Previous Page Next Page 
వసుంధర కథలు-7 పేజి 30


    "అంటే?"
    "మనమిలా కూర్చుంటే ఇద్దరన్నా చెల్లెళ్ళు కూర్చున్నట్లుంది తప్పితే భార్యాభర్తలు కూర్చున్నట్లులేదు...."
    "భార్యాభర్తలెలా కూర్చుంటారో నీకు తెలుసా?" చిలిపిగా అడిగింది కవిత. ఒకోసారి ఆడవాళ్ళు ఎంత అమాయకత్వం ప్రదర్శిస్తారంటే అదే వారి పతనానికి దారి తీస్తూంటుంది. తన ప్రశ్నలోని చిలిపితనం కవితకు తెలియలేదు.
    శామ్యూల్ ఆమెకు దగ్గరగా జరిగి-భుజంమీద చేయివేసి-ఆమెను దగ్గరగా తనవైపు అదుముకుంటూ-"ఇలా?" అన్నాడు.
    అప్పటికి కవితకు తన పొరపాటు అర్ధమయింది. అయితే ఆమెకు అతడికి దూరంగా జరగ్లని కానీ-తన భుజంమీద నుంచి అతడి చేతిని తీసివేయాలనిగానీ అనిపించలేదు. ఆ దగ్గరతనమూ, అతడి స్పర్శా ఆమెకు ఏదో తెలియని కొత్త హాయినిస్తున్నాయి. అలాగే వుండిపోవాలనిపించిందామెకు.
    అటువంటి సమయంలో మగవాడు కోరుకునేదదే. ఆడది మాట్లాడకుండా ఊరుకోవడం అతడికి వరం! శామ్యూల్ ఆ వరాన్ని వృధా చేయదల్చుకోలేదు. కాసేపట్లో ఇద్దరూ మరి కాస్త దగ్గరయ్యారు. అద్దం సంగతి ఇద్దరూ మరిచిపోయారు.
    కొద్ది క్షణాల్లోనే ఆ చనువు మరింత పెరిగింది. శామ్యూల్ చొరవచేస్తూంటే కవిత కాదనలేకపోతోంది. ఆ అశక్తత ఆమె వంటిమీదనుంచి చీరను తొలగించింది.
    కవిత ఒకరకమైన సందిగ్దావస్థలో పడింది. ఆమెకు. మనసులో భయంగా వున్నది. శరీరం మనసుకు ఎదురు తిరుగుతున్నది. అవునంటే తనకు అన్యాయం జరిగిపోతుందని భయం. కాదంటే అతడు తనను వదిలిపెడతాడని భయం. అతడి చనువు ఆమెకు బాగున్నది.
    శామ్యూల్ మంచితనం, మర్యాద ఆమెకు తెలుసు. తన ప్రోత్సాహంలేనిదే అతడొక్క అడుగు కూడా ముందుకు వేయడు. వేయలేడు.
    ఇక ముందు ఏం జరిగినా ఆ తప్పుకతడిని బాద్యుడిని చేయలేదు. పూర్తి బాధ్యత తనదే అవుతుంది.
    అతణ్ణి వారించాలా, కూడదా?
    కవిత ఆలోచిస్తూనే వున్నది. వున్నట్లుండి శామ్యూల్ ఆమెకు దూరంగా జరిగాడు-"నన్ను మన్నించు కవితా చీర కట్టుకో!"
    కవిత ఉలిక్కిపడింది. ఆ ఉలికిపాటులో నిరాశ కూడా వుంది.
    కవిత మనసు ఆమె శరీరానికి అనుగుణంగా మారిపోతోంది. తానతడిని ప్రోత్సహించకపోయినా ప్రతిఘటించరాదని ఆమె నిర్ణయించుకుంది. అయితే తనకుతానై విరమించుకున్నాడు. ఏం జరిగింది?
    "నావల్ల చాలా పెద్ద పొరపాటు జరుగవలసింది. సమయానికి నా కళ్ళు తెరుచుకున్నాయి...." అన్నాడు శామ్యూల్.
    కవిత చటుక్కున చీర కట్టుకుంది.
    "ఛీ-నువ్వెంత సిగ్గుమాలినదానివి-మగవాడికున్న పాటిముందు ఆలోచన నీకు లేకపోయింది-" అని మనసామెను తూలనాడింది.
    అతడిలో ఆ క్షణంలో వచ్చిన మార్పు ఎందుకో తెలుసుకోవాలని ఆమెకు అనిపించింది. కానీ ఎలా అడుగుతుంది?
    ఇద్దరూ అక్కణ్ణించి బయటపడ్డారు.
    ఆ తర్వాత నాలుగు రోజులు ఇద్దరూ కలుసుకోడానికి ప్రయత్నించలేదు. ఆవేశంలో మనిషి ఏమేమో చేయాలనుకుంటాడు. ఆవేశం తొలగిపోయాక తాము చేయాలనుకున్నదానికి సిగ్గు, ఆశ్చర్యం కలుగుతాయి.
    నాలుగు రోజుల తర్వాత శామ్యూల్ పార్కులో కలుసుకున్నాడు కవితను. ఆమెకు బహుమతిగా ఓ చిన్న ప్యాకెట్ తెచ్చాడు.
    "నాకు ఉద్యోగం లేదు. అది వెతుక్కుంటూ ఈ ఊరొస్తే నువ్వు దొరికావు. నీకోసమైనా త్వరగా ఉద్యోగం సంపాదించాలని వుంది. అది సాధ్యపడుతుందనే ఆశిస్తున్నాను. ప్రస్తుతం నేను చిల్లర పనులుచేసి డబ్బు సంపాదించి రోజులు గడుపుతున్నాను. నా ఆదాయం అంతంతమాత్రం అందువల్ల నేను పేదవాడిని నా బహుమతి నా అంతస్థుకు తగినట్లుగానే వుంటుంది. కానీ దాన్ని నువ్వు నిరాదరణ చేయవద్దు. అంతస్థు ఎదిగాకనే మంచి బహుమతి ఈయవచ్చునుకదా-ఇంతలో తొందర ఏమొచ్చింది-అని అనుకోవద్దు. ఇది నీకు ఇవ్వడానికి ఓ పెద్ద కారణముంది. ముందు నేను నీకేమిచ్చానో చూడు-" అన్నాడు శామ్యూల్.
    కవిత ఆత్రుతగా ప్యాకెట్ విప్పింది. అది...ఆకుపచ్చరంగు చేనేత చీర! డిజైన్ ఎంతో బాగుంది. ఖరీదెంతో వుండదు. ఆపైన రిబేట్లో కొన్నట్లున్నాడు.
    "ఇది నాకు ఎంతో విలువైనది!" అన్నది కవిత చటుక్కున ఆ చీరను గుండెలకు హత్తుకుని.
    "అవును నిజంగానే అది నీకు విలువైనది. అందుకే నేనది నీకోసం కొన్నాను. నీ శీలానికది రక్షాకవచంగా కూడా వుంటుంది-" అన్నాడు శామ్యూల్ ఆమె వంకే పరీక్షగా చూస్తూ.
    "అంటే?" అన్నది కవిత అర్ధంకాక.
    "నాలుగురోజుల క్రితం మనమిద్దరం ఓ గదిలో ఉన్నప్పుడు-నీ వంటిమీద చీరలేనప్పుడు-నీ వంటిమీద వున్న లంగా రంగు ఆకుపచ్చ. నాలో ఆవేశం పెల్లుబుకుతున్నప్పటికీ ఆకు పచ్చరంగును నీ శరీరాన్నుంచి దూరం చేయాలన్న ఆలోచనేనాకు భయంకరంగా తోచింది. అప్పుడే నాలో వివేకం తలెత్తింది...." అన్నాడు శామ్యూల్.
    కవితకు గుర్తువస్తోంది. సాధారణంగా బయటకు వెళ్ళేటప్పుడు తను అన్నీ మ్యాచింగు బట్టలే కడుతుంది. ఆ రోజు తను ఎర్రచీర కట్టుకుంది. ఎర్ర లంగా చాకలివద్ద వుండిపోయింది. అందుకని ఆకుపచ్చ లంగా వేసుకుంది. కానీ అదే ఆ రోజు తన శీలాన్ని కాపాడిందంటే-అందులోనూ తనుకూడా మానసికంగా, మనస్ఫూర్తిగా శీలాన్ని పోగొట్టుకోవడానికి సిద్దపడినప్పుడు కాపాడిందంటే అది చాలా పెద్ద విశేషమే!
    ఆ చీర కవితవద్ద ఇంకా వున్నది. దాన్నామె భద్రంగా దాచుకున్నది.
    కవిత వెళ్ళి బీరువా తలుపు తెరిచింది. మూలగావున్న ఆ చీర తీసింది. ఆ చీరను చూస్తూనే ఆమె ఉలిక్కిపడింది.
    అదామె కొన్న కొత్త చీరకువలెనే వున్నది. డిజైన్లో మాత్రం చిన్న చిన్న తేడాలున్నాయి.
    తన కోసమని కొన్న ఆ చీర డిజైన్ శామ్యూల్ కు ఇంకా అంత బాగా గుర్తున్నదా? అతడే ఉద్దేశ్యంతో తన స్నేహితుడని పంపాడు? ఇప్పుడేం జరుగుతుంది? శామ్యూల్ తనకుతానై తనను కలుసుకోకుండా తన స్నేహితుడినెందుకు పంపాడు?
    అసలు శామ్యూల్ ఇప్పుడెక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు?

