్రభావంవల్ల ఇలా మారాడా?
అతడికి తానంటే ఎంతో అభిమానం. తన మనసు కష్టపడే పని ఒక్కటీ చేసేవాడుకాదు. మాట అనేవాడు కాదు.
శామ్యూల్ కి ఎంతో సంస్కారం కూడా వుంది! అతడి కారణంగానే తన శీలం కాపాడబడింది......ఈ సమాజంలో ఆడది, మగాడు ఏకాంతంగా వున్నప్పుడు.....ఒక మగాడు ఆడదాన్ని తొందరపడకుండా ఆపడం సామాన్య విశేషంకాదు.
అలాంటి శామ్యూల్ ఈ రోజు బ్లాక్ మెయిలింగ్ కి దిగాడా?
ఆలోచిస్తూండగానే ఆ రోజు గడిచిపోయింది. రాత్రి అయిపోయింది.
ఇరవై నాలుగు గంటలు గడువిచ్చాడు శామ్యూల్ స్నేహితుడు.
పన్నెండు గంటలు అప్పుడే అయిపోయాయి.
కవిత భర్తకోసం ఎదురు చూస్తోంది. ఎదురుచూస్తూనే అతడు వస్తాడేమోనని భయపడుతోంది.
చలపతిరావు తనను ప్రాణంకంటే మిన్నగా ప్రేమిస్తున్నాడు. అలాంటి అతడినుంచి తనీ రహస్యం ఎందుకు దాచాలి? అందులోనూ తనేమీ తప్పుచేయలేదు కూడా!
కానీ...అతడు ఎన్నడూ తనను ప్రాణంకంటే మిన్నగా ప్రేమిస్తూనే వుండాలని తనకున్నది. అందుకే రహస్యం దాచాలనుకుంటున్నది.