                                  4

    "శామ్యూల్ గురించి ఆలోచించకండి-" అన్నాడతను.
    కవిత ఫోన్ లోకి చూసింది. దూరాన వున్న ఆ మనిషిని చూస్తున్నట్లుగానే వున్నదామె ముఖం-"మరి ఎవరి గురించి ఆలోచించమంటారు?"
    "నా గురించి-...."
    "మీ గురించా-ఎందుకు?"
    "శామ్యూల్ కు మీరు ప్రేమలేఖలు వ్రాశారు. అవి నా దగ్గరున్నాయి. శామ్యూల్ మీకు వ్రాసిన ప్రేమలేఖల్ని అతడి ముఖాన కొట్టారు. అవీ నా దగ్గరున్నాయి. శామ్యూల్ మీతో పంచుకున్న అనుభవాల్ని డైరీలో వ్రాసుకున్నాడు. అవి నా దగ్గరున్నాయి. శామ్యూల్ ని మీరెంతగా కాంక్షించినదీ మీరు డైరీలో వ్రాసుకున్నారు. అవీ నా దగ్గరున్నాయి. మీ గురించిన వివరాలు ఇన్ని నా దగ్గరుంచుకుంటే మీరు నా గురించి ఎందుకు ఆలోచించాలనడం హాస్యాస్పదంగా లేదూ!" అన్నాడతను.
    కవిత శరీరంలో వణుకు పుట్టుకొచ్చింది. అతడు చెప్పేదంతా నిజమా? తను బ్లాక్ మెయిలింగు వ్యవహారంలో ఇరుక్కోబోతుందా?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS